పాల ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు
నెల్లూరు(పొగతోట):
జిల్లాలో పాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జేసీ 2 రాజ్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాథమిక రంగాల్లో రెండంకెల వృద్ధిరేటు సాధించేలా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జీవనోపాధి కల్పించాలన్నారు. పశువులు, కోళ్లు, గొర్రల యూనిట్లు మంజూరయ్యాయన్నారు. డీఆర్‌డీఏ, పశుసంవర్థక శాఖలు సమన్వయంతో పని చేసి లభ్ధిదారులు ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. కోళ్లు, గొర్రెల యూనిట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే కేటాయించాలన్నారు. 4500ల కోళ్ల యూనిట్లు, 475 గొర్రెల యూనిట్లు మంజూరయ్యాయన్నారు. కోళ్ల యూనిట్ రూ.4 వేలు, గొర్రెల యూనిట్ రూ.50 వేలుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ యూనిట్లకు సబ్సిడీ ఉండదన్నారు. 480 పశువుల యూనిట్లు మంజూరు చేశామన్నారు. యూనిట్ కాస్ట్ రూ.60 వేలుగా నిర్ణయించినట్లు తెలిపారు. పశువుల యూనిట్లకు 75 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. ఈ యూనిట్లు ఎస్‌స్సీలకు మాత్రమే మంజూరు చేయాలన్నారు. అనంతరం వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, వైద్య శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయ డెయిరీ చైర్మన్ కె.రంగారెడ్డి, డీఆర్‌ఆఏ పీడీ లావణ్యవేణి, పశుసంవర్థక శాఖ జేడీ శ్రీధర్ పాల్గొన్నారు.