గతవారం బిజినెస్‌ | Last week Business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్‌

Published Mon, Mar 6 2017 12:58 AM | Last Updated on Tue, Sep 5 2017 5:17 AM

గతవారం బిజినెస్‌

గతవారం బిజినెస్‌

నియామకాలు
దేశీ అతిపెద్ద వాణిజ్య సంస్థ ‘ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌’ (ఐఓసీ) చైర్మన్‌గా సంజీవ్‌ సింగ్‌ నియమితులయ్యారు. ఈయన ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఈయన ఐఓసీలో రిఫైనరీస్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. కాగా సంజీవ్‌ సింగ్‌ జూన్‌ 1 లేదా తదనంతరం పదవీ బాధ్యతలు చేపడతారు.

క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ ‘సెబీ’ చైర్మన్‌గా అజయ్‌ త్యాగి పదవీ బాధ్యతలు స్వీకరించారు. సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సే్ఛంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) తొమ్మిదవ చైర్మన్‌గా త్యాగి వ్యవహరించనున్నారు.

మెగా చమురు పీఎస్‌యూ వచ్చేస్తోంది!
అంతర్జాతీయ స్థాయిలో మెగా చమురు దిగ్గజాన్ని నెలకొల్పాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పం త్వరలోనే సాకారం కాబోతోంది. చమురుగ్యాస్‌ ఉత్పత్తిలో అగ్రగామి ఓఎన్‌జీసీ.. చమురు మార్కెటింగ్‌ కంపెనీ హెచ్‌పీసీఎల్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ డీల్‌ విలువ దాదాపు రూ.44,000 కోట్లు (6.6 బిలియన్‌ డాలర్లు) ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కేంద్రానికి హెచ్‌పీసీఎల్‌లో 51.11 శాతం వాటా ఉంది. ఒప్పందంలో భాగంగా దీన్ని ఓఎన్‌జీసీ కొనుగోలు చేయనుంది. అయితే, సెబీ నిబంధనల ప్రకారం ఇతర హెచ్‌పీసీఎల్‌ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఓఎన్‌జీసీ ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించాల్సి ఉంటుంది.

ఎల్‌ఐసీ ప్రీమియం వసూళ్లు.. డిజిటలైజ్‌!
లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) తన ఏజెంట్లకు పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీవోఎస్‌) మెషీన్లను అందించాలని భావిస్తోంది. లక్షల సంఖ్యలో ఉన్న ఎల్‌ఐసీ ఏజెంట్లు సంవత్సరానికి దాదాపు రూ.1.5 లక్షల కోట్ల ప్రీమియం కలెక్ట్‌ చేస్తున్నారు. ‘నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వ్యూహంలో భాగంగా ఎల్‌ఐసీ తొలిగా 1.5 లక్షల మంది ఏజెంట్లకు పీవోఎస్‌ మెషీన్లను అందించనుంది. దీంతో ప్రీమియం వసూళ్లు డిజిటలైజ్‌ కానున్నవి’ అని ఒక సీనియర్‌ అధికారి తెలిపారు.  

భారత్‌కు నోకియా ఫోన్లు
ఐకానిక్‌ ‘నోకియా–3310’ మళ్లీ భారత్‌ మార్కెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఇది వచ్చే త్రైమాసికంలో భారతీయులకు అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.3,500గా నిర్ణయించినట్లు తెలిసింది. మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్లెట్స్‌కు సంబంధించి నోకియాతో పదేళ్ల వరకు బ్రాండ్‌ లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్న హెచ్‌ఎండీ గ్లోబల్‌ ఈ ఫోన్లను భారత్‌లో విక్రయించనుంది. ఇది నోకియా–3310 ఫోన్‌తోపాటు నోకియా–6, నోకియా–5, నోకియా–3 వంటి ఆండ్రాయిడ్‌ ఫోన్లను కూడా ఆవిష్కరించింది.

ఎన్‌హెచ్‌పీసీ షేర్ల బైబ్యాక్‌
జలవిద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వ రంగ ఎన్‌హెచ్‌పీసీ 81 కోట్ల షేర్లను (దాదాపు 7.33 శాతం వాటా) బైబ్యాక్‌ చేయనున్నది. ఒక్కో షేర్‌ను రూ.32.25 ధరకు బైబ్యాక్‌ చేస్తామని ఎన్‌హెచ్‌పీసీ తెలిపింది. ఈ బైబ్యాక్‌  విలువ రూ.2,616 కోట్లు. గత నెల 7న జరిగిన డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశంలో తీర్మానానికి అనుగుణంగా ఈ బైబ్యాక్‌ జరుగుతుందని ఎన్‌హెచ్‌పీసీ వెల్లడించింది. ఈ బైబ్యాక్‌ ఆఫర్‌ను ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ నిర్వహిస్తుందని పేర్కొంది.

లక్ష్యాన్ని దాటిన ద్రవ్యలోటు...
ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చేసే వ్యయం మధ్య వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి ముగిసే నాటికే లక్ష్యాన్ని దాటిపోయింది. 2016–17 బడ్జెట్‌ ద్రవ్యలోటు లక్ష్యం రూ.5.33 లక్షల కోట్లు కాగా, జనవరి నాటికి రూ.5.64 లక్షల కోట్లకు చేరింది. తద్వారా మొత్తం ఆర్థిక సంవత్సరంలో 105.7 శాతానికి చేరినట్లయ్యింది.

డొకోమోతో వివాదానికి ’టాటా’!
జపాన్‌ టెలికం దిగ్గజం ఎన్‌టీటీ డొకోమోతో వివాదానికి టాటా గ్రూప్‌ ముగింపు పలకనుంది. తమ టెలికం జాయింట్‌ వెంచర్‌ సంస్థ నుంచి డొకోమో వైదొలిగే విషయంలో చాలా ఏళ్లుగా నడుస్తున్న న్యాయ వివాదంపై కోర్టు వెలుపల సెటిల్‌మెంట్‌కు అంగీకరించినట్లు టాటా సన్స్‌ ప్రకటించింది. ఈ కేసులో డొకోమోకు 1.18 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ. 7,900 కోట్లు) పరిహారాన్ని చెల్లించనున్నట్లు తెలిపింది.

అంచనాలు మించిన వృద్ధి...
జీడీపీ వృద్ధి రేటు మూడవ త్రైమాసికం (అక్టోబర్‌–డిసెంబర్‌)లో అంచనాలను మించింది. ఏడు శాతంగా నమోదయ్యింది. నోట్ల రద్దు ప్రకటన... సేవలు, తయారీసహా పలు రంగాలపై ప్రతికూల ప్రభావం భయాలు... దీనితో వృద్ధి రేటు తగ్గిపోతుందన్న అంచనాల నేపథ్యంలో తాజాగా కేంద్ర గణాంకాల శాఖ ప్రకటించిన అంచనాలు ఆర్థిక విశ్లేషకులకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. మూడో త్రైమాసికంలో భారత్‌ వృద్ధి రేటు 6.1–6.8 శాతం మధ్య వుండగలదంటూ పలు ఏజెన్సీలు వేసిన అంచనాల్ని తాజా గణాంకాలు మించడం విశేషం.

డీఎల్‌ఎఫ్‌ ప్రమోటర్ల వాటా విక్రయం!
డీఎల్‌ఎఫ్‌ కంపెనీ ప్రమోటర్లు, తమ రెంటల్‌ విభాగంలో 40 శాతం వాటాను విక్రయించనున్నారు. తమ రెంటల్‌ విభాగం, డీసీసీడీఎల్‌ (డీఎల్‌ఎఫ్‌ సైబర్‌ సిటీ డెవలపర్స్‌ లిమిటెడ్‌)లో 40 శాతం వాటాను సింగపూర్‌కు చెందిన జీఐసీకు ప్రమోటర్లు విక్రయించనున్నట్లు డీఎల్‌ఎఫ్‌ తెలిపింది. డీల్‌  విలువ రూ.12,000–13,000 కోట్ల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

మౌలిక రంగ ఉత్పత్తి నెమ్మది...
పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో దాదాపు 37 శాతం వాటా కలిగిన ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి వృద్ధి జనవరిలో తగ్గింది. 3.4 శాతంగా ఇది నమోదయ్యింది. ఐదు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో వృద్ధి ఇదే తొలిసారి. 2016 డిసెంబర్‌లో ఈ ఎనిమిది రంగాల వృద్ధి 5.6 శాతం. జనవరి 2016లో ఈ రంగాల వృద్ధిరేటు 5.7 శాతం. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జనవరి మధ్య చూస్తే... వృద్ధి రేటు 2.9 శాతం నుంచి 4.8 శాతానికి పెరిగింది.

మోబిలియో సేల్స్‌ నిలిపివేసిన హోండా
జపాన్‌ కార్ల కంపెనీ హోండా తన మోబిలియో వాహన విక్రయాలను ఆపేసింది. ఈ కారుకు డిమాండ్‌ లేకపోవడం, కొత్త భద్రతా నియమాలకు అనుగుణంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని హోండా కార్స్‌ ఇండియా తెలిపింది. ఈ మోడల్‌లో కొత్త వేరియంట్‌ను తెచ్చేదీ లేనిదీ మరో రెండు నెలల్లో నిర్ణయిస్తామని పేర్కొంది. గత నెలలో ఒక్క కారును కూడా అమ్మలేకపోయామని పేర్కొన్నారు.  

హెచ్‌డీఎఫ్‌సీ మధ్యంతర డివిడెండ్‌ రూ.3
హెచ్‌డీఎఫ్‌సీ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌కు రూ.3 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ నెల 20 నుంచి డివిడెండ్‌ చెల్లింపులు ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం కూడా ఇంతే మొత్తం డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. ఈ క్యూ3లో ఈ కంపెనీ మొత్తం ఆదాయం 22 శాతం వృద్ధితో రూ.14,989 కోట్లకు, నికర లాభం 13 శాతం వృద్ధితో రూ.2,729 కోట్లకు పెరిగాయి.

ఫిబ్రవరిలోనూ తయారీ స్పీడ్‌: నికాయ్‌
నికాయ్‌ మార్కెట్‌ ఇండియా మాన్యుఫాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం... తయారీ రంగం వరుసగా రెండో నెల ఫిబ్రవరిలోనూ మెరుగుపడింది. జనవరిలో 50.4 పాయిం ట్ల వద్ద ఉన్న సూచీ, ఫిబ్రవరిలో 50.7 పాయింట్లకు పెరిగింది.

డీల్స్‌..
 ప్రావిడెన్స్‌ ఈక్విటీ పార్ట్‌నర్స్‌ సంస్థ, ఐడియాలో తనకున్న మొత్తం 3.3 శాతం వాటాను విక్రయించింది. ఈ వాటాను బహిరంగ మార్కెట్‌ లావాదేవీల ద్వారా ప్రావిడెన్స్‌ సంస్థ అమ్మేసింది. ఈ విక్రయం విలువ రూ.1,288 కోట్లని అంచనా.

ఐటీ సర్వీసుల దిగ్గజం కాగ్నిజంట్‌ జపాన్‌కు చెందిన బ్రిలియంట్‌ సర్వీసెస్‌ కంపెనీని కొనుగోలు చేసింది. డీల్‌ విలువ తెలియాల్సి ఉంది.

ఇంగ్లండ్‌కు చెందిన ఎస్‌పీసీ ఇంటర్నేషనల్‌లో మెజారిటీ వాటాను టీవీఎస్‌ లాజిస్టిక్స్‌కు చెందిన ఇంగ్లండ్‌ అనుబంధ కంపెనీ టీవీఎస్‌ రికో సప్లై చెయిన్‌ సర్వీసెస్‌ చేజిక్కించుకుంది. డీల్‌ విలువ రూ.165 కోట్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement