Meat sales
-
మంట పుట్టిస్తున్న మటన్ ధరలు.. కిలో ధర ఎంతంటే!
సాక్షి, హైదరాబాద్: మాంసాహార ప్రియులకు చేదువార్త. మటన్ ధరలు మంట రేపుతున్నాయి. తెలంగాణలో మేక మాంసం ధర మరోసారి ‘వెయ్యి’ మైలురాయివైపు పరుగులు తీస్తోంది. ప్రస్తుత స్పీడ్ చూస్తుంటే త్వరలోనే మటన్ థౌజండ్ వాలా పేలడం ఖాయంగానే కనిపిస్తోంది. క్వాలిటీని బట్టి కిలో మటన్ ధర ప్రస్తుతం 800 నుంచి 850 రూపాయలకు విక్రయిస్తున్నారు. కార్తీక మాసం ముగిసిన తర్వాత ధర మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే మటన్ ఇప్పటికే కొన్నిచోట్ల నాలుగు అంకెల స్థాయికి చేరిందని టాక్. సామాన్యులకు దూరం గత కొద్ది సంవత్సరాలుగా ధరలు బాగా పెరుగుతూ వస్తుండటంతో సామాన్యులు మటన్ కొనాలంటే జంకుతున్నారు. మేక మాంసం కొనే స్తొమత లేక చికెన్‌తోనే సరిపెట్టుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అరకొరగా మాత్రమే మటన్ కొంటున్నారు. ధరలు భారీగా పెరగడంతో పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు మటన్‌కు దూరమవుతున్నారు. గతేడాది జీహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో మటన్ కిలో ధర వెయ్యి రూపాయలు దాటినా తర్వాత దిగివచ్చింది. బర్డ్‌ప్లూను బూచిగా చూపి అప్పట్లో కొంతమంది వ్యాపారులు అడ్డగోలుగా రేట్లు పెంచేశారు. కరోనా సమయంలోనూ మటన్ ధరలు ఆకాశాన్నంటాయి. ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో మటన్ వినియోగం ఎక్కువ. ఈమధ్య కాలంలో మటన్ వినియోగం బాగా పెరిగిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజల వినియోగానికి సరిపడనంతగా గొర్రెలు, మేకలు అందుబాటులో లేకపోవడమే ధరలు పెరగడానికి కారణమని అంటున్నారు. జాతీయ పశుగణన లెక్కల ప్రకారం తెలంగాణలో 2019లో 1.91 కోట్ల గొర్రెలు, మేకలు ఉన్నట్టు అంచనా. ఇవి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 600 ట్రక్కుల్లో గొర్రెలు, మేకలు తెలంగాణకు సరఫరా అవుతుంటాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం కూడా డిమాండ్‌ను అందుకోకలేకపోతోంది. గొర్రె, మేకల నుంచి 50 శాతం మాత్రమే మాంసం వస్తుందని.. అదే చికెన్ అయితే 70 శాతం వస్తుందని.. మటన్ ధర ఎక్కువగా ఉండడానికి ఇదీ ఓ కారణం. కరోనా తర్వాత ప్రజలు ఎక్కువగా మంసాహారం వైపు మొగ్గు చూపుతుండడం గమనార్హం. చికెన్ మాదిరిగా మటన్ ధరను నిర్ణయించే ఓ వ్యవస్థ లేకపోవడంతో ధరలపై నియంత్రణ లేకుండా పోతోంది. ధరల మాట ఎలా ఉన్నా ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో మాత్రం గత నెల రోజులుగా మటన్ విక్రయాలు భారీగా పెరిగాయని పరిశీలకుల అంచనా. మాంసాహారులే ఎక్కువ దేశంలో మాంసాహారులు పెరుగుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)–5 వెల్లడించింది. అధిక శాతం ప్రజలు వారానికి కనీసం ఒకసారి చేపలు, చికెన్, మాంసంలో ఏదో ఒక దానిని కచ్చితంగా ఆరగిస్తున్నారని తెలిపింది. అయితే మటన్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే టాప్‌లో ఉంది. 73 శాతం మంది ప్రజలు కనీసం వారంలో ఒకసారైనా మాంసం తింటున్నారు. కేవలం 4.4 శాతం మంది ఎటువంటి మాంసాహారం ముట్టకుండా కోడిగుడ్డు మాత్రమే తీసుకుంటున్నారు. 0.27 శాతం మంది మాత్రమే వెజిటేరియనన్లు ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. (క్లిక్ చేయండి: నిమ్స్‌కు మునుగోడు గ్రహణం) -
భారత్‌లో పాలు, మాంసానికి భారీ డిమాండ్.. నివేదికలో కీలక అంశాలు!
సాక్షి, అమరావతి: పాలు, మాంసం, గుడ్లు, చేపలు.. దేశంలో వినియోగం భారీగా పెరుగుతున్న ఆహారం. జనాభా పెరుగుదల, సంపన్నులు పెరుగుతుండటంతో ఈ డిమాండ్ ఇంకా భారీగా పెరుగుతుందని నాబార్డు అంచనా వేస్తోంది. 2050 నాటికి దేశ జనాభా 1.6 బిలియన్లు దాటే అవకాశం ఉందని, వీరిలో సగం మంది నగరాలు, పట్టణాల్లో నివసిస్తారని, సంపన్నుల సంఖ్యా పెరుగుతున్నందున వీటికి డిమాండ్ వేగంగా పెరుగుతుందని ‘పశువులు, వ్యవసాయ వృద్ధి – పేదరిక నిర్మూలన’పై నాబార్డు అధ్యయన నివేదిక వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ వీటి వినియోగం పెరుగుతోందని, గుడ్ల వాడకం మరింత ఎక్కువగా ఉందని పేర్కొంది. భారతదేశం పశు సంవర్ధక రంగంలో డిమాండ్‌కు తగినట్లుగా వృద్ధి సాధిస్తోందని తెలిపింది. 2010–11 నుంచి 2019–20 మధ్య పశు సంవర్ధక రంగం రికార్డు స్థాయిలో 7.6 శాతం మేర వార్షిక వృద్ధి సాధించిందని వెల్లడించింది. వ్యవసాయ వృద్ధి కంటే ఇది రెండింతలు ఎక్కువని తెలిపింది. వ్యవసాయ వృద్ధిలో పశువుల రంగం వాటా 30 శాతం ఉందని పేర్కొంది. పేదరికాన్ని తగ్గిస్తున్న పశు సంవర్థక రంగం దేశంలో పేదరికాన్ని తగ్గించడంలో పశు సంవర్ధక రంగం ప్రభావం ఎక్కువ ఉంది. పశు పోషణ రంగంలో దేశంలో 70 శాతం కంటే ఎక్కువగా మహిళలే ఉన్నారు. మహిళా సాధికారతకు పశు పోషణ దోహదపడుతోంది. పశువుల ద్వారా వచ్చిన ఆదాయాన్నే మహిళలు ఇంటి బడ్జెట్‌కు వినియోగిస్తున్నారు. ప్రధానంగా ఈ ఆదాయాన్ని పిల్లల పోషకాహారం, ఆరోగ్యం, విద్యకు కేటాయిస్తున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. భవిష్యత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని పేదరిక నిర్మూలనకు దోహదపడే పశు సంవర్ధక రంగాన్ని, పశు పోషణను మరింతగా ప్రోత్సహించాలని నాబార్డు నివేదిక సూచించింది. ఆహార అలవాట్లలో మార్పు 1990–91 నుంచి మొత్తం జనాభా వృద్ధి రేటు 1.57 శాతంతో పోల్చితే పట్టణ జనాభా వృద్ధి రేటు 2.64 శాతంగా ఉందని నివేదిక తెలిపింది. దేశ జనాభాలో మూడింట ఒక వంతు నగరాలు, పట్టణాల్లోనే నివశిస్తున్నారు. ఈ ప్రభావంతో ఆహార అలవాట్లలో మార్పు వచ్చింది. గత రెండు దశాబ్దాలుగా పట్టణాల్లో తలసరి పాలు, పాల ఉత్పత్తుల వినియోగం 10 శాతం పెరిగింది. గుడ్లు వినియోగం 13 శాతం, మాంసం, చేపల వినియోగం 25 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపల వినియోగం దాదాపు ఇదే స్థాయిలో పెరిగాయని పేర్కొంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో గుడ్ల వినియోగం చాలా వేగంగా 45.5 శాతం మేర పెరిగినట్లు నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో 2030 నాటికి దేశంలో పాల డిమాండ్ 65.2 శాతం, మాంసం డిమాండ్ 75.5 శాతం, గుడ్లకు డిమాండ్ 65.7 శాతం, చేపల డిమాండ్ 75.0 శాతం మేర పెరుగుతుందని నాబార్డు నివేదిక అంచనా వేసింది. -
మాంసం అమ్మకాలపై కరోనా ఎఫెక్ట్
-
మాంసంపై మీమాంస!
సాక్షి, హైదరాబాద్: అక్టోబర్ 2, గాంధీ జయంతి.. ఈ రోజున దేశ వ్యాప్తంగా మాంస విక్రయాలు జరగవు. అయితే రైల్వే క్యాంటీన్లలో ఇందుకు విరుద్ధంగా గాంధీ జయంతిన మాంసాహారం వడ్డించే ఏర్పాట్లు చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. దురంతో, రాజధాని, శతాబ్ది లాంటి ప్రీమియం రైళ్లల్లో ప్రయా ణించే వారందరికీ శాఖాహారమే వడ్డించాలని రైల్వే ఈ ఏడాది జనవరిలో నిర్ణయించింది. ఈసారి గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించాలని ఇండియన్ రైల్వే కేటరింగ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) భావించింది. ఇందుకు ఆహార మెనూలో మార్పులు చేసింది. ఈ రోజున భోజనంలో చపాతీలు, పరోటాలు, పనీర్, కూరగాయలతో చేసిన పలు రకాల వంటకాలనే అందించాలని నిర్ణయించింది. గత నెలలోనే నిర్ణయం.. శాఖాహార భోజనం వాస్తవానికి ఈ ఆలోచన జనవరిలో వచ్చినా.. అధికారిక నిర్ణయం మాత్రం సెప్టెం బర్ తొలివారంలో వెలువడింది. దీన్ని చాలామంది ప్రయాణికులు గమనించలేదు. దీంతో ఆ రోజు రైలు ప్రయాణంలో ఉన్నవారిలో చాలామంది మాంసాహారం ఆర్డర్ చేశారు. ఇప్పుడు తమ మెనూ మార్పు పై గందరగోళంలో ఉన్నట్లు సమాచారం. దక్షిణాది నుంచి ఢిల్లీ, గుజరాత్, రాజస్తాన్ ప్రాంతాలకు 28 నుంచి 32 గంటల ప్రయాణ సమయం పడుతుంది. ప్రయాణికులు అక్టోబర్ ఒకటి రాత్రి ప్రయాణం మొదలుపెడితే, వారికి అక్టోబర్ 2న శాఖాహారం అందించి, తిరిగి 3న వారు కోరిన మాంసాహారం ఇవ్వనున్నారు. ముందస్తు నిర్ణయం తీసుకోవడంలో ఐఆర్సీటీసీ విఫలమవడంతోనే ఇది తలెత్తింది. కావాలంటేనే ఇస్తాం: ఐఆర్సీటీసీ దేశవ్యాప్తంగా రోజూ 7 నుంచి 14 లక్షల వరకు ఐఆర్సీటీసీలో టికెట్లు బుక్ చేస్తారు. దక్షిణ మధ్య రైల్వే నుంచి ఈ సంఖ్య లక్షకు పైగా ఉంటుంది. ప్రీమియం రైళ్లలో ప్రయాణం చేసేవారి సంఖ్య 12 వేలకు పైమాటే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది, దక్షిణ మధ్య రైల్వేలో వేలాదిమంది ఇప్పటికే మాంసం ఆర్డర్ చేశారు. వాస్తవానికి తమ షెడ్యూలు ప్రకారం.. అందరికీ శాఖాహారమే వడ్డిస్తామని ఐఆర్సీటీసీ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఐఆర్సీటీసీ పరిధిలో నడిచే ఫుడ్ కోర్టులు, హోటళ్లు, స్టాళ్లకు ఆదేశాలిచ్చినట్లు పేర్కొంటున్నారు. అయితే అప్పటికే ఆర్డర్‌ఇచ్చిన వారు మరీ ఒత్తిడి చేస్తే మాత్రమే మాంసం వడ్డిస్తామని చెబుతున్నారు. లేదంటే మాంసాహారం ఆర్డర్ చేసిన వారికి కూడా శాఖాహారమే అందిస్తామంటున్నారు. -
మాంసం అంతా మోసం..!
విజయనగరం మున్సిపాలిటీ: మనం తింటున్నది నాణ్యమైన మాంసమేనా..? పట్టణంలో ఆరోగ్యవంతమైన జంతు మాంసాలే విక్రయిస్తున్నారా..? మున్సిపల్ అదికారులు పరిశీలించి ముద్ర వేసిన మాంసాన్ని మనం కొంటున్నామా..? అని ఎవరైనా అడిగితే లేదనే సమాధానం వస్తోంది. జిల్లా కేంద్రంలో మాంసం విక్రయాల వెనుక మోసం దాగి ఉందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. నాసిరకం, అనారోగ్య జంతువుల మాంసాన్ని మున్సిపాలిటీ అనుమతి లేకుండా విక్రయించేస్తున్నట్టు సమాచారం. ఫ్రిజ్‌ల్లో మిగులున్న చికెన్, మటన్ నిల్వలను మరుసటి రోజు విక్రయిస్తున్నారు. మిగులు చికెన్, మటన్‌ను హోటళ్లకు తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఏ ఒక్కరు చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడం గమనార్హం. నిఘా కరువు.. నగరంలో మాంసం విక్రయాలుపై నిఘా కరువైంది. మున్సిపల్ ప్రజారోగ్య విభాగాధికారులు , వెటర్నరీ విభాగాల మధ్య సమన్వయ లోపం కరాణంగా నాసిరకం, నాణ్యత లోపించిన మాంసం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. విజయనగరం పట్టణంలో చికెన్ సెంటర్లు 130, మటన్ విక్రయశాలలు 64 వరకు ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇటు అధికారికంగా... అటు అనధికారికంగా నిర్వహిస్తోన్న మాంసం విక్రయకేంద్రాలు నిబంధనలు పాటించడం లేదు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడే మాంసం విక్రయిస్తున్నారు. చేపల విక్రయాల పరిస్థితీ ఇదే. మురుగు కాలువలకు అనుకుని, రోడ్లు మీదనే విక్రయాలు చేస్తున్నారు. అపరిశుభ్ర పరిసరాల్లోనే విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఆది, మంగళవారాల్లో అయితే పరిస్థితి మరింత దారుణం. మటన్ రూ.520 నుంచి రూ.600లకు కిలో విక్రయిస్తున్నారు. మిగులు మాంసాన్ని మరుసటి రోజు ధర తగ్గించి విక్రయిస్తున్నారు. నాసిరకం, వయస్సు మళ్లిన , అనారోగ్యంగా ఉన్న గొర్రెలు, మేకల నుంచి సేకరించే మాంసాన్ని తక్కువ ధరకే హోటళ్లకు విక్రయిస్తున్నట్టు సమాచారం. చికెన్ అమ్ముడయ్యే ప్రాంతాలు... రోజురోజుకు విస్తరిస్తోన్న విజయనగరం పట్టణంలో చికెన్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మున్సిపల్ ప్రజారోగ్య విభాగం అధికారిక లెక్కల ప్రకారం 130 వరకు దుకాణాలు అనుమతులతో నిర్వహిస్తుండగా... అధికారికంగా ఎటువంటి అనుమతులు లేకుండా అంతకన్నా రెట్టింపు కేంద్రాల్లో విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రధానంగా మున్సిపల్ కార్యాలయం జంక్షన్, గూడ్స్‌షెడ్ రోడ్ కోట జంక్షన్, దాసన్నపేట కూడలి, రింగ్‌రోడ్, రైల్వేస్టేషన్ రోడ్, కలెక్టరేట్ జంక్షన్ల వద్ద అధికారిక దుకాణాలు నడుస్తుండగా... వీధికొకటి చొప్పున వెలుస్తున్న సెంటర్లు సైతం వందల్లో ఉండడం గమనార్హం. రోడ్డుపక్కన చిన్నపాటి బల్లపెట్టి ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ విక్రయాలు చేపట్టి ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. మిగులు వ్యర్థాలను కాలువల్లో వేయడంతో పరిసరాలు దుర్ఘంధ భరితంగా మారుతున్నాయి. ప్రాంతం : విజయనగరం మున్సిపాలిటీ మొత్తం జనాభా : 3 లక్షల పైమాటే చికెన్ సెంటర్లు : 130 పైబడి మటన్ విక్రయ కేంద్రాలు : 64 నాన్‌వెజ్ హోటళ్లు : 25 పట్టణ శివార్లలో దాబాల సంఖ్య : 12 రోజు వారీ మటన్ విక్రయాలు : సగటున 1000 కిలోలు ఆది, మంగళవారాల్లో విక్రయాలు : 2వేల కిలోల పైమాటే రోజు వారీ చికెన్ విక్రయాలు : 4 వేలకు పైగా కిలోలు ఆది, మంగళవారాల్లో విక్రయాలు : సుమారు 10 వేల కిలోలు నిబంధనలు ఇలా.... అనుమతి ఉన్న దుకాణాల్లో మాత్రమే మాసం విక్రయాలు చేయాలి. మున్సిపాలిటీకి చెందిన పశువైద్యాధికారి «ధ్రువీకరించిన తర్వాతనే స్లాటర్ హైస్‌లో జంతువధ చేయాలి. ఆపై మున్సిపల్ శాఖ ముద్ర వేయాలి. ఆ తర్వాత విక్రయించాలి. జంతువు ఆరోగ్యంగా ఉందా, బతికి ఉండగానే వధించారా..? లేదా అని వెటర్నరీ అధికారులు నిర్ధారించాలి. నగరంలో ఇటువంటి పరిస్థితులు, తనిఖీలు లేవు. జాగ్రత్తలు ఇలా... లేత తెలుపు రంగులోని మాంసం ఆరోగ్యకరమైనది. గట్టిదనం ఉంటేనే తాజాదనం ఉన్నట్టు. విక్రయిస్తున్న మాంసం కబేళా నుంచి తెచ్చినదా.. లేదా అన్నది దుకాణదారులను ప్రశ్నించాలి. మున్సిపల్ అధికారులు అధికారికంగా వేసే ముద్రను పరిశీలించాలి. ఎరుపు రంగులో ఉన్నా మడతలు ఉన్నా కొనకపోవడం మంచిది కొన్ని సందర్భాల్లో చూడటానికి తాజాగా ఉన్నా వండే సమయంలో చెడువాసన వస్తే అలాంటి మాంసాన్ని తినకూడదు. అనుమానం వస్తే మున్సిపల్ , వెటర్నరీ వైద్యులకు సమాచారం ఇవ్వాలి. చర్యలు తీసుకుంటాం... మున్సిపాలిటీ పరిధిలో అధిక మొత్తంలో మాంసం విక్రయ శాలల ఉండటం నిజమే. పక్షం రోజుల కిందట పట్టణంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విక్రయ శాలల్లో లోపాలను గుర్తించాం. సుమారు 10 దుకాణాలు పరిశీలిస్తే అందులో ఏ ఒక్కరు నియమ నిబంధనలు పాటించడం లేదన్న విషయాన్ని గుర్తించాం. సుమారు రూ.25 వేల అపరాధ రుసుం విధించాం. వినియోగదారులు కూడా మాంసం కొనుగోలు సమయంలో జాగ్రత్తలు పాటించాలి. మున్సిపాలిటీ ముద్ర వేసి ఉన్న మాంసం ఉత్పత్తులను కొనుగోలు చేయడం మేలు. – డాక్టర్ శివకుమార్, ప్రజారోగ్య అధికారి, విజయనగరం మున్సిపాలిటీ -
గాడిదల బహిరంగ వధపై నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్ : గుంటూరు జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కబేళా విషయంలో నిజానిజాలను తేల్చేందుకు ఓ న్యాయాధికారిని నియమించాలని ఉమ్మడి హైకోర్టు నిర్ణయించింది. వాస్తవాలను పరిశీ లించి నివేదిక ఇచ్చేందుకు వీలుగా న్యాయాధికారిని క్షేత్రస్థాయికి పంపాలని గుంటూరు జిల్లా జడ్జిని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరులో నిబంధనలకు విరుద్దంగా కబేళా నిర్వహించడమే కాక, గాడిదలను బహిరంగంగా వధిస్తూ, వాటి మాంసాన్ని విక్రయిస్తు న్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ కాకినాడకు చెందిన యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ కార్యదర్శి ఎస్.గోపాల్‌రావు, మరో ముగ్గురు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం పై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం దానిని మరోసారి విచారించింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబేళాను 2014లోనే మూసివేయడం జరిగిందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఇది నిజమేనా? అంటూ ప్రశ్నించింది. దీనిని రికార్డు చేసి, క్షేత్రస్థాయి నుంచి వాస్తవాలు తెలుసుకుంటామంది. తప్పని తేలితే కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేసింది. తరువాత పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, కబేళా వెలుపల గాడిదలను బహిరంగంగానే వధిస్తున్నారని కోర్టుకు నివేదించారు. మాంసం విక్రయాలను కూడా అక్కడే జరుపుతున్నారని తెలిపారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, క్షేత్రస్థాయికి ఓ న్యాయాధికారిని పంపి వాస్తవాలు తెలుసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఓ న్యాయాధికారిని పంపి వాస్తవాలపై ఓ నివేదిక సమర్పించాలని గుంటూరు జిల్లా జడ్జిని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
గార్దభ వ్యథ
కిలోమీటర్ల దూరం.. వీపుపై మోయలేని బరువు..రాళ్ల దారైనా, ముళ్ల బాటైనా అలుపెరగని ప్రయాణం. యజమాని బతుకు బరువు మోసేందుకు గాడిదలు పడిన కష్టమిది.. ఆయన ఇల్లు గడించేందుకు ఒళ్లంతా గుల్ల చేసుకున్న మూగజీవాల ప్రస్తానమిది. అయితే మనిషి కష్టాన్ని గుండెలపై మోసిన గాడిదలను నేడు నిర్దయగా చంపేస్తున్నారు. వాటి రక్తమాంసాలకు అలవాటు పడి నిత్యం కత్తివేటుకు బలి చేస్తున్నారు. జీవన నావకు తోడుగా..బతుకు బాటకు నీడగా నిలిచిన జీవాన్ని పాషాణ హృదయాలతో ప్రాణాలు తోడేస్తున్నారు. గంభీరమైన గార్దబాల గొంతును నిత్యం వధిస్తూ వాటికి మూగ వ్యథనే మిగిలిస్తున్నారు. ‘గాడిద’ హైకోర్టు మెట్లెక్కింది. గాడిద మాంసం విక్రయాలను నిలిపేయాలంటూ ఓ ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఈ అమ్మకాలు గుం టూరు జిల్లాలో ఎక్కువగా జరుగుతున్నాయని ఆ వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీంతో స్పందించిన న్యాయస్థానం గాడిద మాంసం అమ్మకాలపై నివేదిక ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం. తెనాలి : కష్టపడి పనిచేసే వ్యక్తిని ఉద్దేశించి ‘గాడిదలా కష్టపడుతున్నాడు’ అనటం, గొంతు బాగో లేదనటానికి ‘అబ్బ! నీది గార్దభ స్వరం రా’ అని ఎద్దేవా చేయటం తెలిసిందే. భారమంతా తానే మోస్తున్నానని చెప్పటానికి ‘గాడిద బరువును మోస్తున్నా’ అనీ అంటారు. అలాగే, ‘గాడిద గుడ్డేం కాదూ’ అనే వాడుక పదాన్నీ వింటుంటాం. గాడిదను ఇన్ని రకాల ఉపమానాలకు వాడుకుంటున్న మనిషి, ఆధునికతను తొడుక్కుంటున్నకొద్దీ ఆ జంతువుకు దూరమవుతూ వచ్చాడు. యంత్రం ప్రవేశించాక గాడిదతో అవసరం లేదన్నట్టుగా తయారైంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ వీటి మనుగడ బాగా తగ్గిపోతోంది. తగ్గుతున్న సంఖ్య.. దేశంలో పశువులు, ఇతర జంతువుల సంఖ్య తగ్గిపోతోంది. పాడి పశువుల సంఖ్య పెరుగుతున్నా, మిగిలిన వాటి పరిస్థితి ఆందోళనకరమే. 2012 గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా గాడిదల్లో 27.22 శాతం తగ్గుదల నమోదైంది. 2007 నాటికి 4.38 లక్షలుగా ఉన్న గాడిదలు, 2012 లెక్కలకు వచ్చేసరికి 3.19 లక్షలు మాత్రమే ఉన్నాయి. రాజస్తాన్‌లో ఇవి అధికం కాగా, తర్వాతి స్థానాల్లో గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. మనిషి కుటుంబానికి సన్నిహితంగా మెలుగుతూ వచ్చిన గాడిద, క్రమక్రమంగా సంచార జీవులతో సహవాసం చేస్తూ వచ్చాయి. ఇప్పటికీ ఎక్కువగా దుస్తులు ఉతికేవాళ్లు, ఇటుక బట్టీలు, కొండల్లోని పుణ్య క్షేత్రాలకు యాత్రికులను తీసుకెళ్లేందుకు వీటిని వినియోగిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో వీటి ఉనికి నామమాత్రమే. గతంలో చీరాల ప్రసిద్ధి.. మాంసాహారులు పెరగటం కూడా గాడిదల మనుగడకు ముప్పుతెచ్చేలా తయారైంది. రకరకాల జంతువులను తింటున్నట్టే, మనిషి గాడిద మాంసానికీ అలవాటు పడుతున్నాడు. ఒకప్పుడు రాష్ట్రంలో చీరాల గాడిద మాంసానికి ప్రసిద్ధి. క్రీడాకారులు, బరువైన పనులు చేసేవాళ్లు గాడిద రక్తం తాగేందుకు చీరాలకు చేరుకునేవారు. వేకువజామునే గాడిదను కోసిన వెంటనే పట్టిన రక్తాన్ని తాగేసి వీధుల్లో పరుగులు తీసేవారు. పనిలోపనిగా కొంత మాంసాన్ని తీసుకొచ్చి వండించుకుని తినేవారు. గాడిద రక్తం, మాంసం ఆరోగ్యానికి భేషుగ్గా ఉంటాయని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. స్టూవర్ట్పురంతో సహా మరికొన్ని ప్రాంతాలకు చెందిన ఆరితేరిన నేరస్తులు గాడిద రక్తాన్ని, మాంసాన్ని తీసుకుంటారని ఉదహరించేవారు. క్రమంగా విస్తరించి గ్రామాలకు, నగరాలకు పాకింది. వందకుపైగా కుటుంబాలకు జీవనోపాధి.. జిల్లాలో చెరుకుపల్లి, తాడేపల్లి, గుంటూరు, బాపట్లకు చెందిన 100 నుంచి 200 కుటుంబాల వారు గాడిద మాంసాన్ని జీవనోపాధిగా చేసుకున్నారు. కొందరు వారం వారం ఒకేచోట మాంసం విక్రయాలు చేస్తుంటే, మరికొందరు రోజుకో ఊరు చొప్పున చేపడుతున్నారు. ఆపరేషను చేయించుకున్నవారికి కుట్లు మానటానికి, ప్రమాదాల్లో తగిలిన దెబ్బలు తాలూకు నొప్పుల నివారణకు గాడిద మాంసం మంచి ఔషధమనే ప్రచారంతో వినియోగం పెరిగింది. పొట్టేలు మాంసం తరహాలోనే కిలో రూ.400 అమ్ముతున్నారు. ఆడ గాడిద పాలు కూడా (గా>్లసుడు) రూ.50 నుంచి రూ.100 ధరకు విక్రయిస్తున్నారు. ఛాతీలో నెమ్ము, ఆయాసానికి దివ్యౌషధంగా చెబుతుంటారు. మాంసాహారుల్లో అవసరమైనవారు నిరభ్యంతరంగా ఈ మాంసాన్నీ ఆదరిస్తున్నారు. కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం... ఈ నేపధ్యంలో కాకినాడకు చెందిన యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ కార్యదర్శి గోపాలరావు, మరో ముగ్గురు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. గుంటూరులో గాడిదలను వధించి, విచ్చలవిడిగా మాంసం విక్రయాలు సాగిస్తున్నారనీ, అధికారులు చర్యలు తీసుకోవటం లేదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. గత నెల 31వ తేదీన ఈ వ్యాజ్యంలో వాదనలు విన్న తర్వాత సంబంధిత రాష్ట్ర, గుంటూరు జిల్లా అధికారులకు నోటీసులు జారీ చేసింది. మంగళవారం జరిగిన విచారణలో ‘గాడదల్నీ వదలరా..’ అంటూ విస్మయం వ్యక్తం చేసింది. దీనిపై నివేదికను కోరి వచ్చే వారానికి వాయిదా వేసింది. అయితే, ఈ పరిణామాలతో గాడిదల మాంసం విక్రయాలు జీవనోపాధిగా చేసుకున్నవారు ఆందోళనకు గురవుతున్నారు. వారు కూడా కోర్టును ఆశ్రయించి తమ వాదనల్ని వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. తాడేపల్లి, వణుకూరుల్లోనూ.. తాడేపల్లి రూరల్ (మంగళగిరి) / కంకిపాడు (పెనమలూరు) / నందిగామ : తాడేపల్లి కేంద్రంగా గాడిద మాంసం అమ్మకాలను నిర్వహిస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి గాడిదలను తీసుకువస్తుంటారు. కేజీ రూ.400 నుంచి రూ.500 వరకు అమ్ముతుంటారు. జిల్లా మొత్తంమీద ఇక్కడే గాడిద మాంసం విక్రయాలు ఎక్కువగా జరుగుతాయని చెప్పొచ్చు. ఇక పెనమలూరు మండలం వణుకూరులో ప్రతి ఆదివా రం గాడిద మాంసం అమ్మకాలు సాగుతుంటా యి. ప్రస్తుతం కిలో రూ.400 ఉంది. ఉయ్యూరు బస్టాండు సెంటర్లోనూ ప్రతి ఆదివారం అమ్మకాలు జరుగుతుంటాయి. అలాగే, లీటరు గాడిద పాలు రూ.100 నుంచి రూ.130 వరకు అమ్ముతుంటారు. నందిగామ పట్టణంలోనూ తరచూ గాడిద పాలు అమ్మకానికి వస్తున్నాయి. మేమూ కోర్టును ఆశ్రయిస్తాం.. గొర్రెలు, కోళ్లు కోస్తున్నారు.. పశువుల్నీ వదలటం లేదు. గాడిదల మాంసం విక్రయిస్తే తప్పేమిటి? తినేవాళ్లుంటేనే కదా మేం అమ్మేది? జిల్లాలో చాలామందిమి ఈ వ్యాపారంపై ఆధారపడ్డాం. మేం కోయోళ్లం... గాడిదలోళ్లు అంటారు. ఇక్కడ గాడిదలు దొరకటం లేదు. మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చుకుంటున్నాం. ఇద్దరం కలిసి చాకిరీ చేస్తే చెరో రూ.500 మిగిలితేనే గొప్ప! మా నోటికాడ కూడు లాగేత్తే ఎట్టా బతకాల? మేమూ కోర్టుకెళతాం. – చండ్ర గోపి, చెరుకుపల్లి -
గుంటూరులో గాడిద మాంసం అమ్మకాలు!
సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కబేళాల్లో గాడిద వధ జరుగుతోందని, గాడిద మాంసాన్ని పట్టణంలో ఎక్కడ బడితే అక్కడ విక్రయిస్తున్నారని, అయినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. గాడిద వధను, మాంసం విక్రయాలను నిరోధించి, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అనుమతిలేని కబేళాలను మూసివేసేలా గుంటూరు మున్సిపల్ అధికారులను ఆదేశించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా, కాకినాడకు చెందిన యానిమల్ రెస్కూ ఆర్గనైజేషన్ కార్యదర్శి ఎస్.గోపాలరావు, మరో ముగ్గురు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. గుంటూరు జిల్లాలో ఇష్టానుసారంగా గాడిద వధ జరుగుతోందని, రోడ్లను ఆక్రమించి జంతువులను వధిస్తున్నారని పిటిషనర్లు పేర్కొన్నారు. -
‘కొత్త’ సంబరం.. రూ.35 కోట్లు
ఉమ్మడి జిల్లాలో రూ.20 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు దసరాను మరిపించిన మాంసం విక్రయాలు జోరుగా కేక్‌లు, మిఠాయిల అమ్మకాలు కనిపించని నోట్ల రద్దు ప్రభావం మంచిర్యాల రూరల్(హాజీపూర్) కొత్త ఏడాది సంబరం అంబరాన్నంటింది. ఉమ్మడి జిల్లాలో ప్రజలు సుమారు రూ.35 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 31 శనివారానికి తోడు ఆదివారం సెలవు దినం కలిసి రావడంతో కావడంతో జోష్ పెంచింది. మద్యం, మాంసం, కేక్‌లు, మిఠాయిల విక్రయాలు జోరుగా సాగాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని హాజీపూర్ మండలం గుడిపేట లిక్కర్ డిపో పరిధిలో 140 వరకు మద్యం దుకాణాలు, బార్లు, ఉట్నూర్ లిక్కర్ డిపో పరిధిలో 90 మద్యం దుకాణాలు, బార్లు ఉన్నాయి. ఆయా దుకాణాలకు శుక్ర, శని, ఆదివారాల్లో సుమారు రూ.20 కోట్ల విలువైన మద్యం సరఫరా జరిగినట్లు తెలుస్తోంది. గత ఏడాది అమ్మకాల కన్నా ఈ ఏడాది 25 శాతం ఎక్కువగా అమ్మకాలు జరిగిట్లు అంచనా. మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో మద్యంతోపాటు మాంసం, కేక్‌లు, మిఠాయిల, శీతల పానీయాల విక్రయాలు జోరుగా సాగాయి. పలువురు మిఠాయిలు పంచుతూ స్నేహితులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. యువకులు గ్రీటింగ్‌లు, మొబైల్స్‌లో ఇంటర్నెట్ డాటా, ఎస్సెమ్మెస్‌లు, మహిళలు ఇళ్ల ముందు ముగ్గులు వేయడానికి రంగుల కొనుగోలుకు డబ్బులు ఖర్చు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెట్టింపు స్థాయిలో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మాంసం, మద్యం విక్రయాలు దసరా పండుగను మరిపించాయి. అన్ని వర్గాల ప్రజలు నూతన సంవత్సర వేడుకలు చేసుకోవడంతో కొనుగోలు పెరిగినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. మంచిర్యాలలో మాంసం దుకాణాలు 50, చికెన్‌సెంటర్లు 30 వరకు ఉన్నాయి. మొత్తంగా జిల్లాలో రూ.60 లక్షల వరకు వ్యాపారం సాగినట్లు తెలుస్తోంది. మంచిర్యాల, సింగరేణి ప్రాంతంలో చికెన్, మటన్ విక్రయాలు శని, ఆదివారాల్లో భారీగా సాగాయి. కేక్‌లు.. మిఠాయిలు.. నూతన సంవత్సర వేడుకలతో బేకరీలు, మిఠాయి దుకాణాలు కిటకిటలాడాయి. ఒక్క మంచిర్యాల పట్టణంలోనే రూ.70 లక్షల వరకు కేక్‌లు, కూల్‌డ్రింక్స్ అమ్మకాలు జరిగాయి. ఈ లెక్కన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.2 కోట్లపై వరకు అమ్మకాలు జరిగినట్లు అంచనా. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడానికి ఇంటి లోగిళ్ల ముందు రంగులతో ముగ్గులు వేయడానికి మంచిర్యాల పట్టణంలోనే రూ.12 లక్షల విలువైన రంగులు వాడారని వ్యాపారులు తెలిపారు. నాలుగు జిల్లాల వ్యాప్తంగా రూ.కోటి వరకు రంగుల అమ్మకాలు జరిగినట్లు అంచనా. వీటితోపాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి పూలు, బొకెలు, బాణాసంచా తదితర వాటికి పెద్ద మొత్తంలోనే ఖర్చు జరిగినట్లు తెలుస్తుంది. ఏదేమైనా కొత్త సంవత్సరం ప్రజలకు ఆనందాన్ని పంచడానికి భారీగా ఖర్చు పెట్టించింది. నోట్ల రద్దు ప్రభావం ఎక్కడా మచ్చుకు కూడా కనిపించకపోవడం కొసమెరుపు. -
పెద్ద నోట్ల రద్దుతో చికెన్ అమ్మకాలు ఢమాల్
-
చికెన్ అమ్మకాలు ఢమాల్
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ప్రభావం మాంసం వ్యాపారుల మీదా పడింది. ఆదివారం రోజు జోరుగా సాగే మాంసం వ్యాపారాలు మందగించాయి. సండే రోజు చికెన్ షాపులు ముందు వరుసకట్టే వినియోగదారులు పెద్ద నోట్ల రద్దుతో ఆవైపుకే రాలేదు. దీంతో వినియోగదారులు లేక మాంసం దుకాణాలు వెలవెలబోయాయి. మామూలుగా కార్తీక మాసంలో చికెన్ అమ్మకాలు కొద్దిగా తగ్గుతాయి. రూ.500. రూ. వెయ్యి నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం, చిల్లర సమస్యలతో మాంస్యం అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. మిగతా వ్యాపారాలు కూడా డీలా పడ్డాయి. చేపల మార్కెట్లు కూడా వెలవెలబోతున్నాయి. సెలవురోజు చిల్లర ఖర్చులు డబ్బులు లేకపోవడంతో నాలుగో రోజు జనం ఏటీఎంల ముందు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే జనం ఏటీఎంల ముందు క్యూ కట్టారు. మరోవైపు బ్యాంకులు ఈరోజు కూడా పనిచేయనున్నాయి. -
హే రాం!
స్వాతంత్య్రదినోత్సవం రోజూ ఆగని అమ్మకాలు జోరుగా మద్యం, మాంసం విక్రయాలు పట్టించుకోని యంత్రాంగం చోడవరం : ‘నిబంధనలంటే లెక్కలేదు... ప్రభుత్వ ఆదేశాలంటే పట్టింపు లేదు... పోనీ దేశనాయకుల పట్ల గౌరవమైనా లేదు...అందుకే పరిస్థితి ఇలా’... యథేచ్ఛగా జరిగిన మద్యం, మాంసం విక్రయాలను చూసి స్థానికుల వ్యాఖ్యానాలివి. స్వాతంత్య్రదినోత్సవం, రిపబ్లిక్ డే, గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం మద్యం, మాంసం అమ్మకాలు నిషేధించిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం ఎక్కడా ఆ పరిస్థితి కనిపించలేదు. ఓ పక్క వాడవాడలా జెండా పండుగ నిర్వహించి ప్రజలు ఆనందోత్సాహాలతో మునిగి తేలుతుంటే మరోవైపు వ్యాపారులు తమ అమ్మకాలను యథేచ్ఛగా కొనసాగించారు. మాంసం విక్రయాలు బహిరంగంగానే జరగగా, మద్యం దుకాణాలకు బయట షట్టర్లువేసి దొడ్డిదారిలో అమ్మకాలు జరిపారు. షాపుల పక్కనే ఉన్న కి ల్లీషాపులు కూడా మద్యం అమ్మకాలకు వేదికయ్యాయి. డ్రై డేని దృష్టిలో పెట్టుకుని ఎక్సైజ్ అధికారులు గురువారం సాయంత్రమే మద్యం దుకాణాలకు సీళ్లువేశారు. విషయం ముందే తెలిసిన వ్యాపారులు దొడ్డిదారిన అమ్మకాలకు తగిన ఏర్పాట్లు చేసుకుని యథేచ్ఛగా వ్యాపారం నిర్వహించారు. కొందరు వ్యాపారులు దుకాణాలకు అనుబంధంగా ఉన్న కిల్లీ బడ్డీలకు ముందుగానే సరుకు తరలించారు. చోడవరం పట్టణంతోపాటు మండలంలో ఉన్న అన్ని మద్యం దుకాణాలకు అనుబంధంగా చిన్నాచితకా షాపుల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు సాగాయి. ఈ అమ్మకాలను చూసి పలువురు పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకోనట్లు వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి అని వాపోయారు.