దేవస్థానమా..మున్సిపాలిటీనా ?
- శ్రీకాళహస్తి గుడిని సందర్శించిన దేవాదాయశాఖ కమిషనర్
- శుభ్రత పాటించలేదనిఅధికారులపై ఆగ్రహం
- ఆలయ ఉద్యోగులు పీఆర్వో కార్యాలయంలో ఏంచేస్తారని నిలదీత
- గోపురబాధితుల భయంతో బిక్షాలగోపురాన్ని పరిశీలించని వైనం
శ్రీకాళహస్తి ఆలయంలో పారిశుధ్యం అధ్వానంగా ఉందని దేవాదాయ శాఖ కమిషనర్ అధికారులపై మండిపడ్డారు. దేవస్థానమా.. మున్సిపాలిటీనా అని ప్రశ్నించారు.
శ్రీకాళహస్తి: ‘శ్రీకాళహస్తి దేవస్థానం ఏడాదికి వందకోట్లకు పైగా ఆదాయం వస్తున్న ఆలయాల జాబితాల్లో ఉంది.. అయినా శుభ్రత పాటించడంలేదు.. దేవస్థానమా..మున్సిపాలిటీనా’ అంటూ దేవాదాయశాఖ కమిషనర్ అనురాధ ఆలయాధికారులపై మండిపడ్డారు. సోమవారం రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు ఆమె ఆలయాన్ని పరిశీలించారు. దేవస్థానంలో తడి ప్రదేశం ఉండకూడదని.. అయినా పలుచోట్ల నీటి తడి ఎందుకు ఉందని ప్రశ్నించారు. పారిశుద్ధ్యం కోసం లక్షలు ఖర్చుచేస్తున్నట్లు రికార్డులు చూపుతున్నారు... శుభ్రత మాటేంటి ? అని ప్రశ్నించారు. దేవస్థానంలో ప్రధానంగా క్యూ పద్ధతి పాటించడంలేదని పలువురు ఫిర్యాదు చేశారని, క్యూ పద్ధతిని కచ్చితంగా పాటించాలని ఈవో రామిరెడ్డిని హెచ్చరించారు.
ఇప్పుడున్న రెండు క్యూలుకాకుండా మరొకటి ఏర్పాటు చేయాలని సూచించారు. పీఆర్వో కార్యాలయంలో ఎవరి కోసం ఏడుగురిని నియమించారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. దేవస్థానం లోపల భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూలు వేగవంతంగా ముందుకు సాగేలా చూడడానికి సిబ్బంది అవసరమని, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను ఏడుగురిని ఇక్కడ నియమించడం సరికాదని చెప్పారు. పీఆర్వో కార్యాలయంలో గుంపులు గుంపులుగా కూర్చొని కాలక్షేపం చేయడం తగదని మందలించారు. ఈవో రూ.1500 రాహుకేతు పూజలను ఆలయం లోపల నుంచి బయటకు మార్పుచేస్తున్నట్లు తెలిపారు. ఆమె ఆ మండపాన్ని, అన్నదాన మండపాన్ని పరిశీలించారు. ఆమె చివరగా బిక్షాలగోపురాన్ని పరిశీలించడానికి వెళ్లారు. అయితే అదే ప్రాంతంలో గాలిగోపురం బాధితులు తమకు న్యాయం చేయాలంటూ నిలదీయాలని వేచి ఉండటంతో ఆమె కారులో నుంచే బిక్షాలగోపురాన్ని చూస్తూ వెళ్లిపోయారు.