మాక్లూర్ మండలం గొట్టుముక్కల గ్రామంలో గొర్రెల పిల్లలతో లబ్ధిదారులు , పశుసంవర్ధకశాఖ అధికారులు (ఫైల్)
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: గొర్రె బలుస్తే గొల్లకు లాభం.. అనే నానుడి వాస్తవ రూపం దాల్చుతోందని అంటున్నారు.. పశుసంవర్ధక శాఖ అధికారులు. జిల్లాలో గతేడాది గొల్ల, కుర్మల లబ్ధిదారులకు సబ్సిడీపై పంపిణీ చేసిన గొర్రెలకు సుమారు 93 వేల గొర్రె పిల్లలు జన్మించాయని పశు సంవర్థక శాఖ గుర్తించింది. తద్వారా సుమారు రూ.30 కోట్ల మేరకు లబ్ధిదారులకు ఆదాయం లభించినట్లు అంచనా వేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో గొర్రెల పంపిణీ పథకం కింద జిల్లాలో 9,631 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో 8,522 యూనిట్లు పంపిణీ చేయగలిగారు. ఒక్కో యూనిట్ వ్యయం రూ.1.25 లక్షలు ఉండగా.. లబ్ధిదారులకు 20 గొర్రెలు, ఒక పొట్టేలును పంపిణీ చేశారు. ఇందుకోసం మొదటి విడతలో రూ.94.59 కోట్లు ఖర్చు చేశారు. మూడు నెలల వయస్సు దాటిన గొర్రె పిల్ల సుమారు రూ.మూడు వేల వరకు విలువ ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
మహారాష్ట్రకు మన బృందాలు..
మొదటి విడతలో పంపిణీ చేసిన గొర్రెలను ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌లో కొనుగోలు చేశారు. ఈసారి మాత్రం మహారాష్ట్రలోని హింగోళి, జాల్‌నాలో కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఐదుగురు పశువైద్యులు, కొందరు లబ్ధిదారుల ప్రతినిధుల బృందం ఇటీవల హింగోళి, జాల్‌నాకు వెళ్లారు. ఈ ఆర్థిక సంవత్సరం 2018–19లో 9,475 గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు 472 యూనిట్లు గొర్రెలు పంపిణీ చేశారు.
ఎన్నికల కోడ్‌తో జాప్యం..
ఎన్నికల కోడ్ కారణంగా రెండో విడత గొర్రెల పంపిణీలో కొంత జాప్యం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత మూడు నెలలుగా కోడ్ అమలులో ఉంది. దీంతో లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేయడం వీలు కాలేదు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పశుసంవర్థక శాఖ ఈ గొర్రెల పంపిణీ పథకంపై దృష్టి సారించింది. గొర్రెల కొనుగోలుకు ప్రక్రియను వేగవంతం చేసింది.
చనిపోయిన గొర్రెల స్థానంలో..
గతేడాది లబ్ధిదారులకు పంపిణీ చేసిన గొర్రెల్లో సుమారు 5,230 గొర్రెలు వివిధ కారణాలతో మృత్యువాత పడ్డాయి. గొర్రెల బీమా పథకం కింద చనిపోయిన గొర్రెల స్థానంలో పంపిణీ చేయాల్సిన గొర్రెలను కూడా కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టింది. మరణించిన 5,230 గొర్రెలకు సంబంధించి బీమా కంపెనీ నుంచి పరిహారం నిధులు విడుదలయ్యాయి. జిల్లా కలెక్టర్ ఖాతాలో ఈ నిధులు జమ చేశారు. ఈ బీమా పరిహారం నిధులతో చనిపోయిన గొర్రెల స్థానంలో కొనుగోలు చేస్తామని పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు.
కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేశాం
ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో గొర్రెల కొనుగోలు ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో లేకపోవడంతో ఈ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేశాము. ఇప్పటి వరకు 557 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేశాం. వీటితో పాటు, గొర్రెల బీమా ప్రీమియం, రవాణా ఖర్చులు, దాణా వంటివి లబ్ధిదారులకు ఈ పథకం కింద అందజేచేస్తున్నాము.
డాక్టర్ బాలిక్ అహ్మద్, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment