ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో’లో పాల్గొన్నారు. దీపిందర్ తన బాల్యంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు.. ఇంటర్ ఫస్ట్‌ఇయర్‌లో 39 మార్కులు సాధించిన గోయల్ ఐఐటీ ఢిల్లీలో సీటు సంపాదించి జొమాటోను ఎలా స్థాపించారో వివరించారు. జీవితం తనకు ఎన్నో పాఠాలు నేర్పిందన్నారు.
‘స్కూల్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు చాలా భయపడుతూ ఉండేవాడిని. దానికి కారణం నేను చదువులో టాప్ స్టూడెంట్‌ను కాదు. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు పరీక్షలో నేను సరైన సమాధానాలు రాయకపోయినా మా టీచర్ కావాలనే నాకు మంచి గ్రేడ్ ఇచ్చారు. దాంతో కుటుంబం, స్నేహితుల నుంచి ప్రశంసలు అందుకున్నాను. అది నాకు చాలా సంతోషాన్నిచ్చింది. కొంతకాలం తర్వాత చివరి సెమిస్టర్ పరీక్షలు వచ్చాయి. అంతకుముందు వచ్చిన మార్కులు ఫేక్ అనే విషయం నాకు తెలుసు. ఈసారి ఎలాగైనా కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి మళ్లీ ప్రశంసలు పొందాలనుకున్నాను. (నవ్వుతూ)మా ప్రశ్నపత్రాలు ప్రింట్ చేసే ప్రింటింగ్ ప్రెస్ వ్యక్తి వద్దకు వెళ్లి ముందస్తుగా ప్రశ్న పత్రాలను పొందడానికి ప్రయత్నించాను. కానీ అది సాధ్యం కాలేదు. దాంతో విజయానికి షార్ట్‌కట్‌లు లేవని అర్థం చేసుకున్నాను. నేను కష్టపడి చదవడం ప్రారంభించాను. చివరి సెమిస్టర్‌లో క్లాస్‌లో ఐదో స్థానానికి చేరుకున్నాను. ఈ విజయం నాకు జీవితంలో ఏదైనా చేయగలననే విశ్వాసాన్ని కలిగించింది’
ఇంటర్ ఫస్టియర్‌లో 39 శాతం మార్కులే..
‘కొన్ని కారణాల వల్ల నేను ఇంటర్ ఫస్టియర్(11వ తరగతి)లో 39 శాతం మార్కులే వచ్చాయి. ప్రీ-యూనివర్శిటీ ఎడ్యుకేషన్ కోసం చండీగఢ్‌కు వెళ్లాను. కష్టపడి చదివి ఐఐటీ-జేఈఈ క్లియర్ చేసి ఐఐటీ ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ఇక్కడ జీవితం ఎన్నో పాఠాలు నేర్పించింది. మన ఆలోచనలు ఉన్నతంగా ఉంటే ఉన్నత వ్యక్తులను కలుస్తాం. మనం ఎంచుకున్న విభాగంలో ఎప్పుడూ మొదటిస్థానంలో ఉండేందుకు కష్టపడి పని చేయాలి. ఇది నిత్య పోరాటంగా సాగాలి’ అన్నారు.
డిప్రెషన్‌ను అధిగమించాలంటే..
‘నేను కొన్ని కారణాల వల్ల చాలాసార్లు డిప్రెషన్‌గా ఫీల్ అవుతుంటాను. ఈ డిప్రెషన్ సైకిల్ మూడేళ్లుంటుంది. డిప్రెషన్ సైకిల్స్ నిజానికి మంచివని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అవి నన్ను ఒక పాయింట్‌కి మించి మరింత ఉన్నతంగా ఆలోచించేలా చేస్తాయి. మానసిక సవాళ్లను ఎదుర్కోవడమే డిప్రెషన్‌కు సరైన చికిత్స. అందుకే మనం చేస్తున్న పనిలోనే డిప్రెషన్ తొలగించుకునేందుకు పరిష్కారాలు వెతకాలి. ప్రతి సైకిల్‌ను అధిగమించేందుకు గతంలో కంటే మరింత మెరుగ్గా ఆలోచిస్తూ పని చేస్తున్నాను’ అని అన్నారు.
ముందు టొమాటో!
‘ఐఐటీలో చదువు పూర్తి చేసుకున్నాక కెరియర్ ప్రారంభంలో బైన్ & కో. అనే కన్సల్టింగ్ సంస్థలో పని చేశాను. కమ్యూనికేషన్ నైపుణ్యాలు నేర్పించడంలో, వ్యూహాత్మకంగా ఆలోచించేందుకు ఇది ఎంతో తోడ్పడింది. ఎలా ఆలోచించాలో, ఏం మాట్లాడాలో ఈ సంస్థ నాకు నేర్పింది. నేను ఎప్పటికీ బైన్ అండ్ కో సంస్థకు కృతజ్ఞతతో ఉంటాను. బైన్‌లో పని చేస్తున్న సమయంలోనే జొమాటో ఆలోచన వచ్చింది. కంపెనీ స్థాపించాలనే ఉద్దేశంతో పేరును ఖరారు చేయాలనే సందర్భంలో ‘టొమోటో’అని అనుకున్నాం. దానికి సంబంధించిన డొమైన్ పేరు ‘టొమోటో డాట్ కామ్’ను కూడా ఏర్పాటు చేశాం. కానీ చివరకు దాన్ని జొమాటోగా నిర్ణయించాం’ అన్నారు.
ఇదీ చదవండి: 6:15 గంటల్లో రూ.5 లక్షల కోట్లు ఆవిరి!
అంతిమంగా, కొన్ని ఎదురుదెబ్బలు, తను నేర్చుకున్న జీవిత పాఠాలే జొమాటోను ఏర్పాటు చేయడానికి గోయల్‌కు ధైర్యాన్ని అందించాయి. తను కోరుకుంటే ఏదైనా చేయగలననే విశ్వాసాన్ని ఇచ్చాయి. తాత్కాలిక విజయాలకు పొంగిపోవడం, అపజయాలకు కుంగిపోకుండా జీవితంలో దీర్ఘకాల లక్ష్యాలను ఏర్పరుచుకుని దాన్ని సాధించాలనే గట్టి తపనతో ముందుకెళ్లాలి.
Comments
Please login to add a commentAdd a comment