Indian laws
-
జూలై 1 నుంచి ‘భారత’ చట్టాలు
న్యూఢిల్లీ: వలసపాలన నాటి నేర న్యాయ వ్యవస్థ చట్టాలను సంస్కరించి నేటి ఆధునిక సమాజ అవసరాలకు తగ్గట్లుగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యా చట్టాలు జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించిన నిబంధనలు మాత్రం ఇప్పుడే అమలుకావు. హిట్ అండ్ రన్ కేసులపై ట్రక్కు డ్రైవర్లు దేశవ్యాప్తంగా కొద్దివారాల క్రితం ధర్నాకు దిగిన నేపథ్యంలో ఈ నిబంధనల అమలును ప్రస్తుతానికి పక్కనబెట్టారు. ఈ మూడు నూతన చట్టాలకు గత ఏడాది డిసెంబర్ 21న పార్లమెంట్ ఆమోదం తెలపగా డిసెంబర్ 25వ తేదీన రాష్ట్రపతి ముర్ము ఆమోదముద్ర వేశారు. ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసిజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్1872ల స్థానంలో ఈ మూడు చట్టాలు తెచి్చన సంగతి తెల్సిందే. దోషులను శిక్షించడంకంటే ముందు బాధితులకు సత్వర న్యాయం అందించే లక్ష్యంతోనే ఈ చట్టాలను తెచ్చామని బిల్లులపై చర్చ సందర్భంగా పార్లమెంట్లో హోం మంత్రి అమిత్‌షా వ్యాఖ్యానించారు. ఐపీసీలో లేని ఉగ్రవాదం అనే దానికి తొలిసారిగా కొత్త చట్టంలో సరైన నిర్వచనం పొందుపరిచారు. రాజదోహ్రం అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో ‘దేశ వ్యతిరేక నేరాలు’ అనే సెక్షన్‌ను జతచేశారు. వేర్పాటువాదం, సాయుధపోరాటాలు, దేశ సార్వ¿ౌమత్వాన్ని భంగపరిచే చర్చలు, దేశ, విదేశాల్లో ఉంటూ చేసే విధ్వంసకర కుట్రలు, దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే కుట్ర విద్వేష ప్రసంగాలు.. ఇలా పలు రకాల నేరాలను ఇకపై దేశవ్యతిరేక నేరాలుగా పరిగణిస్తారు. ఈ నేరాలకు గరిష్టంగా జీవితఖైదు పడొచ్చు. రాజద్రోహం అనే పదాన్ని తొలగించి దేశద్రోహం అనే నిర్వచించారు. దోషులకు మేజిస్ట్రేట్ విధించే జరిమానా మొత్తాలను పెంచారు. అన్ని భాగస్వామ్య వర్గాల సలహాలు, సూచనలు స్వీకరించి సమగ్ర చర్చలు, సంప్రతింపుల తర్వాతే ముసాయిదా బిల్లులు చట్టాలుగా రూపుదాల్చాయని అమిత్ షా అన్నారు. -
International Lawyers Conference 2023: భారతీయ భాషల్లో భారత చట్టాలు
న్యూఢిల్లీ: దేశంలో అమల్లో ఉన్న చట్టాలను అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో భారతీయ భాషల్లో రచించడానికి కేంద్ర ప్రభుత్వం నిజాయితీగా కృషి చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. ఆయన శనివారం ఢిల్లీలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా సైబర్ ఉగ్రవాదం, మనీ లాండరింగ్ నేరాలు విపరీతంగా పెరిగిపోతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. విధ్వంసకర కార్యకలాపాల కోసం అరాచక శక్తులు కృత్రిమ మేధ(ఏఐ)ను వాడుతున్నాయని చెప్పారు. ముష్కరుల కార్యకలాపాలకు, సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి దేశాలన్నీ చట్టాలకు లోబడి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. దేశాల మధ్య అమల్లో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థల తరహాలోనే సైబర్ ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ రూపొందించుకోవాలని చెప్పారు. 2047 నాటికి దేశం పూర్తిగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో భారత్ కృషి చేస్తోందని, ఇందుకోసం బలమైన, నిష్పక్షపాతంతో కూడిన న్యాయ వ్యవస్థ కావాలని చెప్పారు. రెండు రూపాల్లో చట్టాలు కక్షిదారులకు న్యాయం చేకూర్చడంలో న్యాయ ప్రక్రియ, చట్టాలను రాసేందుకు ఉపయోగించిన భాష కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. చట్టాలు రెండు రూపాల్లో ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. న్యాయ నిపుణులు ఉపయోగించే భాషలో, సామాన్య ప్రజలు ఉపయోగించే భాషలో చట్టాలు ఉండాలన్నారు. ప్రజల భాషలో చట్టాలు ఉన్నప్పుడు వారు వాటిని సొంతం చేసుకుంటారని తెలిపారు. చట్టాలను సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా సులభతరంగా మార్చే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. అది పూర్తి కావడానికి సమయం పడుతుందన్నారు. డేటా ప్రొటెక్షన్ చట్టంతో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టామని వివరించారు. కక్షిదారులకు తీర్పు కాపీలను వారి మాతృభాషలో అందజేయాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. భారత న్యాయ వ్యవస్థను కాపాడడంలో జ్యుడీíÙయరీ, బార్ కౌన్సిల్ సాగిస్తున్న కృషి ప్రశంసనీయమని చెప్పారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఎంతోమంది న్యాయవాదులు ముందంజలో నిలిచారని గుర్తుచేశారు. అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్, యూకే న్యాయ సహాయ శాఖ మంత్రి అలెక్స్ చాక్ కె.సి., భారత అటార్నీ జనరల్ ఆర్.వెంటకరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, బార్ కౌన్సిల్ చైర్మన్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదుల పాత్ర మారాలి: జస్టిస్ చంద్రచూడ్ నేటి ప్రపంచీకరణ శకంలో అంతర్జాతీయంగా న్యాయరంగంలో సవాళ్లను ఎదుర్కొనే దిశగా న్యాయవాదుల పాత్ర మార్పు చెందాలని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ సూచించారు. ఆధునిక పరిజ్ఞానాన్ని లాయర్లు అందిపుచ్చుకోవాలన్నారు. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ వంటి అంశాల్లో సాంకేతికపరమైన మార్పులను కక్షిదారులు, ప్రభుత్వాలు అందిపుచ్చుకొనేలా లాయర్లు కృషి చేయాలని సీజేఐ తెలిపారు. -
ప్రేమించిన వ్యక్తితో సహజీవనం.. పుట్టిన పిల్లలకు ఆస్తి వస్తుందా?
భారత చట్టాల గురించి మీకు ఈ విషయాలు తెలుసా? హిందూ అడాప్షన్ అండ్ మెయిన్టెనెన్స్ యాక్ట్ 1956 దేశంలోని ఏ ఒంటరి స్త్రీ అయినా పిల్లలను దత్తత తీసుకునే హక్కును కల్పిస్తోంది ఈ చట్టం. అమ్మాయి.. అబ్బాయి అనే తేడా లేకుండా వాళ్లకు నచ్చిన పిల్లల్ని దత్తత తీసుకునే వెసులుబాటును ఇస్తోంది. అయితే ఇదే వెసులుబాటును ఒంటరి పురుషులకు ఇవ్వడం లేదు ఈ చట్టం. ఒకవేళ ఒంటరి పురుషుడెవరైనా పిల్లలను దత్తత తీసుకోవాలను కుంటే కేవలం అబ్బాయిని మాత్రమే దత్తత తీసుకోవచ్చు. అమ్మాయిని కాదు. ఒకవేళ అమ్మాయినే దత్తత తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ చట్టంలోని సెక్షన్ 11 (3) ప్రకారం తన కన్నా 21 ఏళ్లు చిన్నదైన అమ్మాయిని మాత్రమే దత్తత తీసుకునే వీలు కల్పిస్తోంది. అంటే దత్తత తీసుకోవాలనుకుంటున్న వ్యక్తికి.. దత్తతకు వెళ్లబోతున్న అమ్మాయికి కనీసం 21 ఏళ్ల వయసు అంతరం ఉండాలన్నమాట. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 మేజర్లు అయిన అమ్మాయి, అబ్బాయి సహజీవనం చేస్తుంటే దాన్ని చట్టబద్ధమైన బంధంగానే భావించాలని చెబుతోంది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21. దీని ప్రకారం ఏ వ్యక్తికైనా జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. సహజీవనం కూడా దాని కిందకే వస్తుంది. దేశంలో.. 2005 నుంచి సహజీవనం చట్టబద్ధం అయింది. సహజీవనం చేస్తున్న జంటకు పుట్టిన పిల్లలకు ఆస్తిహక్కునూ కల్పిస్తోందిది. జీవించే హక్కు,ఆర్టికల్ 21 దేశంలోని పౌరులు అందరికీ జీవించే హక్కును కల్పిస్తోంది ఈ ఆర్టికల్. ప్రభుత్వంతో సహా ఎవరికీ ఎవరి జీవితాన్ని హరించే హక్కు లేదు. పైపెచ్చు దేశంలోని ప్రతి పౌరుడి జీవితానికి ప్రభుత్వం భద్రత కల్పించాలి. ఎవరి జీవితమైనా ప్రమాదంలో పడితే వారిని రక్షించేందుకు కావలసిన చర్యలను ప్రభుత్వం చేపట్టాలి. జీవించే హక్కుకు అవరోధం కల్పిస్తున్నవారిలో ప్రభుత్వ అధికారులనూ బాధ్యులను చేస్తుందీ ఆర్టికల్. ప్రభుత్వాల జోక్యం వల్ల కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే బాధ్యుల మీద విచారణను కోరే హక్కును పౌరులకు అందిస్తోందీ ఆర్టికల్. చదువుకునే హక్కు, ఆర్టికల్ 21 (ఏ).. ఇది దేశంలోని ఆరేళ్ల నుంచి పద్నాలుగేళ్ల లోపు పిల్లలందరికీ నిర్బంధ ఉచిత విద్య హక్కును కల్పిస్తోంది. దీని ప్రకారం దేశంలోని ప్రైవేట్ బడులన్నీ ఉచిత విద్య కింద 25 శాతం సీట్లను రిజర్వ్ చేయాలి. ఆ ఖర్చును ప్రభుత్వ– ప్రైవేట్ భాగస్వామ్యం కింద ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాదు ప్రభుత్వ గుర్తింపు లేని బడులను రద్దు చేస్తుంది. అలాగే డొనేషన్లు, కార్పొరేట్ ఫీజులు వసూలు చేయకూడదని చెబుతోంది. స్కూళ్లల్లో పిల్లల ప్రవేశ సమయంలో స్కూల్ సిబ్బంది.. పిల్లలను, పిల్లల తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేయడాన్నీ నిషేధిస్తుంది. ఈ చట్టం ప్రకారం ఎలిమెంటరీ స్కూల్ విద్య అయిపోయే సమయానికి ఏ విద్యార్థినీ ఫెయిల్ చేయడం కానీ.. పై తరగతికి పంపకుండా మళ్లీ అదే తరగతిలో ఉంచడం కానీ.. బడి నుంచి బహిష్కరించడం కానీ చేయకూడదు. అంతేకాదు బోర్డ్ ఎగ్జామ్ తప్పకుండా పాస్ కావాలనీ బలవంతపెట్టకూడదు. చదువులో వెనుకబడిన పిల్లలను అలా వదిలేయకుండా తోటివారికి సమంగా తయారు చేయాలనీ చెబుతోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ 1988 మోటార్ వెహికిల్ యాక్ట్, సెక్షన్ 185, 202 ప్రకారం.. మద్యం సేవించి వాహనాన్ని నడుపుతున్నప్పుడు.. వంద మిల్లిలీటర్ల రక్తం నమూనాలో 30 మిల్లీ గ్రాముల మద్యం ఉంటే గనుక అరెస్ట్ వారెంట్ లేకుండానే పోలీసులు వాహనం నడుపుతున్న వారిని అరెస్ట్ చేయొచ్చు. ఇదే చట్టంలోని సెక్షన్ 129 ప్రకారం.. టూ వీలర్‌ను నడిపేవాళ్లు తప్పకుండా హెల్మెట్ ధరించాల్సిందే. పార్ట్ 128.. టూ వీలర్ మీద ఇద్దరు మాత్రమే ప్రయాణం చేయాలని చెబుతోంది. ఒకవేళ.. ఏ కారణం లేకుండా ట్రాఫిక్ పోలీసులు.. పౌరుల వాహనం తాళం చెవిని లేదా డాక్యుమెంట్స్‌ను తీసుకుంటే ఆ దృశ్యాన్ని ఫొటో తీసి.. ట్రాఫిక్ పోలీసుల మీద ఫిర్యాదు చేసే హక్కునూ కల్పిస్తోందీ చట్టం. -
మీకు తెలుసా?ఆఫీస్‌లో గర్భిణీలతో అలాంటి పనులు చేయించకూడదు
మీరు టూ వీలర్ డ్రైవ్ చేస్తున్నారు.. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఫాలో అవుతూ! హెల్మెట్ పెట్టుకున్నారు.. ఆర్సీ.. డ్రైవింగ్ లైసెన్స్‌ను క్యారీ చేస్తున్నారు.. బండికి ఇన్సూరెన్స్ ఉంది.. పొల్యూషన్ ఫ్రీ సర్టిఫికెట్ కూడా ఉంది.. అయినా ట్రాఫిక్ పోలీస్ మిమ్మల్ని ఆపారు.. మీ బండి కీ లాక్కున్నారు! ఓ ప్రైవేట్ సంస్థ.. తన ఉద్యోగులకు నెల నెలా సరిగ్గా జీతాలే ఇవ్వట్లేదంట!ఇలా చెప్పుకుంటే బోలెడు.. ట్రాఫిక్ పోలీస్ హెరాస్మెంట్ నుంచి ఎమ్ఆర్పీని మించి ధరను వసూలు చేసే దుకాణదారు దాకా! ఎఫ్ఐఆర్ నమోదు చేయననే పోలీస్ నుంచి చెల్లని చెక్ ఇచ్చే పరిచయస్తుల వరకు!అన్నీ సమస్యలే.. అంతటా మోసాలే!అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష అన్నట్టుగానే పైవాటన్నిటీకీ పరిష్కారం హక్కుల రూపంలో మన రాజ్యాంగంలోనే ఉంది! చట్టాలుగా వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం..!! పోలీస్ యాక్ట్ 1861 ప్రతి భారతీయ పౌరుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన యాక్ట్ ఇది. దీని ప్రకారం పోలీస్‌లు 24 గంటలూ విధినిర్వహణలో ఉండాలి యూనిఫామ్ వేసుకున్నా, వేసుకోకపోయినా! మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 దీని ప్రకారం.. ప్రెగ్నెన్సీ వల్ల విధులకు హాజరు కాలేకపోతున్న ఉద్యోగినిని ఉద్యోగంలోంచి తీసేసే హక్కు ఏ యజమానికి, ఏ అధికారికీ లేదు. తీస్తే అది శిక్షార్హమవుతుంది. గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష ఉంటుంది. పదిమంది ఉద్యోగులున్న ప్రతి ప్రైవేట్ సంస్థ గర్భిణీ ఉద్యోగులకు 84రోజుల పాటు వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాలి. గర్భిణీ ఉద్యోగులతో ఇలాంటి పనులు చేయించకూడదు ఉద్యోగం కోసం వచ్చిన మహిళ.. ప్రసవమై లేదా గర్భస్రావమై ఆరువారాలు దాటలేదని తెలిస్తే.. ఆమెను వెంటనే ఉద్యోగంలో నియమించకూడదు. ఆరువారాలు దాటితేనే నియమించాలి. ప్రసవమై లేదా గర్భస్రావమైన ఉద్యోగిని ఆరు వారాలు దాటితే కాని తిరిగి విధుల్లో చేర్చుకోకూడదు. అలాగే విధులకు సంబంధించి ఎంతటి అత్యవసర పరిస్థితుల్లోనైనా.. గర్భిణీ ఉద్యోగికి గంటలు గంటలు.. అదీ నిలబడి చేసే పనిని అస్సలు అప్పగించకూడదు. అంతేకాదు గర్భస్థ శిశువు మీద ప్రభావం చూపేంత ఒత్తడినీ ఆమె మీద పెట్టకూడదు. గర్భస్రావానికి దారి తీసే పరిస్థితి.. లేదా ఆమె ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపేంత పనినీ ఆమెకు పురమాయించకూడదు. 1955 హిందూ వివాహ చట్టం భార్యభర్తలు విడాకులు పొందాలనుకుంటే ఈ చట్టం ప్రకారం ఆ జంట పెళ్లయిన ఏడాది వరకు ఆగాల్సిందే. పెళ్లయిన ఏడాదిలోపు విడాకులను మంజూరు చేయదీ చట్టం. అయితే ప్రతి చట్టం ఏదో ఒక వెసులుబాటును ఇస్తున్నట్టే ఫ్యామిలీ లా కూడా ఓ వెసులుబాటును కల్పిస్తోంది. అదేంటంటే.. భార్య, భర్తలు ‘పరస్పర అంగీకారంతో’ పెళ్లయిన ఏడాదిలోపు కూడా విడాకులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివాహేతర సంబంధం, శారీరక, మానసిక హింస, నపుంసకత్వం, ఇంట్లోంచి చెప్పకుండా వెళ్లిపోవడం, హిందూ మతంలో ఉన్న భాగస్వామి వేరే మతాన్ని స్వీకరించడం, మానసిక వ్యాధులు, మొండి జబ్బులు, ఏడేళ్ల వరకు భాగస్వామి జాడ తెలియకపోవడం వంటి కారణాల కింద భార్య, భర్తల్లో ఎవరైనా విడాకులు కోరవచ్చు. సమాన పనికి సమాన వేతనం 1976, ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ ప్రకారం.. ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది ఒకేరకమైన వాతావరణం.. ఒకేరకమైన పరిస్థితుల్లో ఒకేరకమైన పనిని ఒకేరకమైన సామర్థ్యంతో చేస్తున్నట్లయితే ఎలాంటి భేదభావం చూపకుండా అందరికీ సమాన వేతనమే ఇవ్వాలి. ఒకవేళ అలా ఇవ్వనట్లయితే సంబంధిత లేబర్ అధికారికి యజమాని మీద ఫిర్యాదు చేయవచ్చు. ఆ అధికారులు విచారణ చేపట్టి.. అవసరమైన చర్యలు తీసుకుంటారు. -
భారత చట్టాలకు లోబడి పని చేయాల్సిందే
న్యూఢిల్లీ: భారత్‌లో పని చేసే సంస్థలన్నీ ఇక్కడి చట్టాలకు, నియమ నిబంధనలకు లోబడి నడుచుకోవాల్సిందేనని బ్రిటన్‌కు కేంద్రం స్పష్టం చేసింది. రెండు రోజుల జీ–20 మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు భారత్ వచ్చిన బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవర్లీ బుధవారం విదేశాంగ మంత్రి జై శంకర్‌తో భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. బీబీసీపై పన్ను ఎగవేత ఆరోపణలు, ఢిల్లీ, ముంబైల్లోని ఆ సంస్థ కార్యాలయాల్లో సీబీఐ సర్వే ఉదంతాన్ని ఈ సందర్భంగా క్లెవర్లీ ప్రస్తావించారు. ఏ సంస్థలైనా ఇక్కడి పూర్తిగా చట్టాలకు లోబడి పని చేయాలని జై శంకర్ గట్టిగా బదులిచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పలు అంతర్జాతీయ పరిణామాలపైనా తామిద్దరం లోతుగా చర్చలు జరిపామంటూ అనంతరం జై శంకర్ ట్వీట్ చేశారు. -
ఇక్కడి చట్టాలను పాటించాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో నివసించే, పనిచేసే వారందరూ భారతప్రభుత్వ చట్టాలు, నియమాలకు కట్టుబడి ఉండాలని కేంద్ర ఐటీ శాఖ నూతన మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్ మధ్య గత కొంతకాలంగా నెలకొన్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో కేంద్ర ఐటీ శాఖ నూతన మంత్రిగా ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించిన వెంటనే, నూతన ఐటీ నిబంధనల విషయంలో ప్రభుత్వ వైఖరిని మరోసారి స్పష్టంచేశారు. ట్విట్టర్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ దేశంలోని చట్టాలు అందరికీ సమానమని, అందరూ దీనిని తప్పనిసరిగా పాటించాలని అశ్విని వైష్ణవ్ వ్యాఖ్యానించారు. ఒడిశాకు చెందిన రాజ్యసభ సభ్యుడు అశ్విని వైష్ణవ్ బుధవారం కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖతో పాటు రైల్వేశాఖ బాధ్యతలను ఆయన స్వీకరించారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) బీఎల్ సంతోష్‌ను కలిసిన తరువాత వైష్ణవ్ విలేకరులతో మాట్లాడారు. ఎలక్ట్రానిక్స్, ఐటి, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖలో బీజేపీ సీనియర్ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ స్థానంలో వైష్ణవ్ నియమితులయ్యారు. దేశంలో నూతన నిబంధనలు మే 26 నుంచి అమల్లోకి వచ్చినప్పటికీ, ప్రభుత్వం పదేపదే గుర్తుచేసినప్పటికీ ట్విట్టర్ ఇంకా సోషల్ మీడియా మార్గదర్శకాలకు కట్టుబడలేదు. ట్విట్టర్‌కు రక్షణ కల్పించలేం: ఢిల్లీ హైకోర్టు కొత్త ఐటీ నిబంధనల నుంచి అమెరికాకు చెందిన ప్రముఖ మైక్రో బ్లాగింగ్ యాప్ ట్విటర్‌కు ఎలాంటి మినహాయింపు, రక్షణ ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. ఒకవేళ ఆ నిబంధనల ఉల్లంఘన జరిగితే, చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందని స్పష్టం చేసింది. తాజా ఐటీ నిబంధనలను అమలు చేస్తామని పేర్కొంటూ అమెరికాలో నోటరీ అయిన అఫిడవిట్‌ను రెండు వారాల్లోగా సమర్పించాలని జస్టిస్ రేఖ పల్లి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ట్విటర్‌ను ఆదేశించింది. అనంతరం, తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. కొత్త ఐటీ నిబంధనల ప్రకారం ట్విటర్ నియమించిన అధికారులు కూడా కోర్టుకు అఫిడవిట్ సమర్పించాలని పేర్కొంది. కోర్టు నుంచి తాము కూడా ఎలాంటి రక్షణ కోరడం లేదని ట్విటర్ తరఫు న్యాయవాది సాజన్ పూవయ్య తెలిపారు. కొత్తగా నియమించిన చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ తదితర అధికారుల వివరాలను జులై 8లోగా కోర్టు ముందుంచాలని గతంలో కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం ట్విటర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. తాత్కాలిక ప్రాతిపదికను అధికారులను నియమించే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. తాత్కాలిక చీఫ్ కంప్లయన్స్ అధికారిని ఇప్పటికే నియమించామని, భారత్‌లో నివసించే గ్రీవెన్స్ అధికారిని, నోడల్ ఆఫీసర్‌ను తాత్కాలిక ప్రాతిపదికన ఈ నెల 11న నియమిస్తామని తెలిపారు. వారు తాత్కాలిక అధికారులే అయినా.. పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపడ్తారన్నారు. ఫిర్యాదులు, ఇతర వివాదాల విషయంలో పూర్తి స్థాయి బాధ్యత ట్విటర్ తీసుకోవాలని అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ కోరారు. పారదర్శకత ఉండాల్సిందే ఫేస్‌బుక్‌కు సుప్రీం స్పష్టీకరణ న్యూఢిల్లీ: ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలు పవర్ సెంటర్లుగా మారుతున్నాయని, ప్రజల అభిప్రాయాలను సైతం ప్రభావితం చేయగలుగుతున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఫేస్‌బుక్‌కు ఇండియాలో 27 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారని గుర్తుచేసింది. ఇలాంటి సామాజిక వేదికలు పారదర్శకత పాటించాల్సిందేనని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఢిల్లీ అసెంబ్లీ శాంతి, సామరస్య కమిటీ తమకు జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ ఫేస్బుక్ ఇండియా ఉపాధ్యక్షుడు, ఎండీ అజిత్ మోహన్‌తోపాటు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎస్.కె.కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈశాన్య ఢిల్లీలో గత ఏడాది చోటుచేసుకున్న అల్లర్లకు సంబంధించి సాక్షిగా తమ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ ఢిల్లీ శాసనసభకు చెందిన శాంతి, సామరస్య కమిటీ ఫేస్‌బుక్‌తోపాటు ఇతరులకు గతంలో సమన్లు జారీ చేసింది. సాక్షిగా ప్రశ్నించేందుకు పిలిచే విశేష అధికారాలు ఢిల్లీ హైకోర్టుకు, దాని కమిటీకి ఉన్నాయని పేర్కొంది. -
ఒక వైపు పెళ్లి విందు..మరోవైపు వైవాహిక జీవితం మొదలు
స్త్రీ పురుష సమానత్వం కోసం చరిత్రలో ఎన్నో పోరాటాలు జరిగాయి. వర్తమానంలోనూ జరుగుతున్నాయి. అవకాశాల్లో సమానత్వం. వసతులలో సమానత్వం. వేతనాలలో సమానత్వం. ఇప్పుడు పెళ్లీడులో సమానత్వం కోసం న్యాయపోరాటం మొదలైంది! పెళ్లి వయసు 21–18గా ఉంటే నష్టం ఏమిటి? 21–21 ఉంటే వచ్చే లాభం ఏమిటి? ‘యుక్తవయసు’ అంటే పెళ్లీడు అనుకుంటాం. కానీ కాదు! అది యుక్తమైన వయసు. అనువైన వయసు. అర్హమైన వయసు. ఇంగ్లిష్‌లో ‘రైట్ ఏజ్’ అంటారు. తగిన వయసు అని. జీవితంలో ప్రతి దానికీ యుక్త(మైన) వయసు ఒకటి ఉంటుంది. చదువు ప్రారంభించడానికి. చదువు పూర్తి చేయడానికి. ఉద్యోగాల వేటకు, వివాహానికి. చట్ట ప్రకారం కూడా కొన్నింటికి యుక్తమైన వయసులు ఉన్నాయి. ఓటు హక్కుకు యుక్త వయసు. మైనారిటీ తీరడానికి యుక్తవయసు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అవడానికి యుక్త వయసు. ఈ కనీస యుక్త వయసుల విషయంలో భారత చట్టాలు స్త్రీ, పురుషులిద్దర్నీ సమానంగా చూశాయి.. ఒక్క మేరేజ్ ఏజ్ లిమిట్లో తప్ప! మనదేశంలో పెళ్లి చేసుకోడానికి అబ్బాయికి కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి. అమ్మాయికి 18 ఏళ్లు నిండి ఉండాలి. దీన్నిప్పుడు కొంతమంది పురుషాధిక్య ధోరణిగా, ఆడవాళ్ల పట్ల వివక్షగా చూస్తున్నారు. స్త్రీ పురుషులిద్దరూ సమానమైనప్పుడు వివాహానికి యుక్తమైన వయసు ఇద్దరికీ సమానంగానే కదా ఉండాలి అని అశ్విని ఉపాధ్యాయ్ అనే న్యాయవాది కొన్నాళ్ల క్రితం ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేశారు. దానిపై గత సోమవారం కోర్టు స్పందిస్తూ, ‘ఇదేంటో చూడండి’ అని కేంద్ర ప్రభుత్వానికి పురమాయించింది. అక్టోబర్ 30 లోపు సమాధానం రావాలని కూడా కోరింది. కోర్టులో పిల్ వేసిన అశ్విని (పురుష న్యాయవాది) ప్రధానంగా రెండు పాయింట్లు లేవనెత్తారు. ఒకటి: పెళ్లికి కనీస వయోపరిమితిగా అమ్మాయికి ఒక వయసు, అబ్బాయికి ఒక వయసు ఉండడం అశాస్త్రీయం. పురుషులదే పైచేయిగా, పైమాటగా ఉన్న కాలం స్వభావ అవశేషం అది. రెండు : ఇప్పటికే 125 దేశాలు వివాహ వయసును స్త్రీ పురుషులిద్దరికీ సమానం చేశాయి. అయినప్పటికీ మనమింకా వేర్వేరు వయసులకు పరిమితం అయ్యాం. ఇది మహిళల పట్ల వివక్షను కనబరచడమే. ‘ఈ ప్రశ్నకు బదులివ్వండి’ అబ్బాయికి ఉన్నట్లు అమ్మాయికి కనీస వివాహ అర్హత వయసు 21గా లేకపోవడం స్త్రీలపై భారతీయ సమాజం చూపిస్తున్న ఒక ఘోరమైన వివక్షకు నిదర్శనం అని, స్త్రీ, పురుషులిద్దరూ సమానమే అనే రాజ్యాంగ స్ఫూర్తిని ఈ వివక్ష భంగపరిచేలా ఉందనీ అశ్విని తన పిటిషన్లో ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది ఆగస్టు 29, 30 తేదీలలో ఢిల్లీలో బాల్య వివాహాలపై జాతీయ సదస్సు జరిగింది. సదస్సులోని అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న జాతీయ మానవ హక్కుల సంఘం మిగతా దేశాల్లో మాదిరిగానే మన దేశంలోనూ పెళ్లికి ఒకే విధమైన వయోపరిమితులను విధించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆ సంగతిని కూడా గుర్తు చేస్తూ అశ్విని తన అభిప్రాయాలను, అభ్యంతరాలను పిటిషన్లో పొందుపరిచారు. ప్రస్తుత వయోపరిమితి అన్‌సైంటిఫిక్‌గా (అశాస్త్రీయంగా), స్టీరియోటైప్‌గా (పాత మూసలో) ఉందని తప్పుపట్టారు. ఈ పిటిషన్‌ని పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డి.ఎన్.పటేల్, జస్టిస్ సి.హరి శంకర్ వచ్చే అక్టోబర్ ముప్పై లోపు ఈ ‘వివక్ష’కు బదులివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వయసులో ఏముంది? చట్టం తన పని తను చేసుకుపోతుంది. అయితే చట్టాన్ని ఏర్పాటు చేసే పని వేరొకరు చేయాలి. వాళ్లే ప్రజా ప్రతినిధులు. ప్రజల్లో ఎక్కువ మంది దేన్నైతే కోరుకుంటున్నారో, ఎక్కువ మందికి ఏదైతే ప్రయోజనకరంగా ఉంటుందో దానిపై వారు ఒక నిర్ణయం తీసుకుని, చట్ట సభల్లో అమోదం కోసం ప్రయత్నిస్తారు. చట్టాన్ని తీసుకొస్తారు. ఇప్పుడీ పెళ్లీడు ‘వివక్షను’ నిర్మూలిస్తూ ఒక చట్టం రావాలన్నా ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. దాన్నలా ఉంచితే, అసలు ఈ పిటిషన్ ఉద్దేశం సరైనదేనా అన్నది ప్రశ్న. పెళ్లి వయసును సమానం చేస్తే కలిగే ప్రయోజనం ఏమిటి? చెయ్యకపోతే జరిగే నష్టం ఏమిటనే దానిపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భార్య వయసు భర్త వయసు కన్నా కనీసం ఒకటీ రెండేళ్లయినా తక్కువగా ఉండేందుకే సమాజం మొగ్గు చూపుతుంది. అందుకు కారణాలు అందరికీ తెలిసినవే. పెద్దల్ని గౌరవించడం అనే సూత్రం దాంపత్యంలోనూ వర్తించి, కాపురంలో కలహాలు రాకుంటా ఉంటాయన్నది ఒక యాంగిల్. ‘గౌరవించడం’ అంటే తగ్గడం. భార్యే ఎందుకు తగ్గాలి? తనకన్నా వయసులో చిన్నది కనుక భర్తే తగ్గొచ్చుకదా అనేది దీనికి కౌంటర్. ‘తగ్గడం’ మంచి విషయం అయినప్పుడు ఎవరు తగ్గితే ఏమిటి? ఎవరి వయసు ఎంతుంటే ఏమిటి? ఇదొక వాదన. దంపతులు సమ వయస్కులుగా ఉన్నప్పుడు.. ‘నేనేం తక్కువ, నేనెందుకు తగ్గాలి’ అనే ఇగో వచ్చి, మనస్పర్థలు తలెత్తే ప్రమాదం ఉందని, వాటిని నివారించడానికి అమ్మాయి వయసు తక్కువగా ఉండాలని పూర్వికులు ఆలోచించి పెట్టారు అని చెప్పేవాళ్లూ ఉన్నారు. దీనికి భిన్నమైన వాదన ఎలాగూ ఉంటుంది. భార్యాభర్తలు ఒకర్నొకరు అర్థం చేసుకుంటూ నడిస్తే వయసు సమానంగా లేకుంటే మాత్రం నష్టం ఏమిటి అని. అసలిది సమస్యే కాదని, అశ్విని అనే ఆయన పనిలేక ఈ పిటిషన్ వేశార ని అంటున్నవారూ ఉన్నారు. మనదేశంలో అబ్బాయికి అమ్మాయికి కనీస వివాహార్హత వయసును నిర్ణయించడానికి కారణం బాధ్యతల్ని గుర్తెరిగే వయసని. అయితే ఎన్నేళ్లొచ్చినా బాధ్యతల్ని తెలుసుకోని భార్యాభర్తల మాటేమిటి? అది చట్టానికి సంబంధించని విషయం. మంచి కాని దాన్ని నివారించడం చట్టం బాధ్యత. బాల్య వివాహాలు మంచివి కావు. అందుకని చట్టం ఒక ఏజ్ లిమిట్ పెట్టింది. ఇప్పుడు ఆ ఏజ్‌ని సమానం చేయాలన్న విజ్ఞప్తి కోర్టు దృష్టికి వచ్చింది. దీనివల్ల ఒనగూడే ప్రత్యేక ప్రయోజం ఏదైనా ఉంటే తప్పకుండా ఇదీ ఒక చట్టం అవుతుంది. సమానత్వం కోసం చట్టమే కానీ, చట్టంతో పని లేకుండా సమానత్వాన్ని పాటించడం భార్యాభర్తల చేతుల్లో పనే. ఆచారాలలో సమానత్వం వధూవరుల వయసు సమానంగా ఉండాలన్న దానిపై వాదోపవాదాలను, భిన్నాభిప్రాయాలను పక్కన ఉంచితే, భార్యాభర్తల్లో ఎవరు ఎవరికన్నా వయసులో పెద్దవారైనా, చిన్నవారైనా.. దాంపత్య జీవితంలో వాళ్లిద్దరిదీ సమభాగస్వామ్యమే అని చెప్పే మంచి మంచి సంప్రదాయాలు, ఆచారాలు ప్రపంచ సంస్కృతులలో అనేకం ఉన్నాయి. జర్మనీలో ఒక వైపు పెళ్లి విందు జరుగుతుండగనే మరోవైపు వధూవరుల చేత అక్కడికక్కడ అందరి సమక్షంలో వారి వైవాహిక జీవితాన్ని మొదలు పెట్టించేస్తారు! ఒక పెద్ద దుంగను, రంపాన్ని తెచ్చి.. ఆ రంపంతో ఆ దుంగను వాళ్ల చేత రెండు భాగాలుగా కోయిస్తారు. కోసేటప్పడు రాలే చెక్క పొడి వాళ్ల కొత్త బట్టలపై పడుతూ ఉంటుంది. అయినా కోస్తూనే ఉండాలి. వాళ్ల దాంపత్య జీవితంలో వచ్చే మొదటి సమస్యకు సంకేతం ఆ ఆచారం. ఇకముందు ఏ సమస్యనైనా ఇద్దరూ కలిసి పనిచేస్తేనే పరిష్కారం అవుతుందని చెప్పడం అంతరార్థం. ఫిలిప్పీన్స్ పెళ్లి తంతులో దంపతులిద్దరికీ ఒకే దండ వేస్తారు. సన్నటి దారానికి విలువైన చిన్నచిన్న రాళ్లు గుచ్చి ఉండే ఆ దండను ఎనిమిది ఆకారంలో మెలితిప్పి ఒక భాగాన్ని వరుడికి, ఒక భాగాన్ని వధువుకి వేసి తీస్తారు. ‘యుగల్’ అంటారు ఆ దండను. జీవితాంతం ఒకరికొకరు కట్టుబడి ఉండండి అని చెప్పడం ఈ సంప్రదాయంలోని ప్రధాన ఉద్దేశం అయినా.. మీరిద్దరూ ఒకరికొకరు ఎక్కువగానీ, తక్కువగానీ కాదని చెప్పడం అంతర్లీన సందేశం. స్కాట్లాండ్లో వధూవరులిద్దరికీ పెళ్లికి ముందురోజు ఒళ్లంతా ఆహార పదార్థాలు పూస్తారు. కోడి ఈకలు అంటిస్తారు. తర్వాత వాళ్లను టాప్‌లెస్ వాహనంలో ఊరేగిస్తారు. ఈ పూతలు, ఈకలు భవిష్యత్తులో దంపతులపై పడబోయే నిందలకు, ఆరోపణలకు సంకేతాలు. వీటిని ఇద్దరికీ అద్దడం దేనికంటే.. ఒకరిపై వచ్చిన నిందలు, ఆరోపణలు ఇద్దరిపై వచ్చినట్లుగానే భావించి, ఒకరి తరఫున ఒకరు గట్టిగా నిలబడాలని చెప్పడం. ఆఫ్రికన్–అమెరికన్ పెళ్లిళ్లలో వధూవరుల చేత చీపురును దాటిస్తారు. గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ఆరంభించాలని చెప్పడం. అమెరికాలో బానిసత్వ దురాచారం అమల్లో ఉన్న రోజుల్లో ఆఫ్రో–అమెరికన్ పెళ్లిళ్లే ఉండేవి కాదు. రోజులు మారి, ఆ రెండు జాతుల మధ్య ప్రేమ పెళ్లిళ్లకు సమ్మతి లభించాక ఈ చీపురు ఆచారం మొదలైంది. ఆఫ్రిన్ అమ్మాయిని గానీ, అబ్బాయిని గానీ అమెరికన్ అబ్బాయి గానీ, అమ్మాయి గానీ పెళ్లి చేసుకున్నాక.. ఇక తమ జీవిత భాగస్వామి గతాన్ని ఎంత పెద్ద గొడవలోనూ ఎత్త కూడదు. గుర్తు చేయకూడదు. అలాగని ప్రమాణం చేయాలి. ఆ ప్రమాణానికి గుర్తే చీపుర్ని దాటించడం. క్రమంగా ఇది మామూలు పెళ్లిళ్లలో కూడా ఒక ఆచారంగా స్థిరపడింది. నైరుతి నైజీరియాలో యొరూబా అనే తెగ ప్రజలున్నారు. వాళ్ల పెళ్లిళ్లలో వధూవరులకు రకరకాల రుచుల పానీయాలను ఇస్తారు. వైవాహిక జీవితంలో ఉండబోయే కష్టసుఖాలను శాంపిల్‌గా చూపించడం ఇది. పానీయం తాగడానికి కాదు. ఒక చుక్క నాలుకపై వేసుకోడానికి. అలా నాలుగైదు రకాల పానీయాలను రుచి చూస్తారు. అలా చేయడమంటే.. ఏ రుచినైనా ఇద్దరం సమానంగా స్వీకరిస్తాం అని చెప్పడమే. చైనాలోని మంగోలియా ప్రాంతాల్లో పెళ్లి అయ్యీ కాగానే వధూవరులిద్దరూ ఒకే కత్తితో కోడిపిల్లను చంపి, కోడిపిల్ల దేహంలో కాలేయాన్ని వెతికి పట్టుకుంటారు. కష్టం వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి పరిష్కారం కనుక్కోవాలని ఈ ఆచారం సూచిస్తోంది. ఫ్రాన్స్‌లో ఫస్ట్‌నైట్‌కు ముందు దంపతులు తమ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఆహారాన్ని కలిసి భుజిస్తారు. అది చిన్న కేకు ముక్కే అయినా కలిసి ఒకేసారి నోట్లో పెట్టుకుంటారు. ఉన్ననాడు లేనినాడు ఒకే నోరుగా, ఒకే కడుపుగా ఉండాలని దానర్థం. యూదుల పెళ్లిళ్లలో కొత్త దంపతులు పూల పందిరి కింద ఉంటారు. ఆ సమయంలో చిన్న ఆభరణం కూడా ధరించి ఉండకూడదు. ఒక్కొక్కరూ ఆ పూల పందిరి కిందికి వచ్చి వాళ్లను ఆశీర్వదించి వెళుతుంటారు. ఆభరణాలకు ప్రాముఖ్యం లేనప్పుడు దాంపత్యమే ఒక విలువైన ఆభరణంలా భాసిస్తుందని, నిరాడంబరమైన జీవితం ప్రశాంతతనిస్తుందని చెప్పడం. ఆడంబరంగా ఉండటం తేలిక. నిరాడంబరంగా ఉండాలంటే మాత్రం ఇద్దరూ అనుకుంటేనే సాధ్యం అని అర్థం. వివక్ష అనుకోనక్కర్లేదు ఆడపిల్లల్లో ఎదుగుదల, మానసిక పరిణతి త్వరగా వచ్చేస్తుంది. మగపిల్లల్లో ఈ పరిపక్వత కాస్త ఆలస్యం అవుతుంది. దీనికి అనుగుణంగానే వధూవరుల వయస్సుల మధ్య రెండు మూడేళ్ల వ్యత్యాసం ఉంటూ వస్తోంది. సూక్ష్మంగా చూస్తే.. సమానత్వం కోసమే ఈ స్వల్ప వయోభేదం అనే విషయం అర్థమౌతుంది. దీనిని వివక్ష అనుకోనక్కర్లేదు.– డాక్టర్ అనంతలక్ష్మి, ఆధ్యాత్మికవేత్త -
కంచే చేను మేస్తే...
సుప్రీంకోర్టు తను నిర్ధా రించిన న్యాయసూత్రాలు తానే అమలు చేయాలి కదా. పనిచేసేచోట మహిళా ఉద్యోగినులపైన లైంగిక పరమైన వేధింపులు జీవన హక్కు, పనిచేసే హక్కును హరించడమే కాక పీనల్ కోడ్ నేరాలు కూడా అవుతాయని, అంతర్జాతీయ న్యాయసూత్రాలకు భంగమనీ ఈ దుష్ప్రవర్తపై ఫిర్యాదు చేయడానికి వెసులు బాట్లు, ఒక కమిటీ ఉండాలని సర్వోన్నత న్యాయ స్థానం విశాఖ వర్సెస్ రాజస్తాన్ రాష్ట్రం (1997–6 ఎస్పీసీ 241)కేసులో నిర్దేశించింది. న్యాయమూర్తిపైనే ఆరోపణను ఎవరు విచారిస్తారనే ప్రశ్నకు జవాబులేదు. న్యాయమూర్తిని దర్యాప్తు చేసే ప్రత్యామ్నాయ వ్యవస్థా లేదు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిపైన 2014లో ఒక మహిళాజడ్జిగారు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆ కేసు సుప్రీంకోర్టు దాకా వచ్చింది. పనిచేస్తున్న హైకోర్టు జడ్జిపైన ఫిర్యాదు రాగానే భారత ప్రధాన న్యాయమూర్తికి ఒక నిష్పాక్షిక అంతర్గత దర్యాప్తు విధానాన్ని నిర్ధారించి అనుసరించాలని అడిషనల్ సెషన్స్ జడ్జి ‘ఎక్స్’ వర్సెస్ మధ్యప్రదేశ్ హైకోర్ట్ (2015– 4 ఎస్సీసీ 91) కేసులో సుప్రీంకోర్టు సూచించింది. అంతర్గత దర్యాప్తు విధానం (ఇన్ హౌస్ ప్రొసీజర్) ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తి.. ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కమిటీ వేయాలి. విచారణ ప్రక్రియను, విచారణ ఫలితాన్ని పర్యవేక్షించాలి. కేసు పూర్వాపరాలను బట్టి పక్షపాతం, అభిమానం, వ్యతిరేకతల నుంచి ఫిర్యాదికి రక్షణ కల్పించే విధంగా అంతర్గత విచారణా విధానాలను మార్చుకోవచ్చునని కూడా సుప్రీంకోర్టు ఆ తీర్పులో సూత్రీకరించింది. 2013 లైంగిక వేధింపుల నిరోధ చట్టం (2013 చట్టం) సుప్రీంకోర్టు జడ్జిలకు మినహాయింపు ఇవ్వలేదు. లైంగిక నేరాల విచారణకు సుప్రీంకోర్టు రూపొందించిన (జీఎస్ ఐసీసీ) 2013 నియమావళి ప్రకారం ప్రధాన న్యాయమూర్తికే పూర్తి పర్యవేక్షణాధికారాలు ఉన్నాయి. విచారణ కమిటీ సభ్యుల ఎంపిక ఆయనేచేస్తారు, విచారణ ముగిసిన తరువాత సిఫార్సులను ఆయనకే సమర్పిస్తారు. ఆ నిర్ణయాలను తిరస్కరించడమో లేదా ఆమోదించడమో ఆయన విచక్షణకే వదిలేస్తారు. కానీ ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తిపైనే ఫిర్యాదు ఉంది. ఈ ఫిర్యాదు ఈ నియమావళి కింద ఇచ్చినది కాదు. కనుక అంతర్గత విచారణా విధానంగానీ, నియమావళి గానీ ఈ కేసులో పనిచేయకపోవచ్చు. ఏ విభాగంలోనైనా చిన్న ఉద్యోగి తనపై ఉన్నతాధికారి సాగించిన లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేస్తే పెద్దల ఆగ్రహానికి గురికావడం సహజం. కనుక ఈ ఫిర్యాదుల విచారణ కమిటీలో సభ్యురాలిగా ఉండడానికి తప్పనిసరిగా ఆ విభాగానికి చెందని, బయట మరో రంగం నుంచి ఒక నిష్పాక్షిక వ్యక్తిని, ఎంపిక చేయాలి. ఆమె లేకుండా జరిపే దర్యాప్తు చెల్లదని కూడా సుప్రీంకోర్టు వారే సెలవిచ్చారు. ఆరోపణకు గురైన అధికారి చెప్పుచేతల్లో పనిచేసే వారితో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేస్తే ఆ దర్యాప్తు చెల్లదని ఎం. రాజేంద్రన్ వర్సెస్ డైసీరానీ అండ్ అదర్స్ (2018–3 ఎంఎల్జే 84) కేసులో మద్రాస్ హైకోర్టు పేర్కొంది. బాధిత మహిళను మరిన్ని వేధింపుల నుంచి రక్షిస్తూ నిందితుడిని బదిలీచేయాలి. ఆరోపణకు గురైన వ్యక్తి న్యాయ మూర్తి అయితే, సాక్షులపై ఆయనకు అధికార పరిధి ఉన్నట్టయితే, ఆయనను ఆ పరిధి నుంచి తప్పించాలని కూడా మధ్యప్రదేశ్ జడ్జి కేసులో సుప్రీంకోర్టు వివరించింది. ఇది సుప్రీంకోర్టుకు వర్తించదా? భారత ప్రధాన న్యాయమూర్తిపై ఫిర్యాదు చేసిన మహిళ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు దర్యాప్తులో ఏప్రిల్ 26, 29 న హాజరైనారు. కమిటీ సభ్యులు వేసిన ప్రశ్నలు తనను అదరగొట్టాయన్నారు. తన ప్రకటన నమోదు చేసేటప్పుడు తనకు అండగా ఒక లాయర్నుగానీ, మిత్రుడినిగానీ అనుమతించలేదని, కమిటీ తనలో ఆందోళన బాధ కలిగిస్తున్నదని ప్రకటించారు. తనపై జరిగిన నేరానికి సాక్షులు ఉన్నారని, కానీ వారంతా సుప్రీంకోర్టు ఉద్యోగులే కనుక వారు నిర్భయంగా సాక్ష్యం చెప్పే అవకాశం లేదన్నారు. తాను మొదటిసారి హాజరైనప్పుడు మహిళా పోలీసులు తనను భయానకంగా, అవమానకరంగా సోదా జరిపారనీ, తన వాంగ్మూలాన్ని నమోదు చేసేటప్పుడు దృశ్యశ్రవణ చిత్రీకరణ కోరినా నిరాకరించారని, రికార్డు చేసిన తన వాంగ్మూ లం ప్రతి అడిగినా ఇవ్వలేదని ఆమె చెప్పారు. న్యాయమూర్తి తనతో మాట్లాడిన రెండు సెల్ నంబర్ల వాట్సాప్ కాల్ ఛాట్ వివరాలు, కాల్ రికార్డులు తెప్పిస్తే అవి కీలకమైన సాక్ష్యాలు అవుతాయని ఆమె అన్నారు. దర్యాప్తు ఎన్నాళ్లు సాగుతుందో చెప్పలేమని, దీని నివేదిక కూడా రహస్యమని జడ్జి బోబ్డే తనకు చెప్పారని ఆమె అన్నారు. ఇటువంటి దర్యాప్తులో పాల్గొనజాలనని ఆమె బయటకు వెళ్లిపోయారు. అయినా దర్యాప్తు కొనసాగుతున్నది. భారత ప్రధాన న్యాయమూర్తి కూడా హాజరై తన వాదం వినిపించారు. ఒకవేళ ప్రతికూల నివేదిక వస్తే బాధితురాలు ఏ కోర్టుకు అప్పీలుకు వెళ్లాలో? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
నిర్భయ కేసు విచారణకు సుప్రీం వేళల్లో మార్పు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ రేప్ కేసులో దోషులకు దిగువ కోర్టు ఇచ్చిన మరణ శిక్షనే ఖరారు చేయాలా, లేక మరణ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలా? అన్న అంశంపై సుప్రీం కోర్టు ఈ నెల 18వ తేదీన తీర్పు వెలువరించనుంది. ఆ రోజున సాధారణ కోర్టు ముగిసే వేళల్లో కూడా మార్పు చేశారు. సాధారణంగా సాయంత్రం నాలుగు గంటలతో కోర్టు పని వేళలు ముగుస్తాయి. నిర్భయ రేప్ కేసుకున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని సుప్రీం కోర్టు తన పని వేళలను సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు పొడిగించింది. కేసు విచారణను మరుసటి రోజుకు పొడిగించిన ఈ అదనపు వేళలే కొనసాగుతాయి. 2012, డిసెంబర్ 16వ తేదీ రాత్రి జరిగిన నిర్భయ రేప్ కేసులో మొత్తం ఆరుగురు దోషులకు శిక్షలు పడగా, అందులో మైనర్ దోషి మూడేళ్ల జువెనైల్ జైలు శిక్షను అనుభవించి విడుదలకాగా, మరో నిందితుడు ముకేష్ సోదరుడు రామ్‌సింగ్ విచారణ దశలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ముకేశ్, పవన్, వినయ్, అక్షయ్‌లకు ఢిల్లీ హైకోర్టు మరణ శిక్ష విధించింది. దోషులను దీనిపై సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకున్నారు. సుప్రీం కోర్టు జస్టిస్ దీపక్ మిశ్రా నాయకత్వంలోని ప్రత్యేక బెంచీ ఈ కేసును విచారిస్తోంది. ఈ కేసుకున్న ప్రాధాన్యత దృష్ట్యా దోషుల తరఫున వాదించేందుకు, అలాగే చట్టాల విషయంలో కోర్టుకు సహకరించేందుకు సీనియర్ న్యాయవాదులు రాజు రామచంద్రన్, సంజయ్ హెగ్డేలను కోర్టు నియమించింది. ముకేష్, పవన్‌ల తరఫున రాజు రామచంద్రన్, వినయ్, అక్షయ్‌ల తరఫున సంజయ్ హెగ్డేలు వాదిస్తారు. 26-11 పేలుళ్ల కేసులో మరణ శిక్ష పడిన అజ్మల్ కసబ్, ముంబై పేలుళ్ల కేసులో మరణ శిక్ష పడిన యూకుబ్ మీనన్‌ల తరఫున సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్ వాదించారు. నిర్భయ తల్లి ఆషాదేవి, తండ్రి భద్రీనాథ్‌ల పిటిషన్‌ను కూడా జూలై 18వ తేదీన విచారించేందుకు సుప్రీం కోర్టు అనుమతించింది. అత్యంత క్రూరంగా జరిగిన నిర్భయ రేప్ కేసు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించడం రేప్ కేసుకు సంబంధించిన భారతీయ చట్టాల్లో కూడా మార్పులు తీసుకొచ్చింది. -
న్యాయం: మీ జీవితాలను కాపాడే చట్టాలున్నాయి!
ఆస్పత్రి ముందు రోగి బంధువుల ఆందోళన... ఈ మధ్య కాలంలో ఈ వార్త ఎపుడైనా చూశారా? ఎందుకు చూడలేదు.. ప్రతిరోజు పేపర్లో అవే వార్తలు కనిపిస్తుంటే... అంటారా! ఆ గొడవలకు కారణం నిర్లక్ష్య వైద్యం అని ఆ వార్తలు చదివితే అర్థమవుతుంది కదా... కానీ ఈ నిర్లక్ష్య వైద్యానికి భారతీయ చట్టాల్లో పెద్దపెద్ద శిక్షలు ఉన్నాయనే విషయం తెలుసా? ఇలాంటి కేసులు వాదించడానికే ప్రత్యేకంగా లాయర్లు ఉంటారని తెలుసా? పాశ్చాత్యులు ఈ నిర్లక్ష్య వైద్యాలను ‘మెడికల్ యాక్సిడెంట్స్’ అంటారు. ఇండియన్లు ‘మెడికల్ మాల్‌ప్రాక్టీస్’ అంటారు. పేర్లు వేరే గాని అర్థం మాత్రం ఒక్కటే. నిర్లక్ష్య వైద్యంతో రోగుల ప్రాణాల మీదికి తేవడం. ఇలాంటి కేసులంటే విదేశాల్లో వైద్యులు చాలా భయపడతారు. ప్రజాచైతన్యం ఎక్కువగా వున్న ఆ దేశాల్లో డాక్టర్లు నిర్లక్ష్యంగా వైద్యం చేస్తే జీవితాంతం సంపాదించిన సొమ్మంతా కలిపినానష్టపరిహారం కట్టలేని పరిస్థితి. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు గానీ, పొరపాటు గానీ జరగకూడదు, చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పడం ఆ చట్టాల ఉద్దేశం. అవే చట్టాలు ఇండియాలోనూ ఉన్నాయి. కానీ వాటి గురించి చైతన్యమే ప్రజల్లో లేదు. వెద్య నిర్లక్ష్యం (మెడికల్ మాల్‌ప్రాక్టీస్) అత్యంత తీవ్రమైన నేరమనీ, శిక్షించడానికి భారతీయ చట్టంలో పలు సెక్షన్లు ఉన్నాయనీ చాలా తక్కువ మందికి తెలుసు. మన దగ్గర చాలా మంది గొడవ పడి తమ కర్మ అనుకుని ఊరుకుండిపోతారు. కానీ, నష్టపోయిన ప్రతి రోగి లేదా రోగి బంధువు వైద్యుడి తప్పు కనుక ఉంటే నూటికి నూరు శాతం నష్టపరిహారం పొందే అవకాశాలు ఉన్నాయి. ఆస్పత్రులకు వెళ్లే వ్యక్తుల్లో అత్యధికులు తాము వెళ్తున్న ఆస్పత్రి చాలా మంచిదనీ, తాము ఎంచుకున్న వైద్యుడు చాలా మంచివాడనీ నమ్ముతారు. ఎందుకంటే... నమ్మకుండా ఏ రోగీ ఏ డాక్టరు దగ్గరికీ వెళ్లడు. అంటే రోగులకు ఆస్పత్రే దేవాలయం. మరి ఆ దేవాలయంలోని దేవుళ్లు వరాలిచ్చేవారేనా, శపించేవారు కూడా ఉంటారా అన్నది బయటకు వస్తే గాని తెలియదు. టీచరు తప్పు చేస్తే ఆలస్యంగా సమాజం పాడవుతుంది. వైద్యుడు తప్పు చేస్తే వెంటనే ఆరోగ్యం పాడవుతుంది. అందుకే భారతీయ చట్టాలు వైద్యుల తప్పులను అస్సలు క్షమించకూడదని నిర్ణయించాయి. దురదృష్టవశాత్తూ ఇండియాలో నిన్నమొన్న వచ్చిన గృహ హింస చట్టానికి ఉన్నంత ప్రచారం దశాబ్దాల నుంచి ఉన్న ఈ వైద్య చట్టానికి లేదు. వైద్యుడు వీలయితే చూసే రోగుల సంఖ్య తగ్గించాలి గాని ఏ ఒక్క రోగినీ విసుక్కోకూడదు, తొందర పెట్టకూడదు, సరైన సమాచారం రోగి నుంచి రాబట్టకుండా వైద్యం చేయకూడదు. కార్పొరేట్ ఆస్పత్రులు కళ్లు బైర్లు కమ్మే బిల్డింగులు కట్టడంలోనూ, హౌస్‌కీపింగ్‌లోనూ పెట్టిన శ్రద్ధ రోగుల ప్రాణాల మీద పెట్టడం లేదన్న ఆరోపణ ఉంది. అది నిజం అయినా, కాకున్నా రోగికి చట్టం ఎన్నో సంరక్షణలు, హక్కులు ఇచ్చింది. వారికి ఆస్పత్రిలో మంచి మర్యాద దక్కాలి. మంచి వైద్యం అందాలి. కానీ నిజంగా అలా ఎక్కడైనా జరుగుతోందా? ఒక చిన్న ఉదాహరణ... ఏ ఆస్పత్రికి వెళ్లినా చికిత్సకు ముందు అన్ని టెస్టులు తీస్తారు. అంతకు కొద్దిరోజుల ముందు వేరే చోట చేయించుకుని ఉన్నా, ఆ రిపోర్టులు చూపినా వాటిని పక్కన పడేసి మళ్లీ టెస్టులు చేయిస్తారు. ఇది మన చట్టాల ప్రకారం నేరం. నిర్దేశిత సమయంలో (కొద్దిరోజులు, వారాల ముందు) వేరే చోట చేయించుకున్న టెస్టుల ఆధారంగానే ఏ ఆస్పత్రి అయినా చికిత్స చేయాలి. అవే టెస్టులు మళ్లీ చేసి రోగిని ఇబ్బంది పెట్టకూడదు. అయినా దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. నిజంగా రోగి తన హక్కులన్నీ వాడుకుంటే వైద్యానికయ్యే ఖర్చును కనీసం ఇరవై శాతం తగ్గించుకోవచ్చు. ఇక మరోకోణం. వైద్యుడి నిర్లక్ష్యం వల్ల మనకేమైనా నష్టం జరిగినా Indian Penal Code, 1860 sections 52, 80, 81, 83, 88, 90, 91, 92 304అ, 337, 338 సెక్షన్ల కింద న్యాయం పొందొచ్చు. మీకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే ‘మెడికల్ మాల్‌ప్రాక్టీస్ ఇన్ ఇండియా’ అని వెతికితే దీనికి సంబంధించిన బోలెడు సమాచారం, ఫోరమ్స్, మీకు అండగా నిలిచే సంఘాలు, సంస్థలు, వైద్యులు, లాయర్లు దొరుకుతారు. ఇటీవల కొందరు ఫేస్బుక్లో ప్రజా చైతన్యం కల్పించడానికి ‘ఎక్స్పోజ్ మెడికల్ మాల్‌ప్రాక్టీస్ ఇన్ ఇండియా’ అని ఒక పేజీ కూడా పెట్టారు. దాన్ని ఫాలో అయితే అప్డేట్ అవుతూ ఉండొచ్చు. ఇంకా ఇలాంటి చైతన్య వేదికలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. టెక్నాలజీ ఇంతగా అందుబాటులోకి వచ్చాక కూడా మనం నష్టపోయి అనాథలా మారాల్సిన పని లేదు.