Refinery expansion
-
ఐవోసీ రూ.21,000 కోట్ల పెట్టుబడి
పట్నా: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) రూ.21,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించింది. బిహార్‌లోని బరౌనీ రిఫైనరీ విస్తరణ, ఆ రాష్ట్రంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏర్పాటుకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు ఐవోసీ ఈడీ సుమన్ కుమార్ వెల్లడించారు.‘సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో బరౌని రిఫైనరీని పెట్రోకెమికల్ ప్లాంట్‌తో కలిపి ప్రస్తుత 6 మిలియన్ టన్నుల నుంచి సంవత్సరానికి 9 మిలియన్ టన్నులకు విస్తరిస్తున్నాం. 27 నగరాల్లో ఆటోమొబైల్స్‌కు, గృహాలు, పరిశ్రమలకు పైపుల ద్వారా సీఎన్జీని సరఫరా చేయడానికి నెట్వర్క్ ఏర్పాటుకై మరో రూ.5,600 కోట్లు పెట్టుబడి పెడతాం. 2,00,000 టన్నుల తయారీ సామర్థ్యంతో పాలీప్రొఫైలిన్ కేంద్రాన్ని కూడా 2025 చివరినాటికి ఏర్పాటు చేస్తాం. 2047 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల కంపెనీగా ఎదగాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం’ అని ఆయన చెప్పారు.ఇదీ చదవండి: ఈ–వ్యాలెట్లలోకి పీఎఫ్ సొమ్ము? రూ.2 లక్షల కోట్ల కంటే అధిక పెట్టుబడి110 బిలియన్ డాలర్ల విలువైన ఐవోసీ..దూకుడుగా మూలధన విస్తరణ ప్రణాళికను రూపొందించింది. రిఫైనింగ్ సామర్థ్యం, పెట్రోకెమికల్ ఇంటిగ్రేషన్, అనుబంధ మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధన ఆస్తులను విస్తరించడానికి దశాబ్దంలో రూ.2 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలని ప్రతిపాదించింది. భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్న నేపథ్యంలో దేశ ఇంధన అవసరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ‘ద ఎనర్జీ ఆఫ్ ఇండియా’గా సంస్థ 2050 నాటికి భారత ఇంధన అవసరాలలో 12.5 శాతం సమకూర్చడం ద్వారా ముందు వరుసలో నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ పానిపట్ రిఫైనరీని సంవత్సరానికి 15 మిలియన్ టన్నుల నుంచి 25 మిలియన్ టన్నులకు, గుజరాత్ రిఫైనరీని 13.7 మిలియన్ టన్నుల నుండి 18 మిలియన్ టన్నులకు విస్తరిస్తోంది. -
వైజాగ్ హెచ్‌పీసీఎల్ విస్తరణపై ఆశలు
త్వరలో ఢిల్లీ నుంచి పర్యావరణ అనుమతుల కమిటీ ప్లాంట్ పర్యటన * పచ్చజెండా ఊపితే రూ.15వేల కోట్లతో 15ఎంఎంటీఏలకు సామర్థ్యం పెంపు * కాలుష్య భయంతో రెండేళ్లుగా అనుమతులు రాక యాజమాన్యం కుదేలు * మారటోరియం ఎత్తివేత,ప్లాంట్ కాలుష్యం తగ్గడంతో సానుకూల సంకేతాలు * మరోవైపు వైజాగ్ పీసీపీఐఆర్లోనూ కొత్త ప్లాంట్‌పైనా ముమ్మర కసరత్తు. సాక్షి, విశాఖపట్నం: దేశంలోనే అతి పెద్దదైన విశాఖపట్నం హెచ్‌పీసీఎల్ రిఫైనరీ విస్తరణపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. రూ.15వేల కోట్లతో ప్రస్తుత సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలనే ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. రెండేళ్లుగా భవిష్యత్తు విస్తరణకు అడ్డంకిగా ఉన్న పర్యావరణ అనుమతులు కొలిక్కి వచ్చేలా కనిపిస్తున్నాయి. తిరిగి చాలాకాలం తర్వాత ఢిల్లీ నుంచి పర్యావరణ అనుమతుల కమిటీ ప్లాంట్‌కు వస్తుండడంతో యాజమాన్యం ఈసారి అనుకున్నది సాధించాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పెట్టుబడుల అంచనా రెట్టింపయ్యే ప్రమాదం ఉండడంతో ఎలాగైనా ఈదఫా విస్తరణ చేసి తీరాలని పట్టుదలతో ఉంది. మరోవైపు విశాఖలో కొత్త పరిశ్రమల ఏర్పాటుపై మారటోరియం కూడా సడలించడంతో విస్తరణకు అనుమతులు సులువుగానే రావచ్చని అంచనావేస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే తొందరగానే విస్తరణ పూర్తిచేయడానికి అధికారులు ప్రణాళికలు తయారు చేయాలని భావిస్తున్నారు. మొదటినుంచీ ఎన్ని చిక్కులో... కేంద్ర ప్రభుత్వ రంగంసంస్థల్లో ఒకటైన హెచ్ీపీసీఎల్కు 6.5 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీఏ) సామర్థ్యంతో ముంబైలో, 8.3 ఎంఎంటీఏ సామర్థ్యంతో విశాఖలో రిఫైనరీలు ఉన్నాయి. రానురానూ దేశీయంగా ఇంధన అవసరాలు భారీగా పెరిగిపోతుండడంతో యాజమాన్యం విశాఖలోని రిఫైనరీ సామర్థ్యాన్ని విస్తరించాలని రెండున్నరేళ్ల కిందట నిర్ణయించింది. నిపుణులతో సర్వే చేయించి రూ.15 వేల కోట్ల పెట్టుబడులతో ప్రస్తుతమున్న 8.3ఎంఎంటీఏల సామర్థ్యాన్ని 15ఎంఎంటీఏలకు విస్తరించాలని తేల్చింది. ఈమేరకు విస్తరణ ప్రణాళికను 2013 నాటికి ఓ స్థాయికి తీసుకువచ్చి 2014-2015 మధ్య ప్లాంట్‌లో పక్రియ మొత్తాన్ని పూర్తిచేసి ఉత్పత్తికి సిద్ధమవాలని మొదట్లో హెచ్‌పీసీఎల్ డెరైక్టర్(రిఫైనరీస్) కె.మురళీ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు అప్పట్లోనే పర్యావరణ అనుమతుల కోసం కేంద్రానికి దరఖాస్తు చేసింది. అప్పటికే విశాఖలో పారిశ్రామిక కాలుష్యం తీవ్రంగా ఉండడం, అదికూడా రిఫైనరీ విస్తరణ చేయాలనుకునే ప్రాంతం చుట్టూ అనేక తీవ్ర కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు కూడా ఉండడంతో హెచ్‌పీసీఎల్ రిఫైనరీ విస్తరణకు ఆటంకం ఏర్పడింది. కొత్త అనుమతులిస్తే చుట్టుపక్క ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ)నివేదిక ఇవ్వడంతో పర్యావరణ మంత్రిత్వశాఖ అప్పట్లో అనుమతులు నిరాకరించింది. దీంతో అప్పటినుంచీ విస్తరణ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. విశాఖలో పారిశ్రామిక విస్తరణపై నిషేధం విధించిన కేంద్రం గతేడాది దీన్ని తొలగించింది. సీఈపీఐ పాయింట్లు 73 నుంచి 60కి తగ్గడంతో పర్యావరణ మంత్రిత్వశాఖ మారటోరియంను ఎత్తేసింది. ఈనేపథ్యంలో ఈదఫా పర్యావరణ అనుమతుల సమస్య పెద్దగా ఉండకపోవచ్చని యాజమాన్యం భావిస్తోంది. మరో వారంలోగా జరగనున్న నలుగురు సభ్యుల పర్యావరణ అనుమతుల కమిటీ ప్లాంట్ పర్యటనలో వాస్తవాలు వివరించి అనుమతులు దక్కించుకునేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి కలిసొస్తుందా.. విస్తరణ జాప్యం వలన రూ.15వేల కోట్ల పెట్టుబడి ప్రణాళిక ఇప్పుడు రూ.20వేల కోట్లకుపైగా పెరిగిపోవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. ఈనేపథ్యంలో త్వరలో ఢిల్లీ వెళ్లి అక్కడినుంచి నిధుల సమీకరణ ప్రక్రియను పూర్తిచేయాలని భావిస్తున్నారు. విస్తరణకు సంబంధించి నిధుల సమస్య లేకపోవడంతో వేగంగానే నిధుల విడుదల కోరుతూ ఉన్నతాధికారులను ఒప్పించేం దుకు నిర్ణయించారు. త్వరలో పర్యావరణ అనుమతుల కమిటీ కూడా వస్తుండడంతో విశాఖలో విస్తరణ పెట్టుబడులను రాజస్థాన్‌కు తరలించే ప్రయత్నాలకు బ్రేక్ పడే అవకాశం ఉంది. కాగా, హెచ్‌పీసీఎల్ సల్ఫర్‌ను గాల్లోకి వదులుతోన్న పరిమాణం పెరిగిపోవడంతో కాలుష్య నియం త్రణకు చమురు శుద్ధిలో కేంద్రం గతంలో కోత విధించింది. రిఫైనరీ పనితీరు సామర్థ్యాన్ని 6.3 ఎంఎంటీఏలకు కుదించింది. ఇప్పుడు ఆ సమస్య లేకపోవడంతో అనుమతులు వేగంగానే రావచ్చని అంచనా. ఇది జరిగిన వెంటనే విశాఖ పీసీపీఐఆర్ పరిధిలో కొత్త ప్లాంట్ నిర్మాణంపైనా దష్టిసారించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈమేరకు ఇప్పటికే ప్రాథమిక నివేదికకు సంబంధించిన కసరత్తు ప్రారంభించారు.