బంగారు పతకాలు అందుకున్న మహ్మద్ కరీమా(ఎడమ), తులసీ రుక్మిణి(కుడి)
సాక్షి,అమరావతి/యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు మెరుగైన ఆదాయాన్నివ్వడంలో పశు సంపద కీలకపాత్ర పోషిస్తోందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. తిరుపతి వేదికగా శనివారం జరిగిన శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పదో స్నాతకోత్సవంలో కులపతి హోదాలో గవర్నర్ పాల్గొన్నారు. విజయవాడ రాజ్‌భవన్ నుంచి వెబినార్‌లో ప్రసంగించారు. రైతులు అదనపు ఆదాయం కోసం వ్యవసాయ అనుబంధ రంగాలకు మరలుతున్నారని, హరిత విప్లవం, ఆర్థిక సరళీకరణ, వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోవడం, కూలీల కొరత వంటి కారణాలతో పశు పోషణపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ జనాభాలో మూడింట రెండొంతుల మంది జీవనోపాధికి పశు సంతతి కీలకంగా మారిందన్నారు. పెంపకందార్లకు పశు వైద్యులు వృత్తిపరంగా, నైతికంగా మద్దతిస్తూ పశు పోషణను లాభదాయకంగా మార్చేందుకు మార్గనిర్దేశం చేయాలని గవర్నర్ కోరారు.
ఆర్‌బీకేల మూల్యాంకనం అభినందనీయం
తీరిక సమయాల్లో విద్యార్థులు సామాజిక సేవలో నిమగ్నం కావాలని పిలుపునిచ్చారు. బీవీఎస్సీ విద్యార్థులు చివరి సంవత్సరం శిక్షణ కాలంలో రైతు భరోసా కేంద్రాల(ఆర్‌బీకే) పనితీరును మూల్యాంకనం చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ‘అమూల్’ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం శుభపరిణామమని, తద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధి మార్గంలో దూసుకు పోగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. స్టార్టప్‌ల ఫైనాన్సింగ్, వ్యవస్థాపకత, ఉద్యోగ కల్పనను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ‘స్టార్ట్–అప్ ఇండియా’ ప్రచారాన్ని ప్రారంభించిందని, విద్యార్థులు అవకాశాలను అన్వేషించి పారిశ్రామికవేత్తలు కావాలని.. మరింత మందికి ఉద్యోగాలు కల్పించాలని గవర్నర్ సూచించారు.
మత్స్యశాఖ ప్రాముఖ్యం దృష్ట్యా.. ప్రత్యేక విశ్వవిద్యాలయం
974 కిలోమీటర్ల తీర ప్రాంతం నీటి వనరులు, 1.74 లక్షల హెక్టార్ల ఉప్పు నీటి సాంద్రత కలిగిన ఆంధ్రప్రదేశ్.. మత్స్య రంగంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని గవర్నర్ తెలిపారు. ఈ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా 14.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. మత్స్యశాఖ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రత్యేక మత్స్యశాస్త్ర విశ్వవిద్యాలయాన్ని ప్రకటించిందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వివరించారు. కార్యక్రమంలో రాజ్‌భవన్ నుంచి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా, గవర్నర్ సంయుక్త కార్యదర్శి శ్యామ్‌ప్రసాద్, విశ్వవిద్యాలయ పరిశోధన విభాగపు సంచాలకులు డాక్టర్ సర్జనరావు, విస్తరణ విభాగ సంచాలకులు డాక్టర్ వెంకటనాయుడు పాల్గొన్నారు.
తిరుపతి నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక బోర్డు సభ్యుడు డాక్టర్ ఏకే శ్రీవాత్సవ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కాగా, వీసీ డాక్టర్ పద్మనాభరెడ్డి పాల్గొన్నారు. అనంతరం వెటర్నరీ రంగంలో విశేష సేవలు అందిస్తున్న శాస్త్రవేత్తలు, అధ్యాపకులకు అవార్డులను, పలువురు విద్యార్థులకు పతకాలను అందించారు. బాపట్లకు చెందిన తులసీరుక్మిణి 11 బంగారు పతకాలు, ఒక వెండి పతకం, నెల్లూరుకు చెందిన మహ్మద్ కరీమా 5 బంగారు, ఒక వెండి పతకాన్ని అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment