న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొ(ఐఓసీ) నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో 40 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2016–17) క్యూ4లో రూ.3,721 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.5,218 కోట్లకు పెరిగిందని ఐఓసీ చైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. షేర్ పరంగా చూస్తే, నికర లాభం ఒక్కో షేర్‌కు రూ.3.93 నుంచి రూ.5.51కు పెరిగిందని పేర్కొన్నారు. రిఫైనింగ్ మార్జిన్ అధికంగా ఉండటం, ఇన్వెంటరీ లాభాలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఈ స్థాయిలో నికర లాభం సాధించామని వివరించారు.
ఒక్కో బ్యారెల్ ముడిచమురును ఇంధనంగా మార్చే విషయంలో 9.12 డాలర్ల రిఫైనింగ్ మార్జిన్‌ను సాధించామని పేర్కొన్నారు. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది 8.95 డాలర్లుగా ఉందని వివరించారు. గత క్యూ4లో రూ.3,442 కోట్ల ఇన్వెంటరీ లాభాలు వచ్చాయని పేర్కొన్నారు. ఇక టర్నోవర్ రూ.1.24 లక్షల కోట్ల నుంచి రూ.1.36 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు. పెట్రోలియమ్ ఉత్పత్తుల విక్రయం 19.64 మిలియన్ టన్నుల నుంచి 20.8 మిలియన్ టన్నులకు పెరిగిందని పేర్కొన్నారు.
ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.20 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. ఇప్పటికే ఇచ్చిన రూ.19 మధ్యంతర డివిడెండ్‌కు ఇది అదనమని పేర్కొన్నారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.19,106 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.21,346 కోట్లకు పెరిగిందని, కంపెనీ చరిత్రలో ఇదే అత్యధికమని సంజీవ్ సింగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment