విన్నపాలు వేనవేలు | Hyderabad swachh Second stage of the application | Sakshi
Sakshi News home page

విన్నపాలు వేనవేలు

Published Thu, Jun 18 2015 1:44 AM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM

విన్నపాలు వేనవేలు - Sakshi

విన్నపాలు వేనవేలు

- ‘స్వచ్ఛ హైదరాబాద్’ రెండో దశలో దరఖాస్తుల వెల్లువ
- తొలివిడత సమస్యలు ఎక్కడివక్కడే
- అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం
 - పరిష్కారానికి సీఎం, మంత్రుల హామీ
సాక్షి,సిటీబ్యూరో:
మహా నగరంలో బుధవారం నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ రెండో దశ కార్యక్రమంలోనూ అనేక చోట్ల పాత సమస్యలపైనే వినతులు వెల్లువెత్తాయి. అధ్వాన్న రహదారులు, పునరుద్ధరణకు నోచుకోని పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, పొంగిపొర్లుతున్న మ్యాన్‌హోళ్లు, ఇళ్ల స్థలాలు, పారిశుద్ధ్య సమస్యలు, వెలగని వీధి దీపాలు, కలుషిత జలాలు, మురుగు సమస్యలపైనే మంత్రులు, అధికారులకు ఫిర్యాదులు అందాయి. పార్శిగుట్టలో సీఎం కేసీఆర్, ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఆనంద్ నగర్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, నోడల్ ఠమొదటిపేజీ తరువాయి అధికారులు పర్యటించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గత నెలలో జరిగిన స్వచ్ఛ హైదరాబాద్ మొదటి దశ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులను ఆరా తీశారు. తొలివిడత వినతులు ఇప్పటి వరకు పరిష్కారానికి నోచుకోలేదని వివిధ ప్రాంతాల ప్రజలు అధికారులు, మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కంగుతిన్న అధికారులు, మంత్రులు వాటి తక్షణ పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
 
రెండో విడత సాగిందిలా...
- ఖైరతాబాద్‌లోని ఆనంద్ నగర్ కమ్యూనిటీ హాల్‌లో గవర్నర్ నరసింహన్ స్థానికులతో సమావేశం నిర్వహించారు. పారిశుద్ధ్య పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిసరాల పరిశుభ్రతపై రాజీ పడవద్దని సూచించారు.
- సోమాజిగూడలోని బీఎస్ మక్తాలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ పర్యటించారు. స్థానికంగా చెత్త కుప్పలు పేరుకుపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీటి పైప్‌లైన్ల మరమ్మతులకు రూ.25 లక్షలు, రహదారులకు రూ.25 లక్షలు కేటాయిస్తున్నామన్నారు.
- ఎల్‌బీనగర్ నియోజకవర్గం... మన్సూరాబాద్ డివిజన్ 328 యూనిట్ చంద్రపురి కాలనీలో మంత్రి జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రతి యూనిట్‌కు 15 మందితో కూడిన పౌర కమిటీలను నియమించారు.
- డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆజంపుర డివిజన్‌లోని మార్కస్‌లో పర్యటించారు. స్థానికంగా ఉంటున్న 110 కుటుంబాలకు రెండు గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఓల్డ్ మలక్‌పేట శంకర్ నగర్‌లో పర్యటించారు. మూసీ నదిలో పడి చనిపోయిన చిన్నారి కుటుంబీకులను పరామర్శించారు. కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం నుంచి పక్కా ఇల్లు, నష్ట పరిహారం ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
- అక్కడినుంచి మూసీ పరీవాహక ప్రాంతానికి వెళ్లి... కబ్జాకు గురవుతున్న స్థలాన్ని పరిశీలించారు. నాలా చుట్టూ రిటైనింగ్ వాల్స్ నిర్మించాలని అధికారులకు సూచించారు. అనంతరం అక్బర్‌బాగ్ డివిజన్ పల్టాన్‌లో పర్యటించారు. కాలనీలో అసాంఘిక కార్యకలాపాలపై స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పోలీసులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.
- బంజారాహిల్స్ రోడ్ నెం.12లో భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పర్యటించారు. ఎన్బీటీ నగర్, ఎన్బీ నగర్ కాలనీ, శ్రీరాంనగర్ కాలనీ, అంబేద్కర్ నగర్ కాలనీలో ఇప్పటి వరకు జరిగిన, చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు.
- వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెస్ట్‌మారేడ్‌పల్లిలో పర్యటించారు. స్థానికులు మురుగు సమస్యలు, పారిశుద్ధ్యంపై ఫిర్యాదు చేయగా... వాటిని తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
- అబిడ్స్‌లోని మురళీధర్‌బాగ్, కట్టెలమండి ప్రాంతాల్లో ైవె ద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పర్యటించారు. మురళీధర్‌బాగ్‌లో పేద ప్రజలకు త్వరలోనే ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. గోషా మహల్ నియోజకవర్గంలో తొలివిడత కార్యక్రమంలో అందిన ఫిర్యాదులపై అధికారులు సమర్పించిన నివేదికలను పరిశీలించారు. పనులు చేపట్టాలని ఆదేశించారు.
- కూకట్‌పల్లిలోని బాలాజీ నగర్‌లో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పర్యటించారు. నాలా అభివృద్ధికి రూ.30 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కమ్యూనిటీ హాలులో రెండోఅంతస్తు నిర్మాణం చేపట్టాలని, కలుషిత జలాల సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
- బాలానగర్‌లో ఏడు బస్తీల అసోసియేషన్లు స్వచ్ఛ హైదరాబాద్‌పై సమావేశమయ్యాయి. పారిశుద్ధ్య పనులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించాయి. అక్రమంగా వెలసిన చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించాయి.
- ఖైరతాబాద్ నియోజకవర్గంలోని కృష్ణకాంత్ నగర్‌లో రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటించారు. స్థానికంగా భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవాలని, నీటి శుద్ధి కేంద్రాలను బాగు చేయించాలని ప్రజలు కోరగా.. ఆమేరకు పనులు చేపడతామని ఆయన వారికి హామీ ఇచ్చారు.
- అంబర్‌పేట్ నియోజకవర్గంలో 210 మందికి ఇళ్లు ఇప్పించేందుకు కృషి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి చెప్పారు. అంబర్‌పేట అభివృద్ధికి రూ.50 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్నారు. మోయిన్ చెరువును మిషన్ కాకతీయలో చేర్చి శుద్ధి చేయించేందుకు అంచనాలు సిద్ధం చేశామన్నారు.  ఇదిలా ఉండగా... ‘గతంలో ఇచ్చిన ఫిర్యాదులను ఇప్పటి వరకు పరిష్కరించ లేదు. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని వీధుల్లో పర్యటిస్తున్నారు?’ అంటూ జైస్వాల్ గార్డెన్ వాసులు  అధికారులను నిలదీయడం గమనార్హం.
- ఉప్పల్‌లో మౌలిక సదుపాయాలకు రూ.17 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినట్టు డిఫ్యూటీ కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. కమ్యూనిటీ హాళ్లు, సీసీ రోడ్లు, పారిశుద్ధ్య పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
- రామంతాపూర్ టీవీ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే ఎన్‌వీఎస్ ప్రభాకర్ స్థలాన్ని పరిశీలించారు. త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. గణేశ్‌నగర్ కమ్యూనిటీ హాల్‌లో జరిగిన సమావేశంలో స్థానికులు అధికారులను నిలదీశారు.
- అల్వాల్‌లో ఐపీఎస్ అధికారి రాజేశ్ కుమార్ పాల్గొన్నారు. ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యం నెరవేరుతుందన్నారు. పనుల్లో నాణ్యత, పారదర్శకత కోసం అధికారులు, స్థానికుల ఫోన్ నెంబర్‌లతో వాట్సప్ గ్రూపును ఏర్పాటు చేశారు.
- మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో అధికారులు కేవలం సమావేశాలకే పరిమితం కావడం, స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా పర్యటించకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
- అమీర్‌పేట ప్రాంతంలో హోం శాఖ కార్యద ర్శి వెంకటేశం పర్యటించారు. గతంలో ప్రజలకు ఇచ్చిన హమీలు ఎంతవరకు నెరవేరాయన్న దానిపై ఆరా తీశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
- బల్కంపేట్‌లోని కంజర్ల లక్ష్మీనారాయణ యాదవ్ మున్సిపల్ పార్కును మెంటార్ ప్రభాకర్ సందర్శించారు. సమస్యల పరిష్కారంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిన్న చిన్నవి పరిష్కారమయ్యాయని, నిధులు కేటాయించాల్సినవాటి విషయంలో జాప్యం జరుగుతోందని స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
 
స్వచ్ఛ హైదరాబాద్ విజయవంతం
సాక్షి,సిటీబ్యూరో:
స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం బుధవారం జీహెచ్‌ఎంసీలోని 400 యూనిట్లలో విజయవంతమైందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పార్శిగుట్టలో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ బీఎస్‌మక్తాలో స్వచ్ఛ కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులు ప్యాట్రన్లుగా ఉన్న 35 యూనిట్లకుగాను 23 మంది హాజరయ్యారన్నారు. 400 మంది  మెంటార్లు ఉండగా... 361 మంది పాల్గొన్నట్టు తెలిపారు. 400 మంది నోడల్ అధికారులు, 2595 స్వచ్ఛ యూనిట్ అధికారులు కార్యక్రమాల్లో పాల్గొన్నారని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement