
ప్రతీకాత్మక చిత్రం
హన్మకొండ: గొర్రెల పంపిణీ పథకంలో రీసైక్లింగ్ చేస్తూ పట్టుబడిన గొర్రెలను వేలం వేసేందుకు ఆధికార యంత్రాంగం నిర్ణయించింది. రీ సైక్లింగ్ చేస్తూ వరంగల్ అర్బన్ జిల్లాలో పట్టుబడిన గొర్రెల్లో 467 గొర్రెలను వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించారు.
ఈ నెల 24న వేలం వేయనున్నట్లు కలెక్టర్ అమ్రపాలి కాట తెలిపారు. డిసెంబర్ 14న రాత్రి ఎల్కతుర్తి పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 634 గొర్రెలను పట్టుకున్నారు. పట్టుకున్న గొర్రెల్లో 467 గొర్రెలకు ట్యాగులు బిగించిన ఆనవాళ్లున్నట్లు గుర్తించారు. ట్యాగులు లేని 107 గొర్రెలున్నట్లు, 60 గొర్రె పిల్లలున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు కేసును కోర్టుకు పంపారు. గొర్రెలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పశు సంవర్థక, పశు వైద్య శాఖకు అప్పగించారు. దీంతో వీటి పోషణ, కాపలా గత డిసెంబర్ 16వ తేదీ నుంచి ఎల్కతుర్తి పశువైద్యాధికారి డాక్టర్ నవత పర్యవేక్షణలో కొనసాగింది. దీంతో గొర్రెల పోషణ, వాటి కాపలా బాధ్యతపై మీమాంస నెలకొంది. పెద్ద సంఖ్యలో గొర్రెలు దొరకడం, విక్రయించిన వారు ఎవరో తెలియక పోవడం పెద్ద సమస్యగా మారింది.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లికి చెందిన పది మంది, కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన ముగ్గురు గొర్రెలు తరలిస్తూ దొరికారు. కేసు కోర్టు పరిధిలో ఉండడంతో గొర్రెలను కాపాడే బాధ్యత, పోషణ ప్రశ్నార్థకంగా మారింది. ఎల్కతుర్తి పశు వైద్య, పశు సంవర్థక అధికారి నవత పోషణ భారం కష్టంగా ఉందని జిల్లా పశు వైద్య, పశు సంవర్థక అధికారి దృష్టికి తీసుకెళ్లడంతో డిసెంబర్ 23న ఖిలావరంగల్ మండలం మామునూర్‌లోని షెడ్‌లో ఉంచి వాటిని పోషిస్తున్నారు. పోషణ భారంగా మారండతో అధికారులు పోలీసుల ద్వారా కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా రీ సైక్లింగ్ జరిగిన గొర్రెలను వేలం వేసి వచ్చిన సొమ్మును కోర్టులో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఈ 24న గొర్రెలను వేలం వేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది.
24న ఉదయం 10 గంటలకు మామునూర్‌లోని గొర్రెల షెడ్‌లో జరుగనున్న వేలంపాటలో 450 గొర్రెలు, 17 పొట్టేళ్లకు వేలం వేయనున్నారు. ఆసక్తిగలవారు ఈ నెల 24 ఉదయం 9 గంటలలోపు రూ.10 వేలు జిల్లా పశు వైద్య, పశు సంవర్థక శాఖ అధికారి కార్యాలయంలో చెల్లించి రశీదు పొంది వేలం పాటలో పాల్గొనాలని కలెక్టర్ అమ్రపాలి కాట సూచించారు. వేలంలో పాల్గొని ఖరీదు చేసిన గొర్రెలను అదే రోజు పూర్తి డబ్బులు చెల్లించి తీసుకుని వెళ్లాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. మరిన్ని వివరాలకు 7337396426, 9989997412 ఫోన్ నంబర్‌లలో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment