పశువుల దాణాలో రసాయనాలు, మద్యం వ్యర్థాలు
దిగుబడి పెంచేందుకు వ్యాపారుల ఎత్తుగడ
ఫలితంగా పాలలో కలుస్తున్న ఆల్కహాల్
పిల్లల ఆరోగ్యంపై పెనుప్రభావం
పాడిపశువులకు ప్రాణాంతకంగా మారుతున్న వైనం
సాక్షి, రంగారెడ్డి జిల్లా : పౌష్టికాహారమైన పాలు ప్రస్తుతం కలుషితమవుతున్నాయి. పాల దిగుబడి పెంచి భారీ లాభాలు మూటగట్టుకునేందుకు కొందరు సరికొత్త పద్ధతికి తెరలేపారు. బ్రెవరేజెస్ కంపెనీల వ్యర్థాలను పశువుల దాణాలో కలిపి వాటికి అందిస్తున్నారు. ఈ ప్రక్రియతో రోజుకు సగటున నాలుగు లీటర్ల పాలిచ్చే గేదె.. ఈ పద్ధతితో ఏకంగా ఏడు లీటర్ల పాలిస్తోంది. దిగుబడి పెరిగి లాభాలందుకుంటున్న నేపథ్యంలో ఈ విధానాన్ని ఇతర రైతులూ అనుసరిస్తున్నారు. అయితే.. కొత్త పద్ధతితో పాల దిగుబడి పెరుగుతున్నప్పటికీ.. ఆ పాలు ఎంతవరకు శ్రేష్టమనే సంగతినే మర్చిపోయారు.
ఖర్చు తక్కువ.. లాభాలు ఎక్కువ
రాజధాని చుట్టూ విస్తరించి ఉండడంతో జిల్లాలో పాడిపరిశ్రమకు విపరీతమైన డిమాండ్ ఉంది. నగరానికి రోజుకు సగటున 25లక్షల లీటర్ల పాలు అవసరం. ఈ స్థాయిలో ఉత్పత్తి లేనప్పటికీ.. రవాణా, ఇతర ఖర్చులు తగ్గే అవకాశం ఉండడంతో జిల్లా పాడి రైతులకు బాగా కలిసివస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 3.1 లక్షల ఆవులు, 2.6 లక్షల గేదెలున్నట్లు పశుసంవర్ధక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రోజుకు జిల్లానుంచి మూడున్నర లక్షల లీటర్ల పాలు నగరానికి సరఫరా అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. న గరంలోని డిమాండ్‌ను ఆసరా చేసుకుని కొందరు దాణా వ్యాపారులు కొత్త పద్ధతికి తెరలేపారు.
బ్రెవరేజెస్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని ఆయా కంపెనీల వ్యర్థాలను రైతులకు విక్రయిస్తున్నారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లోని రైతులకు విజయవాడ సమీపంలోని ఓ బ్రెవరేజెస్ కంపెనీ పక్షం రోజులకోసారి ఈ వ్యర్థ ద్రావణాన్ని ట్యాంకర్ల ద్వారా లీటరుకు సగటున రూ.7 వసూలు చేస్తూ విక్రయిస్తోంది. చేవెళ్ల, శంషాబాద్, పరిగి రైతులకు కరీంనగర్‌కు చెందిన ఓ కంపెనీ ఈ వ్యర్థ ద్రావణాన్ని సరఫరా చేస్తోంది. ఈ పద్ధతితో పాడి రైతుకు ఫీడ్ ఖర్చు భారీగా తగ్గుతుండగా.. దిగుబడితో అధిక లాభాలొస్తున్నాయి.
మద్యం 10 శాతం పైమాటే..
పశువులకు దాణాలో భాగంగా పలు గింజల పొడిని నీటితో కలిపి ఇస్తారు. అయితే తాజాగా పలు చోట్ల ఈ మిశ్రమంలో రసాయనాలతో కూడిన మద్యం వ్యర్థాన్ని కలుపుతున్నారు. వీటిని తీసుకున్న పశువులు మత్తుగా.. సాధారణం కంటే భిన్నంగా ప్రవర్తిస్తాయి. ఈ సమయంలో పాలు అధికంగా ఇస్తున్నప్పటికీ.. అందులో మద్యంతో పాటు ఇతర రసాయనాలు కూడా నమోదవుతున్నాయి. ఇవి పిల్లలకివ్వడం హానికరమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు మద్యం వ్యర్థాలు పశువుల ఆరోగ్యాన్ని సైతం పూర్తిగా దెబ్బతిస్తాయని పరిశోధనలో తేలింది. ఇటీవల ఇబ్రహీంపట్నంకు చెందిన ఓ రైతు మద్యం వ్యర్థాల్ని దాణాలో కలిపి ఇవ్వడంతో వాటి కాలేయం చెడిపోవడం, మూత్రపిండాలు పాడవ్వడంతో ఏకంగా రెండు గేదెలు మృత్యువాత పడ్డాయి. దీంతో స్థానిక పశు వైధ్యాధికారి సూచన మేరకు కొత్త పద్ధతికి స్వస్తి చెప్పాడు.
ఉత్ప్రేరకాల ద్వారా..
మద్యం వ్యర్థాల్ని కలిపే పద్ధతితో పాటు కొన్నిచోట్ల రసాయనాలను ఉత్ప్రేరకాలుగా వాడుతున్నారు. వీటిని పశువులకు నేరుగా ఇంజక్షన్ రూపంలో ఎక్కిస్తున్నారు. ఈ పద్ధతితో పశువులు ఎక్కువ ఉత్తేజితమవుతున్నాయి. తాండూరు, వికారాబాద్‌లలోని కొందరు రైతులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో అవిచ్చే పాలు పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని శాస్త్రవేత్తల పరిశోధనలు చెబుతున్నాయి. సాధారణం కంటే మితిమీరిన ఎదుగుదల ప్రమాదమేనని పశుసంవర్ధక శాఖ అధికారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమృతాహారం.. విషతుల్యం!
Published Mon, Aug 24 2015 3:19 AM | Last Updated on Fri, Aug 17 2018 7:48 PM
Advertisement