ఆపసోపాలు | the District to milk serious shortage | Sakshi
Sakshi News home page

ఆపసోపాలు

Published Tue, Apr 12 2016 4:16 AM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM

ఆపసోపాలు

ఆపసోపాలు

జిల్లాలో తీవ్రమైన పాల కొరత
రోజుకు 10లక్షల లీటర్లు అవసరం
ప్రస్తుతం ఉత్పత్తి 6 లక్షల లీటర్లే..
పశుగ్రాసం, నీటి సమస్యతో తగ్గిన ఉత్పత్తి
డెయిరీల్లో పాల పొడి వినియోగం?
భారంగా మారిన పశువుల పెంపకం


ప్రతి ఒక్కరూ రోజుకు 220 మిల్లీలీటర్ల పాలు తీసుకున్నప్పుడే తగిన పోషకాలు లభించి ఆరోగ్యంగా ఉంటారని నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ చెబుతోంది. ప్రస్తుతం జిల్లా జనాభా 45లక్షలు. ఈ ప్రకారం దాదాపు 10 లక్షల లీటర్ల పాలు అవసరం. అయితే జిల్లాలో ఉత్పత్తి అవుతున్న పాలు 6లక్షల లీటర్లు మాత్రమే. దీన్నిబట్టి చూస్తే జిల్లాలో పాల కొరత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
 
 పాల పొడి వినియోగం

పాల కొరతను అధిగమించేందుకు డెయిరీల్లో పాల పొడి ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. శీతాకాలం, వానాకాలంలో పాల ఉత్పత్తి అధికంగా ఉన్నపుడు పాల పొడి తయారుచేసుకోవడం సర్వసాధారణం. కొరత ఏర్పడినప్పుడు అదే పొడిని ఉపయోగించి పాలు తయారు చేస్తారు. కరువు, వేసవి కారణంగా ప్రస్తుతం పాల కొరత ఉత్పన్నం కావడంతో డెయిరీల్లో పాల పొడి ఉపయోగిస్తున్నట్లు సమాచారం.
 
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో నెలకొన్న కరువు పాల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నీటి సమస్య.. పశుగ్రాసం కొరత పశు పోషణను ప్రశ్నార్థకం చేస్తోంది. పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో పాడి పశువులు దాదాపు 8 లక్షలు. కరువు కారణంగా గత రెండు నెలల్లో దాదాపు 2లక్షల పాడి పశువులను అమ్మేసినట్లు తెలుస్తోంది. మరో 4లక్షల పశువులు ఒట్టిపోవడంతో.. పచ్చిమేత దొరక్క, నీటి సమస్యతో పాల ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది. మనుషులు తాగేందుకే నీళ్లు దొరకని పరిస్థితుల్లో పశువుల దాహార్తి తీర్చడం రైతులకు భారంగా మారుతోంది. శీతా కాలం, వానా కాలంలో సగటున ఒక పాడి పశువు 6 లీటర్ల వరకు పాలు ఇస్తుండగా.. ప్రస్తుతం 3 లీటర్లకు పడిపోయింది. అంటే రోజుకు జిల్లా వ్యాప్తంగా 6లక్షల లీటర్ల పాలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. గత డిసెంబర్ నెలలో 8.50 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి చేయడం చూస్తే.. కొరత ఏ స్థాయిలో పెరుగుతుందో తెలుస్తోంది.


 తగ్గిన  పాల ఉత్పత్తి
ఇటీవల కాలంలో పాడి పరిశ్రమ పట్ల యువత ఆసక్తి చూపుతోంది. పట్టణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమ ఊపందుకుంది. వేసవిలోనూ నిర్వాహకులు పాల ఉత్పత్తి తగ్గకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ పశుగ్రాసం కొరత.. నీటి సమస్య.. దాణా కారణంగా పాల ఉత్పత్తి 10 నుంచి 20 శాతం వరకు తగ్గినట్లు తెలుస్తోంది. ఇందుకు ఉష్ణోగ్రతలు పెరగడమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 10 ఆపై పాడి పశువులు కలిగిన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా ఉత్పత్తి తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో సాధారణ రైతుల పరిస్థితి ఘోరంగా ఉంటోంది.
 
 వసతుల కల్పనలో అధికారుల వైఫల్యం
గ్రామాల్లో పాల ఉత్పత్తి తగ్గకుండా పశు సంవర్ధక శాఖ తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయింది. పశువుల దాహర్తి తీర్చేందుకు గ్రామాల్లో తోట్లు ఏర్పాటు చేసి ప్రతి రోజు నీటితో నింపాల్సి ఉన్నా 80 శాతం గ్రామాల్లో వీటి ఊసే కరువైంది. దాదాపు 3 నెలలుగా నీటితొట్ల పేరిట హడావుడి చేయడం తప్పిస్తే కార్యరూపం దాల్చని పరిస్థితి. ఇక పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలు కూడా నామమాత్రమే. సైలేజి గడ్డి సబ్సిడీపై పంపిణీ చేస్తున్నా పశువులు తినకపోవడం వల్ల రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.


 కాగితాల్లోనే కొత్త పాడి
 కొత్త పాడి కాగితాలకే పరిమితం అవుతోంది. డీఆర్‌డీఏ-వెలుగులో 2015-16లో 10వేలకు పైగా పాడి పశువులు కొని స్వయం సహాయక సంఘల మహిళలకు పంపిణీ చేసినట్లు లెక్కలు ఉన్నాయి. కానీ క్షేత్ర స్థాయిలో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. ఇతర జిల్లాల నుంచి గ్రేడెడ్ ముర్రా గేదెలను తెచ్చి పంపిణీ చేయాల్సి ఉన్నా.. స్థానికంగానే ఇతరుల పశువులు చూపి మమ అనిపించినట్లు తెలుస్తోంది.
 
 పాల ఉత్పత్తి పెంచేందుకు చర్యలు

 జిల్లాలో పశుగ్రాసం కొరతను అధిగమించి పాల దిగుబడి పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం సబ్సిడీపై రైతులకు సైలేజి గడ్డి పంచుతున్నాం. సబ్సిడీ పోను రైతులు కిలోకు రూ.2 ప్రకారం చెల్లించాలి. ముఖ్యంగా వేసవిలో పాల ఉత్పత్తి తగ్గకుండా రైతులకు 75 శాతం సబ్సిడీపై మొలకగడ్డి యూనిట్లు పంపిణీ చేస్తున్నాం. ఇళ్లలోనే ప్టాస్టిక్ ట్రేల్లో ఉత్పత్తి చేసుకోవచ్చు. అజొల్లా యూనిట్లను 75 శాతం సబ్సిడీపై పాడి రైతులకు అందిస్తున్నాం. దాణాకు అజొల్లాను ప్రత్యామ్నాయంగా వినియోగించవచ్చు. నీటి వసతి కలిగిన రైతులకు పశుగ్రాసాల సాగుకు 75 శాతం సబ్సిడీపై గడ్డి విత్తనాలు పంపిణీ చేస్తున్నాం. అవసరమైన రైతులు సంబంధిత పశువైద్యులను సంప్రదించవచ్చు. - డాక్టర్ సుదర్శన్ కుమార్, జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement