రోజుకోసారి పెట్రోల్, డీజిల్ ధరలు ఛేంజ్
రోజుకోసారి పెట్రోల్, డీజిల్ ధరలు ఛేంజ్
Published Fri, Apr 7 2017 4:34 PM | Last Updated on Fri, Sep 28 2018 3:22 PM
న్యూఢిల్లీ : ఇన్ని రోజులూ పదిహేను రోజులకొక్కసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయో పెరిగాయో తెలిసేది. 15 రోజుల సమీక్షలో భాగంగా ఆయిల్ కంపెనీలు వాటి ధరలను ప్రకటించాయి. కానీ ఇకనుంచి రోజుకోసారి పెట్రోల్, డీజిల్ ధరలు మారబోతున్నాయి. అంతర్జాతీయ ధరలకనుగుణంగా రేట్ల సమీక్షలను ఇక ప్రతిరోజూ చేపట్టాలని ప్రభుత్వరంగ చమురు సంస్థలు యోచిస్తున్నాయి. దేశీయ ప్యూయల్ రిటైల్ మార్కెట్ ను 95 శాతం తమ చెప్పుచేతుల్లో ఉంచుకున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియంలు ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టు ఓ ప్రభుత్వ రంగ చమురు సంస్థ టాప్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు.
రోజూ వారీ ధరల సమీక్ష చేపట్టి, పెట్రోల్, డీజిల్ ధరలను మార్చబోతున్నట్టు చెప్పారు. రోజువారీ ధరల విధానంపై చర్చించడానికి ఆయిల్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ లు, ఆయిల్ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో బుధవారం భేటీ అయ్యారు. దీనికి అవసరమైన టెక్నాలజీ కూడా అందుబాటులో ఉన్నట్టు ఆ టాప్ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న డిజిటల్ టెక్నాలజీలు, సోషల్ నెట్ వర్క్ లు కూడా రోజువారీ ధరల మార్పుకు అనుగుణంగా ఉన్నాయని, 53 వేల ఫిలింగ్ స్టేషన్లలో ధరల మార్పు సులభతరమేనని తెలిపారు. అయితే కేవలం కొన్ని పైసల తేడాతోనే ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయని, కస్టమర్లకు ఎలాంటి షాక్ ను కంపెనీలు ఇవ్వబోవని అంటున్నారు.
Advertisement