చేతులు, పాదాల చర్మం... గరుకుదనం పోవాలంటే...
బ్యూటిప్స్
పాదాలు, చేతుల చర్మం గరుకుగా మారితే పగుళ్లు ఏర్పడతాయి. దీని వల్ల పగుళ్లలో మురికి చేరుతుంది. సరైన శుభ్రత పాటించకపోతే పాదాలు, చేతులు అందవికారంగా కనిపిస్తాయి. ఈ సమస్య దరిచేరకుండా ఉండాలంటే రోజూ సరైన జాగ్రత్తలు పాటించాలి. ఒక టబ్ గోరువెచ్చని నీళ్లలో కప్పు మొక్కజొన్న పిండి కలపాలి. అందులో 5-10 నిమిషాలు పాదాలను ఉంచి, విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత పమిస్ స్టోన్‌తో పాదాల మడమలను రుద్ది, కడగాలి. మెత్తని టవల్‌తో పాదాలను, చేతులను తుడిచి మాయిశ్చరైజర్ రాయాలి. రోజూ రాత్రిపూట పడుకునే ముందు ఈ విధంగా చేస్తూ ఉండాలి. కాలి మడమల పగుళ్లు తగ్గాలంటే ఉల్లిపాయ ముద్ద నూరి రాయాలి.రోజూ రాత్రి పడుకునే ముందు ఆవ నూనె పాదాలకు, చేతులకు రాసుకోవాలి.
అర కప్పు పెరుగులో అర టీ స్పూన్ వెనిగర్ కలిపి మడమలు, పాదాలకు మసాజ్ చేయాలి.రాత్రి పూట క్యాండిల్ వ్యాక్స్, ఆవ నూనె కలిపిన మిశ్రమాన్ని పాదాల పగుళ్లకు రాయాలి. సాక్స్ ధరించాలి. మరుసటి రోజు ఉదయం శుభ్రపరుచుకోవాలి.తాజా గులాబీ పువ్వులు కప్పు, అరకప్పు పాలు కలిపి మెత్తగా నూరాలి. దీంట్లో టీ స్పూన్ శనగపిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు, చేతులకు పట్టించి పది నిమిషాల తర్వాత శుభ్రపరచాలి.పెట్రోలియమ్ జెల్లీలో టీ స్పూన్ విటమిన్ ‘ఇ’ ఆయిల్, టీ స్పూన్ గ్లిజరిన్ కలపాలి. ఈ మిశ్రమాన్ని పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేయాలి.బొప్పాయి అర కప్పు, పైనాపిల్ అర కప్పు, తేనె 4 టేబుల్‌స్పూన్లు కలిపి పాదాలకు పట్టించాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి.