Cleanup
-
కళ్లు చెదిరే అందం
ముఖం కాంతివంతంగా మెరవాలంటే... మార్కెట్లో వందలకు వందలు పోసి కొన్న ఫేస్‌క్రీమ్స్ అవసరం లేదు. కాస్త తీరిక చేసుకుని క్లీనప్, స్క్రబ్ చేసుకుని, ఆవిరి పట్టించుకుని, ఇరవై నిమిషాల పాటు మాస్క్ వేసుకుంటే చాలు. సహజసిద్ధమైన అందం మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. మచ్చలు, మొటిమలు శాశ్వతంగా తొలగిపోవాలంటే ఇలాంటి సహజసిద్ధమైన సౌందర్యలేపనాలను వాడాల్సిందే అంటున్నారునిపుణులు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావాల్సినవి : క్లీనప్ : కొబ్బరిపాలు – 1 టేబుల్ స్పూన్, తేనె – 1 టీ స్పూన్ స్క్రబ్ : బియ్యప్పిండి – అర టేబుల్ స్పూన్, చిక్కటి పాలు – అర టేబుల్ స్పూన్ మాస్క్: క్యారెట్ గుజ్జు – అర టేబుల్ స్పూన్, టమాటా గుజ్జు – పావు టేబుల్ స్పూన్, గడ్డపెరుగు – 1 టీ స్పూన్, ముల్తానీ మట్టి – అర టేబుల్ స్పూన్ తయారీ : ముందుగా కొబ్బరిపాలు, తేనె ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యప్పిండి, చిక్కటి పాలు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు క్యారెట్ గుజ్జు, టమాటా గుజ్జు, గడ్డపెరుగు, ముల్తానీ మట్టి ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
పట్టులాంటి మృదుత్వం
సౌందర్యవంతమైన ముఖ కాంతికి సహజమైన చిట్కాలే సరైనవంటున్నారు నిపుణులు. రోజు రోజుకీ పెరిగిపోతున్న కాలుష్యంతో ముఖం జిడ్డుగా, కాంతిహీనంగా మారిపోతుంది. అలాంటప్పుడు కొంత సమయం ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి కేటాయిస్తే చాలు. ముందుగా క్లీనప్, స్క్రబ్ వంటివి చేసుకుని ఆవిరి పట్టించుకుని ఫేస్‌ప్యాక్ వేసుకుంటే ముఖం మృదువుగా పట్టులా మెరుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : పెరుగు మీగడ – 2 టీ స్పూన్లు, నిమ్మరసం – పావు టీ స్పూన్ స్క్రబ్ : ఓట్స్ – 2 టీ స్పూన్లు, టమాటా గుజ్జు – 2 టీ స్పూన్లు మాస్క్: చిక్కటి పాలు–1 టీ స్పూన్, శనగపిండి – అర టీ స్పూన్, తులసి ఆకుల గుజ్జు – 3 టీ స్పూన్లు, పచ్చి పసుపు – చిటికెడు తయారీ : ముందుగా పెరుగు మీగడ, నిమ్మరసం ఒక చిన్న బౌల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఓట్స్, టమాటా గుజ్జు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు తులసి ఆకుల గుజ్జు, శనగపిండి, పసుపు, చిక్కటి పాలు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖానికి ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత సబ్బు పెట్టకపోవడం మంచిది. -
తళుక్కుమనే మెరుపు!
ముఖ సౌందర్యానికి కాసింత సమయాన్ని వెచ్చిస్తే చాలు... తళుక్కుమనే మెరుపు మీ సొంతమవుతుందంటున్నారు నిపుణులు. ముఖంపైన ఉండే మృతకణాలు, మొటిమలు, మచ్చలు పూర్తిగా తొలగిపోవాలంటే... శ్రద్ధ చూపించడం చాలా అవసరం. ముందుగా క్లీనప్, స్క్రబ్ వంటివి చేసుకుని ఆవిరి పట్టించుకుని ఫేస్‌ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతివంతం మారుతుంది. మచ్చ లేని మృదువైన అందం మీ సొంతమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : కొబ్బరి పాలు – 2 టీ స్పూన్లు, కలబంద గుజ్జు – 1 టీ స్పూన్ స్క్రబ్ : బియ్యప్పిండి – 1 టీ స్పూన్, కీరదోస గుజ్జు – 2 టీ స్పూన్లు, కొబ్బరి నూనె – పావు టీ స్పూన్ మాస్క్ : గడ్డ పెరుగు –1 టీ స్పూన్, ముల్తానీ మట్టి – 1 టీ స్పూన్, అరటిపండు గుజ్జు – 2 టీ స్పూన్లు, దానిమ్మ రసం – 1 టీ స్పూన్ తయారీ : ముందుగా కొబ్బరి పాలు, కలబంద గుజ్జు ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యప్పిండి, కీరదోస గుజ్జు, కొబ్బరి నూనె ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు గడ్డ పెరుగు, ముల్తానీ మట్టి, అరటిపండు గుజ్జు, దానిమ్మ రసం ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖానికి ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత సబ్బు పెట్టకపోవడం మంచిది. -
మాంసం అంతా మోసం..!
విజయనగరం మున్సిపాలిటీ: మనం తింటున్నది నాణ్యమైన మాంసమేనా..? పట్టణంలో ఆరోగ్యవంతమైన జంతు మాంసాలే విక్రయిస్తున్నారా..? మున్సిపల్ అదికారులు పరిశీలించి ముద్ర వేసిన మాంసాన్ని మనం కొంటున్నామా..? అని ఎవరైనా అడిగితే లేదనే సమాధానం వస్తోంది. జిల్లా కేంద్రంలో మాంసం విక్రయాల వెనుక మోసం దాగి ఉందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. నాసిరకం, అనారోగ్య జంతువుల మాంసాన్ని మున్సిపాలిటీ అనుమతి లేకుండా విక్రయించేస్తున్నట్టు సమాచారం. ఫ్రిజ్‌ల్లో మిగులున్న చికెన్, మటన్ నిల్వలను మరుసటి రోజు విక్రయిస్తున్నారు. మిగులు చికెన్, మటన్‌ను హోటళ్లకు తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఏ ఒక్కరు చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడం గమనార్హం. నిఘా కరువు.. నగరంలో మాంసం విక్రయాలుపై నిఘా కరువైంది. మున్సిపల్ ప్రజారోగ్య విభాగాధికారులు , వెటర్నరీ విభాగాల మధ్య సమన్వయ లోపం కరాణంగా నాసిరకం, నాణ్యత లోపించిన మాంసం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. విజయనగరం పట్టణంలో చికెన్ సెంటర్లు 130, మటన్ విక్రయశాలలు 64 వరకు ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇటు అధికారికంగా... అటు అనధికారికంగా నిర్వహిస్తోన్న మాంసం విక్రయకేంద్రాలు నిబంధనలు పాటించడం లేదు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడే మాంసం విక్రయిస్తున్నారు. చేపల విక్రయాల పరిస్థితీ ఇదే. మురుగు కాలువలకు అనుకుని, రోడ్లు మీదనే విక్రయాలు చేస్తున్నారు. అపరిశుభ్ర పరిసరాల్లోనే విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఆది, మంగళవారాల్లో అయితే పరిస్థితి మరింత దారుణం. మటన్ రూ.520 నుంచి రూ.600లకు కిలో విక్రయిస్తున్నారు. మిగులు మాంసాన్ని మరుసటి రోజు ధర తగ్గించి విక్రయిస్తున్నారు. నాసిరకం, వయస్సు మళ్లిన , అనారోగ్యంగా ఉన్న గొర్రెలు, మేకల నుంచి సేకరించే మాంసాన్ని తక్కువ ధరకే హోటళ్లకు విక్రయిస్తున్నట్టు సమాచారం. చికెన్ అమ్ముడయ్యే ప్రాంతాలు... రోజురోజుకు విస్తరిస్తోన్న విజయనగరం పట్టణంలో చికెన్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మున్సిపల్ ప్రజారోగ్య విభాగం అధికారిక లెక్కల ప్రకారం 130 వరకు దుకాణాలు అనుమతులతో నిర్వహిస్తుండగా... అధికారికంగా ఎటువంటి అనుమతులు లేకుండా అంతకన్నా రెట్టింపు కేంద్రాల్లో విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రధానంగా మున్సిపల్ కార్యాలయం జంక్షన్, గూడ్స్‌షెడ్ రోడ్ కోట జంక్షన్, దాసన్నపేట కూడలి, రింగ్‌రోడ్, రైల్వేస్టేషన్ రోడ్, కలెక్టరేట్ జంక్షన్ల వద్ద అధికారిక దుకాణాలు నడుస్తుండగా... వీధికొకటి చొప్పున వెలుస్తున్న సెంటర్లు సైతం వందల్లో ఉండడం గమనార్హం. రోడ్డుపక్కన చిన్నపాటి బల్లపెట్టి ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ విక్రయాలు చేపట్టి ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. మిగులు వ్యర్థాలను కాలువల్లో వేయడంతో పరిసరాలు దుర్ఘంధ భరితంగా మారుతున్నాయి. ప్రాంతం : విజయనగరం మున్సిపాలిటీ మొత్తం జనాభా : 3 లక్షల పైమాటే చికెన్ సెంటర్లు : 130 పైబడి మటన్ విక్రయ కేంద్రాలు : 64 నాన్‌వెజ్ హోటళ్లు : 25 పట్టణ శివార్లలో దాబాల సంఖ్య : 12 రోజు వారీ మటన్ విక్రయాలు : సగటున 1000 కిలోలు ఆది, మంగళవారాల్లో విక్రయాలు : 2వేల కిలోల పైమాటే రోజు వారీ చికెన్ విక్రయాలు : 4 వేలకు పైగా కిలోలు ఆది, మంగళవారాల్లో విక్రయాలు : సుమారు 10 వేల కిలోలు నిబంధనలు ఇలా.... అనుమతి ఉన్న దుకాణాల్లో మాత్రమే మాసం విక్రయాలు చేయాలి. మున్సిపాలిటీకి చెందిన పశువైద్యాధికారి «ధ్రువీకరించిన తర్వాతనే స్లాటర్ హైస్‌లో జంతువధ చేయాలి. ఆపై మున్సిపల్ శాఖ ముద్ర వేయాలి. ఆ తర్వాత విక్రయించాలి. జంతువు ఆరోగ్యంగా ఉందా, బతికి ఉండగానే వధించారా..? లేదా అని వెటర్నరీ అధికారులు నిర్ధారించాలి. నగరంలో ఇటువంటి పరిస్థితులు, తనిఖీలు లేవు. జాగ్రత్తలు ఇలా... లేత తెలుపు రంగులోని మాంసం ఆరోగ్యకరమైనది. గట్టిదనం ఉంటేనే తాజాదనం ఉన్నట్టు. విక్రయిస్తున్న మాంసం కబేళా నుంచి తెచ్చినదా.. లేదా అన్నది దుకాణదారులను ప్రశ్నించాలి. మున్సిపల్ అధికారులు అధికారికంగా వేసే ముద్రను పరిశీలించాలి. ఎరుపు రంగులో ఉన్నా మడతలు ఉన్నా కొనకపోవడం మంచిది కొన్ని సందర్భాల్లో చూడటానికి తాజాగా ఉన్నా వండే సమయంలో చెడువాసన వస్తే అలాంటి మాంసాన్ని తినకూడదు. అనుమానం వస్తే మున్సిపల్ , వెటర్నరీ వైద్యులకు సమాచారం ఇవ్వాలి. చర్యలు తీసుకుంటాం... మున్సిపాలిటీ పరిధిలో అధిక మొత్తంలో మాంసం విక్రయ శాలల ఉండటం నిజమే. పక్షం రోజుల కిందట పట్టణంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విక్రయ శాలల్లో లోపాలను గుర్తించాం. సుమారు 10 దుకాణాలు పరిశీలిస్తే అందులో ఏ ఒక్కరు నియమ నిబంధనలు పాటించడం లేదన్న విషయాన్ని గుర్తించాం. సుమారు రూ.25 వేల అపరాధ రుసుం విధించాం. వినియోగదారులు కూడా మాంసం కొనుగోలు సమయంలో జాగ్రత్తలు పాటించాలి. మున్సిపాలిటీ ముద్ర వేసి ఉన్న మాంసం ఉత్పత్తులను కొనుగోలు చేయడం మేలు. – డాక్టర్ శివకుమార్, ప్రజారోగ్య అధికారి, విజయనగరం మున్సిపాలిటీ -
చేతులు, పాదాల చర్మం... గరుకుదనం పోవాలంటే...
బ్యూటిప్స్ పాదాలు, చేతుల చర్మం గరుకుగా మారితే పగుళ్లు ఏర్పడతాయి. దీని వల్ల పగుళ్లలో మురికి చేరుతుంది. సరైన శుభ్రత పాటించకపోతే పాదాలు, చేతులు అందవికారంగా కనిపిస్తాయి. ఈ సమస్య దరిచేరకుండా ఉండాలంటే రోజూ సరైన జాగ్రత్తలు పాటించాలి. ఒక టబ్ గోరువెచ్చని నీళ్లలో కప్పు మొక్కజొన్న పిండి కలపాలి. అందులో 5-10 నిమిషాలు పాదాలను ఉంచి, విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత పమిస్ స్టోన్‌తో పాదాల మడమలను రుద్ది, కడగాలి. మెత్తని టవల్‌తో పాదాలను, చేతులను తుడిచి మాయిశ్చరైజర్ రాయాలి. రోజూ రాత్రిపూట పడుకునే ముందు ఈ విధంగా చేస్తూ ఉండాలి. కాలి మడమల పగుళ్లు తగ్గాలంటే ఉల్లిపాయ ముద్ద నూరి రాయాలి.రోజూ రాత్రి పడుకునే ముందు ఆవ నూనె పాదాలకు, చేతులకు రాసుకోవాలి. అర కప్పు పెరుగులో అర టీ స్పూన్ వెనిగర్ కలిపి మడమలు, పాదాలకు మసాజ్ చేయాలి.రాత్రి పూట క్యాండిల్ వ్యాక్స్, ఆవ నూనె కలిపిన మిశ్రమాన్ని పాదాల పగుళ్లకు రాయాలి. సాక్స్ ధరించాలి. మరుసటి రోజు ఉదయం శుభ్రపరుచుకోవాలి.తాజా గులాబీ పువ్వులు కప్పు, అరకప్పు పాలు కలిపి మెత్తగా నూరాలి. దీంట్లో టీ స్పూన్ శనగపిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు, చేతులకు పట్టించి పది నిమిషాల తర్వాత శుభ్రపరచాలి.పెట్రోలియమ్ జెల్లీలో టీ స్పూన్ విటమిన్ ‘ఇ’ ఆయిల్, టీ స్పూన్ గ్లిజరిన్ కలపాలి. ఈ మిశ్రమాన్ని పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేయాలి.బొప్పాయి అర కప్పు, పైనాపిల్ అర కప్పు, తేనె 4 టేబుల్‌స్పూన్లు కలిపి పాదాలకు పట్టించాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. -
విన్ స్టన్ తుఫాన్ విధ్వంసం.. 20 కి చేరిన మృతులు
విధ్వంసకర విన్స్టన్ తుఫానుతో ఫిజి పౌరులు నిరాశ్రయులయ్యారు. తుఫాను బీభత్సంతో అతలాకుతలమైన ఆ ప్రాంతాన్ని వెంటనే పునరుద్ధరించేందుకు సహకరించాలని స్థానికులు కోరుతున్నారు. శనివారం ఫిజి ద్వీపంలో చెలరేగిన శక్తివంతమైన తుఫాను వల్ల సుమారు 20 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఫిజి తుఫాను సృష్టించిన బీభత్సం ప్రాణ నష్టంతో పాటు... తీవ్ర ఆస్తి, పంట నష్టాన్ని తెచ్చిపెట్టింది. పునరావాస కేంద్రాల్లోని తుఫాన్ బాధితులకు తిరిగి ఆశ్రయం కల్పించే పనులు ప్రారంభించినట్లు ఫసిఫిక్ పశ్చిమ డివిజన్ అధిపతి తెలిపారు. మరో ఐదు రోజుల్లో బాధితులు తిరిగి తమ తమ ప్రాంతాలకు వెళ్లేందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నట్లు స్థానిక కమిషనర్ మానస చెప్పారు. ఫిజి ద్వీపాల్లోని తుఫాను బాధిత ప్రాంతాల్లో.. ముఖ్యంగా ప్రధాన ద్వీపమైన విటి లెవుతో సహా పవర్, టెలి కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దీంతో అధికారులు పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేసే పనిలో పడ్డారు. తుఫాను కారణంగా ఫిజి ప్రాంతంలో విధించిన కర్ఫ్యూ ను సోమవారం ఎత్తివేసినప్పటికీ... తక్షణ పునరుద్ధరణ పనులకోసం 30 రోజులపాటు ఎమర్జెన్సీని ప్రకటించారు. ప్రాథమిక సాయంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఫిజికి 5 మిలియన్ డాలర్ల సాయాన్నిఅందించింది. గృహాలను కోల్పోయిన తుఫాన్ బాధితులకు ఆహారం, తాగునీరు, పరిశుభ్రత వంటి తక్షణ సాయం అందించేందుకు ఆ నిధులను వినియోగించాలని విదేశీ వ్యవహారాల మంత్రి జూలీ బిషప్ చెప్పారు. ఫిజినుంచీ వర్జిన్ ఆస్ట్రేలియా, ఎయిర్ న్యూజిల్యాండ్, ఫిజి ఎయిర్వేస్ విమానాలను ఇప్పటికే పునరుద్ధరించాయని, అయితే జెట్ స్టార్ మాత్రం మంగళవారం నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. తుఫాను వల్ల ఫిజి సందర్శకులకు ఎటువంటి ముప్పు లేదని, వారంతా సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉన్నారని ఫిజి టూరిజం మంత్రి ఫయాజ్ సిద్ధిక్.. ప్రభుత్వ ఫేస్ బుక్ పేజీలో ప్రకటించారు. 'విటి లెవు' ప్రాంతంలో అత్యధికంగా ఉన్న హోటళ్లకు ఎటువంటి నష్టం జరగలేదని, మొబైల్, ఇంటర్నెట్ వ్యవస్థ మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఆయన పేర్కొన్నారు. -
దేవస్థానమా..మున్సిపాలిటీనా ?
- శ్రీకాళహస్తి గుడిని సందర్శించిన దేవాదాయశాఖ కమిషనర్ - శుభ్రత పాటించలేదనిఅధికారులపై ఆగ్రహం - ఆలయ ఉద్యోగులు పీఆర్వో కార్యాలయంలో ఏంచేస్తారని నిలదీత - గోపురబాధితుల భయంతో బిక్షాలగోపురాన్ని పరిశీలించని వైనం శ్రీకాళహస్తి ఆలయంలో పారిశుధ్యం అధ్వానంగా ఉందని దేవాదాయ శాఖ కమిషనర్ అధికారులపై మండిపడ్డారు. దేవస్థానమా.. మున్సిపాలిటీనా అని ప్రశ్నించారు. శ్రీకాళహస్తి: ‘శ్రీకాళహస్తి దేవస్థానం ఏడాదికి వందకోట్లకు పైగా ఆదాయం వస్తున్న ఆలయాల జాబితాల్లో ఉంది.. అయినా శుభ్రత పాటించడంలేదు.. దేవస్థానమా..మున్సిపాలిటీనా’ అంటూ దేవాదాయశాఖ కమిషనర్ అనురాధ ఆలయాధికారులపై మండిపడ్డారు. సోమవారం రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు ఆమె ఆలయాన్ని పరిశీలించారు. దేవస్థానంలో తడి ప్రదేశం ఉండకూడదని.. అయినా పలుచోట్ల నీటి తడి ఎందుకు ఉందని ప్రశ్నించారు. పారిశుద్ధ్యం కోసం లక్షలు ఖర్చుచేస్తున్నట్లు రికార్డులు చూపుతున్నారు... శుభ్రత మాటేంటి ? అని ప్రశ్నించారు. దేవస్థానంలో ప్రధానంగా క్యూ పద్ధతి పాటించడంలేదని పలువురు ఫిర్యాదు చేశారని, క్యూ పద్ధతిని కచ్చితంగా పాటించాలని ఈవో రామిరెడ్డిని హెచ్చరించారు. ఇప్పుడున్న రెండు క్యూలుకాకుండా మరొకటి ఏర్పాటు చేయాలని సూచించారు. పీఆర్వో కార్యాలయంలో ఎవరి కోసం ఏడుగురిని నియమించారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. దేవస్థానం లోపల భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూలు వేగవంతంగా ముందుకు సాగేలా చూడడానికి సిబ్బంది అవసరమని, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను ఏడుగురిని ఇక్కడ నియమించడం సరికాదని చెప్పారు. పీఆర్వో కార్యాలయంలో గుంపులు గుంపులుగా కూర్చొని కాలక్షేపం చేయడం తగదని మందలించారు. ఈవో రూ.1500 రాహుకేతు పూజలను ఆలయం లోపల నుంచి బయటకు మార్పుచేస్తున్నట్లు తెలిపారు. ఆమె ఆ మండపాన్ని, అన్నదాన మండపాన్ని పరిశీలించారు. ఆమె చివరగా బిక్షాలగోపురాన్ని పరిశీలించడానికి వెళ్లారు. అయితే అదే ప్రాంతంలో గాలిగోపురం బాధితులు తమకు న్యాయం చేయాలంటూ నిలదీయాలని వేచి ఉండటంతో ఆమె కారులో నుంచే బిక్షాలగోపురాన్ని చూస్తూ వెళ్లిపోయారు. -
‘చెత్త’శుద్ధి ఉండాల్సిందే!
సభలు, సమావేశాల తర్వాత శుభ్రత బాధ్యత నిర్వాహకులదే ముందే సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి; మార్గనిర్దేశకాలు జారీ చేసిన కేంద్రం న్యూఢిల్లీ: బహిరంగ ప్రదేశాల్లో జరిగిన సభలు, సమావేశాలకు ఎప్పుడైనా వెళ్లారా? కార్యక్రమం తరువాత ఆ ప్రాంతాన్ని గమనించారా? ఖాళీ వాటర్ బాటిళ్లు, నీళ్ల ప్యాకెట్లు, వాడిపారేసే గ్లాసులు, తిని పడేసిన ఫుడ్ ప్యాకెట్లు, ప్లాస్టిక్ కవర్లు.. ఇంకా పేపర్లు, కరపత్రాలు, బ్యానర్లు.. ఎక్సెట్రాలతో చెత్త చెత్తగా ఉంటుంది కదా! అంతేకాదు.. టాయిలెట్ల సౌకర్యం లేకపోవడంతో ఆ ప్రాంతమంతా కంపు కొడ్తూ కూడా ఉంటుంది కదా! కార్యక్రమం పూర్తయిందంటే నిర్వాహకులు ఆ చుట్టుపక్కల కూడా కనిపించకపోవడం కూడా మామూలే కదా! ఇకపై అలా కుదరదు. కార్యక్రమం తరువాత నిర్వాహకులు ‘చెత్త శుద్ధి’ బాధ్యత తీసుకోవాల్సిందే. అదీ కార్యక్రమం పూర్తయిన ఆరు గంటల్లోగా ఆ ప్రాంతమంతా శుభ్రపడిపోవాలి. అంతేకాదు.. సభ ప్రాంగణంలో డస్ట్బిన్లు, తాత్కాలిక టాయిలెట్లను ఏర్పాటుచేయాలి. కాదు, కూడదంటే.. మున్సిపల్ అధికారులు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తారు కానీ ఆ ఖర్చును మాత్రం నిర్వాహకుల దగ్గరే వసూలు చేస్తారు. అందుకోసం ముందే నిర్వాహకుల నుంచి సెక్యూరిటీ డిపాజిట్‌ను వసూలు చేస్తారు. ‘స్వచ్ఛ భారత్’లో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తాజాగా ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. తక్షణమే అమల్లోకొచ్చేలా ఈ నియమ నిబంధనలను మంగళవారం జారీ చేసి, రాష్ట్రాలకు కూడా పంపించింది. ఆ వివరాలు.. కార్యక్రమ నిర్వహణకు అనుమతి తీసుకునే సమయంలోనే నిర్వాహకులు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. అది సభికుల సంఖ్య 500 లోపైతే రూ. 10 వేలు, 5 వేలమందైతే రూ. 50 వేలు, సభికులు 50 వేల వరకు ఉంటే లక్ష రూపాయలను డిపాజిట్‌గా చెల్లించాలి. అనుమతినిచ్చేది పోలీసులైతే.. పోలీసుల వద్దే ఆ డిపాజిట్ ఉంచాలి. కార్యక్రమం తరువాత ప్రాంగణాన్ని శుభ్రం చేయనట్లైతే.. ఆ డిపాజిట్ డబ్బుతో అధికారులే శుభ్రం చేయిస్తారు. -
ఇదే మెనూ.. చచ్చినట్టు తినూ..
ఖమ్మం: మధ్యాహ్నభోజనం అధ్వానంగా మారింది. ఏదో మొక్కు‘బడి’గా పెడుతున్నారే తప్ప మెనూ..గినూ జాన్తనై. నీళ్లచారు, ముద్ద అన్నం పెట్టి ఇదే మెనూ..చచ్చినట్టు తినూ అనే రీతిలో వండివార్చుతున్నారు. పెట్ట అన్నం కూడా సరిపడా పెట్టడం లేదు. అర్థాకలితోనే విద్యార్థులు అలమటించాల్సి వస్తోంది. అన్నం ఉంటే కూర ఉండదు..కూర ఉంటే అన్న ఉండట్లేదని విద్యార్థులు వాపోతున్నారు. శుచీ శుభ్రతలేని వాతావరణం మధ్య విద్యార్థులు భోజనాలు చేయాల్సి వస్తోంది. చాలా పాఠశాలల్లో వంటగదులు లేవు. పలు పాఠశాలల్లో ఉన్నా శిథిలావస్థకు చేరాయి. విద్యార్థులకు ఎండలోనే వడ్డిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే మధ్యాహ్నభోజన పథకం నిర్వహణ ఎవరికీ పట్టనది అయిపోయింది. విద్యాశాఖ ఉన్నతాధికారులు, ప్రధానోపాధ్యాయులు పట్టించుకున్న పాపాన పోలేదు. మామూళ్ల మత్తులో ఉండి వసూళ్లకు పాల్పడుతుంటంతో ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. పుచ్చు కూరగాయలు, చౌకబారుగా దొరికేవే రోజూ వండి పెడుతున్నారని, హాస్టల్స్‌లో మధ్యాహ్న భోజనం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తింటున్నామని విద్యార్థులు వాపోతున్నారు. మధ్యాహ్న భోజనం ఏరోజు మెనూ ఏమిటనే విషయం కూడా పలుపాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియకపోవడం గమనార్హం. అప్పులే మిగిలేది.. మధ్యాహ్నభోజన పథకంతో తమకు ఒరిగేదేమీ లేదని మరోవైపు నిర్వాహకులు వాపోతున్నారు. గత సంవత్సరం 9, 10 తరగతుల విద్యార్థులకు వండిపెట్టిన డబ్బులు ఇప్పటి వరకు రాలేదని తెలిపారు. అప్పులు చేసి వండి పెడుతున్నామని వంట ఏజెన్సీల నిర్వాహకులు తెలిపారు. పలుచోట్ల వంటగదులు లేకపోవడంతో గాలిదుమారం వచ్చినా ఆరుబయటే, చెట్ల కిందే వంట చేస్తున్నారు. తాగునీటి వసతి లేక పలు పాఠశాలల్లో విద్యార్థులు, వంట నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ మొత్తం 34,000 పాఠశాలల్లో ఈ పథకం అమలవుతోంది. 1,17,013 మంది ప్రాథమిక, 63,679 మంది యూపీఎస్, 43,453 మంది హైస్కూల్ విద్యార్థులకు మధ్యాహ్నభోజనం అమలవుతోంది. నీళ్లచారు..ముద్ద అన్నమే... ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా నిర్వాహకులు నీళ్ల చారు.. ముద్ద అన్నమే పెడుతున్నారు. ప్రభుత్వం ఎంఎల్ఎస్ పాయింట్ల నుండి బియ్యం తీసుకోవాల్సిరావడంతో పలువురు డీలర్లు మంచి బియ్యం వారు తీసుకొని ముక్కినవి, తడిసిన బియ్యం పాఠశాలలకు వంపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. వీటిని నివారించేందుకు పైయిలెట్గా కొన్ని పాఠశాలలను ఎంపిక చేశారు. ప్రధానోపాధ్యాయులు బియ్యం తీసుకురావాలని జిల్లా అధికారులు చెప్పినా పలువురు ప్రధానోపాధ్యాయులు వెళ్లడం లేదని తెలుస్తోంది. ఖమ్మం నగరంతోపాటు పలుచోట్ల ఏజెన్సీలకు అప్పగించడంతో పెద్ద మొత్తంలో ఒకే చోట వండుతున్నారు. అది కూడా అధ్వాన్నంగా ఉంటోందని విద్యార్థులు వాపోతున్నారు. వారానికి రెండురోజులకు బదులు ఒకే రోజు గుడ్డు ఇస్తున్నారు. తాగునీరు, వంటషెడ్లు లేక ఇబ్బందులు.. జిల్లాలోని సగానికి పైగా పాఠశాలల్లో తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. వంటగదులు లేకపోవడం, పలు పాఠశాలల్లో వంటగదుల నిర్మాణం అర్థాతరంగా నిలిచిపోవడంతో చెట్ల కిందే వండిపెడుతున్నారు. ఓవైపు పందులు తిరుగుతుంటే మరోవైపు విద్యార్థులు భోజనాలు చేయాల్సి వస్తోంది. పలు పాఠశాలల్లో తాగునీటి కుళాయిల వద్ద అపరిశుభ్రంగా ఉంది.