ఏ దేశానికైనా ప్రధానంగా ఉండాల్సింది స్వాతంత్య్రం. ప్రపంచంలో పలుదేశాలు ఏదో సందర్భంలో ఇతర దేశాల పాలనకు లోబడి అటుపైన స్వాతంత్య్రాన్ని సాధించు కున్నవే. స్వాతంత్య్రాన్ని సాధించుకున్న దినాన్ని ఉత్సవ దినంగా ప్రతి దేశమూ జరుపుకుంటూ ఉంటుంది. స్వాతంత్య్ర దినోత్సవం ప్రతి దేశానికి స్ఫూర్తిదాయకమే.
‘దేశానికి రూపకల్పన చేసేది ఏది? ఎత్తైన నిర్మాణాలు, భవనాల గోపురాలతో ఉండే గొప్ప నగరాలు కాదు; విశాలమైన ఓడరేవులు కాదు, కాదు; మనుషులు, గొప్ప మనుషులు’ అని ఒక గ్రీక్ చాటువును ఆధారంగా తీసుకుని ఇంగ్లిష్ కవి విలిఅమ్ జోన్స్ చెప్పారు. ఆ మాటల్ని తీసుకుని గురజాడ అప్పారావు ‘దేశమంటే మట్టికాదోయ్ /దేశమంటే మనుషులోయ్’ అని చెప్పారు. ఔను, దేశం అంటే మనుషులే.
‘నువ్వు నీ దేశాన్ని ప్రేమించు’ అని ఇంగ్లిష్ కవి ఆల్‌ఫెడ్ టెన్నిసన్ అన్నారు. ఆ మాటల్ని తీసుకునే గురజాడ అప్పారావు ‘దేశమును ప్రేమించుమన్నా‘ అని అన్నారు. దేశాన్ని ప్రేమించడం దేశ ప్రజల్ని ప్రేమించడం ఔతుంది; దేశప్రజల్ని ప్రేమించడం దేశాన్ని ప్రేమించడం ఔతుంది. దేశాన్ని ప్రేమించలేనివాళ్లు దేశ పౌరులుగా ఉండేందుకు ఎంతమాత్రమూ అర్హులు అవరు; వాళ్లు దేశానికి హానికరం ఔతారు.
‘నితాంత స్వాతంత్య్రమ్ము వెల్లి విరియు స్వర్గాన/నా మాతృదేశమును మేలుకొన నిమ్ము ప్రభూ’ ఈ మాటల్లో పలికిన రవీంద్రనాథ్ ఠాగూర్ భావం మాతృదేశం, దేశ స్వాతంత్య్రం ఆవశ్యకత నూ, ప్రాముఖ్యతనూ ఘోషిస్తూ ఉంది. విదేశీ ఆక్రమణ దారుల క్రూరమైన, భయానకమైన పాలనలో పెనుబాధను అనుభవించి, లెక్కలేనంత సంపదను కోల్పోయి, ఎన్నిటినో వదులుకున్న మనదేశం వందల సంవత్సరాల పరపీడన నుండి విముక్తమై 75 యేళ్లుగా స్వాతంత్య్రాన్ని శ్వాసిస్తోంది. మనం ఇవాళ స్వతంత్ర దేశంలో ఉన్నాం; మన దేశంలో మనం మనదేశ పౌరులుగా ఉన్నాం. ఈ దేశం మనది; ఈ మనదేశం మన సంతతికి పదిలంగా అందాలి. ఈ చింతన మనల్ని నడిపించే ఆశయమై మనలో, మనతో సర్వదా, సర్వథా ఉండాలి.
‘నువ్వు, నీ దేశం నీకు ఏం చేస్తుంది అని అడిగే రాజకీయవాదివా? లేకపోతే నువ్వు, నీ దేశానికి ఏం చెయ్యగలను అని ఆడిగే పట్టుదల ఉన్నవాడివా? మొదటి ప్రశ్న అడిగేవాడివి ఐతే నువ్వు పరాన్నజీవివైన పురుగువి, రెండవ ప్రశ్న అడిగేవాడివి ఐతే నువ్వు ఎడారిలో ఉద్యానవనంవి’ అని ఖలీల్ జిబ్రాన్ మాటలు మన మెదళ్లను కదిలించాలి; మనదేశానికి మనం ఉద్యానవనాలం అవ్వాలి.
‘జంబూద్వీపే వైవస్వత మన్వంతరే భరతఖండే... ‘ఇలా ఆలయాల్లో సంకల్పం చెప్పడం మనకు తెలిసిందే. ఈ సంకల్పం చెప్పడం కాశ్మీర్ నుండీ కన్యాకుమారి వరకూ ఉండే ఆలయాల్లో ఉంది. ఇప్పటి పాకిస్తాన్ ప్రాంతంలోనూ, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలోనూ ఉండే ఆలయాల్లోనూ ఉండేది. దీని ద్వారా భరతఖండం సాంస్కృతికంగా ఒకటే అన్న సత్యం విశదం ఔతోంది. 2,000 ఏళ్లకు పూర్వందైన తమిళ్ సాహిత్యం పుఱనానూఱులో ఉత్తరాన హిమాలయాల నుండీ దక్షిణాన కన్యాకుమారి వరకు ఉన్న దేశం ఇది అని చెప్పబడింది. దీని ద్వారా ఎప్పటి నుండో భారతం భౌగోళికంగా ఒకటే అన్న సత్యం అవగతం ఔతోంది.
2,300 యేళ్ల క్రితంనాటి గ్రీక్ చరిత్రకారుడు మెగస్తనీస్ హిమాలయం నుండీ దక్షిణాన కడలి వరకు ‘ఇండికా’ అని గుర్తించాడు. అవగాహనారాహిత్యంతో కొందరు మనదేశం అసలు ఒక దేశమే కాదని, మరొకటని మనలో దేశవ్యతిరేక భావ అనలాన్ని రగిలిస్తూ ఉంటారు. ఆ అనలాన్ని చదువుతోనూ, విజ్ఞతతోనూ మనం ఆర్పేసుకోవాలి.
‘నా తల్లీ, తండ్రీ సంతోషంగా ఉన్నది ఈ దేశంలోనే’ అనీ, ‘తియ్యనైన ఊపిరినిచ్చి కని, పెంచి అనుగ్రహించింది ఈ దేశమే’ అని అన్నారు తమిళ్ మహాకవి సుబ్రమణియ బారతి. ఆయన జాతీయతా సమైక్యతను కాంక్షిస్తూ ‘కాశి నగర పండితుల ప్రసంగాన్ని కంచిలో వినడానికి ఒక పరికరాన్ని చేద్దాం’ అనీ అన్నారు. జాతీయతా సమైక్యత ఆపై సమగ్రత దేశానికి ముమ్మాటికీ ముఖ్యం.
‘వందేమాతరం జయ వందేమాతరం; ఆర్యభూమిలో నారీమణులూ, నరసూర్యులూ చేసే వీరనినాదం వందేమాతరం’ అనీ, ‘వందేమాతరం అందాం; మా దేశమాతను పూజిస్తాం అందాం’ అనీ నినదించారు సుబ్రమణియ బారతి. మనదేశాన్ని ప్రేమిస్తూ ఉందాం, మనదేశాన్ని పూజిస్తూ ఉందాం, మనం దేశభక్తులుగా మసలుతూ ఉందాం. దేశభక్తితో, భారతీయతతో బతుకుతూ ఉందాం. భారతీయులమై మనసారా, నోరారా అందాం, అంటూ ఉందాం ‘వందేమాతరం’.
‘దేశవాసులు అందరికీ జాతీయతా భావం ఉండాలి. జాతీయతా భావం లేకపోవడం క్షంతవ్యం కాదు. జాతీయతా వ్యతిరేకత, దేశ వ్యతిరేకత అనేవి భయంకరమైన మానసికవ్యాధులు. అవి ఉండకూడదు. జాతీయత–దేశ విద్వేషవాదం నుండి మనల్ని, మనదేశాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి’
‘భారత(ప్ర)దేశం... ‘భా’ అంటే ‘కాంతి’ లేదా ‘ప్రకాశం’ అనీ, ‘రత’ అంటే అంకితమైన, అసక్తి కల అనీ అర్థాలు. భగవంతుడు కాంతిరూపుడు. ‘భారతం’ అంటే ‘భగవంతుడికి అంకితమైంది’ లేదా ‘భగవంతుడిపై ఆసక్తి కలది’ అని అర్థం. ఈ అర్థాన్ని మనం ఆకళింపు చేసుకుందాం‘
– రోచిష్మాన్
Comments
Please login to add a commentAdd a comment