women freedom
-
ఆగస్టు 15: ఆమె... దేశంలో సగం ఎప్పుడు!?
స్వాతంత్య్ర దినోత్సవం దేశ ఔన్నత్యాన్ని మాట్లాడుతుంది. దేశ ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తుంది. కాని దేశంలో సగమైన స్త్రీలు సంపూర్ణ స్వాతంత్య్ర ఫలాలు ఇంకా పొందవలసే వుంది. ఏనాడైతే స్త్రీల పట్ల సురక్షితమైన, సంస్కారవంతమైన ప్రవర్తనను ఈ సమాజం చూపుతుందో అప్పుడే స్త్రీలకు సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చినట్టు. అప్పుడే దేశ ఔన్నత్యం ఇనుమడించినట్టు. ‘ఆకాశంలో సగం’లాగా దేశంలో సగం ఇంకెప్పుడు? నేడు ఆగస్టు 15న ఎర్రకోట మీద జెండా ఎగుర వేసే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీకి ఇద్దరు మహిళా ఆర్మీ ఆఫీసర్లు సహకారం అందిస్తారు. మేజర్ నికితా నాయర్, మేజర్ జాస్మిన్ కౌర్ పతాకావిష్కరణ సమయంలో ప్రధానితో పాటుగా ఉండి జెండా వందనం సమర్పిస్తారు. ఈ విశేష ఘట్టంలో ఇద్దరు మహిళలకు ఈ విధంగా చోటు దక్కడం సంతోషపడాల్సిన సంగతి. 76 ఏళ్ల క్రితం స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు స్త్రీల స్థితిగతుల్లో వచ్చిన పురోభివృద్ధికి ఇదీ ఒక సంకేతమే. నాటి నుంచి నేటి వరకు విద్య, ఉపాధి, ఉద్యోగం, సైన్యం, పాలనా యంత్రాంగం, శాసన వ్యవస్థ... వీటిల్లో స్త్రీలకు గణనీయంగా స్థానం దక్కింది. ప్రాముఖ్యం లభించింది. అయితే అంతమాత్రాన స్త్రీలు సంపూర్ణంగా స్వాతంత్య్ర ఫలాలు అనుభవిస్తున్నారా అనేది ప్రశ్న. స్త్రీల త్యాగం దాస్య భారతంలో జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో స్త్రీలు పాల్గొన్నారు. అన్నింటికి మించి పురుషులు దేశం కోసం ప్రాణాలు అర్పించినా, జైళ్ల పాలైనా స్త్రీలు ధైర్యంగా ఇళ్లు నడిపి కష్టాలను ఈదారు. దేశ విభజన సమయంలో తీవ్ర హింసను ఎదుర్కొన్నారు. అంతెందుకు 1930 నాటికి దేశ వ్యాప్తంగా 30 వేల మంది స్త్రీలు స్వాతంత్య్ర పోరాటంలో ఏదో విధాన జైలు శిక్ష అనుభవిస్తున్నారని తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ స్త్రీల పోరాటం చాలామటుకు చరిత్రలో నమోదు కాకుండానే కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడిప్పుడే నాటి వీర వనితల గాధలు వెలికి వస్తున్నాయి. ఇంత పోరాటం, త్యాగం చేసి స్త్రీల భాగస్వామ్యంతో తెచ్చుకున్న స్వాతంత్య్రంలో స్త్రీలు నిజంగా సంతోషంగా ఉన్నారా? సురక్షితం కాని దేశం ‘ఒక స్త్రీ అర్ధరాత్రి క్షేమంగా నడిచి వెళ్లినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు’ అని గాంధీజీ ఏ ముహూర్తంలో అన్నారో కాని అలాంటి స్థితి నేటికీ రాకపోగా నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. ఎన్ని చట్టాలు చేసినా, శిక్షలు తెచ్చినా స్త్రీలను గౌరవించాలి, వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలి అని మెజారిటీ సమాజం అనుకోవడం లేదు. ‘నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ అనే భావన సమాజంలో ఆది కాలం నుంచి చొప్పించి ఉండటం వల్ల స్త్రీ చేసే ప్రతి పనిలో తప్పు ఎంచడం, అదుపు చేయడం, చులకనగా చూడటం, వివక్ష చూపడం, దండించడం ఆనవాయితీగా మారింది. పిల్లల పెంపకం దశ నుంచే స్త్రీలను గౌరవించడం నేర్పించడం లేదు. ఇంట్లో అమ్మాయిని ఒకలాగా, అబ్బాయిని ఒకలాగా పెంచడం వల్ల ఈ అబ్బాయిలు ‘సమాజం’గా మారి స్త్రీ పాలిట బెడదగా మారుతున్నారు. తమ మాటకు ఎటువంటి తిరస్కారం చెప్పినా పురుషుడు శిక్షించేవాడై స్త్రీని చంపేందుకు వెనుకాడటం లేదు. స్త్రీకి ఒక అభిప్రాయం కలిగి ఉండే స్వాతంత్య్రం ఆమెకు ఎందుకు ఇవ్వడం లేదు? స్త్రీలను ప్రేమ, మర్యాద, గౌరవాలతో కుటుంబం చూసుకోవాలి. అప్పుడు ఆ మర్యాద, గౌరవాలు సమాజంలోకి ఆటోమేటిక్‌గా వస్తాయి. కుటుంబం స్త్రీకి ఎలా రక్షణ ఇస్తుందో సమాజం కూడా స్త్రీకి అలా రక్షణ ఇవ్వాలనే పౌర శిక్షణ, సంస్కారం అవసరం. పురుషులు మాత్రమే కాదు స్త్రీలు కూడా కుటుంబం, సమాజం, దేశం కోసం గొప్పగా ఆలోచించగలరు. వారికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఇచ్చి చూస్తే తెలుస్తుంది. అటువంటి వేకువలోకి దేశం ఉదయించాలని ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోరుకుందాం. -
అఫీషియల్: జిమ్‌లు, పార్కుల్లో మహిళలకు నో ఎంట్రీ
కాబూల్: మహిళా హక్కులను, స్వేచ్ఛను హరిస్తూ అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని జిమ్‌లు, పార్కుల్లోకి మహిళల ప్రవేశాన్ని నిషేధించింది. ఈ వారం నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్ ధరించకపోవడం, పార్కులు, జిమ్‌లలో మహిళలు, పురుషులు విభజనను పాటించకపోవడం వల్లే తాజాగా ఈ ఆంక్షలను తీసుకువచ్చినట్లు ప్రభుత్వ ప్రతినిధి గురువారం చెప్పారు. 2021 ఆగస్ట్‌లో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు.. మాధ్యమిక, ఉన్నత విద్యా పాఠశాలల్లో బాలికల ప్రవేశాన్ని నిషేధించారు. అనేక రంగాల్లో మహిళా ఉద్యోగులను తొలగించారు. బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖా ధారణ తప్పనిసరి చేశారు. -
ఇకపై నిర్ణయించేది మేమే!
మహిళల కోసం పోరాడాల్సిన అవసరం ఈ ఆధునిక యుగంలో కూడా ఈ స్థాయిలో ఉందా? అపర్ణ ఏర్పాటు చేసిన రెస్పాన్సిబుల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ గురించి తెలిసినప్పుడు ఎదురయ్యే సహజమైన సందేహం ఇది. అయితే మహిళల కోసం పోరాడాల్సిన అవసరం ఆధునిక యుగంలోనే ఎక్కువగా ఉందంటోంది అపర్ణా అచరేకర్. ఇరవై ఏళ్ల సుదీర్ఘ పాత్రికేయ అనుభవం ఆమెకు నేర్పిన వాస్తవం ఇది. మహిళ పట్ల అణచివేత భౌతికంగా తగ్గినట్లు అనిపిస్తుందేమో కానీ మానసికంగా ఎక్కువైందంటోందామె. తమకంటూ ఒక గుర్తింపు, స్వాతంత్య్రం, తమ అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోగలిగిన సమాజం కోసం ఆమె సోషల్ ఎంటర్ప్రెన్యూర్ అనే కొత్త పాత్రలోకి ఒదిగిపోయారు. ‘ఈవ్ వరల్డ్’ అనే సోషల్ మీడియా వేదికగా ప్రపంచంలోని మహిళలను కలుపుతున్నారు అపర్ణ అచరేకర్. ముంబయికి చెందిన అపర్ణా అచరేకర్ మహిళల కోసం పని చేయాలనే సంకల్పం కలిగిన వెంటనే గత ఏడాది అక్టోబర్ నెలలో ఆచరణలోకి దిగింది. మహిళలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయగలిగిన వేదిక అది. ఒకరు మరొకరిని ప్రభావితం చేసుకోగలిగిన అవకాశం ఈ వేదిక ద్వారా లభిస్తోంది. ‘‘ఐడెంటిటీ, ఇండిపెండెన్స్, ఇన్‌క్లూజన్’ అనే మూడు అంశాల ఆధారంగా నిర్మితమైన ఈ వేదిక ద్వారా మహిళలు తాము కోరుకుంటున్న గుర్తింపుతో పరిచయమవుతారు, ఆ స్థానంలో నిలబడడం కోసం పరస్పర సహకరించుకుంటారు, తమ జీవితాలకు అవసరమైన నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకుంటారు. అలాగే మగవాళ్లు నిర్దేశించిన నియమావళిని రూపుమాపడానికి కృషి చేస్తారు. కొత్త నియమావళిని మహిళలే నిర్ణయిస్తారు. మొత్తానికి మహిళలు తమకంటూ ఒక స్పేస్‌ని ఈ వేదిక ద్వారా క్రియేట్ చేసుకోగలుగుతారు’’ అని చెప్తోంది అపర్ణ. అందం కొలతల్లో ఉండదు! ‘‘మన భారతీయ సమాజం మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం మహిళ విషయంలో ఒకేలా వ్యవహరిస్తుంది. ‘ఆడవాళ్లు ఎలా ఉండాలి...’ అనే నియమాలను మగవాళ్లే రూపొందిస్తుంటారు. ఆడవాళ్లు ఏం చేయాలో కూడా మగవాళ్లే నిర్ణయిస్తుంటారు. స్త్రీ దేహం ఏ కొలతల్లో ఇమిడిపోతే అందమో, ఏ కొలతలు మీరితే అందవిహీనమో కూడా వాళ్లే స్థిరీకరించేస్తారు. నిజానికి అందం అనే మాటకు అర్థం, నిర్వచనం చెప్పగలిగిన వాళ్లున్నారా? కొలతల్లో ఇమిడిపోవడమే అందం అనే భావజాలాన్ని మహిళలకు తలకెక్కించడమే పెద్ద కుట్ర. అలాగే మెంటల్ హెల్త్ నుంచి మెన్స్ట్రువల్ టాబూ వరకు మహిళల స్వేచ్ఛను నిరోధించే శక్తిగా ఉంటోంది మగవాళ్ల భావజాలం. వీటికి భిన్నంగా మహిళలు వ్యవహరిస్తే సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు పాల్పడడానికి ఏ మాత్రం సందేహించరు. ‘ఆడవాళ్ల విషయంలో తీర్పులివ్వడానికి మనం ఎవరు?’ అనే ప్రశ్న తమను తాము వేసుకునే మగవాళ్లు ఎందరు? వీటన్నింటికీ చరమగీతం పాడుతూ మహిళలు కొత్త నియమావళిని రూపొందిస్తారు’’ అని ఆశాభావం వ్యక్తం చేసింది అపర్ణ. సోషల్ మీడియా వేదికగా రకరకాల వేధింపులు, సైబర్ బుల్లీయింగ్‌కు గురవుతున్న మహిళలకు తమ భావవ్యక్తీకరణకు ఇది ఒక సురక్షితమైన వేదిక అవుతుంది. ఆడవాళ్లు ఎలా ఉండాలి... ఏం చేయాలో కూడా మగవాళ్లే నిర్ణయిస్తుంటారు. స్త్రీ దేహం ఏ కొలతల్లో ఇమిడిపోతే అందమో, ఏ కొలతలు మీరితే అందవిహీనమో కూడా వాళ్లే స్థిరీకరించేస్తారు. నిజానికి అందం అనే మాటకు అర్థం, నిర్వచనం చెప్పగలిగిన వాళ్లున్నారా? కొలతల్లో ఇమిడిపోవడమే అందం అనే భావజాలాన్ని మహిళలకు తలకెక్కించడమే పెద్ద కుట్ర. -
సౌదీ మహిళకు స్టీరింగ్
రియాద్: సౌదీ అరేబియాలో మహిళలు ఆదివారం వాహనాలతో రోడ్లెక్కారు. కార్లతో రోడ్లపై సందడి చేస్తూ, కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. సౌదీలో దశాబ్దాలుగా మహిళల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధాన్ని ఆ దేశ యువరాజు బిన్ సల్మాన్ ఇటీవల ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులు 2018, జూన్ 24 నుంచి అమల్లోకి వస్తాయని అప్పట్లో పేర్కొన్నారు. మహిళల డ్రైవింగ్‌పై నిషేధాన్ని ఎత్తివేయడంతో ఆదివారం తెల్లవారుజామున మహిళలు కార్లతో రోడ్లపైకి చేరి సంబరాలు చేసుకున్నారు. తొలిసారి డ్రైవింగ్‌కు బయలుదేరినవారికి కొందరు మహిళలు పూలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. చాలా మంది మహిళలు తమ తొలి కారు డ్రైవింగ్ మధుర క్షణాలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తాము కుటుంబ సభ్యులను కారులో కాఫీ షాప్‌కు, ఐస్‌క్రీమ్‌కు తీసుకెళ్తామని వెల్లడించారు. తండ్రి, సోదరులు, ప్రైవేటు పురుష డ్రైవర్ల అవసరం లేకుండా తొలిసారి కారును నడపడంపై మహిళా యాంకర్, రచయిత సమర్ అల్మోగ్రెన్ స్పందిస్తూ.. ‘నాకు పక్షి అంత స్వేచ్ఛ లభించినట్లు అనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. సౌదీ యువరాజు, కోటీశ్వరుడు అల్వలీద్ బిన్ తలాల్ ‘మహిళలకు ఇది గొప్ప విజయం. ఎట్టకేలకు మహిళలకు స్వేచ్ఛ లభించింది’ అని అన్నారు. తన కుమార్తె ఎస్యూవీ కారును డ్రైవింగ్ చేస్తుండగా, అదే కారులో ఆయన మనుమరాళ్లతో కలసి సంబరాలు చేసుకున్న వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ విషయమై ఓ నిర్మాణ సంస్థ హెచ్ఆర్ మేనేజర్ హలా మాట్లాడుతూ..‘డ్రైవింగ్ అనుమతి లేకపోవడంతో కంపెనీల్లో పనిచేసే మహిళలకు చాలా కష్టసాధ్యంగా ఉండేది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పుడు మహిళలందరూ స్వేచ్ఛగా వాహనాలు నడుపుకుంటూ విధులకు హాజరయ్యే వెసులుబాటు ఏర్పడింది. త్వరలోనే మేనేజర్ స్థాయి ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగనుంది’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 12 ఏళ్లలో రూ.6.1 లక్షల కోట్లు మహిళల డ్రైవింగ్‌పై నిషేధం ఎత్తివేయడం ద్వారా సౌదీ అరేబియా ఆర్థికంగా పురోగమించనుందా? కొత్త ఉద్యోగాల సృష్టి జరగడంతో పాటు మహిళల జీవనప్రమాణాలు మెరుగు కానున్నాయా? అంటే నిపుణులు అవుననే జవాబిస్తున్నారు. డ్రైవింగ్‌కు మహిళల్ని అనుమతించడంపై గల్ఫ్ టాలెంట్ అనే ఆన్లైన్ రిక్రూట్మెంట్ సంస్థ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వ అనుమతి తర్వాత డ్రైవింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 82 శాతం మంది మహిళలు తెలిపారు. తాజా నిర్ణయంతో ఇన్నాళ్లు పురుషులు ఆధిపత్యం చెలాయిస్తున్న ఉన్నతస్థాయి ఉద్యోగాలకు తాము దరఖాస్తు చేసుకునే అవకాశం ఏర్పడిందని పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేశారు. యువరాజు సల్మాన్ నిర్ణయంతో మరో 12 ఏళ్లలో సౌదీ ఆర్థిక వ్యవస్థకు రూ.6.1 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూరనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మహిళా సాధికారతే లక్ష్యం మహిళలకు సాధికారత కల్పించడంలో భాగంగా 2030 నాటికి మొత్తం ఉద్యోగుల్లో 22 నుంచి 30 శాతం మహిళలు ఉండాలని సౌదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం చేపట్టిన సంస్కరణలో భాగంగా తొలుత మహిళల డ్రైవింగ్‌పై నిషేధాన్ని తొలగించింది. దీనిద్వారా వాళ్లు మంచి ఉద్యోగాలు, ఆకర్షణీయమైన జీతం పొందేందుకు వీలవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. తాజా నిర్ణయంతో మహిళలు దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకునే వెలుసుబాటు లభించింది. మహిళల డ్రైవింగ్‌పై ప్రభుత్వం నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో మరింత మంది మహిళా ఉద్యోగుల్ని తీసుకునేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో పురుషులతో సమానంగా మహిళలు కూడా ఆకర్షణీయమైన వేతనాలకు అందుకోనున్నారు. కార్ల మార్కెట్ కూడా గణనీయంగా అభివృద్ధి చెందనుంది. 2020కి 30 లక్షల మహిళలు డ్రైవింగ్ చేస్తారని అంచనా. -
స్త్రీ స్వేచ్ఛ అంటే?
ఇతర రచనల్ని కూడా చూస్తే, తప్పుల్ని దిద్దిన మార్గాలూ, దిద్దలేని మార్గాలూ, తప్పుల్ని మరింత అభివృద్ధి చేసిన మార్గాలూ, అన్నీ కనపడతాయి. అసలు, ‘‘స్త్రీ స్వేచ్ఛ’’ అనే ప్రశ్న ఎందుకు వస్తోంది? ‘‘స్వేచ్ఛ’’ అన్నప్పుడు ఇది ఏ మనిషికైనా ఒకటే కదా? పురుషుడి స్వేచ్ఛలోనే తప్పులు వుంటే, ఆ తప్పులే స్త్రీకి ఎందుకు? వేల వేల సంవత్సరాల నించీ సమాజంలో మంచి చెడ్డలూ, తప్పొప్పులూ ఉంటూనే ఉన్నాయి. ‘మంచి’ శాశ్వతంగా నిలబడుతుంది. చెడ్డే, తప్పే, రక రకాలుగా మారుతుంది. తప్పుల్లో మార్పులూ, సంస్కరణలూ కూడా జరుగుతూ వున్నాయి. ఈ విషయాల్ని రచనల్లో తేలిగ్గా చూడగలం. అవి మత కధలైనా, నాస్తిక గ్రంధాలైనా, తాత్విక గ్రంధాలైనా, సాంఘిక రచనలైనా. సమాజం నిండా తప్పొప్పులు ఈ నాటికీ వున్నాయి. సాహిత్యాన్ని మాత్రమే తీసుకుంటే, రచయితలు ఏయే రకాలుగా ఉంటారు? (1) సమాజం అద్భుతంగా వుంది! ‘తప్పు’ని చూడలేరు. తప్పు కూడా ఒప్పే. అది అలాగే కొనసాగాలి. ఇంకా అదే అభివృద్ధి చెందాలి కూడా!- ఇది ఒక అవగాహన! (2) ‘తప్పు’ని చూడగలగడం! దాన్ని తీసి వేసే ప్రయత్నం! (3) ‘తప్పు’ని తెలుసుకోగలరు. బాధితుల మీద నిర్మలమైన కరుణ చూపుతారు. తప్పుని సంస్కరించలేరు. (4) ‘తప్పు’ తెలుస్తుంది. సంస్కరించే ఉత్సాహం, ఉద్రేకం, వుంటాయి. ఒక తప్పుని ఇంకో తప్పులోకి మారుస్తారు. (5) ‘తప్పు’ని పూర్తిగా నిర్మూలించగల మార్గం తెలుస్తుంది. ఇది, కేవలం సంస్కరణ కాదు. విప్లవమే! ఇక ఆ తప్పు ఉండదు. సమాజంలో లక్ష తప్పులు సాగుతూనే వున్నాయి. కొన్నిటిని విడి విడిగా సంస్కరించడం సాధ్యం. కొన్నిటికి పైపై దిద్దుళ్ళతో సంస్కరణలు అసాధ్యం. మన చుట్టూ వున్న రచనల్లో కనపడే ‘‘స్త్రీ స్వేచ్ఛ’’ గురించి, ఆ రచయితల భావాలు ఎలా వున్నాయో క్లుప్తంగా చూడవచ్చు. వీరేశలింగం గారు, ‘‘బాల వితంతువు’’ అనేది తప్పు అని గ్రహించగలిగారు. దాని సంస్కరణ ప్రారంభించారు. దాన్ని వ్యతిరేకించిన మూర్ఖులూ వున్నారు. అయినా ఆ సంస్కరణ, ఆ తప్పుని తిరస్కరించగలిగింది. గురజాడ, ‘‘వృద్ధుడితో బాలిక సంబంధం తప్పు’’ అని గ్రహించారు. దాన్ని సంస్కరించే ప్రయత్నం రచన ద్వారా చేశారు. ఉన్నవ లక్ష్మీనారాయణ, తన ‘మాలపల్లి’లో కులాల పట్ల కొన్ని మంచి విషయాలు రాసి వుండవచ్చు. కానీ ‘‘స్త్రీ స్వేచ్ఛ’’ అనేది పెద్ద తప్పు మాట అయినట్టూ, ‘‘స్వేచ్ఛ’’ వుంటే స్త్రీలు పిల్లల్ని వదిలేసి ‘లేచిపోతారు’ అన్నట్టూ, ఒక ప్రధాన స్త్రీ పాత్రని చూపిస్తాడు. ఒకామె మరిదితో వెళ్ళిపోయి, పశ్చాత్తాపంతో ఇంటికొచ్చి, భర్త పాదాలమీద పడి క్షమాపణ కోరి మరణిస్తుంది. అడవి బాపిరాజు, తన ‘నారాయణరావు’ నవలలో, పెళ్ళి అయిన స్త్రీ, భర్తని వదిలి ఒక యువకుడితో వెళ్ళిపోయి, అక్కడి నించి ఇంకో యువకుడితో పోతుంది. మొదటి యువకుడు, ‘‘స్త్రీని, సాంప్రదాయం నించి తప్పిస్తే, విచ్చలవిడిగా తిరుగుతుంది’’ అని గ్రహించి, ఆ తప్పు చేశానని ఆత్మహత్య ! స్త్రీకి ఈ సాంప్రదాయం! పురుషుడికి ఇంకో సాంప్రదాయం! విశ్వనాథ సత్యన్నారాయణ, తన ‘చెలియలి కట్ట’లోనూ, ‘వేయి పడగలు’లోనూ చూపిన అవగాహన, ‘‘స్త్రీ స్వేచ్ఛ అంటే తిరుగుడే!’’ అన్నగారి భార్యా, మరిదీ, లేచిపోయి, పశ్చాత్తాపంతో తిరిగి వచ్చి, ఆ వూరి సముద్రంలో ఇద్దరూ ఆత్మహత్యలు! వేయి పడగల్లో ఒక ఉత్తమ పురుషుడికే నాలుగు వర్ణాల స్త్రీలు నలుగురు భార్యలూ, వేశ్యా! కులాల్ని సమానం చేసేశాడీ రచయిత. మరణించిన భార్య ఆత్మ, ఒక బాలికని ఆవహించిందని, ఆ బాలికతో వృద్ధుడి పెళ్ళి! ఇది సమాజంలో ఉన్న క్రూరత్వాలన్నిటినీ అభివృద్ధి చేయడం! అనేక మంది రచయితల దృష్టిలో ‘‘స్త్రీ స్వేచ్ఛ’’ అంటే శారీరక సంబంధాల దృష్టే ! దాన్నే స్త్రీ కోరుతుందని! చలం అయితే తన సమకాలీన రచయిత లందర్నీ తిరస్కరించాడు. ‘‘స్వేచ్ఛ’’ అంటే, వ్యక్తిత్వం, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం వంటి విషయాలు అనేకం చెప్పినప్పటికీ, ప్రధానంగా స్త్రీ పురుషు లిద్దరికీ మధ్య తాత్కాలిక ప్రేమలనే చెప్పాడు. ఇది సమస్యను అవక తవకగా దిద్దబోవడమే. ఇక ఈ నాటి బూర్జువా స్త్రీల ‘‘స్త్రీ స్వేచ్ఛ’’ని చూస్తే, తిరుగుడికి హక్కులూ, వ్యభిచారానికి హక్కులూ! ‘‘పురుషుడి హక్కులన్నీ మాకూ కావాలి!’’ పురుషుడి హక్కులన్నీ తప్పు- అని గ్రహించకుండా, పురుషుడి తప్పుల్ని అనుసరించడం ! పురుషుడే గురువు! ‘దేవదాసు’ రచయితని చూద్దాం. ఈ నవలలో మూడు అద్భుత విషయాలు చెప్పాడు రచయిత. (1) జమీందారి ధనిక కుటుంబానికీ పేద కుటుంబానికీ వుండే వైరుధ్యం. (2) స్త్రీ ఆత్మగౌరవం. ప్రేమ కన్నా, తన ఆత్మగౌరవం గొప్పది. ‘నీ కేనా తండ్రి వున్నది, నాకు లేడా?’’ అంటుంది. ప్రేమికుడు చూపిన నిర్లక్ష్యానికి అతన్ని పూర్తిగా తిరస్కరిస్తుంది. (3) నిజమైన ప్రేమ, తాత్కాలికమైనదిగా అంతరించదు. దిద్దుకోవడానికి సాధ్యం కాని తప్పు జరిగితే, దానికి దుఃఖం తప్ప వేరే దారి వుండదు. - ఈ రచయిత సమాజంలో వున్న తప్పుల్ని గ్రహించాడు. ఒక ‘ఫలానా తప్పు’ని దిద్దుకోవడం సాధ్యం కాదు - అని చెప్పడం అంటే అది పెద్ద హెచ్చరిక! ఇతర రచనల్ని కూడా చూస్తే, తప్పుల్ని దిద్దిన మార్గాలూ, దిద్దలేని మార్గాలూ, తప్పుల్ని మరింత అభివృద్ధి చేసిన మార్గాలూ, అన్నీ కనపడతాయి. అసలు, ‘‘స్త్రీ స్వేచ్ఛ’’ అనే ప్రశ్న ఎందుకు వస్తోంది? ‘‘స్వేచ్ఛ’’ అన్నప్పుడు ఇది ఏ మనిషికైనా ఒకటే కదా? పురుషుడి స్వేచ్ఛలోనే తప్పులు వుంటే, ఆ తప్పులే స్త్రీకి ఎందుకు? పురుషుడి స్వేచ్ఛలో తప్పులే తిరస్కరించాలి కదా? ‘‘కార్మిక స్త్రీల స్వేచ్ఛా దినంగా’’ ఒక దినాన్ని గుర్తించడం అంటే, పురుష కార్మికుల హక్కులు స్త్రీ కార్మికులకు లేకపోవడం వల్ల! స్త్రీ పురుషులకు ఇద్దరికీ సమానంగా వుండవలసినవి ఏమిటి? బాధ్యతలూ, హక్కులూ! ఆ విషయాల్లో సమానత్వానికి ఎవరైనా ఎందుకు వ్యతిరేకించాలి? వ్యతిరేకించే వాళ్ళకి, దాని వల్ల ఏదో లాభం వుంటుంది. ‘‘స్త్రీ స్వేచ్ఛ’’ అన్నప్పుడు, స్త్రీ - పురుషులు ఒకే హక్కులతో, ఒకే బాధ్యతలతో లేరని అర్ధం వస్తుంది. కానీ స్త్రీలందరూ మాత్రం ఒకే హక్కులతో, ఒకే బాధ్యతలతో వున్నారా? ఒక పెట్టుబడిదారుడి భార్యా, ఒక రోడ్లు ఊడ్చే కార్మికురాలూ ఒకే స్తితిలో వున్నారా? అలాంటప్పుడు ‘‘స్త్రీ స్వేచ్ఛ’’ అనేది అర్ధరహితమైన మాట! ‘‘కార్మిక స్త్రీ స్వేచ్ఛ’’ అంటే, దాని అర్ధం వేరు! అది కార్మిక స్త్రీలకు ఉండే ప్రత్యేక సమస్యల గురించి ! -రంగనాయకమ్మ