Indian Oil Corp
-
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా... ఆల్ ఉమెన్ పెట్రోల్ బంక్
కారాగారంలో గడిపే సమయం శిక్ష సమయం కాదు, శిక్షణ సమయం. కారాగారం మానసిక పరివర్తన దిశగా శిక్షణ ఇచ్చే ప్రదేశం. శిక్ష పూర్తయి విడుదలైన తర్వాత సమాజంలో గౌరవంగా జీవించడానికి అవసరమైన నైపుణ్య శిక్షణ కూడా ఇచ్చే ప్రదేశంగా ఉండాలి. అలాగే ఉంటాయి కూడా. అయితే ఈ ఏడాది దేశం మరో అడుగు ముందుకేసింది. శిక్ష అనుభవిస్తున్న మహిళలకు ఉపాధి అవకాశాలను జైలు గోడల మధ్య కాకుండా సమాజంలో కల్పించడం ఈ స్వాతంత్య్ర దినోత్సవం ప్రత్యేకత. చెన్నై నగర శివారులో అంబత్తూరు– పుఱల్ రోడ్డులో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు ‘ఆల్ ఉమెన్ పెట్రోల్ బంక్’ అనే ప్రయోగాత్మకమైన సంస్కరణకు వేదికైంది. పుఱల్ మహిళల కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న మహిళల్లో ముప్ఫై మందికి ఉద్యోగం ఇచ్చింది. దేశంలో ఇదే మొదటి ప్రయత్నం. ఈ ప్రయత్నంతో ఈ పెట్రోల్ బంకు ఫ్రీడమ్ ఫిల్లింగ్ స్టేషన్ అనే గౌరవ సూచికకు అర్హత సాధించింది. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పన్నెండు గంటలు మహిళలు విధులు నిర్వర్తిస్తారు. ఆ తర్వాత పురుష ఖైదీలు విధుల్లోకి వస్తారు. ఖైదీలు తమ శిక్ష కాలం పూర్తయిన తర్వాత సమాజంలో గౌరవంగా జీవించడం కోసం రకరకాల వృత్తుల్లో శిక్షణ ఇస్తారు. అవన్నీ జైలు గోడల మధ్యనే ఉంటాయి. మారుతున్న సమాజానికి తగినట్లు కొత్త కొత్త ఉపాధి మార్గాలకు తగిన ఏర్పాట్లు ఉండవు. అందుబాటులో ఉన్న పనుల్లోనే శిక్షణ ఇవ్వడమే జరిగేది. ఇదిలా ఉంటే... జైళ్లలో మహిళా ఖైదీలకు తగిన సౌకర్యాల పర్యవేక్షణ కోసం అన్ని రాష్ట్రాల్లో పర్యటించిన మహిళా కమిషన్ సభ్యుల పరిశీలనలో కొత్త విషయాలు తెలిశాయి. జైలు గోడల మధ్య ఉండడం వల్ల మహిళలు మానసికంగా కుంగుబాటుకు లోనవుతున్నారని, వారికి సమాజంలో భాగస్వామ్యం కల్పించాలని సూచించడంతో, ఆ సూచనను అందుకున్న జైలు అధికారుల్లో మొదటగా పుఱల్ జైలు అధికారులు ఈ ప్రయత్నం చేశారు. మహిళలకు పెట్రోల్ పట్టడంలో శిక్షణ ఇవ్వడంతోపాటు వినియోగదారులతో మాట్లాడడం, ఉద్యోగానికి తగిన ప్రవర్తనా నియమావళిలో కూడా మహిళలకు శిక్షణ ఇప్పించారు. పెట్రోల్ బంకులో విధులు నిర్వర్తిస్తున్న మహిళలు తమకు స్వాతంత్య్రం వచ్చినట్లు సంతోషిస్తున్నారు. శిక్ష కాలాన్ని ఆనందంగా పూర్తి చేస్తామని, పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో సమాజంలోకి విడుదలవుతామని చెప్పారు. శిక్ష కాలం సమాజంలోనే! శిక్షణ కాలంలో మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకు రావడంతోపాటు ఖైదీలను సమాజంతో అనుసంధానం చేయడం, వారి పునరావాసం కోసం పని చేయడం కూడా అవసరమే. ఆ అవసరాన్ని గుర్తించి మహిళలతోనే ముందడుగు వేసింది జైళ్ల శాఖ. శిక్ష సమయంలో కూడా సమాజంలో మనుషులతో మాట్లాడుతూ ఉంటే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. సమాజానికి దూరంగా ఉన్నామనే ఆవేదన దూరమవుతుంది. సమాజంలోనే నివసిస్తున్న భావనతో జీవిస్తారు. -
ఐఓసీ లాభం 40 శాతం అప్
న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొ(ఐఓసీ) నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో 40 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2016–17) క్యూ4లో రూ.3,721 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.5,218 కోట్లకు పెరిగిందని ఐఓసీ చైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. షేర్ పరంగా చూస్తే, నికర లాభం ఒక్కో షేర్‌కు రూ.3.93 నుంచి రూ.5.51కు పెరిగిందని పేర్కొన్నారు. రిఫైనింగ్ మార్జిన్ అధికంగా ఉండటం, ఇన్వెంటరీ లాభాలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఈ స్థాయిలో నికర లాభం సాధించామని వివరించారు. ఒక్కో బ్యారెల్ ముడిచమురును ఇంధనంగా మార్చే విషయంలో 9.12 డాలర్ల రిఫైనింగ్ మార్జిన్‌ను సాధించామని పేర్కొన్నారు. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది 8.95 డాలర్లుగా ఉందని వివరించారు. గత క్యూ4లో రూ.3,442 కోట్ల ఇన్వెంటరీ లాభాలు వచ్చాయని పేర్కొన్నారు. ఇక టర్నోవర్ రూ.1.24 లక్షల కోట్ల నుంచి రూ.1.36 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు. పెట్రోలియమ్ ఉత్పత్తుల విక్రయం 19.64 మిలియన్ టన్నుల నుంచి 20.8 మిలియన్ టన్నులకు పెరిగిందని పేర్కొన్నారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.20 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. ఇప్పటికే ఇచ్చిన రూ.19 మధ్యంతర డివిడెండ్‌కు ఇది అదనమని పేర్కొన్నారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.19,106 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.21,346 కోట్లకు పెరిగిందని, కంపెనీ చరిత్రలో ఇదే అత్యధికమని సంజీవ్ సింగ్ తెలిపారు. -
రోజుకోసారి పెట్రోల్, డీజిల్ ధరలు ఛేంజ్
న్యూఢిల్లీ : ఇన్ని రోజులూ పదిహేను రోజులకొక్కసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయో పెరిగాయో తెలిసేది. 15 రోజుల సమీక్షలో భాగంగా ఆయిల్ కంపెనీలు వాటి ధరలను ప్రకటించాయి. కానీ ఇకనుంచి రోజుకోసారి పెట్రోల్, డీజిల్ ధరలు మారబోతున్నాయి. అంతర్జాతీయ ధరలకనుగుణంగా రేట్ల సమీక్షలను ఇక ప్రతిరోజూ చేపట్టాలని ప్రభుత్వరంగ చమురు సంస్థలు యోచిస్తున్నాయి. దేశీయ ప్యూయల్ రిటైల్ మార్కెట్ ను 95 శాతం తమ చెప్పుచేతుల్లో ఉంచుకున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియంలు ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టు ఓ ప్రభుత్వ రంగ చమురు సంస్థ టాప్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. రోజూ వారీ ధరల సమీక్ష చేపట్టి, పెట్రోల్, డీజిల్ ధరలను మార్చబోతున్నట్టు చెప్పారు. రోజువారీ ధరల విధానంపై చర్చించడానికి ఆయిల్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ లు, ఆయిల్ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో బుధవారం భేటీ అయ్యారు. దీనికి అవసరమైన టెక్నాలజీ కూడా అందుబాటులో ఉన్నట్టు ఆ టాప్ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న డిజిటల్ టెక్నాలజీలు, సోషల్ నెట్ వర్క్ లు కూడా రోజువారీ ధరల మార్పుకు అనుగుణంగా ఉన్నాయని, 53 వేల ఫిలింగ్ స్టేషన్లలో ధరల మార్పు సులభతరమేనని తెలిపారు. అయితే కేవలం కొన్ని పైసల తేడాతోనే ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయని, కస్టమర్లకు ఎలాంటి షాక్ ను కంపెనీలు ఇవ్వబోవని అంటున్నారు. -
పెట్రోల్ తగ్గింది, డీజిల్ పెరిగింది
న్యూఢిల్లీ: పెట్రోల్ ధర లీటర్ కు 32 పైసలు తగ్గింది. డీజిల్ ధర కాస్త పెరిగింది. లీటర్ డీజిల్ కు 28 పైసలు పెంచినట్టు చమురు సంస్థలు బుధవారం వెల్లడించాయి. కొత్త ధరలు ఈ అర్ధరాత్రి నుంచే అమలవుతాయని పేర్కొన్నాయి. జనవరి 15న పెట్రోల్ పై 32 పైసలు, డిజిల్ పై 85 పైసలు తగ్గించాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గుతున్న ఆ ప్రయోజనం వినియోగదారులకు దక్కడం లేదు. పెట్రోల్ ధర తగ్గించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని పెంచుతోంది. జనవరి 30న పెట్రోల్‌పై లీటర్‌కు రూపాయి, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి 50 పైసలు చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. జనవరి నెలలోనే 2వ తేదీన లీటర్ పెట్రోల్‌పై 37 పైసలు, డీజిల్ పై లీటరుకు రెండు రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకం పెంచింది. దీంతో వినియోగదారులకు పెద్దగా ప్రయోజనం కలగడం లేదు.