దేశప్రగతికి నిర్మాణాత్మక పాత్ర యువతదే
-
జేసీ-2 రాజ్‌కుమార్
-
ఘనంగా జిల్లా స్థాయి యువజనోత్సవాలు
నెల్లూరు(బారకాసు):
దేశప్రగతికి నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుండేది యువతేనని జాయింట్ కలెక్టర్–2 ఎస్‌ఏ రాజ్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక నెల్లూరు పురమందిరంలో యువజన సర్వీసులశాఖ, సెట్నల్ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా యువజనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను విజ్ఞాన సమపార్జనకు ఉపయోగించుకోవాలని సూచించారు. పెడద్రోవ పట్టకుండా పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్లాలని తెలిపారు. ఇంటర్నెట్‌ను వినోదానికి కాకుండా విజ్ఞానానికి ఉపయోగించుకుని ఉన్నతస్థాయికి వెళ్లేందుకు ప్రయత్నించాలన్నారు. లక్ష్యానికి అభిముఖంగా ప్రయాణించి గమ్యానికి చేరుకోవాలని ఈక్రమంలో కష్టాలు ఎదురైనప్పటికీ మొక్కవోని దీక్షతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం డివిజన్ స్థాయిలో వివిధ రంగాలలో యువజన సర్వీసుల శాఖ, సెట్నల్ సంయుక్తంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు జ్ఙాపికలతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు.
విజేతలు వీరే..
కర్ణాటక సంగీతం(గాత్రం) కుమారి లక్ష్మిప్రియ, జానపద సంగీతం వి.శ్రీలత, జానపద నృత్యానికి డిమనోహర్, వక్తృత్వ పోటీలకు సంబంధించి జి.లక్ష్మీనిహారిక, గ్రూపు జానపద నృత్యంలో బాలాజీగ్రూపునకు, అలాగే జానపద గీతానికి సంబంధించి యన్ లక్ష్మీచందన, భరతనాట్యంలో భవిత విజేతలుగా నిలిచారు. కాగా కార్యక్రమ వ్యాఖ్యాతగా బుల్లితెర నటుడు శింగంశెట్టి మురళీమోహన్‌రావు వ్యవహరించారు. సెట్నల్ సీఈఓ సుబ్రహ్మణ్యం, వికలాంగుల సంక్షేమశాఖ సహాయ సంచాలకు జి.నరసింహులు, ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాల ప్రిన్సిపిల్ సాయిబాబ, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటస్వామి, సెట్నల్ ఏఓ ప్రసాద్, స్వచ్ఛంద సంస్థల జిల్లా అధ్యక్షుడు ఈవీఎస్ నాయుడు పాల్గొన్నారు.