బీఎస్‌–6 ఇంధనం వచ్చేసింది.. | BS6 petrol And Diesel to be available In The Country | Sakshi
Sakshi News home page

బీఎస్‌–6 ఇంధనం వచ్చేసింది..

Published Thu, Apr 2 2020 2:07 AM | Last Updated on Thu, Apr 2 2020 2:07 AM

BS6 petrol And Diesel to be available In The Country - Sakshi

న్యూఢిల్లీ: వాహన కాలుష్యాన్ని మరింత తగ్గించే బీఎస్‌–6 ప్రమాణాల పెట్రోల్, డీజిల్‌ విక్రయాలు దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో శుద్ధమైన ఇంధనాన్ని వినియోగిస్తున్న అతి తక్కువ దేశాల సరసన భారత్‌ కూడా చేరింది. రేటులో మార్పులు లేకుండా పాత ధరకే వీటిని విక్రయిస్తున్నట్లు చమురు మార్కెటింగ్‌ కంపెనీలు తెలియజేశాయి. సాధారణంగా లీటరుకు కనీసం రూ. 1 పెంచాల్సి ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో ఆ మేరకు సర్దుబాటు చేసినట్లు పేర్కొన్నాయి. ‘దేశవ్యాప్తంగా మాకున్న 68,700 పెట్రోల్‌ బంకుల్లో నూటికి నూరు శాతం బీఎస్‌–6 పెట్రోల్, డీజిల్‌ విక్రయాలు జరుపుతున్నాం‘ అని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) చైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌ తెలిపారు.

కాలుష్య ప్రమాణాలు మారినా.. రేటులో మార్పేమీ లేదని చెప్పారు. ఐవోసీకి దాదాపు సగం మార్కెట్‌ వాటా ఉంది. కేవలం మూడేళ్ల వ్యవధిలోనే బీఎస్‌–4 ప్రమాణాల నుంచి బీఎస్‌–6కి మారిన ఘనత భారత్‌కు మాత్రమే దక్కుతుందని సింగ్‌ చెప్పారు. వాస్తవానికి ప్రభుత్వం నిర్దేశించిన ఏప్రిల్‌ 1 డెడ్‌లైన్‌ కన్నా మూడు వారాల ముందునుంచే బీఎస్‌–6 అమ్మకాలు ప్రారంభించామన్నారు. అటు బీపీసీఎల్‌ కూడా తమ 16,000 పెట్రోల్‌ బంకుల్లో బీఎస్‌–6 గ్రేడ్‌ ఇంధన విక్రయాలు ప్రారంభించినట్లు తెలిపింది. నవరి నుంచే తమ రిఫైనరీల్లో కొత్త గ్రేడ్‌ ఇంధన ఉత్పత్తి ప్రారంభమైందని, ప్రస్తుతం తమకున్న మొత్తం 16,400 పైచిలుకు బంకుల్లో దీని విక్రయం మొదలుపెట్టామని హెచ్‌పీసీఎల్‌ సీఎండీ ఎంకే సురానా తెలిపారు.  

2010లో యూరో3కి సరిసమానమైన బీఎస్‌–3 ఇంధనాలు అందుబాటులోకి వచ్చాయి. అటుపైన బీఎస్‌–4కి మళ్లడానికి ఏడేళ్లు పట్టింది. ఆ తర్వాత బీఎస్‌–5 జోలికి వెళ్లకుండా దానికన్నా మెరుగైన బీఎస్‌–6 ఇంధనాలు వచ్చాయి. పాత ఇంధనాలతో పోలిస్తే బీఎస్‌–6లో కాలుష్యకారక సల్ఫర్‌ పరిమాణం అత్యంత తక్కువగా 10 పీపీఎం (పార్ట్స్‌ పర్‌ మిలియన్‌) ఉంటుంది. బీఎస్‌–3లో 350 కాగా.. బీఎస్‌–4లో 50 పీపీఎం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement