శనివారం అర్ధరాత్రి రియాద్‌లో కారు నడుపుతున్న మహిళ
రియాద్: సౌదీ అరేబియాలో మహిళలు ఆదివారం వాహనాలతో రోడ్లెక్కారు. కార్లతో రోడ్లపై సందడి చేస్తూ, కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. సౌదీలో దశాబ్దాలుగా మహిళల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధాన్ని ఆ దేశ యువరాజు బిన్ సల్మాన్ ఇటీవల ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులు 2018, జూన్ 24 నుంచి అమల్లోకి వస్తాయని అప్పట్లో పేర్కొన్నారు. మహిళల డ్రైవింగ్‌పై నిషేధాన్ని ఎత్తివేయడంతో ఆదివారం తెల్లవారుజామున మహిళలు కార్లతో రోడ్లపైకి చేరి సంబరాలు చేసుకున్నారు.
తొలిసారి డ్రైవింగ్‌కు బయలుదేరినవారికి కొందరు మహిళలు పూలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. చాలా మంది మహిళలు తమ తొలి కారు డ్రైవింగ్ మధుర క్షణాలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తాము కుటుంబ సభ్యులను కారులో కాఫీ షాప్‌కు, ఐస్‌క్రీమ్‌కు తీసుకెళ్తామని వెల్లడించారు. తండ్రి, సోదరులు, ప్రైవేటు పురుష డ్రైవర్ల అవసరం లేకుండా తొలిసారి కారును నడపడంపై మహిళా యాంకర్, రచయిత సమర్ అల్మోగ్రెన్ స్పందిస్తూ.. ‘నాకు పక్షి అంత స్వేచ్ఛ లభించినట్లు అనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు.
సౌదీ యువరాజు, కోటీశ్వరుడు అల్‌వలీద్ బిన్ తలాల్ ‘మహిళలకు ఇది గొప్ప విజయం. ఎట్టకేలకు మహిళలకు స్వేచ్ఛ లభించింది’ అని అన్నారు. తన కుమార్తె ఎస్‌యూవీ కారును డ్రైవింగ్ చేస్తుండగా, అదే కారులో ఆయన మనుమరాళ్లతో కలసి సంబరాలు చేసుకున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ విషయమై ఓ నిర్మాణ సంస్థ హెచ్‌ఆర్ మేనేజర్ హలా మాట్లాడుతూ..‘డ్రైవింగ్ అనుమతి లేకపోవడంతో కంపెనీల్లో పనిచేసే మహిళలకు చాలా కష్టసాధ్యంగా ఉండేది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పుడు మహిళలందరూ స్వేచ్ఛగా వాహనాలు నడుపుకుంటూ విధులకు హాజరయ్యే వెసులుబాటు ఏర్పడింది. త్వరలోనే మేనేజర్ స్థాయి ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగనుంది’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
12 ఏళ్లలో రూ.6.1 లక్షల కోట్లు
మహిళల డ్రైవింగ్‌పై నిషేధం ఎత్తివేయడం ద్వారా సౌదీ అరేబియా ఆర్థికంగా పురోగమించనుందా? కొత్త ఉద్యోగాల సృష్టి జరగడంతో పాటు మహిళల జీవనప్రమాణాలు మెరుగు కానున్నాయా? అంటే నిపుణులు అవుననే జవాబిస్తున్నారు. డ్రైవింగ్‌కు మహిళల్ని అనుమతించడంపై గల్ఫ్ టాలెంట్ అనే ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ సంస్థ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వ అనుమతి తర్వాత డ్రైవింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 82 శాతం మంది మహిళలు తెలిపారు. తాజా నిర్ణయంతో ఇన్నాళ్లు పురుషులు ఆధిపత్యం చెలాయిస్తున్న ఉన్నతస్థాయి ఉద్యోగాలకు తాము దరఖాస్తు చేసుకునే అవకాశం ఏర్పడిందని పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేశారు. యువరాజు సల్మాన్ నిర్ణయంతో మరో 12 ఏళ్లలో సౌదీ ఆర్థిక వ్యవస్థకు రూ.6.1 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూరనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళలకు సాధికారత కల్పించడంలో భాగంగా 2030 నాటికి మొత్తం ఉద్యోగుల్లో 22 నుంచి 30 శాతం మహిళలు ఉండాలని సౌదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం చేపట్టిన సంస్కరణలో భాగంగా తొలుత మహిళల డ్రైవింగ్‌పై నిషేధాన్ని తొలగించింది. దీనిద్వారా వాళ్లు మంచి ఉద్యోగాలు, ఆకర్షణీయమైన జీతం పొందేందుకు వీలవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. తాజా నిర్ణయంతో మహిళలు దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకునే వెలుసుబాటు లభించింది. మహిళల డ్రైవింగ్‌పై ప్రభుత్వం నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో మరింత మంది మహిళా ఉద్యోగుల్ని తీసుకునేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో పురుషులతో సమానంగా మహిళలు కూడా ఆకర్షణీయమైన వేతనాలకు అందుకోనున్నారు. కార్ల మార్కెట్ కూడా గణనీయంగా అభివృద్ధి చెందనుంది. 2020కి 30 లక్షల మహిళలు డ్రైవింగ్ చేస్తారని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment