న్యాయం: మీ జీవితాలను కాపాడే చట్టాలున్నాయి! | Laws only can be saved your life | Sakshi
Sakshi News home page

న్యాయం: మీ జీవితాలను కాపాడే చట్టాలున్నాయి!

Published Sun, Jun 29 2014 1:33 AM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

న్యాయం: మీ జీవితాలను కాపాడే చట్టాలున్నాయి! - Sakshi

న్యాయం: మీ జీవితాలను కాపాడే చట్టాలున్నాయి!

ఆస్పత్రి ముందు రోగి బంధువుల ఆందోళన... ఈ మధ్య కాలంలో ఈ వార్త ఎపుడైనా చూశారా? ఎందుకు చూడలేదు.. ప్రతిరోజు పేపర్లో అవే వార్తలు కనిపిస్తుంటే... అంటారా! ఆ గొడవలకు కారణం నిర్లక్ష్య వైద్యం అని ఆ వార్తలు చదివితే అర్థమవుతుంది కదా... కానీ ఈ నిర్లక్ష్య వైద్యానికి భారతీయ చట్టాల్లో పెద్దపెద్ద శిక్షలు ఉన్నాయనే విషయం తెలుసా? ఇలాంటి కేసులు వాదించడానికే ప్రత్యేకంగా లాయర్లు ఉంటారని తెలుసా?
 
 పాశ్చాత్యులు ఈ నిర్లక్ష్య వైద్యాలను ‘మెడికల్ యాక్సిడెంట్స్’ అంటారు. ఇండియన్లు ‘మెడికల్ మాల్‌ప్రాక్టీస్’ అంటారు. పేర్లు వేరే గాని అర్థం మాత్రం ఒక్కటే. నిర్లక్ష్య వైద్యంతో రోగుల ప్రాణాల మీదికి తేవడం. ఇలాంటి కేసులంటే విదేశాల్లో వైద్యులు చాలా భయపడతారు. ప్రజాచైతన్యం ఎక్కువగా వున్న ఆ దేశాల్లో డాక్టర్లు నిర్లక్ష్యంగా వైద్యం చేస్తే జీవితాంతం సంపాదించిన సొమ్మంతా కలిపినానష్టపరిహారం కట్టలేని పరిస్థితి. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు గానీ, పొరపాటు గానీ జరగకూడదు, చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పడం ఆ చట్టాల ఉద్దేశం.
 
  అవే చట్టాలు ఇండియాలోనూ ఉన్నాయి. కానీ వాటి గురించి చైతన్యమే ప్రజల్లో లేదు. వెద్య నిర్లక్ష్యం (మెడికల్ మాల్‌ప్రాక్టీస్) అత్యంత తీవ్రమైన నేరమనీ, శిక్షించడానికి భారతీయ చట్టంలో పలు సెక్షన్లు ఉన్నాయనీ చాలా తక్కువ మందికి తెలుసు. మన దగ్గర చాలా మంది గొడవ పడి తమ కర్మ అనుకుని ఊరుకుండిపోతారు. కానీ, నష్టపోయిన ప్రతి రోగి లేదా రోగి బంధువు వైద్యుడి తప్పు కనుక ఉంటే నూటికి నూరు శాతం నష్టపరిహారం పొందే అవకాశాలు ఉన్నాయి. ఆస్పత్రులకు వెళ్లే వ్యక్తుల్లో అత్యధికులు తాము వెళ్తున్న ఆస్పత్రి చాలా మంచిదనీ, తాము ఎంచుకున్న వైద్యుడు చాలా మంచివాడనీ నమ్ముతారు. ఎందుకంటే... నమ్మకుండా ఏ రోగీ ఏ డాక్టరు దగ్గరికీ వెళ్లడు.  అంటే రోగులకు ఆస్పత్రే దేవాలయం. మరి ఆ దేవాలయంలోని దేవుళ్లు వరాలిచ్చేవారేనా, శపించేవారు కూడా ఉంటారా అన్నది బయటకు వస్తే గాని తెలియదు.
 
 టీచరు తప్పు చేస్తే ఆలస్యంగా సమాజం పాడవుతుంది. వైద్యుడు తప్పు చేస్తే వెంటనే ఆరోగ్యం పాడవుతుంది. అందుకే భారతీయ చట్టాలు వైద్యుల తప్పులను అస్సలు క్షమించకూడదని నిర్ణయించాయి. దురదృష్టవశాత్తూ ఇండియాలో నిన్నమొన్న వచ్చిన గృహ హింస చట్టానికి ఉన్నంత ప్రచారం దశాబ్దాల నుంచి ఉన్న ఈ వైద్య చట్టానికి లేదు. వైద్యుడు వీలయితే చూసే రోగుల సంఖ్య తగ్గించాలి గాని ఏ ఒక్క రోగినీ విసుక్కోకూడదు, తొందర పెట్టకూడదు, సరైన సమాచారం రోగి నుంచి రాబట్టకుండా వైద్యం చేయకూడదు. కార్పొరేట్ ఆస్పత్రులు కళ్లు బైర్లు కమ్మే బిల్డింగులు కట్టడంలోనూ, హౌస్‌కీపింగ్‌లోనూ పెట్టిన శ్రద్ధ రోగుల ప్రాణాల మీద పెట్టడం లేదన్న ఆరోపణ ఉంది.  అది నిజం అయినా, కాకున్నా రోగికి చట్టం ఎన్నో సంరక్షణలు, హక్కులు ఇచ్చింది. వారికి ఆస్పత్రిలో మంచి మర్యాద దక్కాలి. మంచి వైద్యం అందాలి.
 
 కానీ నిజంగా అలా ఎక్కడైనా జరుగుతోందా? ఒక చిన్న ఉదాహరణ... ఏ ఆస్పత్రికి వెళ్లినా చికిత్సకు ముందు అన్ని టెస్టులు తీస్తారు. అంతకు కొద్దిరోజుల ముందు వేరే చోట చేయించుకుని ఉన్నా, ఆ రిపోర్టులు చూపినా వాటిని పక్కన పడేసి మళ్లీ టెస్టులు చేయిస్తారు. ఇది మన చట్టాల ప్రకారం నేరం.  నిర్దేశిత సమయంలో (కొద్దిరోజులు, వారాల ముందు) వేరే చోట చేయించుకున్న టెస్టుల ఆధారంగానే ఏ ఆస్పత్రి అయినా చికిత్స చేయాలి. అవే టెస్టులు మళ్లీ చేసి రోగిని ఇబ్బంది పెట్టకూడదు. అయినా దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. నిజంగా రోగి తన హక్కులన్నీ వాడుకుంటే వైద్యానికయ్యే ఖర్చును కనీసం ఇరవై శాతం తగ్గించుకోవచ్చు.  
 
 ఇక మరోకోణం. వైద్యుడి నిర్లక్ష్యం వల్ల మనకేమైనా నష్టం జరిగినా Indian Penal Code, 1860 sections 52, 80, 81, 83, 88, 90, 91, 92 304అ, 337, 338  సెక్షన్ల కింద న్యాయం పొందొచ్చు. మీకు ఇంటర్‌నెట్ అందుబాటులో ఉంటే ‘మెడికల్ మాల్‌ప్రాక్టీస్ ఇన్ ఇండియా’ అని వెతికితే దీనికి సంబంధించిన బోలెడు సమాచారం, ఫోరమ్స్, మీకు అండగా నిలిచే సంఘాలు, సంస్థలు, వైద్యులు, లాయర్లు దొరుకుతారు. ఇటీవల కొందరు ఫేస్‌బుక్‌లో ప్రజా చైతన్యం కల్పించడానికి ‘ఎక్స్‌పోజ్ మెడికల్ మాల్‌ప్రాక్టీస్ ఇన్ ఇండియా’ అని ఒక పేజీ కూడా పెట్టారు. దాన్ని ఫాలో అయితే అప్‌డేట్ అవుతూ ఉండొచ్చు. ఇంకా ఇలాంటి చైతన్య వేదికలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. టెక్నాలజీ ఇంతగా అందుబాటులోకి వచ్చాక కూడా మనం నష్టపోయి అనాథలా మారాల్సిన పని లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement