స్త్రీశక్తితోనే క్లీన్‌సిటీ | Chandrababu Naidu Fortifies Himself for Showdown With KCR | Sakshi
Sakshi News home page

స్త్రీశక్తితోనే క్లీన్‌సిటీ

Published Thu, Jun 18 2015 4:31 AM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM

పార్సీగుట్ట రాఘవ గార్డెన్‌లో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ప్రజల నుంచి స్వయంగా దరఖాస్తులు సేకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి పద్మారావు - Sakshi

పార్సీగుట్ట రాఘవ గార్డెన్‌లో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ప్రజల నుంచి స్వయంగా దరఖాస్తులు సేకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి పద్మారావు

‘స్వచ్ఛ హైదరాబాద్’కు మహిళలు నడుం కట్టాలని సీఎం పిలుపు
19న స్వచ్ఛ కమిటీలతో సమావేశం, అభివృద్ధి పనులపై నిర్ణయం
ఇకపై ప్రతి నెలా 17న కమిటీలతో సమీక్ష.. ఢిల్లీ తరహాలో చెత్త తరలింపు
ఎంత ఖర్చయినా డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామన్న ముఖ్యమంత్రి

సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ హైదరాబాద్ సాధ్యం కావాలంటే మహిళలదే కీలకపాత్ర అని, వారు ముందుంటేనే క్లీన్‌సిటీ సాకారమవుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.

స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రారంభించి నెల రోజులైన సందర్భాన్ని పురస్కరించుకుని తాను ఇన్‌చార్జిగా ఉన్న బౌద్ధనగర్ డివిజన్ పార్సీగుట్టలో స్థానికులతో కేసీఆర్ బుధవారం సమావేశమయ్యారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం, పిల్లలను శుభ్రంగా తయారు చేసి స్కూళ్లకు పంపడం తెలిసిన అక్కాచెల్లెళ్ల వల్లనే క్లీన్‌సిటీ సాధ్యమవుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘నేనొస్తున్నానని సున్నం వేసిండ్రు. అయినంత మాత్రాన కంపు పోతదా.. కడుపులోది బయటకు వచ్చేలా తిప్పుతోంది. ఎన్నేళ్లనుంచో ఉన్న ఈ దరిద్రం ఇప్పటికిప్పుడు పోదు. మనమిప్పుడు పనులు మొదలుపెట్టినం. ఏడాది, రెండేళ్లు పడుతుంది.

అన్నం వండాలన్నా అరగంట.. కూరకు ఇంకో పావుగంట పడతది కదా’ అని కేసీఆర్ అన్నారు. గత నెలలో ఐదురోజుల పాటు నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ వల్ల స్వచ్ఛ కమిటీ బృందాలకు, ప్రభుత్వానికి సమస్యలపై అవగాహన వచ్చిందన్నారు. శుక్రవారం(19న) నిర్వహించే సమావేశంలో పనులపై పూర్తి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. పారిశుధ్యం, పేదలకు ఇళ్లు, నాలాల ఆధునీకరణ తదితరమైన వాటిని అమలు చేసి చూపిస్తామన్నారు. చెత్త సమస్య పరిష్కారానికి ఢిల్లీ, నాగ్‌పూర్ నగరాల్లో అమలవుతున్న మంచి విధానాలను అమలు చేస్తామన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేందుకు ఇంటింటికీ రెండు రంగుల డబ్బాలను మున్సిపల్ అధికారులు అందజేస్తారని, వాటిని తీసుకుని వెళ్లేందుకు నెల రోజుల్లోగా 2,500 ఆటో ట్రాలీలను అందుబాటులోకి తెస్తామని సీఎం చెప్పారు.

ఆ చెత్తను ఎరువుల తయారీ, విద్యుదుత్పత్తి కేంద్రాలకు తరలించనున్నట్లు వివరించారు. ఢిల్లీలో మాదిరిగా నిర్మాణ వ్యర్థాల నుంచి కంకర, ఇసుక తయారుచేసే ప్రాజెక్టులను చేపడతామన్నారు. ప్రతి నెలా 17వ తేదీన స్వచ్ఛ కమిటీల సమావేశం నిర్వహించి భవిష్యత్ పనులను ఖరారు చేస్తామన్నారు. నాలాలపై ఉన్న నివాసాలను తొలగించి వారికి మరో చోట డబుల్‌బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని పునరుద్ఘాటించారు. యూనివర్సిటీ స్థలాల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తామంటే కొందరు నానా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఎకరానికి రూ. 5 కోట్లు వెచ్చించైనా పేదలకు ఇళ్లు కట్టించి తీరతామని స్పష్టం చేశారు. చిలకలగూడలోని రైల్వే స్థలాల కోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామన్నారు.
 
నేడు వేములవాడకు కేసీఆర్
వేములవాడ అర్బన్: ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం కరీంనగర్ జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. బుధవారం రాత్రి  కరీంనగర్ చేరుకున్న సీఎం అక్కడి తెలంగాణ భవన్‌లో బస చేశారు. గురువారం ఉదయం 10కి వేములవాడ వెళ్తారు. స్వామి వారి దర్శనం అనంతరం ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అంతకుముందు కరీంనగర్ వెళుతూ మార్గమధ్యంలో మెదక్ జిల్లా ఎర్రవెల్లి, నర్సన్నపేట తదితర గ్రామాల్లో సీఎం రైతులతో మాట్లాడారు.
 
కరీంనగర్ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఏపీ సీఎం చంద్రబాబు పని అరుుపోరుునట్లేనని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశాలు లేవని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్ పర్యటనకు వెళ్లిన ఆయన బుధవారం రాత్రి ఆ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ, ముఖ్యనేతలతో సమావేశమయ్యూరు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. బుధవారం ఆరు గంటల పాటు సుదీర్ఘంగా నిర్వహించిన ఏపీ కేబినెట్ భేటీలో కేవలం తనను ఎలా ఇరికించాలన్న ఆలోచనలే చేశారని కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. చివరకు తన భాష మీద, తాను మాట్లాడిన అంశాలమీద వివాదం రేపాలని చూస్తున్నారని చెప్పినట్లు సమాచారం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement