ఒక వైపు పెళ్లి విందు..మరోవైపు వైవాహిక జీవితం మొదలు | Different Wedding Stories in World And Right Age Marriage | Sakshi
Sakshi News home page

పెళ్లీడు పోరాటం

Published Fri, Aug 23 2019 8:15 AM | Last Updated on Fri, Aug 23 2019 9:10 AM

Different Wedding Stories in World And Right Age Marriage - Sakshi

స్త్రీ పురుష సమానత్వం కోసం చరిత్రలో ఎన్నో పోరాటాలు జరిగాయి. వర్తమానంలోనూ జరుగుతున్నాయి. అవకాశాల్లో సమానత్వం. వసతులలో సమానత్వం. వేతనాలలో సమానత్వం. ఇప్పుడు పెళ్లీడులో సమానత్వం కోసం న్యాయపోరాటం మొదలైంది! పెళ్లి వయసు 21–18గా ఉంటే నష్టం ఏమిటి? 21–21 ఉంటే వచ్చే లాభం ఏమిటి?

‘యుక్తవయసు’ అంటే పెళ్లీడు అనుకుంటాం. కానీ కాదు! అది యుక్తమైన వయసు. అనువైన వయసు. అర్హమైన వయసు. ఇంగ్లిష్‌లో ‘రైట్‌ ఏజ్‌’ అంటారు. తగిన వయసు అని. జీవితంలో ప్రతి దానికీ యుక్త(మైన) వయసు ఒకటి ఉంటుంది. చదువు ప్రారంభించడానికి. చదువు పూర్తి చేయడానికి. ఉద్యోగాల వేటకు, వివాహానికి.

చట్ట ప్రకారం కూడా కొన్నింటికి యుక్తమైన వయసులు ఉన్నాయి. ఓటు హక్కుకు యుక్త వయసు. మైనారిటీ తీరడానికి యుక్తవయసు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అవడానికి యుక్త వయసు. ఈ కనీస యుక్త వయసుల విషయంలో భారత చట్టాలు స్త్రీ, పురుషులిద్దర్నీ సమానంగా చూశాయి.. ఒక్క మేరేజ్‌ ఏజ్‌ లిమిట్‌లో తప్ప! మనదేశంలో పెళ్లి చేసుకోడానికి అబ్బాయికి కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి. అమ్మాయికి 18 ఏళ్లు నిండి ఉండాలి. దీన్నిప్పుడు కొంతమంది పురుషాధిక్య ధోరణిగా, ఆడవాళ్ల పట్ల వివక్షగా చూస్తున్నారు. స్త్రీ పురుషులిద్దరూ సమానమైనప్పుడు వివాహానికి యుక్తమైన వయసు ఇద్దరికీ సమానంగానే కదా ఉండాలి అని అశ్విని ఉపాధ్యాయ్‌ అనే న్యాయవాది కొన్నాళ్ల క్రితం ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) వేశారు. దానిపై గత సోమవారం కోర్టు స్పందిస్తూ, ‘ఇదేంటో చూడండి’ అని కేంద్ర ప్రభుత్వానికి పురమాయించింది. అక్టోబర్‌ 30 లోపు సమాధానం రావాలని కూడా కోరింది.

కోర్టులో పిల్‌ వేసిన అశ్విని (పురుష న్యాయవాది) ప్రధానంగా రెండు పాయింట్‌లు లేవనెత్తారు. ఒకటి: పెళ్లికి కనీస వయోపరిమితిగా అమ్మాయికి ఒక వయసు, అబ్బాయికి ఒక వయసు ఉండడం అశాస్త్రీయం. పురుషులదే పైచేయిగా, పైమాటగా ఉన్న కాలం స్వభావ అవశేషం అది.  రెండు : ఇప్పటికే 125 దేశాలు వివాహ వయసును స్త్రీ పురుషులిద్దరికీ సమానం చేశాయి. అయినప్పటికీ మనమింకా వేర్వేరు వయసులకు పరిమితం అయ్యాం. ఇది మహిళల పట్ల వివక్షను కనబరచడమే. 

‘ఈ ప్రశ్నకు బదులివ్వండి’
అబ్బాయికి ఉన్నట్లు అమ్మాయికి కనీస వివాహ అర్హత వయసు 21గా లేకపోవడం స్త్రీలపై భారతీయ సమాజం చూపిస్తున్న ఒక ఘోరమైన వివక్షకు నిదర్శనం అని, స్త్రీ, పురుషులిద్దరూ సమానమే అనే రాజ్యాంగ స్ఫూర్తిని ఈ వివక్ష భంగపరిచేలా ఉందనీ అశ్విని తన పిటిషన్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది ఆగస్టు 29, 30 తేదీలలో ఢిల్లీలో బాల్య వివాహాలపై జాతీయ సదస్సు జరిగింది. సదస్సులోని అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న జాతీయ మానవ హక్కుల సంఘం మిగతా దేశాల్లో మాదిరిగానే మన దేశంలోనూ పెళ్లికి ఒకే విధమైన వయోపరిమితులను విధించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆ సంగతిని కూడా గుర్తు చేస్తూ అశ్విని తన అభిప్రాయాలను, అభ్యంతరాలను పిటిషన్‌లో పొందుపరిచారు. ప్రస్తుత వయోపరిమితి అన్‌సైంటిఫిక్‌గా (అశాస్త్రీయంగా), స్టీరియోటైప్‌గా (పాత మూసలో) ఉందని తప్పుపట్టారు. ఈ పిటిషన్‌ని పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ డి.ఎన్‌.పటేల్, జస్టిస్‌ సి.హరి శంకర్‌ వచ్చే అక్టోబర్‌ ముప్పై లోపు ఈ ‘వివక్ష’కు బదులివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

వయసులో ఏముంది?
చట్టం తన పని తను చేసుకుపోతుంది. అయితే చట్టాన్ని ఏర్పాటు చేసే పని వేరొకరు చేయాలి. వాళ్లే ప్రజా ప్రతినిధులు. ప్రజల్లో ఎక్కువ మంది దేన్నైతే కోరుకుంటున్నారో, ఎక్కువ మందికి ఏదైతే ప్రయోజనకరంగా ఉంటుందో దానిపై వారు ఒక నిర్ణయం తీసుకుని, చట్ట సభల్లో అమోదం కోసం ప్రయత్నిస్తారు. చట్టాన్ని తీసుకొస్తారు. ఇప్పుడీ పెళ్లీడు ‘వివక్షను’ నిర్మూలిస్తూ ఒక చట్టం రావాలన్నా ఈ ప్రాసెస్‌ అంతా ఉంటుంది. దాన్నలా ఉంచితే, అసలు ఈ పిటిషన్‌ ఉద్దేశం సరైనదేనా అన్నది ప్రశ్న.  పెళ్లి వయసును సమానం చేస్తే కలిగే ప్రయోజనం ఏమిటి? చెయ్యకపోతే జరిగే నష్టం ఏమిటనే దానిపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భార్య వయసు భర్త వయసు కన్నా కనీసం ఒకటీ రెండేళ్లయినా తక్కువగా ఉండేందుకే సమాజం మొగ్గు చూపుతుంది. అందుకు కారణాలు అందరికీ తెలిసినవే. పెద్దల్ని గౌరవించడం అనే సూత్రం దాంపత్యంలోనూ వర్తించి, కాపురంలో కలహాలు రాకుంటా ఉంటాయన్నది ఒక యాంగిల్‌. ‘గౌరవించడం’ అంటే తగ్గడం. భార్యే ఎందుకు తగ్గాలి? తనకన్నా వయసులో చిన్నది కనుక భర్తే తగ్గొచ్చుకదా అనేది దీనికి కౌంటర్‌. ‘తగ్గడం’ మంచి విషయం అయినప్పుడు ఎవరు తగ్గితే ఏమిటి? ఎవరి వయసు ఎంతుంటే ఏమిటి? ఇదొక వాదన.

దంపతులు సమ వయస్కులుగా ఉన్నప్పుడు.. ‘నేనేం తక్కువ, నేనెందుకు తగ్గాలి’ అనే ఇగో వచ్చి, మనస్పర్థలు తలెత్తే ప్రమాదం ఉందని, వాటిని నివారించడానికి అమ్మాయి వయసు తక్కువగా ఉండాలని పూర్వికులు ఆలోచించి పెట్టారు అని చెప్పేవాళ్లూ ఉన్నారు. దీనికి భిన్నమైన వాదన ఎలాగూ ఉంటుంది. భార్యాభర్తలు ఒకర్నొకరు అర్థం చేసుకుంటూ నడిస్తే వయసు సమానంగా లేకుంటే మాత్రం నష్టం ఏమిటి అని. అసలిది సమస్యే కాదని, అశ్విని అనే ఆయన పనిలేక ఈ పిటిషన్‌ వేశార ని అంటున్నవారూ ఉన్నారు. మనదేశంలో అబ్బాయికి అమ్మాయికి కనీస వివాహార్హత వయసును నిర్ణయించడానికి కారణం బాధ్యతల్ని గుర్తెరిగే వయసని. అయితే ఎన్నేళ్లొచ్చినా బాధ్యతల్ని తెలుసుకోని భార్యాభర్తల మాటేమిటి? అది చట్టానికి సంబంధించని విషయం. మంచి కాని దాన్ని నివారించడం చట్టం బాధ్యత. బాల్య వివాహాలు మంచివి కావు. అందుకని చట్టం ఒక ఏజ్‌ లిమిట్‌ పెట్టింది. ఇప్పుడు ఆ ఏజ్‌ని సమానం చేయాలన్న విజ్ఞప్తి కోర్టు దృష్టికి వచ్చింది. దీనివల్ల ఒనగూడే ప్రత్యేక ప్రయోజం ఏదైనా ఉంటే తప్పకుండా ఇదీ ఒక చట్టం అవుతుంది. సమానత్వం కోసం చట్టమే కానీ, చట్టంతో పని లేకుండా సమానత్వాన్ని పాటించడం భార్యాభర్తల చేతుల్లో పనే.

ఆచారాలలో సమానత్వం
వధూవరుల వయసు సమానంగా ఉండాలన్న దానిపై వాదోపవాదాలను, భిన్నాభిప్రాయాలను పక్కన ఉంచితే, భార్యాభర్తల్లో ఎవరు ఎవరికన్నా వయసులో పెద్దవారైనా, చిన్నవారైనా.. దాంపత్య జీవితంలో వాళ్లిద్దరిదీ సమభాగస్వామ్యమే అని చెప్పే మంచి మంచి సంప్రదాయాలు, ఆచారాలు ప్రపంచ సంస్కృతులలో అనేకం ఉన్నాయి. జర్మనీలో ఒక వైపు పెళ్లి విందు జరుగుతుండగనే మరోవైపు వధూవరుల చేత అక్కడికక్కడ అందరి సమక్షంలో వారి వైవాహిక జీవితాన్ని మొదలు పెట్టించేస్తారు! ఒక పెద్ద దుంగను, రంపాన్ని తెచ్చి..  ఆ రంపంతో ఆ దుంగను వాళ్ల చేత రెండు భాగాలుగా కోయిస్తారు. కోసేటప్పడు రాలే చెక్క పొడి వాళ్ల కొత్త బట్టలపై పడుతూ ఉంటుంది. అయినా కోస్తూనే ఉండాలి. వాళ్ల దాంపత్య జీవితంలో వచ్చే మొదటి సమస్యకు సంకేతం ఆ ఆచారం. ఇకముందు ఏ సమస్యనైనా ఇద్దరూ కలిసి పనిచేస్తేనే పరిష్కారం అవుతుందని చెప్పడం అంతరార్థం.

ఫిలిప్పీన్స్‌ పెళ్లి తంతులో దంపతులిద్దరికీ ఒకే దండ వేస్తారు. సన్నటి దారానికి విలువైన చిన్నచిన్న రాళ్లు గుచ్చి ఉండే ఆ దండను ఎనిమిది ఆకారంలో మెలితిప్పి ఒక భాగాన్ని వరుడికి, ఒక భాగాన్ని వధువుకి వేసి తీస్తారు. ‘యుగల్‌’ అంటారు ఆ దండను. జీవితాంతం ఒకరికొకరు కట్టుబడి ఉండండి అని చెప్పడం ఈ సంప్రదాయంలోని ప్రధాన ఉద్దేశం అయినా.. మీరిద్దరూ ఒకరికొకరు ఎక్కువగానీ, తక్కువగానీ కాదని చెప్పడం అంతర్లీన సందేశం.

స్కాట్లాండ్‌లో వధూవరులిద్దరికీ పెళ్లికి ముందురోజు ఒళ్లంతా ఆహార పదార్థాలు పూస్తారు. కోడి ఈకలు అంటిస్తారు. తర్వాత వాళ్లను టాప్‌లెస్‌ వాహనంలో ఊరేగిస్తారు. ఈ పూతలు, ఈకలు భవిష్యత్తులో దంపతులపై పడబోయే నిందలకు, ఆరోపణలకు సంకేతాలు. వీటిని ఇద్దరికీ అద్దడం దేనికంటే.. ఒకరిపై వచ్చిన నిందలు, ఆరోపణలు ఇద్దరిపై వచ్చినట్లుగానే భావించి, ఒకరి తరఫున ఒకరు గట్టిగా నిలబడాలని చెప్పడం.

ఆఫ్రికన్‌–అమెరికన్‌ పెళ్లిళ్లలో వధూవరుల చేత చీపురును దాటిస్తారు. గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ఆరంభించాలని చెప్పడం. అమెరికాలో బానిసత్వ దురాచారం అమల్లో ఉన్న రోజుల్లో ఆఫ్రో–అమెరికన్‌ పెళ్లిళ్లే ఉండేవి కాదు. రోజులు మారి, ఆ రెండు జాతుల మధ్య ప్రేమ పెళ్లిళ్లకు సమ్మతి లభించాక ఈ చీపురు ఆచారం మొదలైంది. ఆఫ్రిన్‌ అమ్మాయిని గానీ, అబ్బాయిని గానీ అమెరికన్‌ అబ్బాయి గానీ, అమ్మాయి గానీ పెళ్లి చేసుకున్నాక.. ఇక తమ జీవిత భాగస్వామి గతాన్ని ఎంత పెద్ద గొడవలోనూ ఎత్త కూడదు. గుర్తు చేయకూడదు. అలాగని ప్రమాణం చేయాలి. ఆ ప్రమాణానికి గుర్తే చీపుర్ని దాటించడం. క్రమంగా ఇది మామూలు పెళ్లిళ్లలో కూడా ఒక ఆచారంగా స్థిరపడింది.

నైరుతి నైజీరియాలో యొరూబా అనే తెగ ప్రజలున్నారు. వాళ్ల పెళ్లిళ్లలో వధూవరులకు రకరకాల రుచుల పానీయాలను ఇస్తారు. వైవాహిక జీవితంలో ఉండబోయే కష్టసుఖాలను శాంపిల్‌గా చూపించడం ఇది. పానీయం తాగడానికి కాదు. ఒక చుక్క నాలుకపై వేసుకోడానికి. అలా నాలుగైదు రకాల పానీయాలను రుచి చూస్తారు. అలా చేయడమంటే.. ఏ రుచినైనా ఇద్దరం సమానంగా స్వీకరిస్తాం అని చెప్పడమే.
చైనాలోని మంగోలియా ప్రాంతాల్లో పెళ్లి అయ్యీ కాగానే వధూవరులిద్దరూ ఒకే కత్తితో కోడిపిల్లను చంపి, కోడిపిల్ల దేహంలో కాలేయాన్ని వెతికి పట్టుకుంటారు. కష్టం వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి పరిష్కారం కనుక్కోవాలని ఈ ఆచారం సూచిస్తోంది. ఫ్రాన్స్‌లో ఫస్ట్‌నైట్‌కు ముందు దంపతులు తమ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఆహారాన్ని కలిసి భుజిస్తారు. అది చిన్న కేకు ముక్కే అయినా కలిసి ఒకేసారి నోట్లో పెట్టుకుంటారు. ఉన్ననాడు లేనినాడు ఒకే నోరుగా, ఒకే కడుపుగా ఉండాలని దానర్థం. యూదుల పెళ్లిళ్లలో కొత్త దంపతులు పూల పందిరి కింద ఉంటారు. ఆ సమయంలో చిన్న ఆభరణం కూడా ధరించి ఉండకూడదు. ఒక్కొక్కరూ ఆ పూల పందిరి కిందికి వచ్చి వాళ్లను ఆశీర్వదించి వెళుతుంటారు. ఆభరణాలకు ప్రాముఖ్యం లేనప్పుడు దాంపత్యమే ఒక విలువైన ఆభరణంలా భాసిస్తుందని, నిరాడంబరమైన జీవితం ప్రశాంతతనిస్తుందని చెప్పడం. ఆడంబరంగా ఉండటం తేలిక. నిరాడంబరంగా ఉండాలంటే మాత్రం ఇద్దరూ అనుకుంటేనే సాధ్యం అని అర్థం.

వివక్ష అనుకోనక్కర్లేదు
ఆడపిల్లల్లో ఎదుగుదల, మానసిక పరిణతి త్వరగా వచ్చేస్తుంది. మగపిల్లల్లో ఈ పరిపక్వత కాస్త ఆలస్యం అవుతుంది. దీనికి అనుగుణంగానే వధూవరుల వయస్సుల మధ్య రెండు మూడేళ్ల వ్యత్యాసం ఉంటూ వస్తోంది. సూక్ష్మంగా చూస్తే.. సమానత్వం కోసమే ఈ స్వల్ప వయోభేదం అనే విషయం అర్థమౌతుంది. దీనిని వివక్ష అనుకోనక్కర్లేదు.– డాక్టర్‌ అనంతలక్ష్మి, ఆధ్యాత్మికవేత్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement