ఇంతవరకు ఊసేలేని రెండో విడత గొర్రెల పంపిణీ | Second Phase Of Sheep Distribution Process Not Started In Suryapet District | Sakshi
Sakshi News home page

ఇంతవరకు ఊసేలేని రెండో విడత గొర్రెల పంపిణీ

Published Sat, Aug 10 2019 10:16 AM | Last Updated on Sat, Aug 10 2019 10:16 AM

Second Phase Of Sheep Distribution Process Not Started In Suryapet District - Sakshi

సాక్షి, అర్వపల్లి: రెండో విడత గొర్రెల పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇంకా మొదటి విడత ప్రక్రియే కొనసాగుతోంది. రెండో విడత లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ పంపిణీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో ఈ ప్రక్రియ మొదలు కాలేదు. గొర్రెల కోసం లబ్ధిదారులకు ఎదురు చూపులు తప్పడంలేదు.

జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీ ఊసేలేదు. తమకు గొర్రెలు వస్తాయో రావో అనే ఆందోళనలో గొర్రెల కాపరులు ఉన్నారు. గొర్రెల కాపరుల సంక్షేమం, ఆర్థి కాభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఒక్కో యూనిట్‌ విలువ రూ. 1.11 లక్షలు కాగా లబ్ధిదారుల వాటా రూ.27,750, మిగిలిన రూ.83,250 ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందులో భాగంగా జిల్లాలో 2017 మే, జూన్‌ నెలల్లో ఒకే సారి మొదటి, రెండో విడత లబ్ధిదారులను ఎంపిక చేశారు.

మొదటి విడత లక్ష్యం 17,732 యూనిట్లు కాగా, ఇప్పటి వరకు గొర్రెల కాపరులు 17,257 యూనిట్లకు డీడీలు చెల్లించారు. కాగా 16,759 యూనిట్లు పంపిణీ చేశారు. మరో 498 యూనిట్లు గ్రౌండింగ్‌ చేశారు. మొదటి విడతలో కాపరులు తమ వాటాధనం కింద 16,759 యూనిట్లకు రూ.46,50, 62,250 చెల్లించగా ప్రభుత్వం రూ.1,39,51,86,750 విలువ చేసే గొర్రెల యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేసింది. ఈ విడతలో మొత్తం గొర్రెల పంపిణీకి సుమారు రూ.186 కోట్లు ఖర్చు అయ్యాయి.  ఈ ప్రక్రియ 201మే వరకుపూర్తికావాల్సి ఉంది. ఇంకా కొనసాగుతూనే ఉంది. 

సబ్సిడీ గొర్రెలను అమ్ముకుంటున్న లబ్ధిదారులు 
ప్రభుత్వం 75శాతం రాయితీపై గొర్రెలను పంపిణీ చేస్తుండగా అనేక చోట్ల గొర్రెలను అమ్మేసుకుంటున్నారు. అలాగే రీసైక్లింగ్‌ కూడా చేస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇచ్చిన గొర్రెలకు కలిగిన సంతానాన్ని మాత్రమే విక్రయించాలనేది నిబంధన. గొర్రెల మేతకోసం కూడా గడ్డి విత్తనాలను అందిస్తున్నారు. అయితే అక్రమార్కులు మాత్రం గొర్రెలు అవసరం లేని కాపరులను గుర్తించి వల వేస్తున్నారు. 

లబ్ధిదారులకు తప్పని నిరీక్షణ 
రెండో విడత లబ్ధిదారులను 2017 మే, జూన్‌ నెలల్లో గుర్తించారు. ఈ విడతలో జిల్లాలో 17,325 గొర్రెల యూనిట్ల పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2018 జూన్‌లో రెండో విడత పంపిణీ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఏడాది దాటినా ఇంతవరకు రెండో విడతపై ప్రభుత్వంనుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో లబ్ధిదారులకు నిరీక్షణ తప్పడంలేదు. తమకు రెండో విడత గొర్రెలు వస్తాయో, రావోనని ఆందోళన చెందుతున్నారు.  

మొదటి విడతలో.. ఇదీ పరిస్థితి.. 

మొత్తం యూనిట్లు     17,732 
డీడీలు చెల్లించినవారు             17,257 
ఇప్పటి వరకు పంపిణీ చేసిన యూనిట్లు 16,759
గ్రౌండింగ్‌ అయినవి 498 
మొత్తం ఖర్చు       రూ.186కోట్లు 
రెండో విడత లక్ష్యం   17,325లక్ష్యం

రెండో విడతపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు 
రెండో విడత రాయితీ గొర్రెల పంపిణీపై ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదు. రెండో విడతలో జిల్లాలో 17,325 యూనిట్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మొదటి విడతకు సంబంధించి 17,732 యూనిట్లకు గాను 16,759 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశాం. ఇందుకోసం రూ.186కోట్లు ఖర్చు చేయడం జరిగింది.  
– వేణుమనోహరరావు, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి 

గొర్రెలు ఇస్తే ఉపాధి కలుగుతుంది 
రెండోవిడత లబ్ధిదారుల జాబితాలో నాపేరు ఉంది. ఇంతవరకు గొర్రెలు రాలేదు. నాభర్త అకాల మరణం పొందారు. నాకు ఎలాంటి ఆస్తులు లేవు. కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నాను. గొర్రెలు ఇస్తే వాటిని పెంచుకొని ఉపాధి పొందుతా. ఇప్పటికైనా గొర్రెలను పంపిణీ చేయాలి.     
– వజ్జె వల్లమ్మ, రెండో విడత లబ్ధిదారురాలు, రామన్నగూడెం, జాజిరెడ్డిగూడెం మండలం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement