దేశ ఇంధన డిమాండ్ 2047 నాటికి రెట్టింపు అవుతుందని పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ అన్నారు. రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా దేశీయ డిమాండ్ 25 శాతం పెరుగుతుందన్నారు. సెంటర్ ఫర్ హై టెక్నాలజీ (సీహెచ్‌టీ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) సంయుక్తంగా బెంగళూరులో నిర్వహించిన ఎనర్జీ టెక్నాలజీ మీట్ (ఈటీఎం)2024ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు.
‘ఎనర్జీ సెక్యూరిటీ, సుస్థిరత, సాంకేతిక ఆవిష్కరణలకు ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలిచింది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) గణాంకాల ప్రకారం 2047 నాటికి భారత ఇంధన డిమాండ్ రెట్టింపు అవుతుంది. రాబోయే రెండు దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా దేశీయ ఇంధన డిమాండ్ గణనీయంగా 25 శాతం పెరుగుతుంది. నికర-సున్నా ఉద్గారాల లక్ష్యాలను సాధించడంలో చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) మెరుగైన విధానాలు పాటించాలి. ఇథనాల్, హైడ్రోజన్, జీవ ఇంధనాలలో పురోగతి ద్వారా వికసిత్ భారత్ సాధనలో భాగం కావాలి. ఫాజిల్ ప్యూయెల్‌లో కలిపే జీవ ఇంధనం మిశ్రమం రేటు ప్రస్తుతం 16.9%కి చేరుకుంది. 2030 నాటికి ఇది 20% లక్ష్యాన్ని చేరాలనే లక్ష్యం ఉంది. కానీ షెడ్యూల్ కంటే ఐదేళ్ల ముందే ఈ లక్ష్యాన్ని అధిగమించే దిశగా ముందుకు సాగుతున్నాం’ అని మంత్రి అన్నారు.
ఇదీ చదవండి: ఇంటర్‌లో 39% మార్కులు! కట్ చేస్తే కంపెనీకి సీఈఓ
‘భారతదేశం 250 రూపాల్లోని ముడి చమురును ప్రాసెస్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దేశీయ ప్రస్తుత ముడి చమురు శుద్ధి సామర్థ్యం 258 మిలియన్ మెట్రిక్‌టన్స్ పర్ యానమ్(ఎంఎంటీపీఏ)గా ఉంది. రానున్న రోజుల్లో ఇది 310 ఎంఎంటీపీఏకి పెరుగుతుందని అంచనా’ అన్నారు. డిజిటల్ ఇన్నోవేషన్‌పై స్పందిస్తూ 2027 నాటికి దేశీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ 70 బిలియన్ డాలర్లు(రూ.5.81 లక్షల కోట్లు)కు చేరుకుంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ ఛైర్మన్ అండ్ డైరెక్టర్ (మార్కెటింగ్) వి.సతీష్ కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment