నో స్టాక్!
►అధికార యంత్రాంగానికి గొర్రెల కష్టం
►దావణగిరె, చిత్రదుర్గలోనూ చుక్కెదురు
►ఇప్పటివరకు పంపిణీ చేసింది 72 యూనిట్లే
►జీవాల ధరలకు రెక్కలు.. పెంపకందార్ల అనాసక్తి
►గొర్రెల పరిణామంపైనా పెదవివిరుపు
కర్ణాటకబాట పట్టినా గొర్రెల జాడ మాత్రం కనిపించడంలేదు. ప్రతి రోజు సగటున 101 గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న యంత్రాంగం జీవాల లభ్యత లేక చేతులెత్తేసింది. ఇప్పటివరకు కేవలం 72 యూనిట్లను మాత్రమే పంపిణీ చేయగలిగింది.
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం అధికార యంత్రాంగానికి గుదిబండగా పరిణమించింది. ఇబ్బడిముబ్బడిగా నమోదైన సభ్యులకు.. లభిస్తున్న గొర్రెల సంఖ్యకు పొంతన కుదరకపోవడం ఈ పథకం అమలుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత నెల 20వ తేదీన గొర్రెల పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన జిల్లా యంత్రాంగం ఇప్పటివరకు 150 యూనిట్లను మాత్రమే సేకరించగలిగింది. జిల్లాకు కేటాయించిన గొర్రెలను కర్ణాటక రాష్ట్రం దావణగిరె, చిత్రదుర్గ జిల్లాల్లో కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. స్థానికంగా కొంటే అక్రమాలు జరిగే ఆస్కారముందని భావించిన సర్కారు ఈ ఆలోచన చేసింది.ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహించిన పశుసంవర్థకశాఖ.. గొర్రెల లభ్యతను అధ్యయనం చేసింది. ఇందుకనుగుణంగా గొర్రెల కొనేందుకు ఆయా జిల్లాల్లోని సంతలకు వెలుతున్న అధికారులకు నిరాశే మిగులుతోంది. ఇక్కడితో పోలిస్తే ధరలు రెట్టింపు కావడం.. నిర్దేశిత షీప్‌ల పరిణామంలో తేడా ఉండడంలో గొర్రెల పెంపకందారులు ఆసక్తి చూపడంలేదు. దీంతో సుదూర ప్రాంతంలో గొర్రెల కోసం గాలించినా ఫలితం కనిపించడంలేదు. మరోవైపు కర్ణాటక రాష్ట్రం నుంచి జీవాలు కొనుగోలు చేయడం కన్నా.. సమీప ప్రాంతాల్లోనే కొనడం మంచిదనే అభిప్రాయం గొల్ల, కుర్మ, యాదవ సామాజికవర్గం నుంచి వ్యక్తమవుతోంది.
కష్టమే సుమా!
జిల్లావ్యాప్తంగా 368 సొసైటీలు రిజిష్టర్ కాగా, ఇందులో 45,163 మంది సభ్యులుగా నమోదయ్యారు. వీరిలో ఈ ఏడాది 22,581 మందికి గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాల్సివుంది. అంటే సగటున రోజుకు 101 మంది చొప్పున ఆరు నెలలపాటు పంపిణీక్రతువు కొనసాగాలి. ఈ పథకం ప్రారంభించి పదిరోజులు కావస్తున్నా పంపిణీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకు కేవలం 72 మందికే యూనిట్లను పంపిణీ చేశారు. మరో 24 యూనిట్లు జిల్లాకు చేరుకోగా.. మరో 54 యూనిట్లు మార్గమధ్యంలో ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.