ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా..
శతాబ్దాల పాటు విదేశీ పాలనలో సర్వం కోల్పోయిన జాతి మేల్కొని స్వాతంత్య్రం సాధించుకోవడం చరిత్రాత్మకమే! భారత స్వాతంత్య్రోద్యమం ప్రధానంగా అహింసాయుతంగా సాగినా, స్వరాజ్యం రక్తపుటడుగుల మీదనే వచ్చిందన్న సత్యం దాచకూడనిది. స్వాతంత్య్రం, దేశ విభజన ఏకకాలంలో జరిగాయి. నాటి హింసకు ఇరవై లక్షల మంది బలయ్యారు. కోటీ నలభయ్ లక్షల మంది నిరాశ్రయులయ్యారు. భారత విభజన ప్రపంచ చరిత్రలోనే అత్యంత రక్తపాతంతో కూడిన ఘటనగా నమోదైంది.
విస్మరించలేని వాస్తవాలు స్వాతంత్య్ర సమరంలో భారత జాతీయ కాంగ్రెస్ అగ్రస్థానంలో నిలిచిన సంగతితో పాటు గిరిజన, రైతాంగ పోరాటాలు, విదేశీ గడ్డ మీద నుంచి జరిగిన ఆందోళనలు, తీవ్ర జాతీయవాదులు సాగించిన ఉద్యమాలు, బ్రిటిష్ ఇండియా చట్టసభలలో ప్రవేశించిన భారతీయ మేధావులు నాటి చట్టాలను దేశ ప్రయోజనాలకు అనుగుణంగా మలచడానికి చేసిన కృషి విస్మరించలేనివి. అటవీ చట్టాల బాధతో కొండకోనలలో ప్రతిధ్వనించిన గిరిజనుల ఆర్తనాదాలు, అండమాన్ జైలు గోడలు అణచివేసిన దేశభక్తుల కంఠశోష ఇప్పటికైనా వినడం ధర్మం.
విభజన సృష్టించిన హింసాకాండ..
రెండో ప్రపంచయుద్ధం ప్రారంభమైన రెండేళ్లకే వలసల నుంచి ఇంగ్లండ్ వైదొలగడం అవసరమన్న అభిప్రాయం ఆ దేశ నేతలలో బలపడింది. ఆ నేపథ్యంలోనే 1942 నాటి క్విట్ ఇండియా ఘట్టం భారత్ స్వాతంత్య్రోద్యమాన్ని చివరి అంకంలోకి ప్రవేశపెట్టింది. ‘భారత్‌ను విడిచి వెళ్లండి!’ అన్నది భారత జాతీయ కాంగ్రెస్ నినాదం. ‘భారత్‌ను విభజించి వెళ్లండి!’ అన్నది ముస్లిం లీగ్ సూత్రం. ఇదే ప్రతిష్టంభనను సృష్టించింది. స్వాతంత్య్రం రావడానికి సరిగ్గా సంవత్సరం ముందు (16 ఆగస్ట్ 1946) ముస్లిం లీగ్ ఇచ్చిన ‘ప్రత్యక్ష చర్య’ పిలుపు, పర్యవసానాలు ఆ ప్రతిష్టంభనకు అవాంఛనీయమైన ముగింపును ఇచ్చాయి. భారత్‌లో అంతర్యుద్ధం తప్పదన్న భయాలు ఇంగ్లండ్‌కు కలిగించిన పరిణామం కూడా అదే! అంతర్యుద్ధం అనుమానం కాదు, నిజమేనని పంజాబ్ ప్రాంత ప్రముఖుడు మాస్టర్ తారాసింగ్ ప్రకటించారు.
అటు పంజాబ్‌లోను, ఇటు బెంగాల్‌లోను మతఘర్షణలు తారస్థాయికి చేరాయి. ఈ దృశ్యానికి పూర్తి భిన్నమైన చిత్రం మరొకటి ఉంది. 1946లో జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్ భాగస్వాములుగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం విభేదాలతో సతమతమవుతున్నది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో విభజన ప్రయత్నాలు శరవేగంగా జరిగాయి. భారత స్వాతంత్య్రానికి 1947 ఫిబ్రవరి 20న లేబర్ పార్టీ ప్రధాని క్లెమెంట్ అట్లీ ముహూర్తం ఖరారు చేశాడు. 1947 మార్చి 5న బ్రిటిష్ పార్లమెంట్‌లో చర్చ జరిగింది. నిజానికి అది భారత్‌కు స్వాతంత్య్రం ఇచ్చే అంశం కాదు. ఉపఖండ విభజన గురించి. ఫిబ్రవరి 20 నాటి ప్రకటన ప్రకారం 1948 జూన్ మాసాంతానికి భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలి. కానీ ఆ ఘట్టాన్ని 11 మాసాల ముందుకు తెచ్చినవాడు లార్డ్ లూయీ మౌంట్‌బాటన్ , ఆఖరి వైస్రాయ్. ఈ తడబాటే, ఈ తొందరపాటే ఉపఖండాన్ని నెత్తురుటేరులలో ముంచింది.
గాంధీజీకి నెరవేరని కోరిక..
విభజన సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాడన్న నెపంతో 1947 ఫిబ్రవరిలో వైస్రాయ్ వేవెల్‌ను వెనక్కి పిలిపించి, 1947 మార్చి 22న మౌంట్‌బాటన్ ను పంపించారు. భారత్ విభజనను ఆగమేఘాల మీద పూర్తి చేసేందుకే మౌంట్‌బాటన్ ను నియమించారు. ఈ దశలోనే గాంధీజీకీ, జాతీయ కాంగ్రెస్‌కూ మధ్య ‘మౌన’సమరం మొదలయింది. ‘విభజనను కాంగ్రెస్ ఆమోదిస్తే అది నా శవం మీద నుంచే జరగాలి’ అని మౌలానా అబుల్ కలాం ఆజాద్‌తో గాంధీజీ వ్యాఖ్యానించినా దాని ప్రభావం కనిపించలేదు. 1947 మేలో మౌంట్‌బాటన్ విభజన ప్రణాళికను కాంగ్రెస్, ముస్లిం లీగ్‌ల ముందు పెట్టాడు. ఇది స్వదేశీ సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారం ఇచ్చింది. దీనిని మొదట నెహ్రూ వ్యతిరేకించినా, తరువాత అంగీకరించారు. స్వాతంత్య్రం ఇవ్వక తప్పని పరిస్థితులలో 565 సంస్థానాలకు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే అధికారాన్ని విభజన ప్రణాళిక ఇచ్చింది.
గాంధీజీ లేకుండానే విభజన నిర్ణయం..
1947 జూన్ 3న మౌంట్‌బాటన్ భారత్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, విభజన గురించి ప్రకటించారు. కేవలం తొమ్మిది మంది సమక్షంలో విభజన నిర్ణయం ఖరారైంది. నెహ్రూ, పటేల్, జేబీ కృపలానీ (కాంగ్రెస్), జిన్నా, లియాఖత్ అలీ ఖాన్ (లీగ్) బల్దేవ్‌సింగ్ తదితరులు మాత్రమే ఉన్నారు. ఈ కీలక సమావేశంలో గాంధీజీ లేని సంగతి గమనించాలి. మౌంట్‌బాటన్ పథకానికే 1947 జూలై 5న ఇంగ్లండ్ సింహాసనం ఆమోదముద్ర వేసింది. మూడు రోజుల తరువాత బ్రిటిష్ పార్లమెంట్ అంగీకారం తెలియచేసింది. ఆగస్ట్ 15వ తేదీకి ఐదు వారాల ముందు 1947 జూలై 8న సరిహద్దు కమిషన్ ఆ పని ఆరంభించింది. కాంగ్రెస్, లీగ్‌ల నుంచి చెరొక నలుగురు సభ్యులుగా ఉన్నారు. సర్ సిరిల్ జాన్ రాడ్‌క్లిఫ్ ఆ కమిషన్ అధ్యక్షుడు. భారతదేశం గురించి ఏమాత్రం అవగాహన లేనివాడని ఆయన మీద ఆరోపణ. కాలదోషం పట్టి మ్యాపుల ఆధారంగా విభజన రేఖలు వచ్చాయి. బెంగాల్, పంజాబ్‌ల విభజనకు కూడా కమిషన్ లు ఏర్పడినాయి.
ప్రమాదాన్ని ముందే పసిగట్టిన పటేల్, మేనన్..
యూనియన్ జాక్ దిగితే భారత్‌కు సార్వభౌమాధికారం వస్తుంది. కానీ సంస్థానాలు స్వయం నిర్ణయం తీసుకుంటే కొత్త సార్వభౌమాధికారానికి పెను సవాలు ఎదురవుతుంది. ఈ ప్రమాదాన్ని సకాలంలో గుర్తించిన వారు సర్దార్ పటేల్, బ్రిటిష్ ఇండియాలో రాష్ట్రాల వ్యవహారాల ఇన్ చార్జ్ వీపీ మేనన్ . ఆ సమస్యను పరిష్కరించినవారూ వారే! దేశం మీద స్వతంత్ర భారత పతాకం ఎగిరే నాటికే కశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ తప్ప మిగిలిన అన్ని సంస్థానాలను వారు భారత యూనియన్ లోకి తేగలిగారు. ఇది స్వతంత్ర భారతావని భవిష్యత్తును తీర్చిదిద్దిన నిర్మాణాత్మక ఘట్టం. సాంస్కృతిక ఐక్యతకు రాజకీయ ఐక్యతను జోడిరచిన పరిణామం. 1947 ఆగస్ట్ 15న భారత్ స్వతంత్ర దేశమైంది. – డాక్టర్ గోపరాజు నారాయణరావు
Comments
Please login to add a commentAdd a comment