కారాగారంలో గడిపే సమయం శిక్ష సమయం కాదు, శిక్షణ సమయం. కారాగారం మానసిక పరివర్తన దిశగా శిక్షణ ఇచ్చే ప్రదేశం. శిక్ష పూర్తయి విడుదలైన తర్వాత సమాజంలో గౌరవంగా జీవించడానికి అవసరమైన నైపుణ్య శిక్షణ కూడా ఇచ్చే ప్రదేశంగా ఉండాలి. అలాగే ఉంటాయి కూడా. అయితే ఈ ఏడాది దేశం మరో అడుగు ముందుకేసింది. శిక్ష అనుభవిస్తున్న మహిళలకు ఉపాధి అవకాశాలను జైలు గోడల మధ్య కాకుండా సమాజంలో కల్పించడం ఈ స్వాతంత్య్ర దినోత్సవం ప్రత్యేకత.
చెన్నై నగర శివారులో అంబత్తూరు– పుఱల్ రోడ్డులో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు ‘ఆల్ ఉమెన్ పెట్రోల్ బంక్’ అనే ప్రయోగాత్మకమైన సంస్కరణకు వేదికైంది. పుఱల్ మహిళల కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న మహిళల్లో ముప్ఫై మందికి ఉద్యోగం ఇచ్చింది. దేశంలో ఇదే మొదటి ప్రయత్నం. ఈ ప్రయత్నంతో ఈ పెట్రోల్ బంకు ఫ్రీడమ్ ఫిల్లింగ్ స్టేషన్ అనే గౌరవ సూచికకు అర్హత సాధించింది. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పన్నెండు గంటలు మహిళలు విధులు నిర్వర్తిస్తారు. ఆ తర్వాత పురుష ఖైదీలు విధుల్లోకి వస్తారు.
ఖైదీలు తమ శిక్ష కాలం పూర్తయిన తర్వాత సమాజంలో గౌరవంగా జీవించడం కోసం రకరకాల వృత్తుల్లో శిక్షణ ఇస్తారు. అవన్నీ జైలు గోడల మధ్యనే ఉంటాయి. మారుతున్న సమాజానికి తగినట్లు కొత్త కొత్త ఉపాధి మార్గాలకు తగిన ఏర్పాట్లు ఉండవు. అందుబాటులో ఉన్న పనుల్లోనే శిక్షణ ఇవ్వడమే జరిగేది. ఇదిలా ఉంటే... జైళ్లలో మహిళా ఖైదీలకు తగిన సౌకర్యాల పర్యవేక్షణ కోసం అన్ని రాష్ట్రాల్లో పర్యటించిన మహిళా కమిషన్ సభ్యుల పరిశీలనలో కొత్త విషయాలు తెలిశాయి.
జైలు గోడల మధ్య ఉండడం వల్ల మహిళలు మానసికంగా కుంగుబాటుకు లోనవుతున్నారని, వారికి సమాజంలో భాగస్వామ్యం కల్పించాలని సూచించడంతో, ఆ సూచనను అందుకున్న జైలు అధికారుల్లో మొదటగా పుఱల్ జైలు అధికారులు ఈ ప్రయత్నం చేశారు. మహిళలకు పెట్రోల్ పట్టడంలో శిక్షణ ఇవ్వడంతోపాటు వినియోగదారులతో మాట్లాడడం, ఉద్యోగానికి తగిన ప్రవర్తనా నియమావళిలో కూడా మహిళలకు శిక్షణ ఇప్పించారు. పెట్రోల్ బంకులో విధులు నిర్వర్తిస్తున్న మహిళలు తమకు స్వాతంత్య్రం వచ్చినట్లు సంతోషిస్తున్నారు. శిక్ష కాలాన్ని ఆనందంగా పూర్తి చేస్తామని, పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో సమాజంలోకి విడుదలవుతామని చెప్పారు.
శిక్ష కాలం సమాజంలోనే!
శిక్షణ కాలంలో మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకు రావడంతోపాటు ఖైదీలను సమాజంతో అనుసంధానం చేయడం, వారి పునరావాసం కోసం పని చేయడం కూడా అవసరమే. ఆ అవసరాన్ని గుర్తించి మహిళలతోనే ముందడుగు వేసింది జైళ్ల శాఖ. శిక్ష సమయంలో కూడా సమాజంలో మనుషులతో మాట్లాడుతూ ఉంటే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. సమాజానికి దూరంగా ఉన్నామనే ఆవేదన దూరమవుతుంది. సమాజంలోనే నివసిస్తున్న భావనతో జీవిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment