సాక్షి, అమరావతి: పాలు, మాంసం, గుడ్లు, చేపలు.. దేశంలో వినియోగం భారీగా పెరుగుతున్న ఆహారం. జనాభా పెరుగుదల, సంపన్నులు పెరుగుతుండటంతో ఈ డిమాండ్ ఇంకా భారీగా పెరుగుతుందని నాబార్డు అంచనా వేస్తోంది. 2050 నాటికి దేశ జనాభా 1.6 బిలియన్లు దాటే అవకాశం ఉందని, వీరిలో సగం మంది నగరాలు, పట్టణాల్లో నివసిస్తారని, సంపన్నుల సంఖ్యా పెరుగుతున్నందున వీటికి డిమాండ్ వేగంగా పెరుగుతుందని ‘పశువులు, వ్యవసాయ వృద్ధి – పేదరిక నిర్మూలన’పై నాబార్డు అధ్యయన నివేదిక వెల్లడించింది.
గ్రామీణ ప్రాంతాల్లోనూ వీటి వినియోగం పెరుగుతోందని, గుడ్ల వాడకం మరింత ఎక్కువగా ఉందని పేర్కొంది. భారతదేశం పశు సంవర్ధక రంగంలో డిమాండ్‌కు తగినట్లుగా వృద్ధి సాధిస్తోందని తెలిపింది. 2010–11 నుంచి 2019–20 మధ్య పశు సంవర్ధక రంగం రికార్డు స్థాయిలో 7.6 శాతం మేర వార్షిక వృద్ధి సాధించిందని వెల్లడించింది. వ్యవసాయ వృద్ధి కంటే ఇది రెండింతలు ఎక్కువని తెలిపింది. వ్యవసాయ వృద్ధిలో పశువుల రంగం వాటా 30 శాతం ఉందని పేర్కొంది.
పేదరికాన్ని తగ్గిస్తున్న పశు సంవర్థక రంగం
దేశంలో పేదరికాన్ని తగ్గించడంలో పశు సంవర్ధక రంగం ప్రభావం ఎక్కువ ఉంది. పశు పోషణ రంగంలో దేశంలో 70 శాతం కంటే ఎక్కువగా మహిళలే ఉన్నారు. మహిళా సాధికారతకు పశు పోషణ దోహదపడుతోంది. పశువుల ద్వారా వచ్చిన ఆదాయాన్నే మహిళలు ఇంటి బడ్జెట్‌కు వినియోగిస్తున్నారు. ప్రధానంగా ఈ ఆదాయాన్ని పిల్లల పోషకాహారం, ఆరోగ్యం, విద్యకు కేటాయిస్తున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. భవిష్యత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని పేదరిక నిర్మూలనకు దోహదపడే పశు సంవర్ధక రంగాన్ని, పశు పోషణను మరింతగా ప్రోత్సహించాలని నాబార్డు నివేదిక సూచించింది.
ఆహార అలవాట్లలో మార్పు
1990–91 నుంచి మొత్తం జనాభా వృద్ధి రేటు 1.57 శాతంతో పోల్చితే పట్టణ జనాభా వృద్ధి రేటు 2.64 శాతంగా ఉందని నివేదిక తెలిపింది. దేశ జనాభాలో మూడింట ఒక వంతు నగరాలు, పట్టణాల్లోనే నివశిస్తున్నారు. ఈ ప్రభావంతో ఆహార అలవాట్లలో మార్పు వచ్చింది. గత రెండు దశాబ్దాలుగా పట్టణాల్లో తలసరి పాలు, పాల ఉత్పత్తుల వినియోగం 10 శాతం పెరిగింది. గుడ్లు వినియోగం 13 శాతం, మాంసం, చేపల వినియోగం 25 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.
గ్రామీణ ప్రాంతాల్లో కూడా పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపల వినియోగం దాదాపు ఇదే స్థాయిలో పెరిగాయని పేర్కొంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో గుడ్ల వినియోగం చాలా వేగంగా 45.5 శాతం మేర పెరిగినట్లు నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో 2030 నాటికి దేశంలో పాల డిమాండ్ 65.2 శాతం, మాంసం డిమాండ్ 75.5 శాతం, గుడ్లకు డిమాండ్ 65.7 శాతం, చేపల డిమాండ్ 75.0 శాతం మేర పెరుగుతుందని నాబార్డు నివేదిక అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment