విజయనగరం మున్సిపాలిటీ: మనం తింటున్నది నాణ్యమైన మాంసమేనా..? పట్టణంలో ఆరోగ్యవంతమైన జంతు మాంసాలే విక్రయిస్తున్నారా..? మున్సిపల్ అదికారులు పరిశీలించి ముద్ర వేసిన మాంసాన్ని మనం కొంటున్నామా..? అని ఎవరైనా అడిగితే లేదనే సమాధానం వస్తోంది. జిల్లా కేంద్రంలో మాంసం విక్రయాల వెనుక మోసం దాగి ఉందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. నాసిరకం, అనారోగ్య జంతువుల మాంసాన్ని మున్సిపాలిటీ అనుమతి లేకుండా విక్రయించేస్తున్నట్టు సమాచారం. ఫ్రిజ్‌ల్లో మిగులున్న చికెన్, మటన్ నిల్వలను మరుసటి రోజు విక్రయిస్తున్నారు. మిగులు చికెన్, మటన్‌ను హోటళ్లకు తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఏ ఒక్కరు చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడం గమనార్హం.
నిఘా కరువు..
నగరంలో మాంసం విక్రయాలుపై నిఘా కరువైంది. మున్సిపల్ ప్రజారోగ్య విభాగాధికారులు , వెటర్నరీ విభాగాల మధ్య సమన్వయ లోపం కరాణంగా నాసిరకం, నాణ్యత లోపించిన మాంసం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. విజయనగరం పట్టణంలో చికెన్ సెంటర్లు 130, మటన్ విక్రయశాలలు 64 వరకు ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇటు అధికారికంగా... అటు అనధికారికంగా నిర్వహిస్తోన్న మాంసం విక్రయకేంద్రాలు నిబంధనలు పాటించడం లేదు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నాయి.
ఎక్కడ పడితే అక్కడే మాంసం విక్రయిస్తున్నారు. చేపల విక్రయాల పరిస్థితీ ఇదే. మురుగు కాలువలకు అనుకుని, రోడ్లు మీదనే విక్రయాలు చేస్తున్నారు. అపరిశుభ్ర పరిసరాల్లోనే విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఆది, మంగళవారాల్లో అయితే పరిస్థితి మరింత దారుణం. మటన్ రూ.520 నుంచి రూ.600లకు కిలో విక్రయిస్తున్నారు. మిగులు మాంసాన్ని మరుసటి రోజు ధర తగ్గించి విక్రయిస్తున్నారు. నాసిరకం, వయస్సు మళ్లిన , అనారోగ్యంగా ఉన్న గొర్రెలు, మేకల నుంచి సేకరించే మాంసాన్ని తక్కువ ధరకే హోటళ్లకు విక్రయిస్తున్నట్టు సమాచారం.
చికెన్ అమ్ముడయ్యే ప్రాంతాలు...
రోజురోజుకు విస్తరిస్తోన్న విజయనగరం పట్టణంలో చికెన్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మున్సిపల్ ప్రజారోగ్య విభాగం అధికారిక లెక్కల ప్రకారం 130 వరకు దుకాణాలు అనుమతులతో నిర్వహిస్తుండగా... అధికారికంగా ఎటువంటి అనుమతులు లేకుండా అంతకన్నా రెట్టింపు కేంద్రాల్లో విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రధానంగా మున్సిపల్ కార్యాలయం జంక్షన్, గూడ్స్‌షెడ్ రోడ్ కోట జంక్షన్, దాసన్నపేట కూడలి, రింగ్‌రోడ్, రైల్వేస్టేషన్ రోడ్, కలెక్టరేట్ జంక్షన్ల వద్ద అధికారిక దుకాణాలు నడుస్తుండగా... వీధికొకటి చొప్పున వెలుస్తున్న సెంటర్‌లు సైతం వందల్లో ఉండడం గమనార్హం. రోడ్డుపక్కన చిన్నపాటి బల్లపెట్టి ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ విక్రయాలు చేపట్టి ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. మిగులు వ్యర్థాలను కాలువల్లో వేయడంతో పరిసరాలు దుర్ఘంధ భరితంగా మారుతున్నాయి.
ప్రాంతం : విజయనగరం మున్సిపాలిటీ
మొత్తం జనాభా : 3 లక్షల పైమాటే
చికెన్ సెంటర్లు : 130 పైబడి
మటన్ విక్రయ కేంద్రాలు : 64
నాన్‌వెజ్ హోటళ్లు : 25
పట్టణ శివార్లలో దాబాల సంఖ్య : 12
రోజు వారీ మటన్ విక్రయాలు : సగటున 1000 కిలోలు
ఆది, మంగళవారాల్లో విక్రయాలు : 2వేల కిలోల పైమాటే
రోజు వారీ చికెన్ విక్రయాలు : 4 వేలకు పైగా కిలోలు
ఆది, మంగళవారాల్లో విక్రయాలు : సుమారు 10 వేల కిలోలు
నిబంధనలు ఇలా....
అనుమతి ఉన్న దుకాణాల్లో మాత్రమే మాసం విక్రయాలు చేయాలి.
మున్సిపాలిటీకి చెందిన పశువైద్యాధికారి «ధ్రువీకరించిన తర్వాతనే స్లాటర్ హైస్‌లో జంతువధ చేయాలి. ఆపై మున్సిపల్ శాఖ ముద్ర వేయాలి. ఆ తర్వాత విక్రయించాలి.
జంతువు ఆరోగ్యంగా ఉందా, బతికి ఉండగానే వధించారా..? లేదా అని వెటర్నరీ అధికారులు నిర్ధారించాలి. నగరంలో ఇటువంటి పరిస్థితులు, తనిఖీలు లేవు.
జాగ్రత్తలు ఇలా...
లేత తెలుపు రంగులోని మాంసం ఆరోగ్యకరమైనది.
గట్టిదనం ఉంటేనే తాజాదనం ఉన్నట్టు.
విక్రయిస్తున్న మాంసం కబేళా నుంచి తెచ్చినదా.. లేదా అన్నది దుకాణదారులను ప్రశ్నించాలి.
మున్సిపల్ అధికారులు అధికారికంగా వేసే ముద్రను పరిశీలించాలి.
ఎరుపు రంగులో ఉన్నా మడతలు ఉన్నా కొనకపోవడం మంచిది
కొన్ని సందర్భాల్లో చూడటానికి తాజాగా ఉన్నా వండే సమయంలో చెడువాసన వస్తే అలాంటి మాంసాన్ని తినకూడదు.
అనుమానం వస్తే మున్సిపల్ , వెటర్నరీ వైద్యులకు సమాచారం ఇవ్వాలి.
చర్యలు తీసుకుంటాం...
మున్సిపాలిటీ పరిధిలో అధిక మొత్తంలో మాంసం విక్రయ శాలల ఉండటం నిజమే. పక్షం రోజుల కిందట పట్టణంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విక్రయ శాలల్లో లోపాలను గుర్తించాం. సుమారు 10 దుకాణాలు పరిశీలిస్తే అందులో ఏ ఒక్కరు నియమ నిబంధనలు పాటించడం లేదన్న విషయాన్ని గుర్తించాం. సుమారు రూ.25 వేల అపరాధ రుసుం విధించాం. వినియోగదారులు కూడా మాంసం కొనుగోలు సమయంలో జాగ్రత్తలు పాటించాలి. మున్సిపాలిటీ ముద్ర వేసి ఉన్న మాంసం ఉత్పత్తులను కొనుగోలు చేయడం మేలు.
– డాక్టర్ శివకుమార్, ప్రజారోగ్య అధికారి, విజయనగరం మున్సిపాలిటీ
Comments
Please login to add a commentAdd a comment