
హే రాం!
- స్వాతంత్య్రదినోత్సవం రోజూ ఆగని అమ్మకాలు
- జోరుగా మద్యం, మాంసం విక్రయాలు
- పట్టించుకోని యంత్రాంగం
చోడవరం : ‘నిబంధనలంటే లెక్కలేదు... ప్రభుత్వ ఆదేశాలంటే పట్టింపు లేదు... పోనీ దేశనాయకుల పట్ల గౌరవమైనా లేదు...అందుకే పరిస్థితి ఇలా’... యథేచ్ఛగా జరిగిన మద్యం, మాంసం విక్రయాలను చూసి స్థానికుల వ్యాఖ్యానాలివి. స్వాతంత్య్రదినోత్సవం, రిపబ్లిక్ డే, గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం మద్యం, మాంసం అమ్మకాలు నిషేధించిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం ఎక్కడా ఆ పరిస్థితి కనిపించలేదు.
ఓ పక్క వాడవాడలా జెండా పండుగ నిర్వహించి ప్రజలు ఆనందోత్సాహాలతో మునిగి తేలుతుంటే మరోవైపు వ్యాపారులు తమ అమ్మకాలను యథేచ్ఛగా కొనసాగించారు. మాంసం విక్రయాలు బహిరంగంగానే జరగగా, మద్యం దుకాణాలకు బయట షట్టర్లువేసి దొడ్డిదారిలో అమ్మకాలు జరిపారు.
షాపుల పక్కనే ఉన్న కి ల్లీషాపులు కూడా మద్యం అమ్మకాలకు వేదికయ్యాయి. డ్రై డేని దృష్టిలో పెట్టుకుని ఎక్సైజ్ అధికారులు గురువారం సాయంత్రమే మద్యం దుకాణాలకు సీళ్లువేశారు. విషయం ముందే తెలిసిన వ్యాపారులు దొడ్డిదారిన అమ్మకాలకు తగిన ఏర్పాట్లు చేసుకుని యథేచ్ఛగా వ్యాపారం నిర్వహించారు. కొందరు వ్యాపారులు దుకాణాలకు అనుబంధంగా ఉన్న కిల్లీ బడ్డీలకు ముందుగానే సరుకు తరలించారు.
చోడవరం పట్టణంతోపాటు మండలంలో ఉన్న అన్ని మద్యం దుకాణాలకు అనుబంధంగా చిన్నాచితకా షాపుల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు సాగాయి. ఈ అమ్మకాలను చూసి పలువురు పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకోనట్లు వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి అని వాపోయారు.