సాక్షి, అమరావతి: పశుదాణా తయారీ, నాణ్యతా నియంత్రణ, అమ్మకం, పంపిణీ చట్టం–2020ను క్షేత్ర స్థాయిలో అమలు చేసేందుకు ఫీడ్ ఇన్‌స్పెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చట్టం అమలు కోసం ఏర్పాటు చేసిన ‘కంట్రోలింగ్ అథారిటీ’గా పశు సంవర్థక శాఖ డైరెక్టర్ వ్యవహరిస్తుండగా.. జిల్లా స్థాయిలో కలెక్టర్/పశు సంవర్థక శాఖ సంయుక్త సంచాలకులు లైసెన్సింగ్ అథారిటీగా వ్యవహరిస్తున్నారు. తాజాగా పశు దాణా నాణ్యతను తనిఖీ చేసే అధికారాన్ని రాష్ట్ర స్థాయిలో పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌కు, క్షేత్ర స్థాయిలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్, అసిస్టెంట్ డైరెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. వీరు ఫీడ్ ఇన్‌స్పెక్టర్లుగా వ్యవహరిస్తారు.
క్షేత్ర స్థాయిలో పశు దాణా శాంపిల్స్ సేకరించి వాటి నాణ్యత పరిశీలన కోసం ప్రభుత్వం గుర్తించిన ప్రయోగశాలలకు పంపించొచ్చు. రాష్ట్రంలోను, దేశంలోను, ఇతర దేశాల్లో తయారైన పశుదాణా/ఖనిజ లవణ మిశ్రమాల దిగుమతి, విక్రయాలు జరిపేటప్పుడు నాణ్యతాపరంగా తనిఖీచేసే అధికారం వీరికి ఉంటుంది. నాణ్యత లోపాలను గుర్తిస్తే సంబంధిత వ్యాపారులు/ఉత్పత్తిదారులపై చర్యలు తీసుకోవచ్చు. దాణా తయారీలో నిర్దేశిత ప్రమాణాలను పాటించని, తప్పుడు ప్రకటనలు ఇచ్చే కంపెనీలపై ఈ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడే వారికి కనీసం ఏడేళ్ల పాటు జైలు శిక్ష, తగిన జరిమానా విధించే అవకాశం కూడా ఈ చట్టం కల్పిస్తుంది.
పశు వైద్యులే ఫీడ్ ఇన్‌స్పెక్టర్లు
Published Thu, Aug 26 2021 4:56 AM | Last Updated on Thu, Aug 26 2021 4:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment