veterinarians
-
పశుఆరోగ్య సేవా రథాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాల్లో పశు వైద్యులు, పారా వెట్లు, డ్రైవర్లుగా పనిచేసేందుకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని అంబులెన్స్‌ల ప్రాంతీయ పర్యవేక్షకుడు అనిల్ కుమార్ ఓ ప్రకటనలో కోరారు. ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పనిచేసేందుకు సిబ్బంది కావాలని తెలిపారు. ప్రతీ జిల్లాలో ఎనిమిది మంది పశువైద్యులు, ఎనిమిది మంది పారా వెట్(వెటర్నరీ టెక్నీషియన్)లు, ఎనిమిది మంది పైలట్ల(డ్రైవర్లు) చొప్పున మొత్తం 144 మంది సిబ్బంది అవసరమన్నారు. వెటర్నరీ వైద్యుల పోస్టులకు బ్యాచలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ విద్యార్హత కలిగి ఉండాలని, కొత్తగా పట్టా పొందిన వారితో పాటు రిటైర్డ్ డాక్టర్లు కూడా అర్హులే అన్నారు. పారా వెట్ పోస్టులకు డిప్లమో ఆఫ్ వెటర్నరీ సైన్స్ విద్యార్హత కలిగి 30 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలన్నారు. ఇక పైలట్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండి, హెచ్ఎంవీ లైసెన్సుతో కనీసం 2–3 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలని, 35 ఏళ్ల లోపు వారై ఉండాలని తెలిపారు. ఆసక్తి గల వారు విజయవాడలోని ముత్యాలంపాడు వీధిలోని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో ఈ నెల 22, 23 తేదీల్లో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 9154984484లో సంప్రదించాలన్నారు. -
పశు సంపదతో రైతులకు మెరుగైన ఆదాయం
సాక్షి,అమరావతి/యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు మెరుగైన ఆదాయాన్నివ్వడంలో పశు సంపద కీలకపాత్ర పోషిస్తోందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. తిరుపతి వేదికగా శనివారం జరిగిన శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పదో స్నాతకోత్సవంలో కులపతి హోదాలో గవర్నర్ పాల్గొన్నారు. విజయవాడ రాజ్‌భవన్ నుంచి వెబినార్‌లో ప్రసంగించారు. రైతులు అదనపు ఆదాయం కోసం వ్యవసాయ అనుబంధ రంగాలకు మరలుతున్నారని, హరిత విప్లవం, ఆర్థిక సరళీకరణ, వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోవడం, కూలీల కొరత వంటి కారణాలతో పశు పోషణపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ జనాభాలో మూడింట రెండొంతుల మంది జీవనోపాధికి పశు సంతతి కీలకంగా మారిందన్నారు. పెంపకందార్లకు పశు వైద్యులు వృత్తిపరంగా, నైతికంగా మద్దతిస్తూ పశు పోషణను లాభదాయకంగా మార్చేందుకు మార్గనిర్దేశం చేయాలని గవర్నర్ కోరారు. ఆర్బీకేల మూల్యాంకనం అభినందనీయం తీరిక సమయాల్లో విద్యార్థులు సామాజిక సేవలో నిమగ్నం కావాలని పిలుపునిచ్చారు. బీవీఎస్సీ విద్యార్థులు చివరి సంవత్సరం శిక్షణ కాలంలో రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే) పనితీరును మూల్యాంకనం చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ‘అమూల్’ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం శుభపరిణామమని, తద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధి మార్గంలో దూసుకు పోగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. స్టార్టప్‌ల ఫైనాన్సింగ్, వ్యవస్థాపకత, ఉద్యోగ కల్పనను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ‘స్టార్ట్–అప్ ఇండియా’ ప్రచారాన్ని ప్రారంభించిందని, విద్యార్థులు అవకాశాలను అన్వేషించి పారిశ్రామికవేత్తలు కావాలని.. మరింత మందికి ఉద్యోగాలు కల్పించాలని గవర్నర్ సూచించారు. మత్స్యశాఖ ప్రాముఖ్యం దృష్ట్యా.. ప్రత్యేక విశ్వవిద్యాలయం 974 కిలోమీటర్ల తీర ప్రాంతం నీటి వనరులు, 1.74 లక్షల హెక్టార్ల ఉప్పు నీటి సాంద్రత కలిగిన ఆంధ్రప్రదేశ్.. మత్స్య రంగంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని గవర్నర్ తెలిపారు. ఈ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా 14.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. మత్స్యశాఖ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రత్యేక మత్స్యశాస్త్ర విశ్వవిద్యాలయాన్ని ప్రకటించిందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వివరించారు. కార్యక్రమంలో రాజ్‌భవన్ నుంచి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, గవర్నర్ సంయుక్త కార్యదర్శి శ్యామ్‌ప్రసాద్, విశ్వవిద్యాలయ పరిశోధన విభాగపు సంచాలకులు డాక్టర్ సర్జనరావు, విస్తరణ విభాగ సంచాలకులు డాక్టర్ వెంకటనాయుడు పాల్గొన్నారు. తిరుపతి నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక బోర్డు సభ్యుడు డాక్టర్ ఏకే శ్రీవాత్సవ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కాగా, వీసీ డాక్టర్ పద్మనాభరెడ్డి పాల్గొన్నారు. అనంతరం వెటర్నరీ రంగంలో విశేష సేవలు అందిస్తున్న శాస్త్రవేత్తలు, అధ్యాపకులకు అవార్డులను, పలువురు విద్యార్థులకు పతకాలను అందించారు. బాపట్లకు చెందిన తులసీరుక్మిణి 11 బంగారు పతకాలు, ఒక వెండి పతకం, నెల్లూరుకు చెందిన మహ్మద్ కరీమా 5 బంగారు, ఒక వెండి పతకాన్ని అందుకున్నారు. -
పశు వైద్యులే ఫీడ్ ఇన్స్పెక్టర్లు
సాక్షి, అమరావతి: పశుదాణా తయారీ, నాణ్యతా నియంత్రణ, అమ్మకం, పంపిణీ చట్టం–2020ను క్షేత్ర స్థాయిలో అమలు చేసేందుకు ఫీడ్ ఇన్స్పెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చట్టం అమలు కోసం ఏర్పాటు చేసిన ‘కంట్రోలింగ్ అథారిటీ’గా పశు సంవర్థక శాఖ డైరెక్టర్ వ్యవహరిస్తుండగా.. జిల్లా స్థాయిలో కలెక్టర్/పశు సంవర్థక శాఖ సంయుక్త సంచాలకులు లైసెన్సింగ్ అథారిటీగా వ్యవహరిస్తున్నారు. తాజాగా పశు దాణా నాణ్యతను తనిఖీ చేసే అధికారాన్ని రాష్ట్ర స్థాయిలో పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌కు, క్షేత్ర స్థాయిలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్, అసిస్టెంట్ డైరెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. వీరు ఫీడ్ ఇన్స్పెక్టర్లుగా వ్యవహరిస్తారు. క్షేత్ర స్థాయిలో పశు దాణా శాంపిల్స్ సేకరించి వాటి నాణ్యత పరిశీలన కోసం ప్రభుత్వం గుర్తించిన ప్రయోగశాలలకు పంపించొచ్చు. రాష్ట్రంలోను, దేశంలోను, ఇతర దేశాల్లో తయారైన పశుదాణా/ఖనిజ లవణ మిశ్రమాల దిగుమతి, విక్రయాలు జరిపేటప్పుడు నాణ్యతాపరంగా తనిఖీచేసే అధికారం వీరికి ఉంటుంది. నాణ్యత లోపాలను గుర్తిస్తే సంబంధిత వ్యాపారులు/ఉత్పత్తిదారులపై చర్యలు తీసుకోవచ్చు. దాణా తయారీలో నిర్దేశిత ప్రమాణాలను పాటించని, తప్పుడు ప్రకటనలు ఇచ్చే కంపెనీలపై ఈ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడే వారికి కనీసం ఏడేళ్ల పాటు జైలు శిక్ష, తగిన జరిమానా విధించే అవకాశం కూడా ఈ చట్టం కల్పిస్తుంది. -
వందలాది నాటుకోళ్ల మృతి మిస్టరీని ఛేదించిన పశువైద్యాధికారులు
సాక్షి, బషీరాబాద్: వందలాది నాటుకోళ్ల మృతి మిస్టరీని పశువైద్యాధికారులు ఛేదించారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో విచారణ జరిపి ఊపిరాడకనే అవి చనిపోయాయని వెల్లడించారు. ‘వింతవ్యాధితో నాటుకోళ్ల మృత్యువాత’శీర్షికన ఈ నెల 16న ప్రచురితమైన ‘సాక్షి’కథనానికి రాష్ట్ర పశు సంవర్థకశాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి స్పందించారు. వెంటనే విచారణ జరిపి నివేదిక అందజేయాలని జిల్లా వెటర్నరీ అధికారిని ఆదేశించారు. జిల్లా వెటర్నరీ అధికారి ఆదేశాల మేరకు సోమవారం బషీరాబాద్ మండల పశువైద్యాధికారి హతిరామ్ తన సిబ్బందితో కలసి మండంలోని క్యాద్గీరా, గంగ్వార్ గ్రామాల్లో విచారణ జరిపారు. నాటుకోళ్లు మురుగుకాలువల్లోంచి ఆహారం తీసుకుంటున్నట్లు గమనించారు. అనారోగ్యానికి గురైన ఓ నాటు కోడిని పోస్టుమార్టం చేయగా దాని గిజార్డ్ పూర్తిగా ఇసుక రేణువులతో నిండి ఉన్నట్లు గుర్తించారు. పేగుల్లో మొత్తం పరాన్నజీవులు ఉన్నాయని, తద్వారా తిన్న ఆహారం జీర్ణం కాకపోవడంతో ఊపిరాడక మృతి చెందాయని హతిరామ్ తెలిపారు. కోళ్ల పెంపకందారులు వాటికి గింజలు వేయకపోవడం, నీళ్లు సరిగ్గా పట్టకపోవడం, ఎండలకు తట్టుకోలేకపోవడం వంటి కారణాలతో చనిపోయాయని వివరించారు. కోళ్లకు ఎలాంటి వ్యాధి సోకలేదని, రైతులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. -
అక్రమార్కుల పా‘పాలు’
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీ పాడి గేదెల పథకాన్ని కొందరు భ్రష్టుపట్టిస్తున్నారు. అక్రమార్కుల పాపాలు రైతుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. 3, 4 లీటర్లు కూడా పాలివ్వని పశువులను కూడా రైతులతో కొనిపిస్తున్నారు. కొందరు అధికారులు, పశువైద్యులు, దళారులు కుమ్మక్కు అయి పథకాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో పాలకొరత లేకుండా, స్వయంసమృద్ధి సాధించాలని సర్కారు సంకల్పించింది. అందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా సబ్సిడీ గేదెల పథకాన్ని ప్రవేశపెట్టారు. తెలంగాణ విజయ డెయిరీ, నల్లగొండ–రంగారెడ్డి డెయిరీ, ముల్కనూరు మహిళా డెయిరీ, కరీంనగర్ డెయిరీల్లోని 2.13 లక్షల మంది సభ్యులకు ఒక్కొక్కరికి ఒక పాడి పశువును సబ్సిడీపై అందజేయాలన్నది సర్కారు ఉద్దేశం. ఒక్కో పాడి పశువుకు రూ.80 వేలు యూనిట్ ధరగా నిర్దారించారు. ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు 75 శాతం సబ్సిడీ (రూ.60 వేలు) ఇస్తారు. అందులో మిగిలిన 25 శాతం (రూ.20 వేలు) లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. ఇతర లబ్ధిదారులకు 50 శాతం సబ్సిడీ (రూ.40 వేలు) ఖరారు చేశారు. మిగిలిన 50 శాతం వాటాను లబ్ధిదారుడు తన వాటాగా చెల్లించాలి. బ్యాంకులతో సంబంధం లేకుండా ఈ పథకాన్ని అమలు చేయాలి. యూనిట్ ధర రూ.80 వేలలో పాడి పశువు ధర, మూడేళ్ల బీమా, 300 కిలోల దాణా కూడా కలిపారు. కాబట్టి లబ్ధిదారుడు ఎలాంటి అదనపు రుసుం చెల్లించాల్సిన అవసరంలేదు. కమీషన్ల కోసం కుమ్మక్కు... నాలుగు డెయిరీల పరిధిలో 2.13 లక్షల మంది పాడి రైతులకుగాను ఇప్పటివరకు 57,567 మంది రైతులకు పాడి పశువులను సబ్సిడీపై ఇచ్చారు. అందులో విజయ డెయిరీ పరిధిలో 29,189 మంది రైతులు, నల్లగొండ–రంగారెడ్డి డెయిరీకి చెందిన 13,878 మంది, ముల్కనూరు మహిళా డెయిరీకి చెందిన 2,942 మంది. కరీంనగర్ డెయిరీలో 11,558 మంది పాడి రైతులు ఇప్పటివరకు గేదెలు లేదా ఆవులు కొనుగోలు చేశారు. వయసు మళ్లిన వాటిని కొనుగోలు చేసి రైతులకు ఇస్తున్నారు. పాడి ఉత్పత్తి గేదెలలో కనీసం 6–10 లీటర్లు, ఆవులలో 8–12 లీటర్లు సామర్థ్యం కలిగి ఉండాలి. ముర్రా, గ్రేడేడ్ ముర్రా గేదెలు, ఆవు జాతి అయిన జెర్సీ, హోలిస్టిన్ సంకర జాతి పశువులను కొనవలసి ఉండగా నాటు పశువులను కొంటున్నారు. సబ్సిడీ గేదె బహిరంగ మార్కెట్లో రూ.30 వేలకు మించి ధర పలకదని, కానీ దాన్నే రూ.80 వేలకు కొనిపిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గేదెలను తీసుకొచ్చే ప్రాంతంలోని దళారులతో పశువైద్యులు కొందరు కుమ్మక్కు అయి ప్రతి గేదె పేరిట రూ.10 వేలకుపైగానే కమీషన్ కాజేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గేదెలను తీసుకువచ్చే వాహనాల ఖర్చు కూడా రైతులతోనే పెట్టిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. రాష్ట్రంలోని ఎన్నో సంతలుండగా, ఇతర రాష్ట్రాల్లో కొనిపిస్తూ రైతులను అప్పులపాలు చేస్తున్నారు. పాడి పశువులను కొనకపోతే ఇప్పటికే పోస్తున్న పాలు తీసుకోబోమని పాల కేంద్రాల నిర్వాహకులు, వైద్యం చేయబోమని కొందరు పశు వైద్యాధికారులు తమపై ఒత్తిడి తెస్తున్నారని పాడి రైతులు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ను అడ్డుపెట్టుకొని అధికారులు ఎంతో ధీమాగా అక్రమాలకు పాల్పడుతున్నారన్న విమర్శలున్నాయి. పాడి గేదెల పంపిణీలో అవినీతి పాడిగేదెల పంపిణీలో అవినీతి రాజ్యమేలుతోంది. ఈ పథకంతో రైతుకు పెద్దగా ప్రయోజనం ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని కాంట్రాక్టర్లకు, పశువైద్యాధికారులకు పెద్ద ఎత్తున కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రభుత్వం సరఫరా చేసే పాడిగేదె బహిరంగ మార్కెట్లో రూ.30 వేలకు మించి ఉండదు. రవాణా ఖర్చులు మాపైనే వేసేందుకు పశువైద్యులు ప్రయత్నిస్తున్నారు. దీన్ని నేను వ్యతిరేకించాను. – రాగీరు కిష్టయ్య, రైతు, జైకేసారం, చౌటుప్పల్ మండలం -
మాకొద్దీ గొర్రెలు...
- కొన్నింటికి రోగాలు.. మరికొన్ని మృత్యువాత - ఆసక్తిచూపని లబ్ధిదారులు రాయికల్(జగిత్యాల): గొల్లకుర్మలకు ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన గొర్రెల పంపిణీ పథకంపై లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. నాణ్యమైన గొర్రెలు లభించకపోవటం.. పంపిణీ చేసిన వాటిల్లో చాలావరకు రోగాల బారిన పడటం.. మరికొన్ని మృత్యువాత పడటంతో లబ్ధిదారులు వెనకడుగు వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గొల్లకుర్మల కోసం సీఎం కేసీఆర్ 75% సబ్సిడీపై గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారు. గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించి లక్కీడిప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఎంపికైన ఒక్కొక్కరికీ 20 గొర్రెలు, ఒక పొట్టేలును అందజేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలకు పశువైద్యులు రాష్ట్రంలో లబ్ధిదారులకు సరిపోయే గొర్రెలు లేకపోవడంతో ఒక్కో జిల్లాకు ఒక్కో రాష్ట్రాన్ని ఎంపిక చేసి పశువైద్యుల బృందాన్ని పంపించి గొర్రెలను కొనుగోలు చేయిస్తున్నారు. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన గొర్రెలు ఒక్కసారిగా వాతావరణ మార్పుల వల్ల అనారోగ్యానికి గురి కావడం.. అంతకు ముందే బక్కచిక్కిన గొర్రెలను పంపిణీ చేయడంతో అవి రోగాల బారినపడి చనిపోతున్నాయి. జగిత్యాల జిల్లా అయోధ్య గ్రామంలో 10, అర్పపెలిలో 4, డబ్బ గ్రామంలో 15, ఫకీర్కొండాపూర్లో నాలుగు ఇలా ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలు మృత్యువాత పడ్డాయి. దీంతో గొల్ల కుర్మలు ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలు తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. లోకల్లోనే ధర తక్కువ.. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న గొర్రెల ధరలు ఎక్కువగా ఉన్నట్లు గొల్లకుర్మలు చెబుతున్నారు. కొందరు దళారులు రంగంలోకి దిగి కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల నుంచి ఒక్కో జతకు రూ. 6 వేల నుంచి రూ. 7 వేలకే కొనుగోలు చేసి.. ఆయా రాష్ట్రాలకు తీసుకెళ్లి.. వాటిని అక్కడ మళ్లీ మనకే రూ. 14 వేలకు జతగా విక్రయిస్తున్నారు. -
పశువైద్యులుగా 238 మంది నియామకం
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 238 మంది పశువైద్యులుగా నియమితులయ్యారు. కోరుట్ల, ప్రొద్దుటూరు పశువైద్య కళాశాలల్లో డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు కూడా కొందరు ఎంపికయ్యారు. ఈ మేరకు నియామకపు ఉత్తర్వులు జారీ చేసినట్లు పశుసంవర్థక శాఖ డెరైక్టర్ డి.వెంకటేశ్వర్లు తెలిపారు. వాస్తవానికి 469 పశువైద్యుల పోస్టులకు ఈ ఏడాది నోటిఫికేషన్ ఇవ్వగా.. అందులో సగం మేర మాత్రమే భర్తీ కావడం గమనార్హం. మొత్తం 336 దరఖాస్తులు రాగా, ప్రతిభ ఆధారంగా 238 మందిని ఎంపిక చేశారు. వీరిలో కోరుట్ల, ప్రొద్దుటూరు కళాశాలల అభ్యర్థులు కూడా ఉన్నారు. వాస్తవానికి ప్రొద్దుటూరు, కోరుట్ల కళాశాలల్లో బోధనా సిబ్బంది, ఇతర సౌకర్యాలు తగిన విధంగా లేవంటూ వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) ఇక్కడ చదువుకున్న విద్యార్థుల డిగ్రీలకు గుర్తింపునివ్వలేదు. ఈ అంశాన్ని ‘త్రిశంకు స్వర్గంలో వెటర్నరీ డాక్టర్లు’ శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీంతో పశుసంవర్థక శాఖ, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాయి.