ప్రతికాత్మక చిత్రం
సాక్షి, గుర్రంకొండ, చిత్తూరు: స్వాతంత్య్ర దినోత్సవం రోజున మద్యం, మాంసం విక్రయాలు చేయరాదు. అంతేకాకుండా మద్యం సేవించడం చేయకూడదు. అయితే, గుర్రంకొండలో ఈ నియమాలకు రెవెన్యూ అధికారులు తిలోదకాలు వదిలారు. ఎంచక్కా మందు పుచ్చుకుని తమదైన సంబరాల్లో తూలారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున మద్యం దుకాణాలు సీజ్ చేసినా నిర్వాహకులు యథేచ్ఛగా మద్యం అమ్మకాలు సాగించారు. వివరాలు..స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు తమ కార్యాలయం ఎదుట సహోద్యోగులతో కలిసి జాతీయ జెండాను ఎగుర వేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
అయితే మధ్యాహ్నం వేళకు సీను మారిపోయింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున మద్యం సేవించరాదనే విషయం తెలుసో, తెలియదోగానీ గ్రామానికి చెందిన ఓ మద్యం దళారిని పిలిపించుకుని వారికి కావాల్సినంత మద్యం బాటిళ్లను గుర్రంకొండలో తెప్పించుకున్నారు. గ్రామానికి వెలుపల ఓ బహిరంగ ప్రదేశంలో ద్విచక్రవాహనాన్ని అడ్డుగా ఉంచుకుని మద్యం సీసాలను కాసేపటికే ఖాళీ చేశారు. అయితే ఈ దృశ్యాలను కొంతమంది స్థానికలు సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున మద్యం దుకాణాలను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేసినా వారికి మద్యం ఎక్కడ నుంచి వచ్చిందో ఎక్సైజ్ అధికారులకే తెలియాలి. గుర్రంకొండలో పట్టపగలే అధికారులు మద్యం సేవించడం చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment