అమెరికా జనం గుడ్లు కొనుగోలు చేయాలంటే బెంబేలెత్తిపోతున్నారు. అగ్రరాజ్యంలో గుడ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో గుడ్లు డజను ఏడు ఆమెరికన్ డాలర్లు (రూ. 603) చొప్పున విక్రయిస్తున్నారు.
ఇలా గుడ్ల ధరలు పెరగడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణమని డెమోక్రటిక్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పెరుగుతున్న గుడ్ల ధరలను అరికట్టడానికి ట్రంప్ చర్యలు తీసుకోలేదని వారంటున్నారు. కమోడిటీ ప్రైస్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ట్రేడింగ్ ఎకనామిక్స్‌లోని వివరాల ప్రకారం అమెరికాలోని కొన్ని నగరాల్లో గుడ్లు డజనుకు ఏడు అమెరికన్ డాలర్ల రికార్డు ధరకు చేరుకున్నాయి. ఇక్కడి ప్రజల అల్పాహారంలో గుడ్లు ఒక ముఖ్యమైన భాగం అయినందున ప్రతిరోజూ కోట్లాది మంది గుడ్లను కొనుగోలు చేస్తుంటారు.
అయితే ఇప్పుడు గుడ్ల ధరలు తమ బడ్జెట్‌ను మించిపోతున్నాయని వారు బెంబేలెత్తిపోతున్నారు. నిత్యావసరాల ధరలను తగ్గిస్తానని ట్రంప్ హమీనిచ్చారు. అయితే ఇప్పుడు బైడెన్ పదవీకాలంతో పోలిస్తే గుడ్ల ధరలు 40శాతం మేరకు పెరిగాయి. కాగా ఏవియన్ ఫ్లూ వ్యాప్తి చెందడంతో ఆహార దిగుమతులను పరిమితం చేయాలంటూ అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్య , మానవ సేవల శాఖను ఆదేశించడాన్ని డెమొక్రాట్లు వ్యతిరేకించారు. ఈ కారణంగానే గుడ్ల దిగుమతులు తగ్గి ధరలు పెరిగాయని వారంటున్నారు.
ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా లేదా బర్డ్ ఫ్లూ యునైటెడ్ స్టేట్స్‌లో వ్యాపిస్తోంది. ఈ నేపధ్యంలో దేశంలో 30 మిలియన్లకు పైగా కోళ్లు చంపారు. మిన్నెసోటా సెనేటర్ అమీ క్లోబుచార్ ఈ విషయమై మాట్లాడుతూ అమెరికాకు 47వ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. దేశంలో గుడ్ల ధరలను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారని, అయితే అటువంటిదేమీ జరగలేదన్నారు. బిల్ క్లింటన్ మాజీ క్యాబినెట్ కార్యదర్శి రాబర్ట్ రీచ్ మాట్లాడుతూ ట్రంప్ కారణంగా దేశ ప్రజల ఆరోగ్యానికి, జేబుకు ముప్పు వాటిల్లుతోందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment