నిర్భయ కేసు విచారణకు సుప్రీం వేళల్లో మార్పు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ రేప్ కేసులో దోషులకు దిగువ కోర్టు ఇచ్చిన మరణ శిక్షనే ఖరారు చేయాలా, లేక మరణ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలా? అన్న అంశంపై సుప్రీం కోర్టు ఈ నెల 18వ తేదీన తీర్పు వెలువరించనుంది. ఆ రోజున సాధారణ కోర్టు ముగిసే వేళల్లో కూడా మార్పు చేశారు. సాధారణంగా సాయంత్రం నాలుగు గంటలతో కోర్టు పని వేళలు ముగుస్తాయి. నిర్భయ రేప్ కేసుకున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని సుప్రీం కోర్టు తన పని వేళలను సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు పొడిగించింది. కేసు విచారణను మరుసటి రోజుకు పొడిగించిన ఈ అదనపు వేళలే కొనసాగుతాయి.
2012, డిసెంబర్ 16వ తేదీ రాత్రి జరిగిన నిర్భయ రేప్ కేసులో మొత్తం ఆరుగురు దోషులకు శిక్షలు పడగా, అందులో మైనర్ దోషి మూడేళ్ల జువెనైల్ జైలు శిక్షను అనుభవించి విడుదలకాగా, మరో నిందితుడు ముకేష్ సోదరుడు రామ్‌సింగ్ విచారణ దశలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ముకేశ్, పవన్, వినయ్, అక్షయ్‌లకు ఢిల్లీ హైకోర్టు మరణ శిక్ష విధించింది. దోషులను దీనిపై సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకున్నారు. సుప్రీం కోర్టు జస్టిస్ దీపక్ మిశ్రా నాయకత్వంలోని ప్రత్యేక బెంచీ ఈ కేసును విచారిస్తోంది.
ఈ కేసుకున్న ప్రాధాన్యత దృష్ట్యా దోషుల తరఫున వాదించేందుకు, అలాగే చట్టాల విషయంలో కోర్టుకు సహకరించేందుకు సీనియర్ న్యాయవాదులు రాజు రామచంద్రన్, సంజయ్ హెగ్డేలను కోర్టు నియమించింది. ముకేష్, పవన్‌ల తరఫున రాజు రామచంద్రన్, వినయ్, అక్షయ్‌ల తరఫున సంజయ్ హెగ్డేలు వాదిస్తారు. 26-11 పేలుళ్ల కేసులో మరణ శిక్ష పడిన అజ్మల్ కసబ్, ముంబై పేలుళ్ల కేసులో మరణ శిక్ష పడిన యూకుబ్ మీనన్‌ల తరఫున సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్ వాదించారు.
నిర్భయ తల్లి ఆషాదేవి, తండ్రి భద్రీనాథ్‌ల పిటిషన్‌ను కూడా జూలై 18వ తేదీన విచారించేందుకు సుప్రీం కోర్టు అనుమతించింది. అత్యంత క్రూరంగా జరిగిన నిర్భయ రేప్ కేసు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించడం రేప్ కేసుకు సంబంధించిన భారతీయ చట్టాల్లో కూడా మార్పులు తీసుకొచ్చింది.