మీరు టూ వీలర్ డ్రైవ్ చేస్తున్నారు.. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఫాలో అవుతూ! హెల్మెట్ పెట్టుకున్నారు.. ఆర్‌సీ.. డ్రైవింగ్ లైసెన్స్‌ను క్యారీ చేస్తున్నారు.. బండికి ఇన్సూరెన్స్ ఉంది.. పొల్యూషన్ ఫ్రీ సర్టిఫికెట్ కూడా ఉంది.. అయినా ట్రాఫిక్ పోలీస్ మిమ్మల్ని ఆపారు.. మీ బండి కీ లాక్కున్నారు!
ఓ ప్రైవేట్ సంస్థ.. తన ఉద్యోగులకు నెల నెలా సరిగ్గా జీతాలే ఇవ్వట్లేదంట!ఇలా చెప్పుకుంటే బోలెడు.. ట్రాఫిక్ పోలీస్ హెరాస్‌మెంట్ నుంచి ఎమ్‌ఆర్‌పీని మించి ధరను వసూలు చేసే దుకాణదారు దాకా! ఎఫ్‌ఐఆర్ నమోదు చేయననే పోలీస్ నుంచి చెల్లని చెక్ ఇచ్చే పరిచయస్తుల వరకు!అన్నీ సమస్యలే.. అంతటా మోసాలే!అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష అన్నట్టుగానే పైవాటన్నిటీకీ పరిష్కారం హక్కుల రూపంలో మన రాజ్యాంగంలోనే ఉంది! చట్టాలుగా వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం..!!
పోలీస్ యాక్ట్ 1861
ప్రతి భారతీయ పౌరుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన యాక్ట్ ఇది. దీని ప్రకారం పోలీస్‌లు 24 గంటలూ విధినిర్వహణలో ఉండాలి యూనిఫామ్ వేసుకున్నా, వేసుకోకపోయినా!
మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961
దీని ప్రకారం.. ప్రెగ్నెన్సీ వల్ల విధులకు హాజరు కాలేకపోతున్న ఉద్యోగినిని ఉద్యోగంలోంచి తీసేసే హక్కు ఏ యజమానికి, ఏ అధికారికీ లేదు. తీస్తే అది శిక్షార్హమవుతుంది. గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష ఉంటుంది. పదిమంది ఉద్యోగులున్న ప్రతి ప్రైవేట్ సంస్థ గర్భిణీ ఉద్యోగులకు 84రోజుల పాటు వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాలి.
గర్భిణీ ఉద్యోగులతో ఇలాంటి పనులు చేయించకూడదు
ఉద్యోగం కోసం వచ్చిన మహిళ.. ప్రసవమై లేదా గర్భస్రావమై ఆరువారాలు దాటలేదని తెలిస్తే.. ఆమెను వెంటనే ఉద్యోగంలో నియమించకూడదు. ఆరువారాలు దాటితేనే నియమించాలి. ప్రసవమై లేదా గర్భస్రావమైన ఉద్యోగిని ఆరు వారాలు దాటితే కాని తిరిగి విధుల్లో చేర్చుకోకూడదు. అలాగే విధులకు సంబంధించి ఎంతటి అత్యవసర పరిస్థితుల్లోనైనా.. గర్భిణీ ఉద్యోగికి గంటలు గంటలు.. అదీ నిలబడి చేసే పనిని అస్సలు అప్పగించకూడదు. అంతేకాదు గర్భస్థ శిశువు మీద ప్రభావం చూపేంత ఒత్తడినీ ఆమె మీద పెట్టకూడదు. గర్భస్రావానికి దారి తీసే పరిస్థితి.. లేదా ఆమె ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపేంత పనినీ ఆమెకు పురమాయించకూడదు.
1955 హిందూ వివాహ చట్టం
భార్యభర్తలు విడాకులు పొందాలనుకుంటే ఈ చట్టం ప్రకారం ఆ జంట పెళ్లయిన ఏడాది వరకు ఆగాల్సిందే. పెళ్లయిన ఏడాదిలోపు విడాకులను మంజూరు చేయదీ చట్టం. అయితే ప్రతి చట్టం ఏదో ఒక వెసులుబాటును ఇస్తున్నట్టే ఫ్యామిలీ లా కూడా ఓ వెసులుబాటును కల్పిస్తోంది. అదేంటంటే.. భార్య, భర్తలు ‘పరస్పర అంగీకారంతో’ పెళ్లయిన ఏడాదిలోపు కూడా విడాకులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివాహేతర సంబంధం, శారీరక, మానసిక హింస, నపుంసకత్వం, ఇంట్లోంచి చెప్పకుండా వెళ్లిపోవడం, హిందూ మతంలో ఉన్న భాగస్వామి వేరే మతాన్ని స్వీకరించడం, మానసిక వ్యాధులు, మొండి జబ్బులు, ఏడేళ్ల వరకు భాగస్వామి జాడ తెలియకపోవడం వంటి కారణాల కింద భార్య, భర్తల్లో ఎవరైనా విడాకులు కోరవచ్చు.
సమాన పనికి సమాన వేతనం
1976, ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ ప్రకారం.. ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది ఒకేరకమైన వాతావరణం.. ఒకేరకమైన పరిస్థితుల్లో ఒకేరకమైన పనిని ఒకేరకమైన సామర్థ్యంతో చేస్తున్నట్లయితే ఎలాంటి భేదభావం చూపకుండా అందరికీ సమాన వేతనమే ఇవ్వాలి. ఒకవేళ అలా ఇవ్వనట్లయితే సంబంధిత లేబర్ అధికారికి యజమాని మీద ఫిర్యాదు చేయవచ్చు. ఆ అధికారులు విచారణ చేపట్టి.. అవసరమైన చర్యలు తీసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment