స్వాతంత్య్ర దినోత్సవం దేశ ఔన్నత్యాన్ని మాట్లాడుతుంది. దేశ ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తుంది. కాని దేశంలో సగమైన స్త్రీలు సంపూర్ణ స్వాతంత్య్ర ఫలాలు ఇంకా పొందవలసే వుంది.
ఏనాడైతే స్త్రీల పట్ల సురక్షితమైన, సంస్కారవంతమైన ప్రవర్తనను ఈ సమాజం చూపుతుందో అప్పుడే స్త్రీలకు సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చినట్టు. అప్పుడే దేశ ఔన్నత్యం ఇనుమడించినట్టు. ‘ఆకాశంలో సగం’లాగా దేశంలో సగం ఇంకెప్పుడు?
నేడు ఆగస్టు 15న ఎర్రకోట మీద జెండా ఎగుర వేసే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీకి ఇద్దరు మహిళా ఆర్మీ ఆఫీసర్లు సహకారం అందిస్తారు. మేజర్ నికితా నాయర్, మేజర్ జాస్మిన్ కౌర్ పతాకావిష్కరణ సమయంలో ప్రధానితో పాటుగా ఉండి జెండా వందనం సమర్పిస్తారు. ఈ విశేష ఘట్టంలో ఇద్దరు మహిళలకు ఈ విధంగా చోటు దక్కడం సంతోషపడాల్సిన సంగతి.
76 ఏళ్ల క్రితం స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు స్త్రీల స్థితిగతుల్లో వచ్చిన పురోభివృద్ధికి ఇదీ ఒక సంకేతమే. నాటి నుంచి నేటి వరకు విద్య, ఉపాధి, ఉద్యోగం, సైన్యం, పాలనా యంత్రాంగం, శాసన వ్యవస్థ... వీటిల్లో స్త్రీలకు గణనీయంగా స్థానం దక్కింది. ప్రాముఖ్యం లభించింది. అయితే అంతమాత్రాన స్త్రీలు సంపూర్ణంగా స్వాతంత్య్ర ఫలాలు అనుభవిస్తున్నారా అనేది ప్రశ్న.
స్త్రీల త్యాగం
దాస్య భారతంలో జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో స్త్రీలు పాల్గొన్నారు. అన్నింటికి మించి పురుషులు దేశం కోసం ప్రాణాలు అర్పించినా, జైళ్ల పాలైనా స్త్రీలు ధైర్యంగా ఇళ్లు నడిపి కష్టాలను ఈదారు. దేశ విభజన సమయంలో తీవ్ర హింసను ఎదుర్కొన్నారు. అంతెందుకు 1930 నాటికి దేశ వ్యాప్తంగా 30 వేల మంది స్త్రీలు స్వాతంత్య్ర పోరాటంలో ఏదో విధాన జైలు శిక్ష అనుభవిస్తున్నారని తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ స్త్రీల పోరాటం చాలామటుకు చరిత్రలో నమోదు కాకుండానే కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడిప్పుడే నాటి వీర వనితల గాధలు వెలికి వస్తున్నాయి. ఇంత పోరాటం, త్యాగం చేసి స్త్రీల భాగస్వామ్యంతో తెచ్చుకున్న స్వాతంత్య్రంలో స్త్రీలు నిజంగా సంతోషంగా ఉన్నారా?
సురక్షితం కాని దేశం
‘ఒక స్త్రీ అర్ధరాత్రి క్షేమంగా నడిచి వెళ్లినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు’ అని గాంధీజీ ఏ ముహూర్తంలో అన్నారో కాని అలాంటి స్థితి నేటికీ రాకపోగా నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. ఎన్ని చట్టాలు చేసినా, శిక్షలు తెచ్చినా స్త్రీలను గౌరవించాలి, వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలి అని మెజారిటీ సమాజం అనుకోవడం లేదు. ‘నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ అనే భావన సమాజంలో ఆది కాలం నుంచి చొప్పించి ఉండటం వల్ల స్త్రీ చేసే ప్రతి పనిలో తప్పు ఎంచడం, అదుపు చేయడం, చులకనగా చూడటం, వివక్ష చూపడం, దండించడం ఆనవాయితీగా మారింది. పిల్లల పెంపకం దశ నుంచే స్త్రీలను గౌరవించడం నేర్పించడం లేదు. ఇంట్లో అమ్మాయిని ఒకలాగా, అబ్బాయిని ఒకలాగా పెంచడం వల్ల ఈ అబ్బాయిలు ‘సమాజం’గా మారి స్త్రీ పాలిట బెడదగా మారుతున్నారు. తమ మాటకు ఎటువంటి తిరస్కారం చెప్పినా పురుషుడు శిక్షించేవాడై స్త్రీని చంపేందుకు వెనుకాడటం లేదు.
స్త్రీకి ఒక అభిప్రాయం కలిగి ఉండే స్వాతంత్య్రం ఆమెకు ఎందుకు ఇవ్వడం లేదు?
స్త్రీలను ప్రేమ, మర్యాద, గౌరవాలతో కుటుంబం చూసుకోవాలి. అప్పుడు ఆ మర్యాద, గౌరవాలు సమాజంలోకి ఆటోమేటిక్‌గా వస్తాయి. కుటుంబం స్త్రీకి ఎలా రక్షణ ఇస్తుందో సమాజం కూడా స్త్రీకి అలా రక్షణ ఇవ్వాలనే పౌర శిక్షణ, సంస్కారం అవసరం. పురుషులు మాత్రమే కాదు స్త్రీలు కూడా కుటుంబం, సమాజం, దేశం కోసం గొప్పగా ఆలోచించగలరు. వారికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఇచ్చి చూస్తే తెలుస్తుంది. అటువంటి వేకువలోకి దేశం ఉదయించాలని ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోరుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment