కోడికి పోస్టుమార్టం చేస్తున్న పశువైద్యాధికారి హతిరామ్
సాక్షి, బషీరాబాద్: వందలాది నాటుకోళ్ల మృతి మిస్టరీని పశువైద్యాధికారులు ఛేదించారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో విచారణ జరిపి ఊపిరాడకనే అవి చనిపోయాయని వెల్లడించారు. ‘వింతవ్యాధితో నాటుకోళ్ల మృత్యువాత’శీర్షికన ఈ నెల 16న ప్రచురితమైన ‘సాక్షి’కథనానికి రాష్ట్ర పశు సంవర్థకశాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి స్పందించారు. వెంటనే విచారణ జరిపి నివేదిక అందజేయాలని జిల్లా వెటర్నరీ అధికారిని ఆదేశించారు. జిల్లా వెటర్నరీ అధికారి ఆదేశాల మేరకు సోమవారం బషీరాబాద్ మండల పశువైద్యాధికారి హతిరామ్ తన సిబ్బందితో కలసి మండంలోని క్యాద్గీరా, గంగ్వార్ గ్రామాల్లో విచారణ జరిపారు.
నాటుకోళ్లు మురుగుకాలువల్లోంచి ఆహారం తీసుకుంటున్నట్లు గమనించారు. అనారోగ్యానికి గురైన ఓ నాటు కోడిని పోస్టుమార్టం చేయగా దాని గిజార్డ్ పూర్తిగా ఇసుక రేణువులతో నిండి ఉన్నట్లు గుర్తించారు. పేగుల్లో మొత్తం పరాన్నజీవులు ఉన్నాయని, తద్వారా తిన్న ఆహారం జీర్ణం కాకపోవడంతో ఊపిరాడక మృతి చెందాయని హతిరామ్ తెలిపారు. కోళ్ల పెంపకందారులు వాటికి గింజలు వేయకపోవడం, నీళ్లు సరిగ్గా పట్టకపోవడం, ఎండలకు తట్టుకోలేకపోవడం వంటి కారణాలతో చనిపోయాయని వివరించారు. కోళ్లకు ఎలాంటి వ్యాధి సోకలేదని, రైతులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment