ఈ ఏడాది స్వాతంత్య‍్ర సంబురాలకు యావత్ భారవతావని సిద్ధమవుతోంది. ఎంతోమంది వీరుల త్యాగాలతో మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంగతి తెలిసిందే. బ్రిటీష్ వారికి తమ ప్రాణాలను ఎదురొడ్డి నిలిచిన వీరులెందరో భారతమాత ఒడిలో చేరారు. వారిలో ముఖ్యంగా అల్లూరి సీతరామరాజు, సుభాశ్ చంద్రబోస్ పేర్లు వినిపిస్తాయి. స్వాతంత్ర పోరాటంలో అమరులైన వారి చరిత్ర గురించి మనం చాలా సినిమాల్లో చూశాం. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మనలో దేశభక్తి గురించి తెలిపే టాలీవుడ్ చిత్రాలేవో ఓ లుక్కేద్దాం.
1.అల్లూరి సీతారామ రాజు
ఎన్ని ఏళ్లు గడిచినా అందరికీ గుర్తుండి పోయే సినిమా 'అల్లూరి సీతారామ రాజు'. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఈ చిత్రం స్వాతంత్ర్య సమరయోధుడి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. బ్రిటీష్ వారి పాలనకు వ్యతిరేకంగా 1922-24 మద్రాసు ప్రెసిడెన్సీలో స్వాతంత్య్రోద్యమ కాలంలో జరిగిన కథాంశంగా ఈ చిత్రం రూపొందించారు. అనేకమంది జీవితాలకు స్ఫూర్తిగా నిలిచిన అల్లూరి.. బ్రిటిష్ వారిపై యుద్ధంలో తన దళాన్ని ముందుకు నడిపించారు. ఈ 'అల్లూరి సీతారామ రాజు' రిలీజై 175 రోజులు విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించారు. అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
1974లో విడుదలైన అల్లూరి సీతారామరాజు చిత్రానికి వి.రామచంద్రరావు దర్శకత్వం వహించారు. జి హనుమంత రావు, జి ఆదిశేషగిరి నిర్మించిన చిత్రంలో విజయ నిర్మల, కొంగర జగ్గయ్య, చంద్ర మోహన్ కీలక పాత్రల్లో నటించారు. భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో విప్లవకారుడు, మన్యం దొర అల్లూరి సీతారామ రాజు జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు.
2.సర్దార్ పాప రాయుడు
స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యంలో 1980లో వచ్చిన చారిత్రాత్మక చిత్రం సర్దార్ పాపరాయుడు. ఈ చిత్రాన్ని దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కించారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కొన్ని థియేటర్లలో అయితే ఏకంగా 300 రోజులపాటు ప్రదర్శించారు. ఆ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా సర్దార్ పాపరాయుడు ఘనత సాధించింది. శ్రీ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై క్రాంతి కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీదేవి, శారద ప్రధాన పాత్రల్లో నటించారు.
3.మేజర్ చంద్రకాంత్
ఎన్టీఆర్, మోహన్ బాబు, శారద ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం 'మేజర్ చంద్రకాంత్'. 1993లో విడుదలైన ఈ చిత్రం ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించే లక్ష్యంలో ఉన్న సైనికుడి జీవితం చుట్టు తిరుగుతుంది. నగ్మా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ దేశభక్తి చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని 'పుణ్యభూమి నాదేశం', 'ముద్దులతో ఓనమాలు' వంటి పాటలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయాయి.
4. బొబ్బిలి పులి
దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం బొబ్బిలి పులి. ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో కొంగర జగ్గయ్య, కైకాల సత్యనారాయణ, రావుగోపాలరావు, జయచిత్ర, మురళీమోహన్, ఎం. ప్రభాకర్ రెడ్డి, ప్రసాద్ బాబు, అల్లు రామలింగయ్య తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.
5.భారతీయుడు
తమిళ స్టా హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం భారతీయుడు. శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ వారిపై సాధించిన విజయాన్ని అందంగా చిత్రీకరించారు. స్వాతంత్రద్యోమంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాన్ని ఈ చిత్రం ద్వారా చూపించారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేశారు.
6.ఖడ్గం
దేశభక్తిపై రూపొందించిన చిత్రాల్లో ఖడ్గం మూవీకి ప్రత్యేకస్థానం ఉంటుంది. ఈ చిత్రానికి కృష్ణ వంశీ దర్శకత్వం వహించారు. ఈ టాలీవుడ్ ఐకానిక్ చిత్రం కమర్షియల్ హిట్‌గా నిలిచింది. శ్రీకాంత్, సోనాలి బింద్రే, ప్రకాష్ రాజ్, రవితేజ కీలక పాత్రల్లో నటించిన ఖడ్గం థియేటర్లను దద్దరిల్లేలా చేసింది. 2002లో వచ్చిన ఈ చిత్రానికి సరోజిని అవార్డు, ఐదు నంది అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దక్కాయి. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ముగ్గురు యువకుల జీవితాలను ప్రభావితం చేసే అమానవీయ ఉగ్రవాద చర్యల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
7.సుభాష్ చంద్రబోస్
2005లో విడుదలైన హిస్టారికల్ డ్రామా స్వాతంత్రానికి పూర్వం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కించారు. వెంకటేష్, శ్రియ శరణ్, జెనీలియా డిసౌజా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కె.రాఘవేంద్ర దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మూడు నంది అవార్డులను గెలుచుకుంది. బ్రిటీష్ వారితో పోరాడి చింతపల్లి గ్రామాన్ని రక్షించే సుభాష్ చంద్రబోస్ అనుచరుడి చుట్టూ కథను రూపొందించారు.
8.మహాత్మ
టాలీవుడ్‌లోని ఉత్తమ దేశభక్తి చిత్రాలలో మహాత్మ ఒకటి. కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్ ప్రధానపాత్ర పోషించారు. ఈ చిత్రంలో భావోద్వేగ సన్నివేశాలు, త్యాగం ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా తెరకెక్కించారు.
9. సైరా నరసింహారెడ్డి
మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో నటించిన చిత్రం సైరా నరసింహారెడ్డి. బ్రిటీశ్ పాలనలో వారిని ఎదురించి నిలిచిన ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో.. రామ్ చరణ్ నిర్మించారు. 2019లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.
10. ఆర్ఆర్ఆర్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. బ్రిటీష్ కాలంలో ఓ మన్యం వీరుడైన కొమురం భీం జీవితం ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ బ్రిటీష్ పోలీసు అధికారి పాత్రలో కనిపించగా.. ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లూ సాధించగా.. ఆస్కార్ అవార్డ్‌ను సైతం సాధించింది.
వీటితో పాటు స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. వీటిలో పల్నాటి యుద్ధం, నేటి భారతం(1983), వందేమాతరం(1985), ఆంధ్ర కేసరి, మరో ప్రపంచం(1970), మనదేశం(1949) ఘాజీ(2017), మేజర్, సైరా నరసింహా రెడ్డి(2019), గౌతమి పుత్ర శాతకర్ణి, పరమవీరచక్ర చిత్రాలు కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment