ఉదయగిరి, న్యూస్‌లైన్: జిల్లాలోని మెట్ట ప్రాంతం కరువు కోరల్లో చిక్కుకుంది. పంటలు పూర్తిగా ఎండిపోవడంతో కనీసం పాడితోనైనా జీవనం సాగిద్దామనుకున్న రైతుకు కష్టాలు తప్పడం లేదు. నీటి చుక్క నేలరాలక, పశువులకు పచ్చిగడ్డి కరువైంది. తినడానికి మేత లేక, తాగడానికి నీరు లేక పశువుల పొదుగులు ఎండిపోతున్నాయి. పాల దిగుబడి గణనీయంగా పడిపోయింది. పూటకు ఐదు లీటర్ల పాలిచ్చే గేదె..రెండు లీటర్లు ఇవ్వడం కష్టంగా మారింది.
ఏం చేయాలో దిక్కుతోచని స్థితిని పాడిరైతు ఎదుర్కొంటున్నాడు. కళ్ల ముందే గేదెలు నీళ్లు లేక, తిండిలేక శుష్కించిపోతుంటే చూడలేక అందినకాడికి కబేళాలకు అమ్ముకుంటున్నారు. ఎక్కువ ధర పెట్టి కొన్న గేదెల్ని కూడా కాలం కలిసిరాక దళారులు అడిగిన రేటుకు తెగనమ్ముతున్నారు.
జిల్లాలో వ్యవసాయం తర్వాత పాడి ఆధారంగానే లక్షలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో పంటలు పండక, పాడిగేదెల ద్వారానే భృతి కొనసాగిస్తున్నారు. గత ఏడాది పాలవెల్లువ రావడంతో కొనే వారు లేక రైతులు నష్టపోయారు. ఈ ఏడాది ఉదయగిరి, ఆత్మకూరు, కావలి నియోజకవర్గంలోని పలు మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. పంటల సంగతి దేవుడెరుగు. కనీసం పశువులు, జీవాలకు కూడా మేత, నీరు లేదు. అనేక గ్రామాల్లో బోర్లలో నీరు పూర్తిగా అడుగంటింది. వాగులు, వంకలు,చెరువులు బోసిపోయాయి. ఈ పరిస్థితుల్లో పశువులకు కష్టాలు మొదలయ్యాయి. వీటిని నమ్ముకున్న పాడి రైతుకు ఇబ్బందులు తప్పలేదు.
గణనీయంగా తగ్గిన దిగుబడి
జిల్లాలో రోజుకు సగటున 2 లక్షలకుపైగా లీటర్ల పాలను విజయ డెయిరీతో పాటు ప్రైవేటు డెయిరీలు సేకరిస్తాయి. రెండు మూడునెలల నుంచి సేకరణ పడిపోతోంది. ప్రస్తుతం జిల్లాలో లక్ష లీటర్లు మాత్రమే పాల సేకరణ జరుగుతోంది. కరువు కారణంగా రెండు నెలలుగా విజయ డెయిరీకి వచ్చే పాలు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం 25 వేల లీటర్ల స్థాయికి పడిపోయింది. మార్చి, ఏప్రిల్‌లో మరింత దిగజారి పది వేల స్థాయికి పడిపోయే అవకాశం ఉంది. పాల రంగంలో చక్రం తిప్పుతున్న తిరుమల, దొడ్ల, హెరిటేజ్, విష్ణుప్రియ తదితర ప్రైవేటు డెయిరీలకూ కరువు పోటు తప్పలేదు. వీటికీ పాలసేకరణ తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో పాడి రైతుల్ని ఆదుకునేందుకు ముందుకు రావాల్సిన ప్రైవేటు, ప్రభుత్వ డెయిరీ యాజమాన్యాలు తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి.
కరువు కోరల్లో ‘పాడి’
Published Mon, Mar 3 2014 4:14 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 AM
Advertisement