పట్నా: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) రూ.21,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించింది. బిహార్‌లోని బరౌనీ రిఫైనరీ విస్తరణ, ఆ రాష్ట్రంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ఏర్పాటుకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు ఐవోసీ ఈడీ సుమన్ కుమార్ వెల్లడించారు.
‘సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో బరౌని రిఫైనరీని పెట్రోకెమికల్ ప్లాంట్‌తో కలిపి ప్రస్తుత 6 మిలియన్ టన్నుల నుంచి సంవత్సరానికి 9 మిలియన్ టన్నులకు విస్తరిస్తున్నాం. 27 నగరాల్లో ఆటోమొబైల్స్‌కు, గృహాలు, పరిశ్రమలకు పైపుల ద్వారా సీఎన్‌జీని సరఫరా చేయడానికి నెట్‌వర్క్ ఏర్పాటుకై మరో రూ.5,600 కోట్లు పెట్టుబడి పెడతాం. 2,00,000 టన్నుల తయారీ సామర్థ్యంతో పాలీప్రొఫైలిన్ కేంద్రాన్ని కూడా 2025 చివరినాటికి ఏర్పాటు చేస్తాం. 2047 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల కంపెనీగా ఎదగాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం’ అని ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: ఈ–వ్యాలెట్లలోకి పీఎఫ్ సొమ్ము?
రూ.2 లక్షల కోట్ల కంటే అధిక పెట్టుబడి
110 బిలియన్ డాలర్ల విలువైన ఐవోసీ..దూకుడుగా మూలధన విస్తరణ ప్రణాళికను రూపొందించింది. రిఫైనింగ్ సామర్థ్యం, పెట్రోకెమికల్ ఇంటిగ్రేషన్, అనుబంధ మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధన ఆస్తులను విస్తరించడానికి దశాబ్దంలో రూ.2 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలని ప్రతిపాదించింది. భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్న నేపథ్యంలో దేశ ఇంధన అవసరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ‘ద ఎనర్జీ ఆఫ్ ఇండియా’గా సంస్థ 2050 నాటికి భారత ఇంధన అవసరాలలో 12.5 శాతం సమకూర్చడం ద్వారా ముందు వరుసలో నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ పానిపట్ రిఫైనరీని సంవత్సరానికి 15 మిలియన్ టన్నుల నుంచి 25 మిలియన్ టన్నులకు, గుజరాత్ రిఫైనరీని 13.7 మిలియన్ టన్నుల నుండి 18 మిలియన్ టన్నులకు విస్తరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment