భారత చట్టాల గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
హిందూ అడాప్షన్ అండ్ మెయిన్‌టెనెన్స్ యాక్ట్ 1956
దేశంలోని ఏ ఒంటరి స్త్రీ అయినా పిల్లలను దత్తత తీసుకునే హక్కును కల్పిస్తోంది ఈ చట్టం. అమ్మాయి.. అబ్బాయి అనే తేడా లేకుండా వాళ్లకు నచ్చిన పిల్లల్ని దత్తత తీసుకునే వెసులుబాటును ఇస్తోంది. అయితే ఇదే వెసులుబాటును ఒంటరి పురుషులకు ఇవ్వడం లేదు ఈ చట్టం. ఒకవేళ ఒంటరి పురుషుడెవరైనా పిల్లలను దత్తత తీసుకోవాలను కుంటే కేవలం అబ్బాయిని మాత్రమే దత్తత తీసుకోవచ్చు. అమ్మాయిని కాదు. ఒకవేళ అమ్మాయినే దత్తత తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ చట్టంలోని సెక్షన్ 11 (3) ప్రకారం తన కన్నా 21 ఏళ్లు చిన్నదైన అమ్మాయిని మాత్రమే దత్తత తీసుకునే వీలు కల్పిస్తోంది. అంటే దత్తత తీసుకోవాలనుకుంటున్న వ్యక్తికి.. దత్తతకు వెళ్లబోతున్న అమ్మాయికి కనీసం 21 ఏళ్ల వయసు అంతరం ఉండాలన్నమాట.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21
మేజర్లు అయిన అమ్మాయి, అబ్బాయి సహజీవనం చేస్తుంటే దాన్ని చట్టబద్ధమైన బంధంగానే భావించాలని చెబుతోంది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21. దీని ప్రకారం ఏ వ్యక్తికైనా జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. సహజీవనం కూడా దాని కిందకే వస్తుంది. దేశంలో.. 2005 నుంచి సహజీవనం చట్టబద్ధం అయింది. సహజీవనం చేస్తున్న జంటకు పుట్టిన పిల్లలకు ఆస్తిహక్కునూ కల్పిస్తోందిది.
జీవించే హక్కు,ఆర్టికల్ 21
దేశంలోని పౌరులు అందరికీ జీవించే హక్కును కల్పిస్తోంది ఈ ఆర్టికల్. ప్రభుత్వంతో సహా ఎవరికీ ఎవరి జీవితాన్ని హరించే హక్కు లేదు. పైపెచ్చు దేశంలోని ప్రతి పౌరుడి జీవితానికి ప్రభుత్వం భద్రత కల్పించాలి. ఎవరి జీవితమైనా ప్రమాదంలో పడితే వారిని రక్షించేందుకు కావలసిన చర్యలను ప్రభుత్వం చేపట్టాలి. జీవించే హక్కుకు అవరోధం కల్పిస్తున్నవారిలో ప్రభుత్వ అధికారులనూ బాధ్యులను చేస్తుందీ ఆర్టికల్. ప్రభుత్వాల జోక్యం వల్ల కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే బాధ్యుల మీద విచారణను కోరే హక్కును పౌరులకు అందిస్తోందీ ఆర్టికల్.
చదువుకునే హక్కు, ఆర్టికల్ 21 (ఏ)..
ఇది దేశంలోని ఆరేళ్ల నుంచి పద్నాలుగేళ్ల లోపు పిల్లలందరికీ నిర్బంధ ఉచిత విద్య హక్కును కల్పిస్తోంది. దీని ప్రకారం దేశంలోని ప్రైవేట్ బడులన్నీ ఉచిత విద్య కింద 25 శాతం సీట్లను రిజర్వ్ చేయాలి. ఆ ఖర్చును ప్రభుత్వ– ప్రైవేట్ భాగస్వామ్యం కింద ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాదు ప్రభుత్వ గుర్తింపు లేని బడులను రద్దు చేస్తుంది. అలాగే డొనేషన్లు, కార్పొరేట్ ఫీజులు వసూలు చేయకూడదని చెబుతోంది. స్కూళ్లల్లో పిల్లల ప్రవేశ సమయంలో స్కూల్ సిబ్బంది.. పిల్లలను, పిల్లల తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేయడాన్నీ నిషేధిస్తుంది. ఈ చట్టం ప్రకారం ఎలిమెంటరీ స్కూల్ విద్య అయిపోయే సమయానికి ఏ విద్యార్థినీ ఫెయిల్ చేయడం కానీ.. పై తరగతికి పంపకుండా మళ్లీ అదే తరగతిలో ఉంచడం కానీ.. బడి నుంచి బహిష్కరించడం కానీ చేయకూడదు. అంతేకాదు బోర్డ్ ఎగ్జామ్ తప్పకుండా పాస్ కావాలనీ బలవంతపెట్టకూడదు. చదువులో వెనుకబడిన పిల్లలను అలా వదిలేయకుండా తోటివారికి సమంగా తయారు చేయాలనీ చెబుతోంది.
డ్రంక్ అండ్ డ్రైవ్
1988 మోటార్ వెహికిల్ యాక్ట్, సెక్షన్ 185, 202 ప్రకారం.. మద్యం సేవించి వాహనాన్ని నడుపుతున్నప్పుడు.. వంద మిల్లిలీటర్ల రక్తం నమూనాలో 30 మిల్లీ గ్రాముల మద్యం ఉంటే గనుక అరెస్ట్ వారెంట్ లేకుండానే పోలీసులు వాహనం నడుపుతున్న వారిని అరెస్ట్ చేయొచ్చు. ఇదే చట్టంలోని సెక్షన్ 129 ప్రకారం.. టూ వీలర్‌ను నడిపేవాళ్లు తప్పకుండా హెల్మెట్ ధరించాల్సిందే. పార్ట్ 128.. టూ వీలర్ మీద ఇద్దరు మాత్రమే ప్రయాణం చేయాలని చెబుతోంది. ఒకవేళ.. ఏ కారణం లేకుండా ట్రాఫిక్ పోలీసులు.. పౌరుల వాహనం తాళం చెవిని లేదా డాక్యుమెంట్స్‌ను తీసుకుంటే ఆ దృశ్యాన్ని ఫొటో తీసి.. ట్రాఫిక్ పోలీసుల మీద ఫిర్యాదు చేసే హక్కునూ కల్పిస్తోందీ చట్టం.
Comments
Please login to add a commentAdd a comment