Sanjeev Singh
-
ఐఓసీ నష్టాలు రూ. 5,185 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఐఓసీకి గత ఆర్థిక సంవత్సరం(2019–20) నాలుగో క్వార్టర్లో భారీగా నష్టాలు వచ్చాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2018–19) క్యూ4లో రూ.6,099 కోట్ల నికర లాభం రాగా గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.5,185 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఐఓసీ తెలిపింది. మార్చి క్వార్టర్లో చమురు ధరలు బాగా పతనం కావడంతో భారీగా ఇన్వెంటరీ నష్టాలు వచ్చాయని ఐఓసీ చైర్మన్ సంజీవ్ సింగ్ వెల్లడించారు. దీనికి రిఫైనరీ మార్జిన్లు తగ్గడం కూడా తోడవడంతో ఈ స్థాయి నికర నష్టాలు వచ్చాయని వివరించారు. మరిన్ని వివరాలు..... ► 2018–19 క్యూ4లో రూ.1,787 కోట్ల ఇన్వెంటరీ లాభాలు రాగా, గతేడాది క్యూ4లో రూ.14,692 కోట్ల మేర ఇన్వెంటరీ నష్టాలు వచ్చాయి. ► క్యూ4లో స్థూల రిఫైనింగ్ మార్జిన్ (జీఆర్ఎమ్) మైనస్ 9.64 డాలర్లకు పడిపోయింది. ► లాక్డౌన్ కారణంగా 70 శాతం మేర ఇంధన డిమాండ్ తగ్గింది. జూలై మొదటి వారం కల్లా ఈ తగ్గిన 70 శాతం డిమాండ్‌లో 90 శాతం పుంజుకునే అవకాశాలున్నాయి. ► 2018–19లో రూ.16,894 కోట్లుగా ఉన్న నికర లాభం 2019–20లో రూ.1,313 కోట్లకు తగ్గింది. ► 2018–19లో రూ.3,227 కోట్ల ఇన్వెంటరీ లాభాలు రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.12,531 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐఓసీ షేర్ 3% నష్టంతో రూ.87 వద్ద ముగిసింది. -
మనకు పెట్రో ఊరట లేనట్టే!
న్యూఢిల్లీ: అమెరికాలో ఒకపక్క క్రూడ్ ధర మైనస్‌లోకి పడిపోయినప్పటికీ... దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు మాత్రం భారీగా దిగొచ్చే పరిస్థితి లేదా? ప్రభుత్వ రంగ చమురు రిటైలర్లు(ఓఎంసీ) ఇదే మాట చెబుతున్నారు. ఎందుకంటే మనం కేవలం అమెరికా క్రూడ్‌ను మాత్రమే దిగుమతి చేసుకోమని.. దేశీ ధరలను బ్రెంట్ క్రూడ్(ప్రస్తుతం బ్యారెల్ 25 డాలర్ల స్థాయిలో ఉంది) ఇతరత్రా విభిన్న ప్రామాణిక రేట్ల ప్రకారం నిర్ణయించడమే దీనికి కారణమనేది వారి వాదన. ఇప్పటికే రిఫైనరీలన్నీ భారీ నిల్వలతో నిండిపోయాయని కూడా చెబుతున్నారు. కాగా, కేవలం ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో మే నెల కాంట్రాక్టులకు డెలివరీ స్టోరేజీ లేకపోవడం వల్లే ఇలా అమెరికా క్రూడ్ ధర మైనస్‌లోకి కుప్పకూలిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) చైర్మన్ సంజీవ్ సింగ్ పేర్కొన్నారు. చమురు ధర ఇలా కనిష్ట స్థాయికి పడిపోవడం స్వల్పకాలంలో ప్రయోజనకరమే అయినప్పటికీ, దీర్ఘకాలంలో మాత్రం ఆయిల్ ఎకానమీ తీవ్రంగా దెబ్బతింటుందని ఆయన అభిప్రాయపడ్డారు. క్రూడ్ ఉత్పత్తిదారులకు పెట్టుబడులకు నిధుల్లేక అన్వేషణ, ఉత్పత్తి కార్యకలాపాలు దిగజారుతాయన్నారు. అయితే, అంతర్జాతీయంగా క్రూడ్ ధర భారీగా పడిపోయినప్పటికీ మార్చి 16 నుంచి ఇప్పటిదాకా మనదగ్గర రిటైల్ చమురు ధరల్లో ఎలాంటి తగ్గింపూ ఎందుకు లేదన్నదానిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. నిజానికి ధరలు తగ్గించకపోగా, రూ.3 ఎక్సైజ్ సుంకం, బీఎస్–6 ప్రమాణాలంటూ మరో రూ.1 చొప్పున అదనపు భారాన్ని ఈ నెల 1 నుంచి ప్రజలపై ఓఎంసీలు వడ్డించాయి. ఢిల్లీలో లీటరు పెట్రోలు ప్రస్తుతం రూ.69.59, డీజిల్ రూ.62.29 రేటుకు విక్రయిస్తున్నారు. -
బీఎస్–6 ఇంధనం వచ్చేసింది..
న్యూఢిల్లీ: వాహన కాలుష్యాన్ని మరింత తగ్గించే బీఎస్–6 ప్రమాణాల పెట్రోల్, డీజిల్ విక్రయాలు దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో శుద్ధమైన ఇంధనాన్ని వినియోగిస్తున్న అతి తక్కువ దేశాల సరసన భారత్ కూడా చేరింది. రేటులో మార్పులు లేకుండా పాత ధరకే వీటిని విక్రయిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు తెలియజేశాయి. సాధారణంగా లీటరుకు కనీసం రూ. 1 పెంచాల్సి ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో ఆ మేరకు సర్దుబాటు చేసినట్లు పేర్కొన్నాయి. ‘దేశవ్యాప్తంగా మాకున్న 68,700 పెట్రోల్ బంకుల్లో నూటికి నూరు శాతం బీఎస్–6 పెట్రోల్, డీజిల్ విక్రయాలు జరుపుతున్నాం‘ అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) చైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. కాలుష్య ప్రమాణాలు మారినా.. రేటులో మార్పేమీ లేదని చెప్పారు. ఐవోసీకి దాదాపు సగం మార్కెట్ వాటా ఉంది. కేవలం మూడేళ్ల వ్యవధిలోనే బీఎస్–4 ప్రమాణాల నుంచి బీఎస్–6కి మారిన ఘనత భారత్‌కు మాత్రమే దక్కుతుందని సింగ్ చెప్పారు. వాస్తవానికి ప్రభుత్వం నిర్దేశించిన ఏప్రిల్ 1 డెడ్‌లైన్ కన్నా మూడు వారాల ముందునుంచే బీఎస్–6 అమ్మకాలు ప్రారంభించామన్నారు. అటు బీపీసీఎల్ కూడా తమ 16,000 పెట్రోల్ బంకుల్లో బీఎస్–6 గ్రేడ్ ఇంధన విక్రయాలు ప్రారంభించినట్లు తెలిపింది. నవరి నుంచే తమ రిఫైనరీల్లో కొత్త గ్రేడ్ ఇంధన ఉత్పత్తి ప్రారంభమైందని, ప్రస్తుతం తమకున్న మొత్తం 16,400 పైచిలుకు బంకుల్లో దీని విక్రయం మొదలుపెట్టామని హెచ్‌పీసీఎల్ సీఎండీ ఎంకే సురానా తెలిపారు. 2010లో యూరో3కి సరిసమానమైన బీఎస్–3 ఇంధనాలు అందుబాటులోకి వచ్చాయి. అటుపైన బీఎస్–4కి మళ్లడానికి ఏడేళ్లు పట్టింది. ఆ తర్వాత బీఎస్–5 జోలికి వెళ్లకుండా దానికన్నా మెరుగైన బీఎస్–6 ఇంధనాలు వచ్చాయి. పాత ఇంధనాలతో పోలిస్తే బీఎస్–6లో కాలుష్యకారక సల్ఫర్ పరిమాణం అత్యంత తక్కువగా 10 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) ఉంటుంది. బీఎస్–3లో 350 కాగా.. బీఎస్–4లో 50 పీపీఎం. -
దేశవ్యాప్తంగా 60 ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో మూడు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు 60 ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) చైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద కొత్తగా 5.87 కోట్ల కనెక్షన్లు మంజూరైన నేపథ్యంలో వంట గ్యాస్ సరఫరా కోసం బాట్లింగ్ సామర్ధ్యం మరింత పెంచుకోవాల్సి ఉందన్నారు. చిన్న స్థాయిలో ఏర్పాటయ్యే 60 ప్రైవేట్ బాట్లింగ్ ప్లాŠంట్లలో ఇండియన్ ఆయిల్ 21 ప్లాంట్లను, భారత్ పెట్రోలియం 20, హిందుస్తాన్ పెట్రోలియం 19 ప్లాంట్ల సర్వీసులను వినియోగించుకోనున్నట్లు ఆయన తెలియజేశారు. సాధారణ బాట్లింగ్ యూనిట్ వార్షిక సామర్ద్యం 1,20,000 టన్నులుగా ఉంటుండగా, ప్రైవేట్ రంగంలోని చిన్న బాట్లింగ్ ప్లాంట్ల సామర్ధ్యం వార్షికంగా 30,000 టన్నులుగా ఉంటుంది. దేశీయంగా ఎల్పీజీ వినియోగం వచ్చే ఏడాది 6–8 శాతం మేర వృద్ధి చెందవచ్చని అంచనా వేస్తున్నట్లు సింగ్ చెప్పారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద ఇప్పటిదాకా ఇండియన్ ఆయిల్ 2.75 కోట్ల కనెక్షన్లు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. -
12 శాతం తగ్గిన ఐఓసీ లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో రూ.3,246 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.3,696 కోట్లతో పోలిస్తే 12.6 శాతం తగ్గిపోయింది. విదేశీ మారక నష్టాలు, చమురు రిఫైనరీ మార్జిన్లు తగ్గుదల నికర లాభానికి చిల్లు పెట్టాయి. షేరు వారీ ఆర్జన రూ.3.90గా ఉంది. అమ్మకాలపై ఆదాయం ఏకంగా 48 శాతం పెరిగి రూ.1,32,357 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.89,499 కోట్లుగా ఉంది. ఫారెక్స్ నష్టాలు రూ.2,600 కోట్లు రూపాయి విలువ పడిపోవడం వల్ల ఈ త్రైమాసికంలో తాము రూ.2,600 కోట్లను విదేశీ ఎక్సేంజ్ రూపంలో నష్టపోయినట్టు ఐవోసీ చైర్మన్ సంజీవ్ సింగ్ మీడియాకు తెలిపారు. చమురు ధరలు పెరగడం, రుణాలను తిరిగి చెల్లించడం కూడా దీనికి తోడయ్యాయని చెప్పారు. విదేశీ ఎక్సేంజ్ నష్టం అన్నది... ఓ కంపెనీ తాను ఒక డాలర్‌ను రుణంగా తీసుకున్నప్పుడు రూపాయి మారకం విలువ రూ.70 ఉందనుకుంటే, తిరిగి చెల్లించే సమయానికి అంతకంటే దిగజారితే అధికంగా చెల్లించడం వల్ల ఎదురయ్యే నష్టం. అలాగే, ముడి చమురును కొనుగోలు చేసి, ఆ తర్వాత 15–30 రోజులకు చెల్లింపులు చేసే సమయానికి కరెన్సీ విలువ దిగజారినా గానీ నష్టం ఎదురవుతుంది. రిఫైనరీ మార్జిన్ 6.79 డాలర్లు ప్రతీ బ్యారెల్ ముడి చమురు శుద్ధి చేసి ఇంధనంగా మార్చడంపై 6.79 డాలర్ల మార్జిన్‌ను కంపెనీ సెప్టెంబర్ క్వార్టర్లో ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ మార్జిన్ 7.98 డాలర్లుగా ఉంది. ఇన్వెంటరీ రూపంలో రూ.4,408 కోట్ల లాభం రావడంతో ఫారెక్స్ నష్టాలను కంపెనీ అధిగమించగలిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇన్వెంటరీ లాభాలు కేవలం రూ.1,056 కోట్లుగానే ఉన్నాయి. ఇన్వెంటరీ లాభాలు అంటే... ముడి చమురును కొన్న ధర నుంచి... దాన్ని ఇంధనంగా మార్చి విక్రయించే ధర ఎక్కువ ఉంటే వచ్చే లాభం. అయితే, క్వార్టర్ వారీగా (క్రితం క్వార్టర్‌తో) చూసుకుంటే ఇన్వెంటరీ లాభాలు 44 శాతం తగ్గడం గమనార్హం. క్యూ2లో బ్రెంట్ క్రూడ్ సగటున 75.89 డాలర్లుగా ఉంది. క్రితం క్వార్టర్‌తో పోలిస్తే ఒక శాతం ఎక్కువ. ఆరు నెలల్లో రూ.10,078 కోట్లు ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అర్ధ సంవత్సరంలో చూసుకుంటే ఐవోసీ నికర లాభం రూ.10,078 కోట్లు, ఆదాయం రూ.3,01,313 కోట్లుగా ఉన్నాయి. స్థూల రిఫైనరీ మార్జిన్ 8.45 డాలర్లు కాగా, క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 6.08 డాలర్లే. -
ఐఓసీ లాభం 40 శాతం అప్
న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొ(ఐఓసీ) నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో 40 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2016–17) క్యూ4లో రూ.3,721 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.5,218 కోట్లకు పెరిగిందని ఐఓసీ చైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. షేర్ పరంగా చూస్తే, నికర లాభం ఒక్కో షేర్‌కు రూ.3.93 నుంచి రూ.5.51కు పెరిగిందని పేర్కొన్నారు. రిఫైనింగ్ మార్జిన్ అధికంగా ఉండటం, ఇన్వెంటరీ లాభాలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఈ స్థాయిలో నికర లాభం సాధించామని వివరించారు. ఒక్కో బ్యారెల్ ముడిచమురును ఇంధనంగా మార్చే విషయంలో 9.12 డాలర్ల రిఫైనింగ్ మార్జిన్‌ను సాధించామని పేర్కొన్నారు. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది 8.95 డాలర్లుగా ఉందని వివరించారు. గత క్యూ4లో రూ.3,442 కోట్ల ఇన్వెంటరీ లాభాలు వచ్చాయని పేర్కొన్నారు. ఇక టర్నోవర్ రూ.1.24 లక్షల కోట్ల నుంచి రూ.1.36 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు. పెట్రోలియమ్ ఉత్పత్తుల విక్రయం 19.64 మిలియన్ టన్నుల నుంచి 20.8 మిలియన్ టన్నులకు పెరిగిందని పేర్కొన్నారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.20 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. ఇప్పటికే ఇచ్చిన రూ.19 మధ్యంతర డివిడెండ్‌కు ఇది అదనమని పేర్కొన్నారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.19,106 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.21,346 కోట్లకు పెరిగిందని, కంపెనీ చరిత్రలో ఇదే అత్యధికమని సంజీవ్ సింగ్ తెలిపారు. -
గతవారం బిజినెస్
నియామకాలు దేశీ అతిపెద్ద వాణిజ్య సంస్థ ‘ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్’ (ఐఓసీ) చైర్మన్‌గా సంజీవ్ సింగ్ నియమితులయ్యారు. ఈయన ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఈయన ఐఓసీలో రిఫైనరీస్ డైరెక్టర్‌గా ఉన్నారు. కాగా సంజీవ్ సింగ్ జూన్ 1 లేదా తదనంతరం పదవీ బాధ్యతలు చేపడతారు. క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ చైర్మన్‌గా అజయ్ త్యాగి పదవీ బాధ్యతలు స్వీకరించారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తొమ్మిదవ చైర్మన్‌గా త్యాగి వ్యవహరించనున్నారు. మెగా చమురు పీఎస్‌యూ వచ్చేస్తోంది! అంతర్జాతీయ స్థాయిలో మెగా చమురు దిగ్గజాన్ని నెలకొల్పాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పం త్వరలోనే సాకారం కాబోతోంది. చమురుగ్యాస్ ఉత్పత్తిలో అగ్రగామి ఓఎన్జీసీ.. చమురు మార్కెటింగ్ కంపెనీ హెచ్‌పీసీఎల్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ డీల్ విలువ దాదాపు రూ.44,000 కోట్లు (6.6 బిలియన్ డాలర్లు) ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కేంద్రానికి హెచ్పీసీఎల్లో 51.11 శాతం వాటా ఉంది. ఒప్పందంలో భాగంగా దీన్ని ఓఎన్జీసీ కొనుగోలు చేయనుంది. అయితే, సెబీ నిబంధనల ప్రకారం ఇతర హెచ్‌పీసీఎల్ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఓఎన్జీసీ ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు.. డిజిటలైజ్! లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తన ఏజెంట్లకు పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషీన్లను అందించాలని భావిస్తోంది. లక్షల సంఖ్యలో ఉన్న ఎల్ఐసీ ఏజెంట్లు సంవత్సరానికి దాదాపు రూ.1.5 లక్షల కోట్ల ప్రీమియం కలెక్ట్ చేస్తున్నారు. ‘నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వ్యూహంలో భాగంగా ఎల్ఐసీ తొలిగా 1.5 లక్షల మంది ఏజెంట్లకు పీవోఎస్ మెషీన్లను అందించనుంది. దీంతో ప్రీమియం వసూళ్లు డిజిటలైజ్ కానున్నవి’ అని ఒక సీనియర్ అధికారి తెలిపారు. భారత్‌కు నోకియా ఫోన్లు ఐకానిక్ ‘నోకియా–3310’ మళ్లీ భారత్ మార్కెట్లోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఇది వచ్చే త్రైమాసికంలో భారతీయులకు అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.3,500గా నిర్ణయించినట్లు తెలిసింది. మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్స్కు సంబంధించి నోకియాతో పదేళ్ల వరకు బ్రాండ్ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న హెచ్ఎండీ గ్లోబల్ ఈ ఫోన్లను భారత్‌లో విక్రయించనుంది. ఇది నోకియా–3310 ఫోన్‌తోపాటు నోకియా–6, నోకియా–5, నోకియా–3 వంటి ఆండ్రాయిడ్ ఫోన్లను కూడా ఆవిష్కరించింది. ఎన్‌హెచ్‌పీసీ షేర్ల బైబ్యాక్ జలవిద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వ రంగ ఎన్‌హెచ్‌పీసీ 81 కోట్ల షేర్లను (దాదాపు 7.33 శాతం వాటా) బైబ్యాక్ చేయనున్నది. ఒక్కో షేర్‌ను రూ.32.25 ధరకు బైబ్యాక్ చేస్తామని ఎన్‌హెచ్‌పీసీ తెలిపింది. ఈ బైబ్యాక్ విలువ రూ.2,616 కోట్లు. గత నెల 7న జరిగిన డైరెక్టర్ల బోర్డ్ సమావేశంలో తీర్మానానికి అనుగుణంగా ఈ బైబ్యాక్ జరుగుతుందని ఎన్‌హెచ్‌పీసీ వెల్లడించింది. ఈ బైబ్యాక్ ఆఫర్‌ను ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ నిర్వహిస్తుందని పేర్కొంది. లక్ష్యాన్ని దాటిన ద్రవ్యలోటు... ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చేసే వ్యయం మధ్య వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి ముగిసే నాటికే లక్ష్యాన్ని దాటిపోయింది. 2016–17 బడ్జెట్ ద్రవ్యలోటు లక్ష్యం రూ.5.33 లక్షల కోట్లు కాగా, జనవరి నాటికి రూ.5.64 లక్షల కోట్లకు చేరింది. తద్వారా మొత్తం ఆర్థిక సంవత్సరంలో 105.7 శాతానికి చేరినట్లయ్యింది. డొకోమోతో వివాదానికి ’టాటా’! జపాన్ టెలికం దిగ్గజం ఎన్టీటీ డొకోమోతో వివాదానికి టాటా గ్రూప్ ముగింపు పలకనుంది. తమ టెలికం జాయింట్ వెంచర్ సంస్థ నుంచి డొకోమో వైదొలిగే విషయంలో చాలా ఏళ్లుగా నడుస్తున్న న్యాయ వివాదంపై కోర్టు వెలుపల సెటిల్మెంట్కు అంగీకరించినట్లు టాటా సన్స్ ప్రకటించింది. ఈ కేసులో డొకోమోకు 1.18 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 7,900 కోట్లు) పరిహారాన్ని చెల్లించనున్నట్లు తెలిపింది. అంచనాలు మించిన వృద్ధి... జీడీపీ వృద్ధి రేటు మూడవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లో అంచనాలను మించింది. ఏడు శాతంగా నమోదయ్యింది. నోట్ల రద్దు ప్రకటన... సేవలు, తయారీసహా పలు రంగాలపై ప్రతికూల ప్రభావం భయాలు... దీనితో వృద్ధి రేటు తగ్గిపోతుందన్న అంచనాల నేపథ్యంలో తాజాగా కేంద్ర గణాంకాల శాఖ ప్రకటించిన అంచనాలు ఆర్థిక విశ్లేషకులకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. మూడో త్రైమాసికంలో భారత్ వృద్ధి రేటు 6.1–6.8 శాతం మధ్య వుండగలదంటూ పలు ఏజెన్సీలు వేసిన అంచనాల్ని తాజా గణాంకాలు మించడం విశేషం. డీఎల్ఎఫ్ ప్రమోటర్ల వాటా విక్రయం! డీఎల్ఎఫ్ కంపెనీ ప్రమోటర్లు, తమ రెంటల్ విభాగంలో 40 శాతం వాటాను విక్రయించనున్నారు. తమ రెంటల్ విభాగం, డీసీసీడీఎల్ (డీఎల్ఎఫ్ సైబర్ సిటీ డెవలపర్స్ లిమిటెడ్)లో 40 శాతం వాటాను సింగపూర్‌కు చెందిన జీఐసీకు ప్రమోటర్లు విక్రయించనున్నట్లు డీఎల్ఎఫ్ తెలిపింది. డీల్ విలువ రూ.12,000–13,000 కోట్ల రేంజ్లో ఉండొచ్చని అంచనా. మౌలిక రంగ ఉత్పత్తి నెమ్మది... పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో దాదాపు 37 శాతం వాటా కలిగిన ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి వృద్ధి జనవరిలో తగ్గింది. 3.4 శాతంగా ఇది నమోదయ్యింది. ఐదు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో వృద్ధి ఇదే తొలిసారి. 2016 డిసెంబర్లో ఈ ఎనిమిది రంగాల వృద్ధి 5.6 శాతం. జనవరి 2016లో ఈ రంగాల వృద్ధిరేటు 5.7 శాతం. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి మధ్య చూస్తే... వృద్ధి రేటు 2.9 శాతం నుంచి 4.8 శాతానికి పెరిగింది. మోబిలియో సేల్స్ నిలిపివేసిన హోండా జపాన్ కార్ల కంపెనీ హోండా తన మోబిలియో వాహన విక్రయాలను ఆపేసింది. ఈ కారుకు డిమాండ్ లేకపోవడం, కొత్త భద్రతా నియమాలకు అనుగుణంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని హోండా కార్స్ ఇండియా తెలిపింది. ఈ మోడల్లో కొత్త వేరియంట్‌ను తెచ్చేదీ లేనిదీ మరో రెండు నెలల్లో నిర్ణయిస్తామని పేర్కొంది. గత నెలలో ఒక్క కారును కూడా అమ్మలేకపోయామని పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ మధ్యంతర డివిడెండ్ రూ.3 హెచ్డీఎఫ్సీ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌కు రూ.3 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ నెల 20 నుంచి డివిడెండ్ చెల్లింపులు ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం కూడా ఇంతే మొత్తం డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. ఈ క్యూ3లో ఈ కంపెనీ మొత్తం ఆదాయం 22 శాతం వృద్ధితో రూ.14,989 కోట్లకు, నికర లాభం 13 శాతం వృద్ధితో రూ.2,729 కోట్లకు పెరిగాయి. ఫిబ్రవరిలోనూ తయారీ స్పీడ్: నికాయ్ నికాయ్ మార్కెట్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ప్రకారం... తయారీ రంగం వరుసగా రెండో నెల ఫిబ్రవరిలోనూ మెరుగుపడింది. జనవరిలో 50.4 పాయిం ట్ల వద్ద ఉన్న సూచీ, ఫిబ్రవరిలో 50.7 పాయింట్లకు పెరిగింది. డీల్స్.. ప్రావిడెన్స్ ఈక్విటీ పార్ట్నర్స్ సంస్థ, ఐడియాలో తనకున్న మొత్తం 3.3 శాతం వాటాను విక్రయించింది. ఈ వాటాను బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా ప్రావిడెన్స్ సంస్థ అమ్మేసింది. ఈ విక్రయం విలువ రూ.1,288 కోట్లని అంచనా. ఐటీ సర్వీసుల దిగ్గజం కాగ్నిజంట్ జపాన్‌కు చెందిన బ్రిలియంట్ సర్వీసెస్ కంపెనీని కొనుగోలు చేసింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది. ఇంగ్లండ్‌కు చెందిన ఎస్పీసీ ఇంటర్నేషనల్‌లో మెజారిటీ వాటాను టీవీఎస్ లాజిస్టిక్స్‌కు చెందిన ఇంగ్లండ్ అనుబంధ కంపెనీ టీవీఎస్ రికో సప్లై చెయిన్ సర్వీసెస్ చేజిక్కించుకుంది. డీల్ విలువ రూ.165 కోట్లు.