రియాద్ : సౌదీ అరేబియా రాజు సల్మాన్ అమెరికా గూఢాచార సంస్థ (సెంట్రల్ ఇంటలిజిన్స్ ఏజెన్సీ) డైరెక్టర్ గినా హాస్పెల్‌తో సమావేశమయ్యారు. గురువారం జరిగిన ఈ భేటిలో ఇరు దేశాల మధ్య మైత్రి బలపడేందుకు చర్చలు జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ సమావేశంలో సౌదీ రాజుతో పాటు విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్, ఇంటలెజిన్స్ చీఫ్ ఖలీద్ అల్ హమ్‌దీన్ సహా ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా ముగ్గురు సౌదీ పౌరులపై బుధవారం అమెరికాలో కేసు నమోదైన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు సౌదీ రాజ కుటుంబానికి చెందిన ప్రముఖ వ్యక్తి(సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌గా ఆరోపణలు ఉన్నాయి) ట్విటర్ ఖాతాతో అమెరికాలో గూఢచర్యం నెరిపినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సౌదీ రాజు గినా హాస్పెల్‌తో అత్యవసరంగా సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇక సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌కు వ్యతిరేకంగా వాషింగ్టన్ పోస్టులో కథనాలు రాసిన జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ టర్కీలో గతేడాది దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. టర్కీలోని సౌదీ రాయబార కార్యాలయానికి వెళ్లిన జమాల్ అదృశ్యం కావడంతో సౌదీ యువరాజుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఘటనను తీవ్రంగా పరిగణించిన అమెరికా ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న తమ దేశంలో నివసిస్తున్న సౌదీ పౌరులపై దర్యాప్తునకు ఆదేశించింది. అదే విధంగా ఖషోగ్గీని హత్య చేయించింది సౌదీ అరేబియా రాజే అనేందుకు తమ దగ్గర ఆధారాలున్నాయంటూ టర్కీ ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో ఈ కేసు విచారణలో భాగంగా సేకరించిన ఆడియో క్లిప్పులను సీఐఏ డైరెక్టర్ గినా హాస్పెల్‌కు అందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఖషోగ్గీ హత్య కేసును నీరుగార్చేందుకే సౌదీ రాజు గినాతో చర్చలు జరుపుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ భేటీ అనంతరం సౌదీ అధికారి మాట్లాడుతూ... తమ దేశ పౌరులు ఏ దేశంలో నివసిస్తున్నా సరే అక్కడి చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలంటూ విఙ్ఞప్తి చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment