జింద్–పటియాలా నేషనల్ హైవేపై ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకుంటున్న మహిళా రైతులు
రెండు నెలలుగా ఢిల్లీలో రైతుల పోరు. మళ్లీ ఈరోజు ప్రభుత్వంతో చర్చలు. నేటి చర్చల్లో ప్రభుత్వం ‘ఓకే’ అనలేదా.. ఈ ఏడాది ఢిల్లీలో రెండు పరేడ్‌లు! ఒకటి.. గణతంత్ర దినోత్సవ శకటాల పరేడ్. రెండు.. రైతుల రణన్నినాద ట్రాక్టర్ పరేడ్. ట్రాక్టర్ పరేడ్‌లోకి మహిళలూ దిగుతున్నారు. అందుకోసమే వాళ్లు హైవే పైకి వచ్చి.. ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు! బండెనక బండి కట్టి మహిళలు కదలక ముందే.. ప్రభుత్వంలో కదలిక వస్తుందా?
రైతులకు, ప్రభుత్వానికి కొద్ది వారాలుగా ఢిల్లీ సరిహద్దుల్లో పరోక్ష యుద్ధం జరుగుతోంది. రైతుల కోసం గత సెప్టెంబరులో పార్లమెంటు తెచ్చిన చట్టాలు మంచివని ప్రభుత్వం అంటుంటే.. ఆ చట్టాలు తమ బతుకును కోరేవి కాకపోగా బలి తీసుకునేవని రైతులు భావిస్తున్నారు. అందుకే ఆ చట్టాలను రద్దు చేయమని డిమాండ్ చేస్తూ ఢిల్లీకి నలువైపులా ఎండకు, వానకు, చలికి చలించకుండా సరిహద్దుల్లో టెంట్‌లు వేసుకుని కూర్చున్నారు. మళ్లీ ఈ రోజు (జనవరి 8) చర్చలు జరుగుతున్నాయి. ఇవీ విఫలమైతే? విఫలమైన మరుక్షణం నుంచే రైతు రాష్ట్రాలైన హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ ల నుంచి రైతులు ట్రాక్టర్‌లు వేసుకుని ఢిల్లీ బయల్దేరతారు.
జనవరి 26 నాటికి ఢిల్లీ చేరుకుంటారు. గణతంత్ర దినోత్సవం రోజు రిపబ్లిక్‌డే పరేడ్‌కి సమాంతరంగా ట్రాక్టర్ పరేడ్ జరుపుతారు. రైతు సంఘాల పోరు ప్రణాళిక ఇది. ఇందుకు మహిళా రైతులూ ట్రాక్టర్‌లు నడుపుకుంటూ ఢిల్లీ వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ట్రాక్టర్ నడపడం రాని మహిళలు సైతం హైవే మీదకు వెళ్లి ట్రాక్టర్ నడపడం నేర్చుకుంటున్నారు. మొదట ఇందుకు హర్యానా మహిళా రైతులు మార్గదర్శకులు అయ్యారు.
హర్యానాలోని రొహ్‌టాక్‌లో ట్రాక్టర్ పరేడ్‌కు రిహార్సల్స్ వేస్తున్న మహిళా రైతులు
ట్రాక్టర్ పరేడ్ కోసమే మహిళలు ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకోవడం పోరాట పథానికి ఒక కొత్త ఆదర్శం అయింది. అంతే కదా. ఇప్పుడు ఆడవాళ్లూ డ్రైవింగ్ నేర్చుకుని టూ–వీలర్లు, ఫోర్ వీలర్లు నడుపుతున్నప్పటికీ అదంతా ఆసక్తి ఉన్నందువల్లనో, అవసరం అయినందు వల్లో. అయితే ఒక ఉద్యమ పోరాటంలో పాల్పంచుకోడానికి మహిళలు డ్రైవింగ్ నేర్చుకోవడమే మరింతగా అభినందించాల్సిన సంగతి. అయితే మహిళా రైతు ఉద్యమకారులెవరూ అభినందనల్ని పట్టించుకునేంత స్థిమితంగా లేరు. హర్యానాలోని జింద్ జిల్లాలో గత సోమవారం నుంచీ జింద్–పటియాలా నేషనల్ హైవే మీద ఖట్కర్ టోల్ ప్లాజా సమీపంలో మహిళలు దీక్షగా ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. టోల్ ప్లాజా వాళ్లు కూడా వారి దగ్గర రుసుమేమీ వసూలు చేయడం లేదు! అదీ ఒక విధంగా రైతు ఉద్యమానికి మద్ధతు తెలియజేయడం అనుకోవాలి.
ఆ ప్రదేశంలో డ్రైవింగ్ శిక్షణ పగలంతా మూడు విడతలుగా జరుగుతోంది. ట్రాక్టర్ స్టార్ట్ చెయ్యడం, స్టీరింగ్ తిప్పడం, వాహనానికి రెండువైపులా వచ్చే వాహనాలను అద్దాల్లో చూస్తూ రోడ్డు రెండు వైపులను పరిశీలిస్తూ ట్రాక్టర్ నడపడం వంటి ప్రాథమిక విషయాలను డ్రైవింగ్ వచ్చిన బంధువుల నుండి, ప్రత్యేక శిక్షకుల ద్వారా ఈ మహిళలంతా నేర్చుకుంటున్నారు. ‘‘ఇది ప్రారంభం మాత్రమే. ప్రభుత్వం దిగి రాకుంటే ఈసారి నేరుగా ఎర్రకోటలోకే మా ట్రాక్టర్లు దూసుకువెళ్తాయి’’ అని 38 ఏళ్ల నైన్ అంటున్నారు. ట్రైనింగ్ అవుతున్న మహిళలో నైన్ ఒకరు. నైన్ ఖట్కర్ గ్రామ మహిళ. అదే గ్రామం నుంచి ట్రాక్టర్ నేర్చుకోడానికి వచ్చిన వారిలో సరోజ్ కూడా ఉన్నారు. ఆమెకు 35 ఏళ్లు. ‘‘నేను రైతు కూతుర్ని. రైతులపై ప్రభుత్వం ఇప్పటికే అనేక అరాచకాలకు పాల్పడింది.
ఇప్పుడైతే మేము అస్సలు వెనక్కు తగ్గాలని అనుకోవడం లేదు. ఇది రెండో స్వాతంత్య్ర సంగ్రామం అనుకోండి’’ అంటున్నారు సరోజ్. విజయేందర్ సిం«ధూ, సత్బీర్ పెహల్వాల్ కూడా అదే మాట చెబుతున్నారు. సత్బీర్ వయసులో పెద్దావిడ. అయినా ధైర్యంగా ట్రాక్టర్ నేర్చుకోడానికి వచ్చారు. ‘‘ఇప్పుడు మేము మౌనంగా ఉంటే, మా తర్వాతి తరం వారికి ప్రభుత్వ అకృత్యాలకు వ్యతిరేకంగా నోరు తెరిచే అవకాశమే ఉండదు. మా పిల్లలు సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతున్నారు. మా భర్తల్ని మాత్రం లోనికి పోనివ్వకుండా ఢిల్లీసరిహద్దుల్లోనే ఆపేశారు. ఏమైనా న్యాయంగా ఉందా?’’ అని సత్బీర్ అడుగుతున్నారు.
రైతు సంఘాల వారికి, ప్రభుత్వ ప్రతినిధులకు మధ్య ఇప్పటివరకు ఏడుసార్లు చర్చలు జరిగాయి. ఒక్కటీ సఫలం కాలేదు. ఎనిమిదో రౌంyŠ చర్చలు ఈ రోజు ఢిల్లీలో జరుగుతున్నాయి. రైతులు కోరుతున్నట్లు ఆ మూడు సాగుచట్టాల్ని ప్రభుత్వం రద్దు చేసిందా, కనీసం మార్పులు చేర్పులు చేసిందా.. ఢిల్లీలో ఒకే పరేడ్ జరుగుతుంది... గణతంత్ర దినోత్సవ పరేడ్. రైతుల డిమాండ్‌లకు ప్రభుత్వం తలవొగ్గలేదా.. ట్రాక్టర్ పరేడ్ తప్పని వాతావరణం ఏర్పడుతుంది. ‘‘ఇప్పటి వరకు రైతు ఉద్యమాన్ని మాత్రమే ప్రభుత్వం చూసింది. ఇకముందు మహిళా రైతు దళం బలాన్ని కూడా కూడగట్టుకున్న రైతు మహోద్యమాన్ని చూడవలసి ఉంటుంది. అది మరింత తీవ్రంగా ఉంటుంది’’ అని హెచ్చరిస్తున్నారు ట్రాక్టర్ నడపడం నేర్చుకుంటున్న హర్యానా మహిళలు.
Comments
Please login to add a commentAdd a comment