మాకొద్దీ గొర్రెలు...
మాకొద్దీ గొర్రెలు...
Published Mon, Jul 31 2017 2:57 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM
- కొన్నింటికి రోగాలు.. మరికొన్ని మృత్యువాత
- ఆసక్తిచూపని లబ్ధిదారులు
రాయికల్(జగిత్యాల): గొల్లకుర్మలకు ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన గొర్రెల పంపిణీ పథకంపై లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. నాణ్యమైన గొర్రెలు లభించకపోవటం.. పంపిణీ చేసిన వాటిల్లో చాలావరకు రోగాల బారిన పడటం.. మరికొన్ని మృత్యువాత పడటంతో లబ్ధిదారులు వెనకడుగు వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గొల్లకుర్మల కోసం సీఎం కేసీఆర్ 75% సబ్సిడీపై గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారు. గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించి లక్కీడిప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఎంపికైన ఒక్కొక్కరికీ 20 గొర్రెలు, ఒక పొట్టేలును అందజేస్తున్నారు.
పొరుగు రాష్ట్రాలకు పశువైద్యులు
రాష్ట్రంలో లబ్ధిదారులకు సరిపోయే గొర్రెలు లేకపోవడంతో ఒక్కో జిల్లాకు ఒక్కో రాష్ట్రాన్ని ఎంపిక చేసి పశువైద్యుల బృందాన్ని పంపించి గొర్రెలను కొనుగోలు చేయిస్తున్నారు. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన గొర్రెలు ఒక్కసారిగా వాతావరణ మార్పుల వల్ల అనారోగ్యానికి గురి కావడం.. అంతకు ముందే బక్కచిక్కిన గొర్రెలను పంపిణీ చేయడంతో అవి రోగాల బారినపడి చనిపోతున్నాయి. జగిత్యాల జిల్లా అయోధ్య గ్రామంలో 10, అర్పపెలిలో 4, డబ్బ గ్రామంలో 15, ఫకీర్‌కొండాపూర్‌లో నాలుగు ఇలా ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలు మృత్యువాత పడ్డాయి. దీంతో గొల్ల కుర్మలు ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలు తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు.
లోకల్‌లోనే ధర తక్కువ..
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న గొర్రెల ధరలు ఎక్కువగా ఉన్నట్లు గొల్లకుర్మలు చెబుతున్నారు. కొందరు దళారులు రంగంలోకి దిగి కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల నుంచి ఒక్కో జతకు రూ. 6 వేల నుంచి రూ. 7 వేలకే కొనుగోలు చేసి.. ఆయా రాష్ట్రాలకు తీసుకెళ్లి.. వాటిని అక్కడ మళ్లీ మనకే రూ. 14 వేలకు జతగా విక్రయిస్తున్నారు.
Advertisement
Advertisement